బామ్మగారి వీలునామా - అచ్చంగా తెలుగు

బామ్మగారి వీలునామా

Share This
బామ్మగారి వీలునామా

పెయ్యేటి రంగారావు


          ఆఫీసులో గొడ్డు చాకిరీ చేసి, ట్రాఫిక్ లో ఒళ్ళు హూనం చేసుకుని, పట్నంలోని కాలుష్యాన్నంతటినీ నింపుకున్న గాలి పీల్చుకుంటూ వడిలిపోయిన తోటకూరకాడలా సాయంత్రం ఏడు దాటాక ఇంటికి చేరుకున్నాడు సదాశివం.  ఆయన వచ్చినట్లే ఇంట్లో ఎవరూ గమనించలేదు.  దీర్ఘంగా ఒక నిట్ట్టూర్పు విడిచి, తన గదిలోకి వెళ్ళి, బట్టలు మార్చుకుని, స్నానాల గదిలోకి వెళ్ళి, తనివి తీరకుండా, మూడంటే మూడే మగ్గుల చన్నీళ్ళతో స్నానం ముగించుకుని వంటింట్లోకి వెళ్ళాడు.  అక్కడ ఫ్లాస్కులో వున్న చల్లటికాఫీని గ్లాసులో ఒంపుకుని, మళ్ళీ వెచ్చబెట్టుకునే ఓపిక లేక, నిలబడే మళ్ళీ మూడంటే మూడే గుక్కల్లో తాగేసి తన గదిలోకి వెళ్ళి పడకకుర్చీలో నడుం వాల్చి, ఆ రోజు వచ్చిన ఋషిపీఠం పత్రిక చేతిలోకి తీసుకున్నాడు.  కాస్త ప్రశాంతంగా చదువుదామని పేజీలు తిరగేసాడు.  ఊహు!  కుదరటల్లేదు.  ఒక్క పంక్తి కూడా చదవలేకపోతున్నాడు.  హాలంతా కేకలు, అరుపులతో దద్దరిల్లి పోతోంది.  ఎవరో ఎవర్నో చంపడానికి వెళ్తున్నారు.  ఆ ' ఎవర్నో ' ప్రాణభయంతో కెవ్వున అరుస్తున్నారు.  ఆ ' ఎవరో ' వికటాట్టహాసం చేస్తున్నారు.  అప్పుడు ఓ బ్రేక్ వచ్చినట్లుంది.  హాల్లో వున్న అందరూ కొందరు మంచినీళ్ళు తాగడానికి, మరికొందరు బాత్ రూముల్లోకి పరుగులు తీసారు. మళ్ళీ సదాశివం ఇందాకటికన్నా దీర్ఘంగా మరో నిట్టూర్పు విడిచి, పుస్తకం పక్కన పడేసి కళ్ళు మూసుకున్నాడు.  వయసుమళ్ళిన వారు అస్తమానూ ఇదే మా కాలంలో అయితే అని మొదలెట్టే లాగే, ఆయన కూడా ఇదే నిన్నటిరోజుల్లో అయితే..............అనుకుంటూ గతంలోకి వెళ్ళిపోయాడు.  
**************************

          పశ్చిమగోదావరి జిల్లా, లంకలకోడేరులో అదొక మండువాలోగిలి వున్న ఇల్లు.  ఆ యింట్లో సదాశివం తల్లి, తండ్రి, ఒక అన్నయ్య, వదిన, ఇంకా పెళ్ళి కాని చెల్లెలు, నాయనమ్మ వుంటున్నారు.  సదాశివం తండ్రి తాలూకా ఆఫీసులో హెడ్ గుమాస్తాగా చేసి రిటైరయ్యారు.  ఆయన పేరు వెంకట్రామయ్యగారు.  తల్లి పేరు సత్యవతి.  నాయనమ్మ పేరు కాసులమ్మ.  ఆవిడ ఎనభై యేళ్ళ పండు ముసలి.  ఐనా చాలా ఆరోగ్యంగా వుంటుంది.  సదాశివం అన్న బుచ్చిరామయ్య.  అతడికి చదువు సరిగా అబ్బలేదు.  అందుకని ఫిప్ట్ ఫారంతో ఆపేసి, చిన్న ఫేన్సీ దుకాణం పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాడు.  సదాశివం మాత్రం కష్టపడి బి.