ట్రాఫిక్
పెయ్యేటి శ్రీదేవి
రాత్రి తొమ్మిది గంటలయింది. అన్నయ్య ఇంకా రాలేదని ఎదురు చూస్తోంది శ్రావ్య. ఇంకో అరగంటకి తలుపు చప్పుడయితే ఆత్రంగా వెళ్ళి తలుపు తీసింది. ' అన్నయ్యా! ఇంటర్వ్యూ బాగా చేసావా? పొద్దున్న తొమ్మిదింటికి వెళ్ళి ఇంతరాత్రి దాకా ఎక్కడున్నావు? రోడ్డు దాటితే ఎదురుగానే కదా ఆఫీసు? ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్టు విచారంగా వున్నావు? ఇంటర్వ్యూ బాగా చెయ్యలేదా? రోడ్డు దాటితే ఎదరే ఇంటర్వ్యూ ఆఫీసని, దూరంగా వచ్చిన ఇంటర్ వ్యూ వదిలేసి, దగ్గర ఆఫీసుకి వెళ్ళావుగా? ఏమిటన్నయ్యా మాట్లాడవు? కంట్లో ఆ కన్నీళ్ళేమిటి? పోన్లే అన్నయ్యా, బాధ పడకు. మరో జాబ్ కోసం చూద్దాంలే. భోంచేద్దూగాని రా. అమ్మా, నాన్నా లేని వాళ్ళం. వర్షంలో అఫీసు నించి వస్తూ, అమ్మ మ్యాన్ హోలులో పడి చనిపోయింది. నాన్న కూడ ఆ షాక్ కి తట్టుకోలేక చనిపోయారు. మనం చిన్నపిల్లలమై పోయాం. ఎల్లాగో పిన్నీ, బాబాయి చేరదీస్తే, వాళ్ళ సూటిపోటి మాటలు పడుతూ, చదువు పూర్తి చేసాం. నాకు నువ్వు, నీకు నేను. నీ బాధేమిటో నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఈ జాబ్ రాకపోతే, మరో జాబ్ రాకపోదులే.' ' కాని మరో సుజిత రాదు కదమ్మా?' అంటూ భోరున ఏడిచాడు ప్రసాదు. ' ఏమిటన్నయ్యా నువ్వనేది? సుజిత ఎవరు? ఏమైందామెకి? ఎవరావిడ?' అడిగింది శ్రావ్య. ' సుజిత అంటే పెద్దావిడ కాదు. ఆరేళ్ళ పసిమొగ్గ. పువ్వై విరియక ముందే మొగ్గగానే రాలిపోయిందమ్మా. ఆ చిన్నారిని నేను కాపాడలేక పోయానమ్మా.' ' అయ్యో! మరందుకే ఇంటర్ వ్యూకి కూడా వెళ్ళలేకపోయావా?' ' ఈ సంఘటన సాయంత్రం నాలుగింటికి జరిగింది. అంతకుముందే ఇంటర్వ్యూకి వెళ్ళాను. కాని అప్పటికే ఆఫీసు మూసేసారు.' ' నాకంతా గజిబిజిగా వుంది. అసలేం జరిగిందన్నయ్యా? వివరంగా చెప్పు నాకు.'
