నవవసంతం
- పూర్ణిమ సుధ
అలకలు, వలపులు, తగవులు, సరసాలు, చిర్రుబుర్రులు, ఒంటరితనాలు, ఎడబాటులు, పసిపిల్లల ఆటలు, ముదిమి వయసు ఒంటరి ఊసులు, పడుచు ఊహలు, ఇలా ఏ చెట్టునడిగినా, బెంచినడిగినా ఎన్నో కబుర్లు చెప్తాయి. లుధియానా సెక్టర్ 10 లోని ఆ పార్క్ లో ఈ మధ్య మరో ఒంటరి జీవి కాసేపు అలా కూర్చుని వెళ్తూ ఉండడం ఈ మధ్య నేను గమనిస్తున్నా...
ఎందుకంటే, అక్కడ కేర్ టేకర్ అయినా ఒక రోజు సెలవు తీసుకుంటాడేమో కానీ నేను మాత్రం వర్షం వచ్చినా, మంచుకురిసినా, ఖచ్చితంగా వెళ్తుంటాను కాబట్టి. ఆ కాలనీలోకి కొత్తగా వచ్చిన ఆ జీవి పేరు సత్యవతమ్మగారని, కొడుకు, కోడలు ఇద్దరూ అక్కడి అపోలో ఆస్పత్రిలో డాక్టర్లని, త్వరలోనే తెలుసుకున్నా... బందరు నుంచీ, కోడలు కడుపుతో ఉందని, ఏదైనా తినాలని ఉంటే అక్కడేమీ తెలుగు తిండి దొరకదని, వచ్చిందిట ఈవిడ. కానీ కోడలు సౌమ్య - పేరులో తప్ప, మనిషిలో ఆ గుణం లేదని అర్థమయిందేమో... పెద్దగా కష్టపెట్టకుండా, ఫాస్ట్ ఫుడ్ తో కడుపు నింపుకోవడం వల్ల, ఈవిడకి పెద్ద పని లేకుండా పోయింది. టీవీ పెడదామంటే, ఆ బల్లే బల్లే సౌండ్లు, ఈవిడ చెవిలో బల్లాల్లా గుచ్చుకుంటున్నాయిట.
ఒకసారి అడిగింది, ఒరేయ్ ఆ తెలుగు చానల్స్ వచ్చే డిష్షో బుష్షో పెట్టించరా బాబూ అని. కోడలు ఒక్కసారిగా ’నాకు టివి అంటేనే చిరాకు. మీ అమ్మ సీరియల్స్ పెట్టిందంటే, నేను హాస్పిటల్ లో ఇప్పుడే అడ్మిట్ అయిపోతా’నందిట. అందుకే, ఇలా రోజంతా పార్క్ లో కాలక్షేపం చేస్తున్నట్టుంది. భాష రాకపోవడం వల్ల, ఇంటి ఓనర్ తో కూడా పెద్దగా మాట్లాడలేదు. ఆవిడో పిచ్చి నవ్వు, పలకరింపుగా, పిచ్చిన్నర నవ్వు... ఇదే తంతు. నా ఆర్జే వృత్తి వల్లో ఏమో, నేను ఇక ఉండబట్టలేక, ఒకరోజు ఆవిడ పక్కకెళ్ళి కూర్చున్నా... ఆవిడ చెవిటి వాడి ముందు శంఖం ఎందుకులే అని ఎటో చూస్తూ కూర్చుంది.
"నా పేరు అనూష. మీ పేరేంటండీ ?" అని అడిగేసరికి, చిన్న పిల్లాడికి, ఫ్రీ గా క్రీం స్టోన్ లో, నట్స్ ఓవర్ లోడ్, చాకో ఫీస్ట్ చిప్స్ కలిపి ఇచ్చినంత ఆనందంగా అయిపోయింది. ఇక ఆరోజు ఆవిడ మాటలు నేర్చుకున్న పసి పిల్లలా గల గలా మాట్లాడింది. ఇద్దరం దగ్గర్లోని హోటల్ కి వెళ్ళి, రోజూ ఒక కొత్త రుచి చవి చూడ్డం, ఆవిడేమో, ఎబ్బే... ఇందులోకి వంకాయ పచ్చి పులుసు మంచి కాంబినేషన్. వీళ్ళ బొంద వీళ్ళకేం తెలుసు అసలు రుచులు ? అంటూ తిట్టిపోసేది. నిజానికి ఆవిడ చాలా చలాకీ మనిషిట. భర్త పోయినదగ్గర్నుంచీ సముద్రంలా ఉన్న ఆవిడ, నదిలా నర్మగర్భంగా తయారయింది. కొడుకు ప్రేమించి చేసుకున్న సౌమ్య, కారణం లేకుండా తనని పురుగులా చూడడం వల్ల, ఇంకా కృంగిపోతోంది. వంశోద్ధారకుడి కోసం పంటి బిగువున భరించడం తప్ప, లేకపోతే ఈ పాటికి, బందరులోని తమ సొంతింట్లో, చక్కగా, పెరట్లోని మొక్కల్తో మాట్లాడుతూ, పూలతో దేవుడికి తన విన్నపాలు చెప్తూ, అలా కాలం గడిపేసేదిట. ఎందుకొచ్చానా ? అని రోజుకో పదిసార్లయినా తిట్టుకునే ఆవిణ్ణి ఎందుకో మీరు, ఏమండీ అనాలని కూడా అనిపించట్లేదు. వయసు పక్కన పెడితే, చలాకీతనంలో నన్ను నేను చూసుకున్నట్టుంది.