ఏ పేసయ్యాడు.  అతడికి తండ్రి పనిచేసిన తాలూకా ఆఫీసులోనే గుమాస్తాగా ఉద్యోగం వచ్చింది.  సదాశివానికి ఉద్యోగం వచ్చిన నెలరోజులలోనే వివాహం కూడా అయింది.  అతడి భార్య పేరు తాయారు. సదాశివం ఆఫీసు కాగానే ఇంటికి వచ్చాడు.  హాల్లో వెంకట్రామయ్యగారు రామాయణం చదువుతుంటే అందరూ కూచుని వింటున్నారు.  సదాశివం గేటు తీసుకుని నూతిదగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం చూసిన తాయారు దిగ్గున లేచి వంటింట్లోకి పరిగెత్తింది.  అతడు లోపలికి అడుగు పెడుతూండగానే చేతిలో మంచినీళ్ళ గ్లాసు వుంచింది.  ' బట్టలు మార్చుకుని మొహం కడుక్కోండి.  వేడి వేడి పకోడీలు తిందురుగాని.' అని ప్రేమగా అంటూ, అతడు తాగిన మంచినీళ్ళ గ్లాసు తీసుకుని వంటింట్లోకి నడిచింది.  రామాయణ పఠనం కొనసాగుతూనే వుంది.  సదాశివం మంచినీళ్ళు తాగాక, భక్తిగా రాములవారి పటానికి నమస్కరించుకుని పడగ్గదిలోకి వెళ్ళాడు.  బట్టలు మార్చుకుని మొహం కడుక్కుని మళ్ళీ పడగ్గదిలోకి అడుగు పెట్టగానే తాయారు నవ్వుతూ పకోడీల ప్లేటు చేతికందించింది.  సదాశివం ఒక పకోడీ ముక్క ఆమె నోటికందించాడు.  ఆమె సిగ్గు పడుతూ ఒక ముక్క కొరికింది.  ఆ మిగిలిన పకోడీ సదాశివం నోట్లో వేసుకుంటూ, ' ఇదేమిటోయ్, పకోడీలు పంచదారతో గాని చేసావా?  ఈ ముక్క చాలా తియ్యగా వుంది?' అన్నాడు నవ్వుతూ.   తాయారు మరింత సిగ్గుపడుతూ, చాల్లెండి సంబడం, మీ సరసాలు కాస్త రాత్రి దాకా దాచుకోండి.  అత్తయ్యగారు వింటే బాగుండదు.' అంది.  
****************************

          సదాశివం అనుకోకుండా మళ్ళీ నిట్టూర్చాడు.  ఆ రోజులన్నీ వెళిపోయాయి.  తండ్రి ఎప్పుడో కాలం చేసాడు.  ఆయన పోయినాక ఎవరికి వారు వేరు కాపురాలు పెట్టేసుకున్నారు.  ఇప్పుడు సదాశివం ప్రమోషనొచ్చి ఆర్.డి.వో.గా రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నాడు.   శ్యామలానగర్ లో నాలుగు వందల గజాల స్థలం కొనుక్కుని అందులో చక్కటి మేడ  కట్టుకున్నాడు.  అతడితో అతడి తల్లి సత్యవతమ్మగారు కూడా వుంటోంది.  అతడు ఆఫీసునించి రాగానే ఇంట్లో రోజూ జరిగే భాగవతమే అది.  తాయారు, తల్లి సత్యవతమ్మ, హాల్లో వున్న ఏభయి అంగుళాల టి.వి.కి ఎప్పుడూ అతుక్కుపోయి వుంటారు.  వాళ్ళకి ఒక్క క్షణం తీరిక వుండదు. సదాశివం ఆఫీసుకెళిపోగానే వాళ్ళు బిజీ అయిపోతారు.  మధ్యాహ్నం పన్నెండింటికి వరసగా ఛీ.టి.వి.లో ' నా కొంపలో మాడట్టు ' కార్యకమం, థూ టి.వి.లో ' నీ ఖర్మ, తింటే నా చేతి వంటే తిను ' కార్యక్రమం, టి.