కత్తిపోటు - కలంపోటు - అచ్చంగా తెలుగు

కత్తిపోటు - కలంపోటు

Share This
కత్తిపోటు - కలంపోటు

పెయ్యేటి శ్రీదేవి

     
     కత్తి కలంతో గొప్పగా చెప్పుకుంది, ' కలంపోటు కన్నా కత్తిపోటు గొప్పది.  అందుకని నీకంటే నేను గొప్పదాన్ని.' కలం ఏం మాట్లాడలేదు. మళ్ళీ కత్తి కవ్వించింది, ' నీకంటే నేను గొప్ప.  తెలుసా?' కలం కాగితం మీద కత్తిబొమ్మ గీసి, దానిమీద ఒక్కపోటు పొడిచి, ' కత్తికన్న కలం గొప్ప ' అని రాసి చూపించింది. కత్తికేమీ అర్థం కాలేదు. మళ్ళీ కలం ' శ్రీరామ ' అని రాసి చదవమంది. కత్తికి చదవడం తెలీలేదు. అప్పుడు కలం కాగితం మీద తిరిగి ' కత్తీ, నువ్వు నిరక్షరకుక్షివి.  చదువు రాని నువ్వు ఎందుకూ పనికిరాని వింత పశువ్వి.  అడ్డగాడిదవి.' అని రాసి చదవమంది. కత్తి అదీ చదవలేకపోయింది. అప్పుడు కత్తితో కలం అంది, ' చూసావా కత్తీ?  నువ్వు చాలా గొప్పదాన్ననుకుని, కలంపోటు కన్న కత్తిపోటు గొప్పదని విర్రవీగుతున్నావు.  కాని నేను తిడుతూ రాసిన దాన్ని, శ్రీరామ అన్న దేవుడి నామాన్ని కూడా నువ్వు చదవలేకపోయావు.  ఇప్పుడైనా కలానిది వాడి ఎక్కువ అని తెలుసుకో. నీకు చదువు రాదు.  మంచిమాటలు చదవలేని నువ్వు మంచి అనే పదానికి అర్థం కూడా తెలుసుకోలేవు.  నువ్వు తెలివితక్కువతనంతో అహంకారం, కక్ష, కార్పణ్యాలతో, కుత్సిత కుతంత్రాలతో, అత్యాశతో నన్ను ప్రేమించమంటూ వెంటపడి వేధిస్తూ, అమ్మాయిలను బాధపెట్టే కిరాతకుల చేతి ఒక్కవేటుతో ఎంతోమంది అమ్మాయిలని నరికేస్తున్నావే?  ఇదేనా నీ కత్తిపోటు గొప్పతనం?  ఎందుకొచ్చిన జన్మ?  నీలాంటి వాళ్ళు దేశానికి చీడపురుగులు. వాల్మీకి, తులసీదాసు, మొల్ల, వేదవ్యాసుడు, విశ్వనాథ సత్యనారాయణ, నన్నయ, తిక్కన, పోతన, ఇలా ఎంతోమంది కవితాపితా మహాత్ములు, రామాయణ, బారత, భాగవతాది మహాగ్రంథాలు కలం ద్వారానే రాసారు.  కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆత్రేయ, ఇంకా ఎంతోమంది మహాకవులు కలం ద్వారానే కవిత్వాలు రాసి మహాకవులయ్యారు. పూర్వం బంధువుల యోగక్షేమాలు, మధురమైన వాక్యాలు కలం ద్వారానే ఉత్తరాల్లో రాస్తే, పోస్ట్ మేన్ తెచ్చిచ్చే ఆ ఉత్తరాల పలకరింపుల్ని ఎంతో ఆనందంగా చదువుకుని, మళ్ళీ మళ్ళీ తనివిదీరా చదువుకుని, మనసునిండా సంతోషాన్ని నింపుకునే వారు.  