మా ఇంట్లో, ఒకనాడు, ఇద్దరం కందిపచ్చడి, వంకాయ కాల్చి చేసే పచ్చిపులుసు చేయడంలో తలమునకలై ఉండగా, ఇంటావిడ వచ్చి, "భాభీజీ కీ బనా రహే హో ? కిణ్ణా సోణా స్వాద్ ఆరహీ హై, దేసీఘీ కే పారాంఠే తో నహీ ?" అని అడిగింది. ప్రశ్నార్థకంగా చూస్తున్న సత్యవతమ్మ గారు, నా వైపు తిరిగి, ఆవిణ్ణి పంపవే బాబూ, దిష్ఠి తగిలేలా ఉంది, మన వంటకి... అని వంటింట్లోకెళ్ళిపోయింది. నేనేదో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడి, లోపలికొస్తూ, మనమెందుకు ఒక ఫుడ్ జాయింట్ పెట్టకూడదు ? అన్నాను. ఇంత బతుకూ బతికి - పూటకూళ్ళ ఇల్లు ఖర్మా ? అంది సత్యవతమ్మ. అలా ఎందుకనుకోవాలమ్మా ? కొత్త దేశంలో కొత్త రుచులకోసం కొట్టుమిట్టాడుతున్న జనాలకి, నీ చేతి వంట పరిచయం చెయ్యడం - వాళ్ళు వహ్వా అనడం బావుంటుంది కదా ? అన్నాను. ఎక్కడో కనెక్ట్ అయిందనిపించింది. మరుసటి రోజు తను తెచ్చిన ఉప్పు గోంగూరని ఎండు మిరపకాయలు, ఇంగువ, మెంతులు వేసి, నూరి ఆ రోజు చుట్టుపక్కల వారి ముక్కుపుటాలదిరిపోయేలా పచ్చడి చేసింది. అంతా వచ్చి, ఏంటది అనడిగి, తలా ఇంత తిని వెయ్యి లైకులు, వంద షేర్లు, అయిదొందల కామెంట్లతో ప్రోత్సహించారు. ఒక ఫేస్బుక్ ఎక్కవుంట్ కూడా క్రియేట్ చేసి, అందులో రేపు చేసే వంట ముందు రోజే పెట్టి, ప్రీ సెల్లింగ్ కూడా మొదలుపెట్టాం. ఇద్దరం కలిసి, పదిరోజుల్లో బాగా ఫేమస్ అయిపోయాము. ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక్క అయ్యప్ప స్వామి గుడికి, వారానికోసారి వచ్చే సౌత్ ఇండియన్స్, వారం రోజులూ మా ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఒకరకమైన ఆత్మ విశ్వాసంతో ఆవిడ మొహంలో ఒక చమక్కొచ్చింది. నాకూ కొత్త వ్యాపకం దొరికింది. నేను ఏ పనీ ఎక్కువ కాలం చెయ్యను. కిక్ లో రవితేజ నాకు స్ఫూర్తని మా అమ్మ తిడుతూ ఉంటుంది. సరే నా సంగతెందుకు లెండి... కథలోకెళ్దాం..!
సౌమ్యకి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువయింది. కాస్త ఉసిరికాయ పచ్చడి నాలుక్కి రాసుకోమ్మా, మంచిది... అని చెప్పిన సత్యవతమ్మకి, లిమ్సీ టాబ్లెట్ చూపించి, ఇదుంది, మీరు తినేసి, పడుకోండి అని చెప్పి వెళ్తోంది. రఘుకి ఆరోజు ఎందుకో తను తల్లిని పట్టించుకోవట్లేదేమో అనిపించి, ఇవాళ నేను హాఫ్ డే లీవ్ తీసుకున్నా, నువ్వెళ్ళు, నేను మధ్యాహ్నం నించీ వస్తాను, అని చెప్పి ఉండిపోయాడు.
తను అమ్మ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో ? అనుకుంటూ, "అమ్మా వంటేంటి ?" అన్నాడు.
"ఏముందిరా ? ఇక్కడేమో, ఏవీ దొరకవు... దిక్కుమాలిన ఆలూ పాలక్ మట్టర్ అంటాడు, అది మట్టరో మటనో కూడా తెలిసి చావదు. అందుకే పెసరపచ్చడి, ఉల్లిపాయ కారం చేసాను. బంగాళాదుంప ముక్కలు వేయించాను. తిన్రా, అమ్మాయి తింటుందని ఉసిరికాయ కూడా పోపేసాను. ఇదిగో ఇలా కోడి కెలికినట్టు కెలకకు... సరిగ్గా కలుపు," అంటూ తనే కలిపి ముద్దలు పెడుతుంటే, స్వర్గం అంటే ఇదే కదా అనిపించింది.