వి.39 లో ' నా చేతి వంట, తింటే కైలాసానికే నంట ' కార్యక్రమం, తరవాత ' అమ్మాయిలూ!  మీరే యువరాణులూ', ' ఫోను కొట్టు, బహుమతి పట్టు ' కార్యక్రమాలు, వీటితో కాలక్షేపం అయిపోతూవుంటుంది.  ఇంక సాయంత్రమైతే వరసగా సీరియల్సే, సీరియల్స్.  ఛీ టి.వి.లో ' అత్తా!  నీ పీక పిసుకుతా. ', దాని తర్వాత థూ టి.వి.లో ' కోడలా!  నువ్వెక్కడ దాపురించావే నా కొడుక్కి?' , అదవగానే టి.వి.39 లో ' తోడికోడళ్ళ ప్రళయ కలహాలు ' సీరియల్ ఇవన్నీ చూస్తుండగానే రాత్రి 9.30 ఐపోతుంది.  మళ్ళీ 9.30 కాగానే ఛీ టి.వి.లో మగవాళ్ళు రోతగా చీరలు కట్టుకుని మొగుళ్ళని చీపుళ్ళతో కొట్టే అపహాస్య కార్యక్రమం ' మస్త్, మస్త్ ' , అది జరుగుతూంటే జడ్జీలుగా వచ్చిన నటభూతం, నాట్యవికారిల వెకిలి నవ్వులు, థూ టి.వి.లో చిన్నపిల్లలు చాలీ చాలని బట్టలు వేసుకుని, కుప్పిగంతులు వేస్తూ ఒకళ్ళనొకళ్ళు పెదవుల మీద ముద్దులు పెట్టుకుంటూ చేసే అసభ్య నృత్యాల కార్యక్రమం ' చిందెయ్యండ్రా చంటోళ్ళూ!' కార్యక్రమం, అది జరుగుతూంటే జడ్జీలుగా వచ్చిన రోతేషు, బూతేశ్వరిలు వేదికమీదకు వెళ్ళి ఆ పిల్లలని ముద్దులు పెట్టుకుని ' ఆహా, ఓహో ' అంటూ పొగడడం, దాని తర్వాత ' ఘోరమైన నేరాలు ' కార్యక్రమంలో ఆరోజు జరిగిన అత్యాచారాలు, రేగింగ్ లు, ఆత్మహత్యలు, హత్యలు చూపుతూ నేరాలు ఎల్లా చెయ్యవచ్చో తెలిపే స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం, ఇవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి పదకొండు దాటుతుంది.  ఇంక కళ్ళు మంటలు పెట్టేస్తుంటే సత్యవతమ్మ, తాయారమ్మా తూలుతూ మంచాలెక్కి కలత నిద్రలోకి జారుకుంటారు. అందువల్ల తాయారమ్మకి మొగుడికి కాస్త ఏమన్నా రుచిగా వండిపెట్టే తీరికే వుండదు.  పొయ్యిమీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసి, హాల్లోకి వచ్చి టి.వి.కి అతుక్కుపోతూ వుంటుంది.  ఇక సదాశివం ఆఫీసునించి వచ్చాక తన కాఫీ తనే కలుపుకోవడమో, లేకపోతే ఫ్లాస్కులో వున్న చల్లారిపోయిన కాఫీనే మళ్ళీ కాస్త వేడి చేసుకు తాగడమో చేస్తూ వుంటాడు.  ఇక భోజనం లోకైతే మాడిపోయిన కూరలు, బిరుసన్నం, ఊరగాయలే గతి. ఇంక సదాశివం పిల్లలైతే వాళ్ళేం చదువుతున్నారో పట్టించుకునే వాళ్ళే లేరు.  సదాశివం ఆఫీసు నించి ఎప్పుడూ ఆలస్యంగానే వస్తాడు.  ఇంక తల్లి తాయారమ్మకి గాని, నాయనమ్మ సత్యవతమ్మకి గాని వాళ్ళని పట్టించుకునే తీరిక అస్సలు లేదు. సదాశివం ఇంటి ప్రస్తుత పరిస్థితి ఇది.  
