అజరామర సూక్తి- 3 - అచ్చంగా తెలుగు

అజరామర సూక్తి- 3

Share This

అజరామర సూక్తి- 3 

- చెరుకు రామమోహనరావు 


సుశ్రాంతో పి వహెద్భారంశీతొష్ణం న చ పశ్యతి సంతుష్టష్చరతే నిత్యం త్రీణి శిక్షస్చ గార్దభాత్ - చాణక్య నీతి.
ఎంత మోత బరువున్నా శీతోష్ణము లెట్లున్నా మనసారా పనిచేసే గాడిద మన కాదర్శం గాదిధ మోత మోస్తున్నావే అనడము మనకు సాధారణమైన వాడుక పదము. కానీ గాడిద కూడా తన పనిని ఏమాత్రము విసుగు విరామము లేకుండా చేస్తుంది. తిండి ఎండుగడ్డి , దారిలో బడిన చెత్త కాగితాలు దానికాహారము. అట్లని తన పనిలో ఏకాగ్రత ఏ మాత్రము లోపించదు. మరి శ్రమజీవికి అగ్గ్దిడ ఆదర్శము కాదా ! మీకు తెలిసిన కథే నాకు తెలిసిన విధంగా తెలుపుతాను. కౌశికుడను ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుందామని అరణ్యాలకు బయలుదేరినాడు అతనికి వ్రుద్దులై ఈ కొడుకు తప్ప మరెవరు దిక్కులేని తల్లిదండ్రులున్నారు.వారు కుమారుని తమ అనంతరం తపస్సుకు వెళ్ళమని చెప్పి బ్రతిమాలుకున్నారు.కౌశికుడు వినలేదు.ఆ ముసలి తల్లిదండ్రులను అలా దిక్కుమాలిన స్థితిలో దిగవిడచి తపస్సునకు వెళ్లి ఒక నిర్జన ప్రదేశంలో ఉరుకు దూరంగా ఒక చెట్టు క్రింద తపస్సు చేయుట ప్రారంభించాడు.రోజూ నిత్యకృత్యాలు తీర్చి మధ్యాహ్నందాకా తపస్సు చేసుకుంటూ మధ్యాహ్న వేళ భిక్షాటనకు గ్రామంలోనికి వెళ్లి "భవతి భిక్షాందేహి "అని ఏవో కొన్ని ఇండ్ల వద్ద అడిగి కర్తల భిక్షతో పొట్టనింపు కుంటూ తపస్సు చేస్తూండేవాడు.ఒకరోజు మధ్యాహ్నం తపస్సు చాలించి భిక్షాటనకై వెళ్ళుటకుద్యమించి యుండగా తాను కూర్చున్న చెట్టుపై నున్న కొంగ రెట్టవేయగా అది ఈ కౌశికుని నెత్తిపై బడెను .అంత మహాకోపముతో కన్నులెర్రజేసి చెట్టుపైనున్న కొంగవైపు చూడగా ఆ కోపాగ్నికి ఆ కొంగ రెక్కలు కొట్టుకొనుచు నేలగూలెను.అంత నాతపస్వి తపము ఫలోన్ముఖము కానున్నదని కొంత సంతోషము కొంత గర్వముతో లేచి భిక్షాటనకై ప్రక్క గ్రామమునకేగెను ఒక బ్రాహ్మణ వాడకేగి "భవతి భిక్షాందేహి"యని ఒక ఇంటి గుమ్మముకడ నిలబడి కేకపెట్టెను ఆ గృహిణి అప్పుడే వచ్చిన తన భర్తకు వలసిన పరిచర్యాదులు యొనర్చి భిక్షగొనివచ్చుటలో కొంత ఆలశ్యమయ్యెను.అంత భిక్షువు తీవ్ర స్వరముతో ఏమమ్మా!మావంటి తపస్వులనింత నిర్లక్ష్యము చేయతగునా?నేను వచ్చి చాల సేపైనది గదా!యని కఠోరముగా పలికెను.అంత నాబ్రాహ్మణి!అయ్యా నాభర్త పరిచర్య సేయుటలో కొంత ఆలష్యమైనది స్రీ లకు పతిసేవ తరువాతనే గదా!వేరొండు పనిసేయుట మీరంత తీవ్రముగా చూచుచున్నారు గాని నేను కొంగను కాదులెండి మీవంటి తపస్వులకు శాంతము అత్యంత ఆవశ్యకము గదా!అనెను.అడవిలో ఎవరును చూడనిచోట జరిగిన ఒకవ్రుత్తాంతమీమెకెట్లు తెలిసేనా!యని కౌశికుడాశ్చర్యపడి అమ్మా!మన్నించుము ఆకలిచే ఆలశ్యమైనందుకు తొందరపడితిని.అది సరేగాని కొంగ సంగతి నీకెట్లు తెలిసెను.అని అడిగెను.తాపసా!నీతో మాట్లాడుటకు నాకు వ్యవధి లేదు అదిగో చూడు మాయూరిచివర ధర్మ వ్యాధుడను చర్మకారుడున్నాడు పోయి నేచేప్పితినని వానినడుగుము.అతడు నీకన్నియు చెప్పగలడనెను.కౌశికుడు మరింత ఆశ్చర్యముతో భోజనాసక్తి వీడి యా ధర్మవ్యాధుని ఇల్లడుగుచు మాదిగపల్లి చేరెను.