పుష్ప దరహాసం - అచ్చంగా తెలుగు

పుష్ప దరహాసం

Share This
 

పుష్ప దరహాసం 

--ప్రసాద్ కట్టుపల్లి 12/9/2015

 

తే.గీ

తెల్ల వారంగ యేతెంచి తిటకు, కంటి
కమ్మని కమనీయ లతలు నెమ్మదిగొని !
ఊగు చున్నవి పువ్వులు తూగు చుండె
మంచు బిందువు లద్దిన మత్తు తోడ !!.............1
తే.గీ
వాయు దేవుడు వీరికి వాయి దమునె
అన్న చందము విరులన్ని నన్ను.బిలిచె!
చేరి నంతనె కోయంగ చేయి చాచ
తుంచ పాపము తగదని తోచె మదిని !!..........2
తే.గీ 
పువ్వు లన్నియు పక్కున నవ్వ సాగె
బెదురు చూపుల నామది బేల గాంచి !
పలికె నీరీతి విరులన్ని కులుకు లొలక
మాదు చెలువము మీకేమి చేదు నొసగె !!....,....3
తే.గీ
అడవి జీవిత మల్పాయ్షు యనుట యేల !
ముళ్ళ తోడుగ మమ్ముల ముడులు వేసి
తెగడు నమ్మలు యయ్యలు,యెగువ సామి
పాద పూజకు మీకన్న ముందు మేము!!...........4
కం,
ద్వేషం బెరుగము మేమున్,
రోషం బుండదు గనంగ, రూపముతో సం
తోషం బంచెదము జనులు
వేషం బేసియు, నిరతము వేడుక సల్పన్ !!.........5
తే.గీ
తిరుగుకీటకములుమాతొకోరు చెలిమి,
కూడు కొరకు మా పైననె దాడి సేయ!
మిగులునేని జనుల కిమ్ము మీరలనుచు 
మధురమైన తేనె నొసగి మరలు మేము!!..........6
కం.
రమణుల శిరమున నుందుము
నమతుడు మన్మద శరముగ సాగన్ గనరే !
నిమర గలముమే మింపుగ
అమర జవానులు కడపటి యాత్రల్ బొందన్ !!.....7
కం
పూజలు సల్పగ గావలె
మీజనులకుమేముసకల మేర్పడ జేయన్ !
ఈజగమున గల నెవ్వరి
కీజయ కీర్తులు బడయను, కీడున కూడన్ !!.........8
కం.
గట్టిగ గట్టిన మాలలు..
పట్టుక తొడిమలును గుచ్చి పంక్తులు పేర్వన్
కట్టగ తోరణములుగా
చెట్టున యున్నటులగానె సిరులను పంచున్ !!------9
కం.
పువ్వుల పానుపు లగుదుము
నవ్వుల రేడుకు విరివిగ నగవులు బంచన్ !
రివ్వున పరిమళ మిడుదుము
సవ్వడి చేయము నలుపగ సరసము లందున్ !!----10
కం,
మీరలు తుంచక పోయిన
నేరక నిలువ తగముగద, నెన్నటి కైనన్ !
చేరగ వలయును మేమును
ఆరక మునుపే సొగసులు,యంపిన వానిన్ !!------11
ఆ,వె
వాడి పోక తగదు నేడైన రేపైన
రాలి తీర వలయు రాత మాది !
తుంచి సాగ నంపు మంచి తావునకని
వేడు చుంటి మనియె, వేడు కొనియె !!--------------12
ఆ,వె
విరిసి విరియ నున్న విరిబాల లన్నియు
కరము లన్ని మోడ్చి కరుణ గోరె !
మనసు నొప్ప కున్న మన్నించ నెంచితి
తుంచె నొక్క పువ్వు నెంచి నేను !!------------------13
తే.గీ
కోడి కూతల తోడుగ నేడు విరిసె
తిరుగ కన్నియల్,లేదూడ పరుగులాడ !
గౌర వించియు వనలక్ష్మి ఘనము నొసగ
పూల వానలు నామీద పూత కురిసె !!------------14

 

No comments:

Post a Comment

Pages