**************************

          ఆ రోజు సదాశివం ఇంటికొచ్చేసరికి పరిస్థితి చాలా గంభీరంగా వుంది.  టి.వి. కట్టేసి వుంది.  పిల్లలు బిక్కు బిక్కుమంటూ ఒక మూల కూర్చుని వున్నారు.  ఏం జరిగిందా అని కంగారుగా లోపలికి వెళ్ళాడు.  వాళ్ళ ఫేమిలీడాక్టరు గారు సత్యవతమ్మగారిని పరీక్ష చేస్తున్నాడు.  తాయారమ్మ కొంగు నోట్లో కుక్కుకుని ఏడుస్తోంది.  సదాశివం కంగారుగా తల్లి దగ్గిరకి వెళ్ళి ఆమె చేతిని పట్టుకున్నాడు.  డాక్టరు గారు పరీక్షించడం పూర్తి చేసి, తెలుగు సినిమాల్లో లాగు, టి.వి.సీరియల్స్ లోలాగు ఒకసారి గంభీరంగా తల పంకించి, బ్యాగు తీసుకుని బైటికి నడిచాడు.  సదాశివం ఆయన వెనకే గాబరాగా వెళ్ళాడు. డాక్టరు గారు ఒకసారి పెదవి విరిచి, గంభీరంగా అన్నాడు, ' చూడండి సదాశివంగారూ, ఆవిడకి వచ్చిన వ్యాధి సామాన్యమైనది కాదు. ' టెల్గూ టివిలో సీరియలోసిస్ ' అనే ప్రాణాంతకమైన వ్యాధి. ఇది శరీరాన్నే కాదు, మనసుని కూడా క్రుంగదీసేస్తూ, క్రమంగా ప్రాణాల్ని హరించి వేస్తుంది.  నేను ' నిదరోలా ' టాబ్లెట్స్, ' టి.వి.చూడకండ్రొరేలా' సిరప్ రాస్తున్నాను.  ఇవి ఆవిడ రెగ్యులర్ గా వాడేలా చూడండి.  బతికి బాగుంటే, నేను కాదు, ఆవిడ, మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వచ్చి చూస్తాను.' అని చెప్పి, సదాశివం ఇచ్చిన ఐదువందల నోటు జేబులో కుక్కుకుని వెళిపోయాడు. ఆ రోజునించి సదాశివం టి.వి.రిమోట్ దాచేసాడు.  ఐనా సత్యవతమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది.  సదాశివం శలవు పెట్టేసి తల్లి దగ్గరే కూర్చుని పరిచర్యలు చేస్తున్నాడు.  కాని ఏమీ ఉపయోగం కనిపించటం లేదు.  మంచం మీదే వుండి బహుశా రామకోటి అయివుండవచ్చు, అదేపనిగా రాసేస్తోంది. మరి నాలుగు రోజులు గడిచాయి.  సత్యవతమ్మ గారు ఏదో చెప్పాలనుకుంటోంది.  కాని చెప్పలేకపోతోంది.  సదాశివం ఆవిడ దగ్గిరకి వెళ్ళి అడిగాడు, ' అమ్మా!  ఏమన్నా కావాలా?  ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా?' ఆవిడ ఔనన్నట్లుగా తలూపింది.  సదాశివం ఆవిడ దగ్గరకు వెళ్ళి నోటి దగ్గర చెవి ఆనించాడు.  ఆవిడ నీరసంగా, ' హాలు, హాలు...' అంది.  సదాశివం ఆవిడ మంచం హాల్లో వేసి అక్కడ ఆవిడని పడుకోబెట్టాడు.  ఆవిడకి కొద్దిగా ఓపిక వచ్చింది.  ' రిమోట్ ' అని గొణిగింది.  సదాశివం తెల్లబోయాడు.  ఐనా తమాయించుకుని, వెంకటేశ్వర భక్తి ఛానెల్ చూడాలనుకుంటోందేమో అని టి.వి. ఆన్ చేసి ఆ ఛానెల్ పెట్టాడు.  ఆవిడ టి.వి.కేసి చూడకుండా రిమోట్ కావాలన్నట్టు చేయి చాపింది.  సదాశివం పళ్ళు కొరుక్కుంటూ ఆవిడ చేతిలో రిమోట్ వుంచాడు.  ఆవిడ ఆత్రంగా మూడవ నంబరు నొక్కింది.  వెంటనే టి.వి.లో ఛీ టి.వి. ప్రసారాలు మొదలయ్యాయి.  కొన్ని ప్రకటనల తర్వాత ' అత్తా!  