రుద్రాణి రహస్యం – 7 - అచ్చంగా తెలుగు

రుద్రాణి రహస్యం – 7

Share This

రుద్రాణి రహస్యం

- వేద సూర్య


(జరిగిన కధ : రుద్రాణి కోనలో ఉన్న శక్తిని వశం చేసుకోవాలని చూస్తుంటాడు ఫ్రెడ్రిక్. ఈ ప్రయత్నంలో భాగంగా అతను పంపిన ఇద్దరు విదేశీయులు, కొనలో అకస్మాత్తుగా కనిపించిన వెలుగుతో మాడి మసైపోతారు. ఇది ప్రొజెక్టర్ పై చూసిన ఫ్రెడ్రిక్ విస్తుపోతూ ఉండగా, విలియమ్స్ అతన్ని క్షుద్రపూజలు చేసే అత్రిక వద్దకు తీసుకువెళ్తాడు. ఆ శక్తి అత్రికకు అందక, ఆమె వారిని భారత్ లో ఉన్న తన గురువు తంత్రిణి వద్దకు వెళ్ళమని పంపుతుంది. గండరుడి కోసం పూజలు చెయ్యాలని నిశ్చయించుకుంటుంది తంత్రిణి. రుద్రాణి కోనకు ఆర్కియాలజి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రవల్లికకు బదిలీ అవుతుంది. సృష్టి, అధ్భుత్ కలిసినప్పుడల్లా ప్రమాదాలు తప్పిపోతుంటాయి.  ప్రవల్లిక వెళ్తున్న జీప్ పంక్చర్ అయితే, ఆ అడవిలో తిరుగుతున్న దేవ్ రిపేర్ చేస్తాడు. తంత్రిణి హోమానికి ప్రసన్నుడైన గండరుడు రుద్రాణి కోన రహస్యం గురించి చెప్తూ ఉంటాడు. కృష్ణుడి వద్దనుంచి ప్రద్యుమ్నుడికి వచ్చిన శమంతకమణిని రుద్రాణి కోటలో ఉంచి అతడు పూజిస్తూ ఉంటాడు. తరతరాలు మారి అది అప్పుడు కోటను పాలిస్తున్న వీరసింగడి చేతికి వస్తుంది. దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో సింగడి కూతురైన జాబిల్లి, ఆమె ప్రేమికుడు సూరీడులను హతమారుస్తాడు కింకాసురుడు. రుద్రాణి వద్ద బందీగా నిలుస్తాడు.   అడవిలో ప్రవల్లికకు అనేక వింత సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. బెంగుళూరు యూత్ మీట్ కు సెలెక్ట్ అవుతారు అద్భుత్, సృష్టి.  అనుకోకుండా ఫెడ్రిక్ ను కలిసి, తన ప్రేమ గురించి చెబుతాడు అద్భుత్...ఇక చదవండి...)
ప్రవల్లిక తన టీంతో రీసెర్చ్ చేస్తూ ఉంది. కోన మధ్యలో కనిపించిన సూరీడు, జాబిల్లి విగ్రహాలను చూసి వాటిని చూస్తుండగా, పరిగెత్తుతున్నకాలి గజ్జెల శబ్దం వినిపించటంతో వెనక్కి తిరిగి
“ఆగరా సచ్చినోడా .. నన్ను ఒగ్గేత్తనంటవా సచ్చినావ్ నా సేతిలో ..ఆగరా,” అంటూ కోయ యువతి రూపంలో ఉన్న తన రూపం తన పక్కగా పరిగెత్తుతూ అస్పష్టంగా కనిపిస్తున్న ఒక పురుషుడి వెనక వెళుతూ కనిపించింది. తనకు తెలియకుండానే వారి వెనక ప్రవల్లిక ఆదరాగా పరిగెత్తుకుని వెళ్ళసాగింది.
ఒక చెట్టు దగ్గర లచ్చిమి కొడుతూ బుంగమూతి పెట్టుకుని కూర్చుంది.
“పిచ్చి లచ్చీ..ఈ పానమైన ఒగ్గేత్తా కానీ నిన్ను ఒగ్గనే,” అని అతను చేతిలోని సంపెంగను లచ్చిమి తలలో తురిమాడు. ఇద్దరూ లాలనలో వారి ప్రపంచంలో ఉండగా వెనక నుండి వస్తున్న సింహాన్ని చూసి ప్రవల్లిక “లచ్చిమీ సింహం”, అని గట్టిగా అరిచి, వారేం పట్టించుకోకపోవటం చూసి తనకు తెలియకుండానే కనిపించిన విల్లును చేతిలోకి తీసుకుని సింహానికి గురిపెట్టి బాణాన్ని వదులుతుంది. బాణం తగిలి సింహం బిగ్గరగా గాండ్రించి పడిపోతూనే మాయమయిపోవటం చూసి లచ్చిమి, ఆమెతో ఉన్న పురుషుడు కనిపించకపోకపోవటంతో చెట్టు దగ్గరకి వెళ్లి వెతకసాగింది.
