వినూత్న నవల - పాశుపతం
పుస్తక పరిచయం : భావరాజు పద్మిని
భారత ప్రజలకు కాలక్షేపం బఠానీల వంటి ఎన్ని కబుర్లో ! ‘అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది,’ అంటూ ఇతరులకు తెలియని స్కాం ల గురించి, జైల్లో ఉన్న వి.ఐ.పి ల గురించి, పెరుగుతున్న ధరల గురించి, కొరవడుతున్న రక్షణ గురించి, తారలపై గాసిప్ ల గురించి...ఇలా ఏ విషయం పైనైనా అనర్గళంగా ప్రసంగించే ‘ప్రవచన్ రాయళ్ళు’ మనకు పార్కుల్లో, బీచుల్లో, ప్రయాణాల్లో, హాస్పిటల్ వెయిటింగ్ హాల్ లో పుంఖానుపుంఖాలుగా తారసపడుతూ ఉంటారు. అయితే, వీరంతా, మంచాల శ్రీనివాసరావు గారి ‘పాశుపతం’ నవల చదివితే, వీరు ఇటువంటి చర్చల్లో తలమునకలై ఉండగా, నాణానికి మరోప్రక్క జరుగుతున్న అంశాలను తెలుసుకుని, నోరెళ్ళపెట్టక మానరు.
ఇది ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్, ఆన్లైన్ లో వెలువడిన ఒక సూపర్ హిట్ సీరియల్. అంతర్జాతీయ గూఢచర్యంపై తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల ఇది. మోడీ వేసుకు విడిచిన కోటు గురించి, మార్కెట్ లో దానికి పలికిన రేటు గురించి మనకు తెలుసు... కాని మోడీ విదేశీ పర్యటన వెనుక ఉన్న అసలు రహస్యం మనకు తెలుసా ?
అగ్రదేశంగా ఎదగాలని చైనా, అగ్రదేశంగా తన చేతినే పైన నిలబెట్టుకోవాలని ఆశించే అమెరికా, ఎప్పటికప్పుడు ఎలా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయో మీకు తెలుసా ? చిన్నదేశాలతో మైత్రిని కలుపుకుని, ప్రపంచ బ్యాంకుకు దీటుగా కొత్త బ్యాంకులను పెట్టి, రుణాలను ఇవ్వటం ద్వారా వాటిని అదుపులో పెట్టుకోవాలనే చైనా వ్యూహం మీకు తెలుసా ?
అన్నింటినీ మించి భారత్ కు చెందిన జల, వాయు, రోడ్డు మార్గాలను నెమ్మది నెమ్మదిగా ఆక్రమిస్తూ, అవసరమైతే క్షణాల్లో భారత్ ను అన్నివైపుల నుంచి దిగ్బంధనం చేసేందుకు చైనా పన్నిన వ్యూహం మన ఆలోచనలకు అందదు. ఇవన్నీ ఒక లేడీ డిటెక్టివ్ ‘దివిజ’ చేత పలికిస్తూ, రచయత కధను నడిపిన విధానం, అలా చెప్పడంలో ఆయన చూపిన నేర్పు, నిజంగా అభినందనీయం. ఉదాహరణకు నవలలోని కొన్ని వాక్యాలు చదవండి...
‘ దేశవిదేశీ సంబంధాలు, వ్యూహాలు పెద్ద సబ్జెక్టు. ఒకసారి అది చదవటం తెలుసుకోవటం మొదలుపెడితే అదో వ్యసనం అవుతుంది. మనం దేశంలో అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న కలహాలను భూతద్దంలో చూస్తాము. మీడియా కు విస్తృత అవగాహన లేకపోవడం వల్ల అత్యంత అల్ప విషయాలనే కొండంతలుగా చూపిస్తూ ఉంటాయి. వాస్తవానికి మనచుట్టూ పెరుగుతున్న ప్రమాదాలు, రాబోయే ఉపద్రవాల తీవ్రత చాలా ఎక్కువ... ఎప్పుడైనా పొరపాటున చైనాతో కయ్యం మొదలుపెడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధమయ్యింది కదా... అంది దివిజ తన అసిస్టెంట్ యాదగిరితో.
ఇలా ఒక స్త్రీకున్న తెగువ, ధైర్యాన్ని చూపిస్తూ, అనేక కోణాల్లో కొత్త విషయాల సమాచారాన్ని మనకు అందించారు రచయత. ఒక్కసారి మొదలుపెడితే, చివరికంటా చదివించే ఈ నవలను మీరూ చదవాలంటే, దిగువ ఉన్న ఫోన్ నెంబర్ ను సంప్రదించండి.
పుస్తకం వెల : 100 రూ.
ప్రతులకు సంప్రదించండి : శ్రీ వేంకటరమణ బుక్ డిస్ట్రిబ్యూటర్స్
Ph: 040-27543500, 9676799500
No comments:
Post a Comment