నీ పీక పిసుకుతా' సీరియల్ మొదలైంది.  ఆవిడ తృప్తిగా మనసులో అనుకుంది.  'అమ్మయ్య, వారం రోజులైనా, కథేం జరగలేదు.'  ఆవిడ చివరి సారిగా  చూసినప్పుడు 962 వ భాగం జరుగుతోంది.  అందులో,  అత్త పడుకోవడానికి గదిలోకి వెళ్ళింది.  ఆవిడ ఎప్పుడు నిద్రపోతుందా, ఎప్పుడు ఆవిడ పీక పిసుకుదామా అని కోడలు ఎదురు చూస్తోంది.  ఒక నల్లపిల్లి అత్తగదిలోకి వచ్చింది.  అత్త ఉలిక్కిపడి చూసింది.  అక్కడ సీరియల్ ఆగింది.  తరవాత కోడలు గదిలో గోళ్లు కొరుక్..........క్...............క్..............క్..............క్............క్కుంటూ ఆవిడ ఎప్పుడు నిద్రపోతుందా అని ఎదురు చూస్తోంది.  అప్పుడే ఆ సీరియల్ ఆగింది.  అప్పుడు చిరుగుల బట్టలేసుకున్నయాంకరమ్మ ప్రేక్షకులకి ఒక ప్రశ్న విసిరింది.  అత్త గదిలోకి నల్లపిల్లి రావడం మీరు చూసారు కదా ప్రేక్షకులూ!  ఆ నల్లపిల్లి అత్తగదిలో టేబులు మీద వున్న పాలు చూస్తుందా, చూడదా?  చూస్తుంది అన్నట్లైతే వెంటనే మీ సెల్ ఫోను తీసి, ' అ నీ పి పి  చూ' అని టైపు చేసి 97975 కి ఎస్.ఎమ్.ఎస్. చెయ్యండి.  ఒకవేళ చూడదు అన్నట్లైతే ' అ నీ పి పి ఊహు' అని టైపు చేసి 97975 కి ఎస్.ఎమ్.ఎస్. చెయ్యండి.  కరెక్టుగా సమాధానం పంపిన వాళ్ళ పేర్లు లాటరీ తీసి, ఒక గ్రాము 22 క్యారెట్ల పూత వున్న నెక్లెస్ మీకు బహుమతిగా పంపబడుతుంది.  త్వరగా మెసేజి పంపి నెక్లెస్ గెలుచుకోండి.' అని ఒళ్ళంతా తిప్పుకుంటూ చెప్పింది.  ఆ మర్నాడు నల్లపిల్లి ఆ పాలగ్లాసుని చూసేసింది.  వారం రోజులుగా ఆ నల్లపిల్లి అత్త గదిలో అటూ ఇటూ తిరుగుతూనే వుంది.  కోడలు గోళ్ళు కొరుక్కుంటూనే వుంది.  రెండవరోజు పాపం తొడుక్కోడానికి సరైన బట్టలు లేని అదే యాంకరమ్మ వచ్చి, ఆ పిల్లి గ్లాసులో పాలు తాగుతుందా, తాగదా అని మరో సవాలు విసిరి మళ్ళీ మెసేజ్ లు పంపమని అడుక్కుంది.  ఇలా వారం రోజులుగా ఆ నల్లపిల్లి హల్ చల్ చేస్తూ వుండడము, కోడలు తన కుడిచేతికున్న ఐదు వేళ్ళ గోళ్ళూ, తరవాత ఎడమ చేతికున్న ఐదువేళ్ళ గోళ్ళూ కూడా కొరుక్కోవడం పూర్తయ్యాక కుడికాలి ఐదువేళ్ళ గోళ్ళూ, తరవాత ఎడమకాలి ఐదు వేళ్ళ గోళ్ళూ కొరుక్కోవడం కూడా విజయవంతంగా పూర్తి చేసింది.  సత్యవతి మళ్ళీ చూడడం మొదలెట్టేసరికి, ఆ సీరియల్ యొక్క 969 వ భాగం మొదలైంది.  అప్పటికి నల్లపిల్లి పాలు తాగడము, కోడలు తన రెండు చేతులకున్న పదివేళ్ళ, రెండు కాళ్ళకున్న పదివేళ్ళ గోళ్ళు కొరుక్కోవడము పూర్తయింది.  ఇప్పుడు తరవాతి భాగం యమ సస్పెన్సుతో మొదలయింది. ఇలా సత్యవతి తిరిగి టి.వి.సీరియల్స్ చూడడానికి వీలు చిక్కడంతో ఆవిడ ఆరోగ్యం మెల్ల మెల్లగా కుదుట పడసాగింది. ఐతే ఆవిడ దురదృష్టం!  ఒకరోజు టి.వి.39 లో ' తోడికోడళ్ళ ప్రళయకలహాలు'  సీరియల్ చూస్తోంది.  