అసలేం అవుతుంది నాకు, అంతా అయోమయంగా ఉంది అనుకుంటూ ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ కనిపించిన అయ్యోరును చూసి, ఆయన వద్దకు వెళ్ళసాగింది.
అయ్యోరు దగ్గరకి వెళ్ళగానే, ఆయన,” ఈ ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలతో నిండి ఉంది, వాటి సమాధానాలు కాలంలోనే కలిసి ఉన్నాయి. శోధించి సాధించుకోవటమే సృష్టి మనకప్పగించిన కర్తవ్యం” అని అంటూ కళ్ళు తెరిచారు.
“ఎవరు మీరు? ఇక్కడేం చేస్తుంటారు?” అడిగింది ప్రవల్లిక.
“నీకులానే గమ్యాన్ని వెతుకుతూ కాలంతో ప్రయాణిస్తున్న బాటసారిని.”
“నేనేం వెతుకుతున్నానో మీకు తెలుసా?” అడిగింది ప్రవల్లిక ఆపుకోలేక.
“ఆగిపోయిన ఒకరి ఆశను వెతుక్కుంటూ వచ్చావ్ , నీకు నువ్వు దొరుకుతున్నావ్”, చెప్పాడు అయ్యోరు.
“ఇక్కడికి నేనెందుకు వచ్చానో మీకెలా తెలుసు? నాకు కాదు ఈ కోనకు తెలుసు ఆ అమ్మకు తెలుసు, నీకు కూడా తెలిసే ఘడియలు సమీపంలోనే ఉన్నాయి,” అని అయ్యోరు కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయారు.
 ప్రవల్లిక ఆలోచనలో ఉండగా,” మేడం ..మేడం...” అనే పిలుపుల్ని విని తన కోసం వెతుకుతున్న తన టీమ్ దగ్గరకి వెళ్ళింది.
“నీ మదిలో ప్రశ్నలకు సమాధానాలు నీ చెంతనే ఉన్నాయి , చూసే కళ్ళతో కాదు శోధించే నీ మనసుతో చూడు దారి దొరుకుతుంది,” అని ధ్యానం లో ఉన్న యోగి చెప్పినట్లు అనిపించి యోగి వైపు చూస్తుంది.
“మేడం ఇక్కడేం చేస్తున్నారు?” అని యామిని అడగటం విని, “ఆ..” అంటూ తత్తరపడి, “ఆ యోగిని చూస్తున్నాను”, అని చెప్పింది ప్రవల్లిక.
“ఏ యోగి మేడం, అక్కడెవరూ లేరు కదా! “ ఆశ్చర్యంగా అంది యామిని.
“ వాట్ , ఏం మాట్లాడుతున్నావ్? ఆ చెట్టు కింద ఆ యోగి,” అంటూ చెట్టు వైపు చూడగానే అయ్యోరు తల అడ్డంగా ఉపటం చూసి,” ఏం లేదు పద” అని అంది.
“ఏమయింది మీకు అదోలా ఉన్నారు, ఆర్ యూ ఓకే,” అడిగింది యామిని రెట్టించి.
“యా ఐ యాం ఓకే .. “అని చెప్పి,” మిగిలిన వాళ్ళెక్కడున్నారు?” అడిగింది ప్రవల్లిక ఒక పక్క ఆలోచనలో ఉంటూనే.
“అందరూ మీ గురించే ఎదురు చూస్తున్నారు. వాగు దగ్గర బురదలో ఈ బ్యాగ్ దొరికింది,” అంటూ యామిని చెప్పగానే, అప్పటివరకూ ఆలోచనల్లో ఉన్న ప్రవల్లిక రియాక్ట్ అయ్యి యామిని చూపిస్తున్న బ్యాగ్ ని చూసి షాక్ కొట్టినట్లయ్యి ఇది .... “ఎక్కడ దొరికిందిది, ఇది మా నాన్నది”, అని కంగారుగా అంది.
*******
అద్భుత్ సృష్టి ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేసాడు.
ఒంటిపై శాలువా కప్పుకుని “ఇంతసేపు ఎక్కడి కెళ్ళావ్? రాను రాను కూతురంటే ప్రేమ లేకుండా పోతుంది,” అంటూ తలుపు తెరచి, తలుపుకి ఆవల కనిపించిన అద్భుత్ ని చూసి,
