బుడుగు సైకిలు - అచ్చంగా తెలుగు

బుడుగు సైకిలు

Share This

బుడుగు సైకిలు

- యనమండ్ర శ్రీనివాస్ 


“వీడి వేషాలు మనకి తెలీనివి కాదు కదా బాబు” అంది అమ్మ బాబాయితో. అలా ఎందుకు అన్నదీ తెలియాలంటే రాత్రి ఏం జరిగిందో చెప్పాలి మీకు.
రాత్రి నిద్రపోయేముందు నేను గాఠి గాఠిగా కిష్టయ్య దేవుడికి ఇలా దణ్ణం పెట్టుకుంటున్నాను.
“ఓ కిష్టయ్యా…నాకొక సైకిలు ఇవ్వు” “ఓ కిష్టయ్యా…నాకొక సైకిలు ఇవ్వు” “ఓ కిష్టయ్యా…నాకొక సైకిలు ఇవ్వు”
ఇంతలో నా పక్కన పడుకున్న బాబాయి లేచి “ఒరేయి… కిష్టయ్యకి చెవుడు లేదురా…నీవు నెమ్మదిగా చెప్పినా ఆయనకి వినపడుతుంది” అన్నాడు విసుగ్గా.
“కిష్టయ్యకి వినపడితే లాభం లేదు బాబాయి. పక్క గదిలో అమ్మకు, నాన్నకు వినపడాలిగా. అందుకే ఈ అరుపుల దణ్ణాలు” అన్నాను. ఈ పెద్దవాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు తెలీనే తెలీవు. అన్నీ వాళ్ళు చేసినట్టే చిన్న పిల్లలు చేస్తారు అనుకుంటారు.
ఆ సైకిలు ప్రార్ధన గురించి బాబాయి చెప్తే అమ్మ నా వేషాలు తెలిసినవేగా అంది. తర్వాత నాతో అంది. “బుడుగూ మమ్మల్ని అడగక్కర్లా కానీ. సైకిలు గురించి కిష్టయ్యని మటుకు అడగడం అలా కాదు. తెలిసిందా” అని.
“మరెలాగా?” అడిగాను నేను.
“ఓ పేపరు తెచ్చుకుని నువ్వు ఈ ఏడాది ఏమేమి పనులు చేసావో గుర్తు తెచ్చుకొని కిష్టయ్యకి ఒక ఉత్తరం రాసుకో. నువ్వు చేసిన పనులు చదివినా నీకు కిష్టయ్య సైకిలు కొని ఇస్తాడో లేదో నువ్వే ఆలోచించు” అంది అమ్మ.
వెంటనే నేను పేపరు తెచ్చి రాసిన ఉత్తరాలు ఇవిగోః
***ఉత్తరం ఒకటి***
“ఓ కిష్టయ్యా
నేను ఈ ఏడాది అన్నీ మంచి పనులే చేసాను. నాకో మాంచి సైకిలు పంపించు. ఎరుపు రంగుది.
ఇట్లు బుడుగు”
కానీ కాసేపు ఆలోచించాక ఎందుకో ఇలా అడగడం కరెక్టు కాదు కదా అనిపించింది. అందుకో ఇలా రెండో ఉత్తరం రాసేశానుః
***ఉత్తరం రెండు***
“ఓ కిష్టయ్యా
ఇదిగో నేను నీ ఫ్రెండు బుడుగుని. సరేనా. నేను ఈ ఏడాది అన్నీ మంచి పనులే చేసాను కదా. నాకో సైకిలు పంపించవా. ప్లీజ్. ఎరుపు రంగుది.
ఇట్లు నీ బుడుగు”
మళ్లా నాకు ఎందుకో ఇది కరెక్టు కాదు కదా అనిపించింది. అందుకని నా మూడో ఉత్తరం ఇదిగోః
***ఉత్తరం మూడు***
“ఓ కిష్టయ్యా
ఇదిగో నేను నీ మంచి ఫ్రెండు బుడుగుని. నేను ఈ ఏడాది దాదాపుగా అన్నీ మంచి పనులే చేసానని అనుకుంటున్నాను. నాకో సైకిలు పంపించవా, ప్లీజ్ నీకు దణ్ణం పెడతా. ఎరుపు రంగు సైకిలు మొన్న పెసూనాంబ కొనుక్కుంది. అలాంటిదైతే బాగుంటుంది కదా. ఆలొచించు ప్లీజ్.
ఇట్లు నీ బుడుగు”
ఏమిటో ఈ ఉత్తరం కూడా కరెక్టు కాదు కదా అనిపించింది. అందుకని ఇంక నాలుగో ఉత్తరం ఇలా రాశానుః
***ఉత్తరం నాలుగు***
“ఓ కిష్టయ్యా
ఇదిగో నేను నీ మంచి ఫ్రెండు బుడుగుని. నేను కిందటి ఏడాది అన్ని మంచి పనులూ చెయ్యలేదు. అది నాకూ తెలుసు. కానీ ఒచ్చే ఏడాది మటుకు నేను మారిపోతాను. ప్లీజ్. నా పుట్టిన రోజు వొస్తోంది. ఒక సైకిలు ఎరుపు రంగుది పంపించవా. పుట్టినరోజు నాడు పెసూనాంబకి సైకిలు ఉండి నీ ఫ్రెండుకి లేకపోతే నీకూ మంచిగా అనిపించదుగా. ఆలోచించు.
ఇట్లు నీ బుడుగు“
ఛీ. ఏమిటీ అడగటం. ఎంత కిష్టయ్య దేవుడైనా కానీ ఇలా మరీ దీనంగా అడగాలా. లాభం లేదు. ఇలా అడిగితే కిష్టయ్య ఇవ్వడు అని అనిపించింది. అందుకే వెంటనే పూజ గదిలోకి వెళ్ళా. అక్కడ అమ్మ రోజూ పూజ చేసే కృష్ణుడు, రాధ బొమ్మ ఉంది. అటూ ఇటూ చూశా. ఎవరూ లేని టైము చూస్కుని వెంటనే రాధ బొమ్మ ఘబుక్కున తీస్కుని నా రూములోకి వచ్చేశా. ఆ బొమ్మ నా వార్డ్ రోబులో దాచేసి, నా రూములో కూర్చుని ఫైనల్ గా ఈ ఉత్తరం రాశాః
“హేయ్ కృష్ణా
ఇదిగో. విను. నేను నీ ఫ్రెండు రాధని నేను కిడ్నాప్ చేశాను. తనను మళ్ళా నీకు తిరిగి ఇవ్వాలంటే ఓ మాంఛి తళ తళ లాడే ఎర్ర సైకిలు రేపటికల్లా నా ఇంట్లో ఉండేలా చూసుకో. ఉంటా. బై”
బాగుంది కదా అవిడియా. ఇదీ స్టైలంటే. సినిమాలు చూస్తే ఇలాంటి అవిడియాలు బోల్డు వస్తాయి తెలిసిందా.

No comments:

Post a Comment

Pages