అందులో ఒక కోడలు మరొక తోటికోడలు మీద కక్షతో ఆమె నాలుగేళ్ళ కూతురు నిద్రపోతుండగా, దిండు ఆ పాప మొహానికేసి నొక్కేసి ఆ పాపను చంపడానికి ప్రయత్నిస్తోంది.  ఆ పాప ఊపిరాడక, ' ఊ.........ఊ.........' అంటూ ఆయాసపడిపోతూ కాళ్ళు గిల గిల కొట్టుకుంటోంది.  ఆ సన్నివేశం చూస్తుండగా అసలే బి.పి,, మధుమేహం, గుండెజబ్బుతో బాధ పడుతోందేమో, సత్యవతి ఆ టెన్షను తట్టుకోలేక బాల్చీ తన్నేసింది. సదాశివానికి ఆవిడ చనిపోయినందుకు ఏడవాలో, ఎల్లా చనిపోయిందో తలుచుకుని ముక్కు మీదకి కోపం తెచ్చుకోవాలో అర్థం కాలేదు.  సరే, తర్వాత కార్యక్రమాలు మొదలయ్యాయి.  ఉన్నట్లుండి సదాశివానికి ఆవిడ చివరి రోజుల్లో రామకోటి రాసిన సంగతి గుర్తుకు వచ్చింది.  పోన్లే, పోయేముందు ఒక మంచి పనన్నా చేసింది కదా అనిపించింది.  ఆ రామకోటి పుస్తకం ఆవిడతో పాటు పైకి పంపేద్దామనిపించింది.  వెంటనే ఆవిడ మంచం దిండుకింద వెతికాడు.  అక్కడ ఒక చిన్న పుస్తకం భద్రంగా వుంది.  ఆత్రుతగా ఒక పేజీ తిరగేసాడు.  ఐతే అతడనుకున్నట్లుగా అది  రామకోటి కాదు.  అందులో ఇలా రాసివుంది!

సత్యవతి మరణశాసనము 

          నాకు వీలునామా రాయడం తెలీదు.  కాని నా తదనంతరం నా నిర్ణయాలు అమలు కావాలనే కోరికతో ఈ వీలునామా రాస్తున్నాను.  నా పేరు సత్యవతి.  నేను చిన్నప్పటినించీ పొద్దున్నే దేవుడి స్తోత్రాలు చదువుకోవడం, సాయంత్రం పురాణకాలక్షేపం జరుగుతోంటే వినడం చేసేదాన్ని.   మా అమ్మకి ఇంటిపనుల్లో చేతనైనంత సాయం చేస్తుండేదాన్ని.  పగలు బోలెడంత ఖాళీ సమయం దొరికేది.  అప్పుడు అడవి బాపిరాజు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, చిలకమర్తివారు, లతగారు, పానుగంటి వారు, ఇంకా ఎందరో మహామహులు వ్రాసిన ఉద్గ్రంథాలు చదువుకుంటూండే దాన్ని.  ఆ రోజుల్లో మాకు టి.వి.లు వుండేవి కావు.  ఒకే ఒక్క టూరింగ్ టాకీసు వుంటే అందులో ఏ భక్తి సినిమాయో వస్తే ఇంటిల్లిపాదీ ఏ నెలకో, రెండు నెలలకో ఒకసారి వెళ్ళేవాళ్ళం.  దసరాకి, శ్రీరామనవమికి పందిళ్ళలో చక్కగా హరికథలు, బుర్రకథలు, పద్యనాటకాలు జరిగేవి.  అవన్నీ ఎంతో ఆనందంగా చూసేవాళ్ళం. కాని ఇప్పుడు రోజులు దారుణంగా మారిపోయాయి.  ఒక్క నిముషం వ్యవధి ఇవ్వకుండా ఇరవైనాలుగు గంటలూ అనేక ఛానెళ్ళలో అనేక రకాల కార్యక్రమాలు వస్తున్నాయి.  పోనీ వాటిలో ఏమన్నా నీతి వుంటుందా అంటే, అబ్బే, చాలా హేయమైన కార్యక్రమాలు వస్తున్నాయి.   నేటి బాలలని, యువతరాన్ని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళేందుకు పురికొల్పేలా వుంటున్నాయి.  పైగా ఆ కార్యక్రమాలు బలవంతంగా మా మీద రుద్దుతున్నారు.  ప్రతి చెత్తకార్యక్రమం చివర ఒక ప్రశ్న ఇవ్వడం, దానికి సమాధానం చెబుతే బహుమతి ఇస్తామనడం, ఇలా జనాన్ని ప్రలోభ పెడుతున్నారు.  