“నువ్వేంటిక్కడ? ఎందుకొచ్చావ్? అని అడిగింది సృష్టి.
“వెళ్ళిపోనా అయితే ?” అన్నాడు అధ్బుత్.
“వెళ్ళిపో అంటే వెళ్ళిపోతావా నువ్వు ?” అంటుంది సృష్టి హాల్లో సోఫాలో కూర్చుంటూ.
“అంటే వెళ్ళననుకో,” అంటూ లోపలికి వెళ్ళి ఇంటీరియర్ ని చూస్తూ...” హూ ..బావుంది” అన్నాడు అద్భుత్. “ఏంటి మనం బెంగుళూరు వెళ్ళకపోవటమా?” అడిగింది సృష్టి.
“ఎవరన్నారు వెళ్ళట్లేదని?” అద్భుత్ అనటం విని,” బాబూ నాకు 104 జ్వరం. ఇల్లు కదిలితే మా అమ్మ చంపేస్తాను అంటోంది, “ అంది సృష్టి.
అద్భుత్ సృష్టి నాడి పట్టుకుని,” మేడం డాక్టరు గారూ మనిషి జ్వరం వచ్చినప్పుడు ఎందుకు డల్ అయిపోతాడో తెలుసా, తనకు ఏదో అయిపొయింది అనే ఫీలింగ్ ని మైండ్ లో పెట్టేసుకోవటం వల్ల. ముందు ఈ బ్రెయిన్ లో ఉన్న ఆలోచనను వదిలెయ్..ఒంట్లో నుండి జ్వరం అదే వెళ్లిపోతుంది,” అంటాడు అద్భుత్.
సృష్టి తననే చూస్తుండటం చూసి, సృష్టి ముఖం దగ్గరగా ముఖం పెట్టి,” ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు , కాసేపు నేనేం చేసినా ఏమనకు”, అన్నాడు.
“అయ్యో ఏం చేస్తావ్ ?” అంటూ శాలువాను దగ్గరగా కప్పుకుంటూ బెదురుగా అడిగింది సృష్టి.
“ముందు మీ కిచెన్ ను టేక్ ఓవర్ చేసుకుంటాను,” అని చెప్పి అద్భుత్ కిచెన్ కు వెళ్ళటం చూసి ఊపిరి పీల్చుకుంది ఆమె.
*****
హోమం చేస్తున్న తంత్రిక ఉచ్చరిస్తున్న మంత్ర శక్తి వల్ల ఉద్భవించిన శక్తి కారణంగా ఆకాశంలో మార్పులు మొదలై ఉన్నట్లుండి పెద్ద శబ్దంతో మెరుపు మెరిసి కోనలో ఒక చోట పిడుగుపడి ఒక చెట్టుకి నిప్పు రాజుకుని మంటలు మొదలయ్యాయి. మంటలను చూసిన కోయ గుంపు బెదురుతూ అటు ఇటు పరుగులు తీస్తుంటే, విషయం తెలుసుకున్న తేజ వాగు దగ్గర రీసెర్చ్ చేస్తున్న ప్రవల్లిక దగ్గరకెళ్ళి ,”మేడం అడవిలో మంటలు రాజుకున్నాయి,” అని చెప్పటంతో ప్రవల్లిక టీం తో కలిసి అకడికి వెళ్ళింది.
తంత్రిక హోమం వల్లన మంటలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బెదురుతున్న కోయగుంపును చూసిన కోయదొర “అందరం అయ్యోరు కాడికి పోదాం పాండి”, అనటంతో అందరూ యోగి దగ్గరకి పరుగులు తీసారు.
******
పది నిమిషాల తరువాత కిచెన్ నుండి వినిపిస్తున్న సౌండ్స్ విని,” ఏం చేస్తున్నావ్ ?” అని అడిగింది సృష్టి. “టు మినిట్స్ మిస్ బ్యూటిఫుల్!” అంటూ చేతిలో గ్లాస్ తో సృష్టి దగ్గరికి వెళ్ళి,” కలువల్లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు మూసుకుని, ఈ చెర్రీ లిప్స్ తరచి, చిట్టి నోరుతో ఇది గటా గటా తాగేయ్,” అంటూ సృష్టి ముక్కు మూసి గ్లాసులో ఉన్న ద్రావకాన్ని తాగించేసాడు.
“వాక్ ..ఏంటిది మంటగా ఉంది”, అంటుంది సృష్టి.
“టెన్ మినిట్స్ ఆగు, అదోలా ఉంటుంది,” అంటూ నవ్వాడు అద్భుత్.
