నవ్వుల నజరానా – ఫేస్బుక్ కార్టూన్స్ బుక్
పుస్తక పరిచయం : భావరాజు పద్మిని
అంతవరకూ మనకు తెలియని ఒక కొత్త లోకానికి మనిషి వెళితే ఏమౌతుంది ? అక్కడి మనుషులు, వారి భాష, వేషాలు, మనస్తత్వాలు అన్నీ చూసి గందరగోళానికి గురౌతూ ఉంటాడు. అటువంటిదే, కొన్నేళ్ళ క్రితం వరకూ మనకు తెలియనిదే – ఫేస్ బుక్ లోకం. ఏ మాధ్యమం ద్వారానైనా మంచికి, చెడుకి సమాన అవకాశాలు ఉంటాయి. కొందరికి ఇదొక పెద్ద వ్యసనం అయిపొయింది, మరికొందరు పెద్దలకు ఇది ఒక వ్యాపకం అయ్యింది, మరికొందరికి చిన్ననాటి నేస్తాలను కలిపే వారధి అయ్యింది. తుమ్మితే స్టేటస్ అప్డేట్ చేసేవారు కొందరు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ బాచ్ కొందరు, ఏవండి- కాఫీ లు తాగారా, టిఫినీలు చేసారా అని కనుక్కునేవాళ్ళు కొందరు, లైక్ లు రాకపోతే చిక్కి శల్యమయ్యేవారు కొందరు, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ను చూసుకుని, మురిసి ముక్కలయ్యేవారు కొందరు, ఏ ఆడది తేరగా దొరుకుతుందా, చిలక్కొట్టుడు కొడదాం అని చూస్తూ, పదిరాళ్ళు వేసి చూసేవారు కొందరు... ఇలా చెప్తూ పొతే ఎన్నెన్నో...
భాష రానివారికి సైతం సులువుగా అర్ధమయ్యి, వారి పెదవులపై నవ్వులు పూయించేదే కార్టూన్ ప్రక్రియ. ఇటువంటి హాస్యాస్పదమైన పోకడలపై దిగ్గజాల వంటి ఇరువురు కార్టూనిస్ట్ లతో కార్టూన్స్ వేయించి, పుస్తకంగా తీసుకురావడంలో జె.వి.పబ్లికేషన్స్ చేసిన కృషి అభినందనీయం.
ఇందులో ‘లేపాక్షి’ శిల్పం వంటి శైలితో సుప్రసిద్ధులైన లేపాక్షి గారు వేసిన కార్టూన్స్ ను పరిశీలిస్తే – ‘ఏంటి, నీకు ఫేస్బుక్ కూడా ఎకౌంటు లేదా ? ఈ రోజుల్లో రిక్షా తొక్కే వాళ్లకు కూడా ఉంది, కాస్త డెవలప్ అవ్వు బాస్’ అంటూ ఎగతాళిగా నవ్వేవారు ఒకచోట కనిపిస్తారు. అలా మిత్రుల బలవంతంతో జలియన్ వాలా బాగ్ లాంటి ఈ దిగుడుబావిలో దూకి, బైటికి రాలేక సతమతమయ్యేవారు మరోచోట కనిపిస్తారు. స్వంత ఆలోచన, అభిప్రాయాలు మానేసి ప్రతిదానికి –‘ఏమంటారు ఫ్రెండ్స్’ అంటూ అడిగే వెర్రి గన్నాయిలు కొన్నిచోట్ల నవ్విస్తారు. ఫేస్బుక్ కారణాలతో గుండాగిరి చేసేవారు మరోచోట దర్శనమిస్తారు. ఇటువంటి వారిని ఆధారంగా చేసుకుని లైక్ లు, కామెంట్ లు, షేర్ లు అమ్ముకునే కంపెనీ లు కూడా వెలిసాయన్నట్లుగా చూపే కార్టూన్, హాస్యానికి సృష్టించింది కాదండోయ్ , నూటికి నూరుపాళ్ళు నిజం.
అలాగే కార్టూన్ కింగ్ ‘రాజు’ గారి కార్టూన్స్ ను గమనిస్తే – లైక్ ల కోసం పర్సనల్ మెసేజ్ లలో, ఫోన్ కాల్స్ లో భిక్ష అడిగేవారు, ఫేస్బుక్ చూసి, చూసి, కనుగుడ్లు ‘f ‘ లా మారిపోయినవారు, ఫేస్బుక్ వదిలేస్తాను అన్నవారికి పిచ్చిపట్టిందేమో అని శంకించేవారు, లైక్ లు లేవని బెంగెట్టుకుని, గ్రూప్ లు వదిలి వెళ్ళేవారు, తమ కాపురాన్ని కూల్చే సవితిలా ఫేస్బుక్ తయారయ్యిందని, వాపోయే ఇల్లాళ్ళు, ముఖాలు కనబడకుండా ప్రొఫైల్ ఫోటో పెట్టాలనే తపనలో కొందరు చేసే విన్యాసాలు, చస్తూ చస్తూ కూడా... పోతా, పోతున్నా... నే పోతున్నా, నే పోయా... అంటూ ఫేస్బుక్ స్టేటస్ అప్డేట్ చేసి చావాలని తాపత్రయ పడేవారు, వీరి ఉబలాటాలు చూసి, నవ్వకుండా ఉండేవారు ఉండరు.
మరి 100 చక్కని కార్టూన్స్ తో చిక్కగా నవ్వించే ఈ పుస్తకం మీకూ కావాలని అనుకుంటున్నారా ? అయితే, ప్రతులకోసం క్రింది ఫోన్ నెంబర్ లో సంప్రదించండి.
పుస్తకం వెల : 120 రూ.
ప్రతులకు సంప్రదించండి : J.V.publishers, ph: 8096310140
No comments:
Post a Comment