అంతే కాకుండా రోజంతా వాళ్ళ ఛానెల్ కే కట్టిపడెయ్యాలన్న పాడు ఆలోచనతో ఉదయం నించి రాత్రిదాకా జరిగే కార్యక్రమాలన్నీ మనం చూడాలట, వారు ప్రతి కార్యక్రమం గురించి ఒక ప్రశ్న వేస్తారట, అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పిన వారికి ఏదో కానుక ఇస్తారట.  ఎంత దారుణం!  అన్ని జన్మలలోకి మానవజన్మ కడు దుర్లభమైనది, ఎంతో ఉత్కృష్టమైనది.  కాని మన దురదృష్టం కొద్దీ అందులో సగభాగం నిద్దరకే సరిపోతుంది.  ఆ మిగిలిన సగభాగమన్నా సార్థకం చేసుకుందామంటే దానికి అవకాశమివ్వకుండా, ఈ దుర్మార్గులు మన జీవితాలలోకి క్రూరంగా చొచ్చుకుని వస్తున్నారు. టి.వి. ద్వారా నీతులు బోధించవచ్చు.  జనాన్ని మంచిదారిలోకి మళ్ళించే అనేక ధార్మిక కార్యక్రమాలను ప్రసారం చెయ్యవచ్చు.  హరికథలు, బుర్రకథలు, కారణజన్ములైనట్టి మహామహుల జీవితగాధలను ప్రసారం చెయ్యవచ్చు, చక్కటి సంగీత కార్యక్రమాలు, శాస్త్రీయమైన నృత్యప్రదర్శనలు చూపించవచ్చు.  అదేమీ లేదు.  పీలికల బట్టలేసుకుని, జుట్టు విరబోసుకుని, ఒత్తులు పలక్కుండా తెలుగు భాషని ఖూనీ చేస్తూ, డభ్భయి ఐదు శాతం ఆంగ్లపదాలను వాడుతూ వెకిలిగా మాట్లాడే యాంకర్లు, వాళ్ళు ప్రజల బుర్రలలోకి ప్రవేశపెట్టే ఇరగదీస్తా, కెవ్వుకేక, గుడ్డు మార్నింగ్, లెగు, వచ్చుద్ది, ఎల్లుద్ది, ఆల్లు, ఎల్లు, కల్లు లాంటి పదాలు, వీటితో మన తెలుగు భాషని, మన సంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలని భ్రష్టు పట్టించేస్తున్నారు.  ఇక కార్యక్రమాల విషయానికి వస్తే, వాళ్ళ జీవితాలు శాశ్వతమైనవి అన్నట్టుగాను, కలియుగాంతం వరకు వాళ్ళు బతికే వుంటామన్నంత భరోసాతోను సీరియల్స్ ని ఏళ్ళతరబడి సాగదియ్యడం, పైగా ఇది మూడు వేల నూట ఏభయిరెండవ ఎపిసోడ్ అని గర్వంగా చెప్పుకోవడం, అలాంటి సాగదీత సీరియల్స్ అన్ని సంవత్సరాలు ఘనంగా సాగదీస్తూ జనాన్ని హింసిస్తున్నందుకు విజయసూచకంగా పండగ జేస్కోవడం, ఆ కార్యక్రమాన్ని మళ్ళీ లైవ్ టెలికాస్ట్ చెయ్యడం, ఇది ఎంత దారుణం!  మన జీవితాల్ని వాళ్ళ కార్యక్రమాలతో దారుణంగా వృధా చేసేస్తున్నారే?  పైగా ఎవరన్నా విమర్శిస్తే, మీ చేతుల్లోనే రిమోట్ వుంటుంది కదా, ఇష్టం లేకపోతే టి.వి. కట్టేసుకోవచ్చు కదా అని పేలాపన చెయ్యడం.  సరి, ఈ విషయం గురించి ఆలోచిస్తూంటే నా కలం అదుపు తప్పుతోంది.  అంతేకాదు, నా మనసు తీరని వేదనతో కుంగిపోతోంది.  అందుకని అసలు విషయంలోకి వస్తాను. ఒక కథ చదువుతున్నామంటే అది బాగాలేదని మధ్యలో ఆపెయ్యలేము.  ఒక సినిమా చూడడానికి వెళ్తే, బాగాలేదని పదినిముషాలలో సినిమాహాలు లోంచి బైటికి రాలేము.  చూద్దాం, తరవాత తరవాత బాగుంటుందేమో అనుకుంటాం.  అంతేకాదు, కథ చివరికి ఏమవుతుంది అన్న జిజ్ఞాస వుంటుంది.  అందుకని ముగింపు తెలిసేదాకా అల్లాగే ఓపిక పడతాం.  నా విషయంలో కూడా అలాగే అయింది.  