అధ్బుత్ నవ్వటం చూసి,” సచ్చినోడా! నన్ను చంపేయటానికి వచ్చావా?” అని అద్భుత్ ని కొడుతుంది. అద్భుత్ అందకుండా పరిగెత్తుతూ మెట్లు ఎక్కి టెర్రస్ కు వెళతాడు.
“ఆగుతావా లేదా ఆగరా , అసలెందుకు వచ్చావ్ ?” అంటూ మెట్లు ఎక్కి అద్భుత్ ని కొట్టబోతుంటే ,”స్టాట్యూ” అన్నాడు అద్భుత్.
సృష్టి ఆగిపోగానే సృష్టి రెండు చేతులు పట్టుకుని ఆమె మెడకు ఆనించి “పోయే పోచె, ఇట్స్ గాన్”, అన్నాడు. సృష్టి నుదురుపై మెడపై చేతులు పెట్టుకుని “అరే ..ఏం చేసావ్,” అంది సర్ప్రైజ్ అవుతూ.
“మ్యాజిక్ !” చెప్పాడు అద్భుత్.
“ఓయ్ ! విషయం చెప్పు “అని సృష్టి అనటంతో “ఆయుర్వేద సంహిత రాసిన చరకుడు ఎపుడో చెప్పాడు, మన పెరడులో వంటగదిలోనే ఆరోగ్యాన్ని ఇచ్చే సహజ ఔషధాలు ఉన్నాయని, కానీ మనం వాటిని వద్దనుకుని కెమికల్స్ వెనక పడుతున్నాం,” అన్నాడు అద్భుత్.
“నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయసలు ?” అడిగింది సృష్టి.
“ప్చ్.. మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా,” చెప్పాడు అద్భుత్.
అది విని సృష్టి పక పకా నవ్వింది.
అద్భుత్ వెంటనే నేల మీద వెతకటం మొదలుపెట్టటం చూసి,” ఏమయింది ?” అని  అడిగింది సృష్టి.
“ఇప్పుడే ఇక్కడ నవరత్నాలు రాలి పడ్డాయి కదా,” అనటంతో, “ఏంటి సోపేస్తున్నావ్, ఏం కావాలేంటి ?” నవ్వుకుంటూ అడిగింది సృష్టి టెర్రస్ గ్రిల్ పై చేతులు ఆన్చి కనిపిస్తున్న రోడ్ వైపుకు చూస్తూ.
అద్భుత్ సృష్టి పక్కనే నిలబడి, తన భుజాన్ని సృష్టి భుజానికి ఆన్చి,” మరి బెంగుళూరు బయలుదేరదామా?” అడిగాడు.
ఇద్దరి భుజాలపై సూర్యుడు, చంద్రుడు మచ్చలు ఒకదానికొకటి తగలటంతో శక్తి ఉద్భవించటం మొదలై ఆకాశంలో నల్ల మబ్బులు ముసురుకోవటం మొదలయ్యింది.
************
 కోయ గుంపు అయ్యోరు కూర్చునే చెట్టు దగరకి వెళ్లి మొక్కుతుంటే చూసిన ప్రవల్లిక చెట్టు వైపుకు చూస్తుంటుంది.
“అక్కడ ఎవరున్నారు మేడం, వీళ్ళంతా అయ్యోరా అంటూ ఎవరికి మొక్కుతున్నారు?” అడిగింది యామిని. ఒక్కసారిగా వర్షం మొదలవటంతో అయ్యోరు కళ్ళు తెరచి “అమ్మా ..! నీ బిడ్డల్నే కాపలాగా పెట్టావా తల్లీ.. ధన్యోస్మి మాతా! “ అంటాడు చేతులు జోడిస్తూ.
కోనలో వర్షం పెద్దదవటంతో మంటలు ఆరిపోవటం చూసి కోయ గుంపు అయ్యోరు కూర్చునే చోటుకి సాష్టాంగ పడి లేచి వెళ్లిపోతుంటారు.
ప్రవల్లిక కోయ దొరను ఆపి,” మీకు ఆ యోగి కనిపిస్తున్నారా?” అని అడుగటం విని,” ఆ అయ్య కాన రావాలంటే పుణ్యం సేసుకోవాల,” అని చెప్పి వెళ్ళటం \తో ప్రవల్లిక తనకు కనిపిస్తున్న అయ్యోరు వైపు చూసింది.
“మేడం రండి వర్షం పెద్దదయింది అంటూ యామిని హడావిడి పెడుతుండటంతో ప్రవల్లిక వెళుతూ అయ్యోరు వైపు చూసింది. అయ్యోరు నవ్వుకుంటూ చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు.
*****
(సశేషం)

No comments:

Post a Comment

Pages