‘స్వప్నలోకం’ - అచ్చంగా తెలుగు

‘స్వప్నలోకం’

Share This

‘స్వప్నలోకం’


పోడూరి శ్రీనివాసరావు 

 

వాస్తవంలో జరగకపోయినా...
జరగడానికి వీలులేకపోయినా...
అనుకున్నది ... అవలేకపోయినా ...
జరిగినంత ... సాధించినంత ...
సంబరం నాకు –
          ఎందుకంటే –
          అనుకున్నది ... జరిగింది!
          సాధించుకన్నా... వీలవకపోయినా!!
ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది??
          నా ‘కల’ లో జరిగింది.
అందుకే ‘స్వప్నలోకం’ అంటే
అమితానందం నాకు.
          ఆ లోకంలో నేనెక్కడికైనా
          విహరించవచ్చు  
ఏమైనా చేయొచ్చు! నా ‘కల’లో.
          నేను ‘కృష్ణుడ్నయినా’
          రాముడిలా ఊహించుకోవచ్చు...
                   నే చూడని ప్రదేశాన్ని...
                   సుందర దృశ్యాల్ని...
                   అందమైన అనుభవాల్ని...
                   అద్బుత జలపాతాల్ని...
                   దట్టమైన కీకారణ్యాల్ని...
                   భయంకర వన్యమృగాల్ని...
          ఇలా ఎన్నో...ఎన్నెన్నో...
          ప్రదేశాలను తిలకించాను –
                   నా ‘స్వప్నలోకం’లో!
          దుర్భరమైన దారిద్ర్యాన్ని
          అనుభవించాను ‘స్వప్నం’లో
          స్వప్నంలో విహరించాను...విహంగమై...
ఎల్లలు దాటి...ఎల్ల దేశాలు దర్శించాను
వీసా లేకపోయినా!!
          ఇలా...ఎన్నని చెప్పను?
నన్ను నేను ఊహించుకున్నాను...
          అమెరికా ప్రెసిడెంట్ ఒబామా లా
          శాస్త్రవేత్త ఐన్ స్టీన్ లా
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజులా
సేవాదురీణి మదర్ థెరిస్సాలా
భారతకోకిల లతామంగేష్కర్ లా
అమరగాయకుడు ఘంటసాలలా
శృంగారతార మేర్లిన్ మన్రోలా
నవ్వుల రారాజు చార్లిస్ చాప్లిన్ లా
అందాల నటసామ్రాట్ అక్కినేనిలా
యుగపురుషుడు ఎన్టీ రామారావులా
అంతర్జాతీయ చిత్రకారుడు పికాసోలా
శాంతిదూత మార్టిన్ లూథర్ కింగ్ లా
జాతిపిత మహాత్మాగాంధీలా
గీతాంజలి సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగోర్ లా
          ఇలా...ఎందరో
          మహనీయులను మహానుభావుల్ని
నన్ను – నేనుగా ఊహించుకున్నాను.
          స్వప్నలోకంలో –
బాపు బొమ్మనై విహరించాను
ముళ్ళపూడి గోపాలంలా అలరించాను
చిచ్చరపిడుగు బుడుగులా ఆనందించాను
సీగాన పెసూనాంబలా సిగ్గులు చిలికించాను.
          ఆనందం,ఆశ్చర్యం,భయానకం,
సౌందర్యం,సౌందర్యహీనం,భీతావాహం
ఉత్సాహం,ఉల్లాసం,ఉద్వేగం
నవరసాల సమ్మోహనం
నా స్వప్నలోకంలో చూశాను.
          కలలో నే చూసిన మంచిపనులను
ఇలలో ఆచరించే ధైర్యం నాకియ్యి
కలలో ఊహించుకున్న మహనీయుల
సద్గుణాలు ఇలలో నన్ను ప్రభావితం చేయనీ!
          మనిషిగా బ్రతకనీ!
          మానవత్వం పెనవేయనీ!!

No comments:

Post a Comment

Pages