వికృతము,విలక్షణము అసహ్యముగానున్న ఈ వాడలో వీధి చివరనున్న ఈ ధర్మవ్యాధుని ఇంటికేగి లోపలనున్న యాతనికి కబురంపెను.ధర్మవ్యాధుడు తానూ రావీలులేదని బ్రాహ్మణునే లోనికి రమ్మనెను.కౌశికుడు లోనికేగి తూగుటుయ్యాలలో వృద్ధులైన తలిదండ్రులను పరుండబెట్టి ఊపుచూ సేవచేయుచున్న యా ధర్మవ్యాధుని చూచెను.ధర్మవ్యాధుడు బ్రాహ్మణ కుమారా!తలిదండ్రుల సేవ విడనాడి అడవిలో తపమోనర్చుట నీకుతగదు.వృద్ధులై వేరుదిక్కులేక నీకై పరితపించుచున్న నీతలిదండ్రుల సేవచేయుచు వారి యనంతరము తపమాచరింపుము.నీకుసిద్ధించును కొంగ చచ్చినంత మాత్రాన నీ తపస్సు ఫలించినట్లు తలంపకుము.తలిదండ్రుల తరువాతనే దైవము,భర్త సేవ తరువాతనే స్త్రీకి దైవ సేవ,ఆయమ్మ నాపరిస్ష్టితి నీవు చూచి తెలిసికొనగలవనియే నాకడకు పంపినది.నేను తపస్సు ఎరుగను దానధర్మములు చేయలేదు నాతలిదండ్రుల సేవ తప్ప నాకితరము తెలియదు.నా వృత్తి ధర్మము ననుసరించి చర్మకారుడనై చెప్పులుకుట్టి యమ్ముకొని జీవించుచున్నాను.నా తలిదండ్రుల యాశీస్సులవే నీ వృత్తాంతము అమ్మ వాక్యములు నాకు తెలిసినవి.నీ తలిదండ్రులు నీ రాకకై ఎదురు చూచుచున్నారు పొమ్ము వారిసేవ చేసి వారి ఆశీస్సులందుము నీ కోరికలు సిద్ధించును అని చెప్పెను.కౌశికుడాశ్చర్యముతో నుక్కిరిబిక్కిరియై త తప్పిదమునకు పశ్చాత్తాపపడి ఇంటికేగి తనకై పరితపించుచున్న తలిదండ్రుల నూరడించి వారి పరిచర్యలొనర్చి వారి అనంతరము తపోవనమునకేగి తపమాచరించి సిద్దించెను.ధర్మవ్యాధుడు చండాలుడైనంత మాత్రాన అతని ఋజువర్తన ఫలించక పోలేదు.కర్మ క్రియాఫలములచే నెవరైనను ఫలమునందుట తప్పదు.పుట్టుక,జాతి ప్రధానము గాదు.నడవడికయే ప్రధానము.అందుచేత ఎక్కడ ఏవిధంగా ఏ జాతిలో పుట్టినను ఔన్నత్యం పొందుటకు,పతితుడగుటకు జాతి,పుట్టుక కారణంకాదు ఆచరణయే.ఇక్కడగుర్తింపవలసినది మరియు ముఖ్యమైనది ఇంకొకటి కూడా వున్నది. నీటి కాలమున ఎంతో మంది రచయితలూ ధర్మ వ్యాధుని గొప్పదనము చెప్పి మిన్నకుందురు. మరి కౌశికుని గోప్పదనమునేందుకు గుర్తించరు. కౌశికుడు బ్రాహ్మనుడైయుండి, కొంతవరకు తపోధనుడై యుండి కూడా నేర్చుకొనుటకు హెచ్చుతగ్గుల తారతమ్యము తలంపక జిజ్ఞాసువై ధర్మ వ్యాధుని వద్దకు పోవుట గొప్పదనము కాదా ! ఆటను అహంకారమును విడువలేదా! శంకరులవారే
బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితమ్, ఇత్థం యస్య దృఢామతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు స తు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. అని చెప్పినారు కదా ! మెలకువనైనా, కలనైనా , గాఢనిద్రలో వున్నపుడైనా, ఏ దివ్యమైన కళ, ఏ చైతన్యము, ఏ వెలుగు కొనసాగుతున్నదో, ఏది బ్రహ్మనుండి చీమవరకు సకల ప్రాణుల శరీరములలోనూ ఓత ప్రోతమై (ఒకబట్ట నిలువు అడ్డము దారాలతో నేయబడుతుంది పొడవు దారాన్ని పడుగు అని అడ్డదారాన్ని పేక లేక పాగడ అని అంటారు. ) ఉన్నదో, అదే నేను, ఆ కళ నే నేను, అంతే కాని కేవలం కంటికి కనిపించే ఈ శరీరం నేను కాను అనే దృఢమైన దివ్య జ్ఞానము ఎవరిలో ఉన్నదో, అతను జన్మచేత చండాలుడైనా, బ్రాహ్మణుడైనా అతను నా గురువే!
కాబట్టి మానవునికి ముఖ్యముగా జిజ్ఞాసువుకుకు ప్రకృతిలోని ఎ స్థావర జంగమ జడ పదార్థమైనా గురువు కావచ్చు.

No comments:

Post a Comment

Pages