నేను, నా కోడలు తాయారు ఛానెల్స్ వాళ్ళు ఇచ్చే ప్రకటనలు చూసి, ప్రలోభపడి కొన్ని సీరియల్సు చూడడం మొదలుపెట్టాము.  అంతే!  ఆ సీరియల్స్ యొక్క ఊబిలో పీకలలోతు దిగబడిపోయాము.  మా కోడలు పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారిపో్యింది.  ఇదివరకు భర్త యోగక్షేమాలు చూసుకునేది.  వేళకు కాఫీ, టిఫిన్లు, భోజనం పెట్టేది.  చక్కగా కాలాతీతం కాకుండా పడుకుని, మర్నాడు పెందరాళే లేచేది.  ఇప్పుడవేమీ లేవు.  భర్త ఎలావున్నాడో, ఏం తింటున్నాడో, అసలు తింటున్నాడో, లేదో, పిల్లలు ఎలా చదువుతున్నారో, ఈ గొడవలేమీ ఆవిడకు పట్టవు.  పొద్దుటినించీ రాత్రిదాకా టి.వి., టి.వి.  అంతే.  ఒక రామాయణం చదవడం లేదు, ఒక సత్సంగం లేదు, ఒక లలితాసహస్రం చదువుకోవడం లేదు.  ఇక నా పరిస్థితి.  ప్రస్తుతం నా ఆరోగ్యం బాగా దెబ్బతింది.  ఇంక ఎన్నాళ్ళో బతుకుతానన్న ఆశ లేదు.  ఐనా ఒక దరిద్రపు బెంగ.  అది నా జీవితం గురించి కాదు.  ఒక పుణ్యం, ఒక పురుషార్థం గురించి కాదు.  నేను చూస్తున్న సీరియల్సులో తరవాత కథ ఏంజరుగుతుంది అనే పనికిమాలిన ఉత్కంఠ.  నేను చచ్చిపోయినా ఈ దుగ్ధ నాకు తీరేలా లేదు.  అందుకనే ఈ వీలునామా రాస్తున్నాను. ఈ సీరియల్సు ఇంకా ఎన్ని దశాబ్దాలు నడుస్తాయో తెలీదు.  అసలవి ముగుస్తాయో లేదో కూడా తెలీదు.  అందుకని, నేను చనిపోయిన తర్వాత, ప్రతి సంవత్సరం నాకు తద్దినం పెట్టే రోజున, బ్రాహ్మలని పిలిచి అంతవరకు ఆ సీరియల్స్ లో కథ ఏం జరిగింది అన్నది క్లుప్తంగా ఆ బ్రాహ్మలకి వివరిస్తూ వుండాలి.  నాకు పెట్టే పిండాలు నా ఆకలిని తీరుస్తాయన్నట్లే, అలా ఆ సీరియల్స్ లో జరిగిన కథ ఆ బ్రాహ్మలకి వివరించి చెబుతే, నాకు వినిపిస్తుందన్న నమ్మకం నాకుంది.  నా ఈ కోరిక తీర్చవలసిందిగా నా కొడుక్కి ఇందుమూలంగా నేను ఆదేశిస్తున్నాను. ఇట్లు, సత్యవతి. ఆ ఉత్తరం చదవడం పూర్తి చేసి సదాశివం నిర్ఘాంతపోయాడు.  బుర్రంతా మొద్దుబారిపోయింది.  తన తల్లి టి.వి.సీరియల్సు చూడ్డానికి అలవాటు పడిపోయిందనుకున్నాడు కాని ఇంత మథనపడుతోందని ఊహించలేకపోయాడు.  క్షణాల్లో అతడొక నిర్ణయం తీసుకున్నాడు.  బైటికి వచ్చి చూసాడు.  అంత్యక్రియలకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  వెదురు కర్రలతో పాడె సిధ్ధం చేస్తున్నారు.  కొద్ది సేపట్లో  సత్యవతి భౌతికకాయాన్ని పాడె మీద వుంచారు.  తాళ్ళతో కట్టబోతుంటే వాళ్ళని ఆగమని చెప్పి సదాశివం హాల్లోకి వెళ్ళి అక్కడున్న ఏభయి అంగుళాల ఎల్.ఇ.డి.టి.వి.ని తీసుకొచ్చి దాన్ని కూడా ఆ పాడె మీద వుంచాడు.  అందరూ అతడిని వింతగా చూస్తుంటే పట్టించుకోకుండా తన తల్లి భౌతికకాయంతో పాటు ఆ టి.వి.ని కూడా మంటలకాహుతి చేసేసి ప్రశాంతంగా ఇంటికి చేరుకున్నాడు.  
************************ 

No comments:

Post a Comment

Pages