బాక్స్ లో తనకి కూడా సర్ది పెట్టింది. ఆఫీస్ కి వెళ్తూనే సౌమ్య దగ్గరికి వెళ్ళి, కొత్తగా ఎవరో సౌతిండియన్ వాళ్ళు ఈ ఫుడ్ జాయింట్ పెట్టారు. బావుంటుందేమో అని ఒక క్యారేజ్ తీసుకున్నా, నచ్చితే కంటిన్యూ చేద్దాం. గివ్ ఎ ట్రై అన్నాడు. రుచి చూసి, ఆసం రఘు, ఇక్కడే కంటిన్యూ చేద్దాం - అదిరింది, ఇంత హెవీగా ఈ మధ్య ఎప్పుడూ తిన్లేదు అని తెగ మెచ్చుకుంది. ఆ రోజు నించీ ప్రతీ రోజూ, మా ఇంట్లో, వాళ్ళ అత్తగారు వండిన వంటలు, లంచ్ గా వెళ్తున్నాయి. కొత్త వ్యాపకంతో, సత్యవతమ్మగారిలో మునుపటి ఉత్సాహం, బలవర్థకమైన ఆరోగ్యకరమైన ఆహారం వల్ల సౌమ్యలో నునుపు, రఘు మొహంలో అమ్మ ఆప్యాయత వల్ల మనశ్శాంతి, నా జీవితంలో ఒక కొత్త స్నేహం... ఇలా కాలం చక్కగా గడిచిపోతోంది. ఇంతలో అనుకోకుండా, ఒకరోజు, సత్యవతమ్మగారు జ్వరంతో బాధపడుతూ లేవలేని స్థితిలో కాఫీ కలుపుకోబోయి, వంటింట్లో కుప్పకూలిపోయారు. రఘు, సౌమ్య అప్పటికే వెళ్ళిపోవడం వల్ల ఎవరికీ తెలియలేదు. ఇంటి ఓనర్ పైన ట్యాంక్ లో నీళ్ళు చూడటానికి వెళ్ళి చడీ చప్పుడూ లేదని చూసి, నాకు ఫోన్ చేసింది. వచ్చి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, మందులు కొనుక్కొచ్చి, ఆవిడకి ఓ రెండు రోజులు రెస్టిచ్చా...
ఆ రెండు రోజులూ క్యారేజీ లేదని అలమటించిన సౌమ్య, ఎక్కడో చిన్న అనుమానమొచ్చి, మొట్టమొదటిసారి, అత్తగారి చేతి వంట తిందామని నిర్ణయించుకుంది. నాలుగో రోజు, నోరు తెరిచి అడిగిందని, ఆవిడే ఓపిక చేసుకుని వంట చేసింది. తిన్న సౌమ్యకి అన్నాళ్ళూ తను కాదనుకున్నదేంటో తెలిసొచ్చింది. అమ్మ లాంటి ఆప్యాయత చూపిస్తున్న అత్తగారి ఆప్యాయతకి, తను చూపిస్తున్న నిరాదరణకి సిగ్గుపడింది. వెంటనే టాటాస్కై వాడికి ఫోన్ చేసి, తెలుగు ప్యాకేజి ఇన్స్టాల్ చెయ్యమని చెప్పింది. తనే సెలవు పెట్టి, దగ్గరుండి చూసుకుంది. తన స్నేహితురాలు, అత్తగార్ల గురించి - వాళ్ళ చాదస్తాలు, గుణగణాల గురించి చెప్పిన తొక్కలో కబుర్లని తుంగలో తొక్కి, చక్కగా మూడు పూటలా తింటూ, కబుర్లు చెప్తూ, ఆవిడకి సాయం చేస్తూ, ఆర్నెల్లు తిరిగేసరికి దబ్బపండంటి మనవరాలిని చేతిలో పెట్టింది. ఇక సత్యవతమ్మ గారికి మేమెవ్వరం కనబడట్లేదు... ఆఖరికి బందరు నుండి వాళ్ళింటి పక్కవాళ్ళు ఫోన్ చేసినా ఇప్పుడప్పుడే రానని ఖరాఖండిగా చెప్పేసింది. మనవరాలి బోసినవ్వుల పండు వెన్నెల్లో తడవాలిగా మరి.
కొన్ని పరిచయాలంతే... ఎందుకు, ఎలా ఏర్పడతాయో ? ఎంతలా దగ్గరవుతాయో చెప్పలేం..! ఇదివరకు పక్కింట్లో ఉన్నా, నేనెవరో కూడా సౌమ్యకి తెలీదు. ఇప్పుడు విడదీయలేని స్నేహితులం. అలా సత్యవతమ్మ గారి జీవితంలో నవ వసంతం వెల్లి విరిసింది.
No comments:
Post a Comment