వినతి(విరించికి)
- గొర్తి వెంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
ఏమి శిక్ష వేస్తావురా విరించి?
చెప్పరా నీ బదులు వివరించి
అధికారిణి తానైనా - లక్షలెన్నో అర్పించి
పనిచేయని సోమరికి అర్ధాంగిగా తానెడితే
తాగి చిందులేస్తాడు - తన్ని గోలచేస్తాడు
సహనశీలి సతిప్రేమకు సమాధి కట్టేస్తాడు
మదియించిన మగవారల - విరించీ!
మర్దించే వ్రాత వ్రాయి సవరించి!
ఆవులింత, అల్లుడొకటే! సమయాన్ని సరకుగొనరు
పదిమందిలో పట్టుకొని పరువు తీసి పెడతారు
యింటిపేరు మార్చుకొని - యింట దీపమెట్టుతున్న
యిల్లాలికి కంటినీరు కానుకగా యిస్తారు
ధరణికి తలమానికమని - విరించీ!
తరుణి గీత మార్చవయ్యా దయ ఉంచి
ఆడదాన్ని బ్రతకనిస్తే మగవాడికి బ్రతుకునిచ్చు
ఎదసీమలో కొలువుంచి అనవరతం పూజించు
పదిలముగా పదినాళ్ళూ తన మంచిని ఆశించే
ఆ అంశను వెలివేస్తే నీ వంశమే పోతుందని
చెప్పరా మగజాతికి - విరించీ!
నీ చట్టాన్ని మార్చవోయి కరుణించి
(ఆడపిల్ల ఆప్యాయత నాశించేది చిన్నప్పుడు తండ్రి, తదుపరి భర్త. వీరి ప్రేమ లభించనిచో ఆమె ఎంత తల్లడిల్లిపోతుందో కళ్ళారా చూశాను. ఆ స్పందనతో వ్రాసిన ఈ కవితను పాటగా కూడా పాడుకోవచ్చును. ఆడది వంటింటి కుందేలుగా చూసే రోజుల్లో,పుట్టిన కూతురిని వీరనారిగా మలచి నాటి రాజదురంధరుల ఆలోచనలకు భిన్నంగా, యీ దేశంలో తొలిసారిగా, మన తెలుగునాట ఒక స్త్రీని సింహాసనంపై కూర్చోపెట్టిన కాకతీయ ప్రభువు గణపతిదేవుని వారసులం. ఆ వీరనారి రుద్రమ్మ సోదరులం. ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్లను బ్రతకనివ్వండి. ఆమె మీ వంశానికి బ్రతుకు నిస్తుంది, పదికాలాలు బ్రతకనిస్తుంది)
No comments:
Post a Comment