ఇప్పుడా అందమైన చేతిరాతలతో రాసే మధురభావాలను తుడిచివేస్తూ, కలానికి ప్రత్యామ్నాయంగా ఇంటర్నెట్, సెల్ ఫోన్ల పోటీ ఎక్కువయింది.  కత్తి, ఇంటర్నెట్ లేని ఇల్లు వుండవచ్చు.  కాని కలం లేని ఇల్లు వుండదు.  ఎక్కడికన్నా వెడితే కలం వెంట తీసికెళ్ళకుండా ఎవరూ వెళ్ళరు.  ఒకవేళ మర్చిపోతే పక్కవాళ్ళని, ' మీ కలం ఒకసారి ఇవ్వరా?' అని అడుగుతారు.  కాని ' మీ కత్తి ఒకసారి ఇవ్వరా?' అని ఎవరూ అడగరు. ఇప్పుడు నువ్వు మనుషుల తలలు నరకడం, సినిమాల్లో, టి.వి.సీరియల్స్ లో కనబడడమే కాకుండా, నిజంగా కూడా దుర్మార్గాలు, దోపిడిలు చేసే వాళ్ళ చేతుల నలంకరించి మనుషుల ప్రాణాలు తియ్యడం గొప్పతనమనుకుంటున్నావా?  ఇదేనా నీ గొప్పతనం?  మనం మనుషులకుపయోగ పడాలి.  ఆ మనిషి మనని తయారు చేసాడు.  అలాంటి మనుషుల్నే నరికేస్తావా? ఎన్నో మంచిమాటలు, నీతికథలు రాసి అందర్నీ మంచి మార్గంలో పెట్టగలిగే శక్తి, విజ్ఞానాన్ని ఇచ్చే శక్తి, అక్షరజ్ఞానం కలిగించే శక్తి ఒక్క నాకే వుంది.  అందుకని కత్తిపోటు కన్న కలంపోటే గొప్పది.' తన అపరాధమేమిటో తెలుసుకున్న కత్తికి కనువిప్పు కలిగింది.  కత్తి కన్నీటితో, ' ఐతే నా ఉపయోగమేమీ లేదా?  నేనెందుకూ పనికిరానా?' అంది. ' ఉపయోగం ఎందుకు లేదు?  నీ ఉపయోగాలు నీకూ వున్నాయి.  పూర్వం రాజుల కాలంలో నువ్వు రాజుల ఒరలలో దర్జాగా వుండేదానివి.  శత్రువుల బారి నించి తమని తాము రక్షించుకోవడం కోసం, రాజ్యాలని కాపాడడం కోసం నీ అవసరం ఎంతైనా వుండేది.  ఇప్పుడు రాజ్యాలు, రాచరికాలు లేవు కాబట్టి, పరాయి దేశాలతో యుధ్ధాలు వచ్చినప్పుడు నీ స్థానాన్ని బాంబులు ఆక్రమించుకున్నాయి.' ' ఐతే ఇప్పుడు నా అవసరమేమీ లేదా?' ' ఎందుకు లేదు?  నీ అవసరం చాలా వుంది.  కూరగాయలు తరగడానికి నువ్వు లేకపోతే వంట ఎల్లా తయారవుతుంది?  నువ్వు కూరగాయలు తరగడానికి ఉపయోగపడు.  ఇప్పుడు ఫంక్షన్స్ లోకూడా ఎన్నోరకాల జంతువుల బొమ్మలు, పూలగుత్తులు నీతో కోసి ఎంతో అందంగా తయారు చేస్తున్నారు.  నీకుండే వుపయోగాలు నీకున్నాయి.' ' అలాగే నేను మంచిమాటలు, విజ్ఞానాన్ని అందించే విషయాలు రాస్తాను.  అందుకనే నేను నీకంటే గొప్ప అని ఎవరికి వారు వాదులాడుకోకుండా, గర్వం చూపించుకోకుండా మనం సమాజానికుపయోగపడే విధంగా మన కర్తవ్యాలని మనం నిర్వర్తిద్దాం.  ఎవరికీ ఉపయోగపడని పనులు వృథా.'  
************************

No comments:

Post a Comment

Pages