******************
హైదరాబాదు నగరంలో తెల్లవారిపోయి ఆరుగంటలయింది. వాహనాలన్నీ హడావిడిగా రొద చేస్తూ ట్రాఫిక్ నిబంధనలకి నీళ్ళొదిలి అస్తవ్యస్తంగా, గజిబిజిగా, బిజీ బిజీగా పరుగులిడుతూ, అడ్డొచ్చిన వాళ్ళని నిర్దయగా పడేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఓ బక్కచిక్కిన రిక్షా భయం భయంగా వేడుకుందిలా..... ' సార్, కొంచెం అడ్డు తప్పుకోండి సార్.' ' ఎవరివయ్యా నువ్వు? నీ పేరేమిటి? ' నన్ను రిక్షా అంటారు సార్.' ' ఆఫ్టరాల్, నువ్వు రిక్షావై వుండి నన్నే అడ్డు తప్పుకోమంటావా? అసలు నేనెవరినో తెలుసా? నన్ను స్కూటర్ అంటారు. ఒళ్ళు జాగ్రత్తగా వుంచుకో. ఇంకెప్పుడూ నాతో పెట్టుకోకు.' ' ఓయ్, లేవయ్యా. నేను జల్దీ పోవాలి. తప్పుకోవయ్యా. అందరూ నాదారికి అడ్డు వచ్చేవారే. అసలు నేనెవరో తెలుసా? ఆటోని. ఆటోగారికి కొంచెం మర్యాదివ్వడం నేర్చుకోండ్రి.' ' ఏవయ్యా, ఏంది? అడ్డంగా నిలబడి కబుర్లేసుకుంటుండ్రు? హారన్ కొడుతుండా, వినిపించటల్లా? పక్కకి తప్పుకోండ్రి. అసలు నేనెవరో తెలుసా? లారీని. ఒక్కటుచ్చుకున్నానంటే బొక్కబోర్లా పడతారు. తప్పుకోండెహె. మీతో నాకేంటి?' ' ఓర్నీ బడాయి మండ! తాగుబోతాళ్ళక్కూడా మర్యాదియ్యాలా? ముందు నువ్వు పక్కకి తప్పుకుని బస్సుని గౌరవించటం నేర్చుకో.' ' ఆఁ .........ఏంటి బాబూ/ నీకే ఇంత మిడిసిపాటుంటే మా గతేం కాను? కొంచెం అహంకారం తగ్గించుకుని నన్ను గౌరవించడం నేర్చుకో. నేనెవరో తెలుసా? నన్ను కారు అంటారు.' ' వీళ్ళందరూ రోడ్డు మీదుండి పొగరు చూపిస్తున్నారే? పట్టాలమీద దర్జాగా వెళ్ళేదాన్ని. నాకెంత గర్వం వుండాలి? అయినా మనం వెళ్ళేదాకా గేటవతల పడుండాల్సిన వాళ్ళేకదా? పొడవాటి రైలుని, నన్ను ఎదిరించే వాళ్ళెవరు? రైలునే...........పొడవాటి రైలునే.......వయ్యారి రైలునే............ ఛుక్..........ఛుక్.........ఛు క్............ఛుక్......ఛూ... ఛూ..........' ' టింగ్....టింగ్.....టింగ్...... ...టింగ్..........టింగ్... అరె, ఇందాకట్నించి బెల్లు నొక్కుతూనే వున్నాను. ఎవరూ తప్పుకోరేం? టింగ్......టింగ్.......టింగ్.. .........' ' ఎవడివయ్యా నువ్వు? ఇందాకట్నుంచీ టెన్షన్ తో మేం ఛస్తూంటే బెల్లు నొక్కి గొడవ చేస్తావేమిటి? నిన్ను మేమెప్పుడూ చూసినట్టు లేదే?' ' నన్ను సైకిలు అంటారు.' ' ఓరోరి, బక్కచిక్కిన సైకిలుగాడివి నువ్వేనా? ఎప్పుడో మేం పుట్టక ముందర వుండేదట సైకిలు. ఇంకా ఇప్పటికీ వున్నావా? మమ్మల్ని చూస్తే నీకేం భయమేయటల్లా? జాగ్రత్త! ఉఫ్ అని ఊదుతే పడిపోతావు. బక్కోడివి, మాకు అడ్డు తగలడమే కాక మమ్మల్నే తప్పుకోమంటావా? ఎంత ధైర్యం నీకు? మాలో ఎవరన్నా ఒక్కరు చాలు నిన్ను పడేసి తొక్కెయ్యటానికి. జాగ్రత్త! ఏంటనుకున్నావో! మా దారికి అడ్డు రాకు.' ' బాబూ! కొంచెం పక్కకి తప్పుకుంటారా? దారిస్తే అర్జంటుగా పట్టాలు దాటి వెళ్ళాలి. కొంచెం అడ్డు తప్పుకోండి బాబూ. త్వరగా ఇంటర్వ్యూకెళ్ళాలి. ఇప్పుడెళ్ళకపోతే జాబ్ రాదు బాబూ నాకు. ఇదే ఆధారం. కొంచెం మీరన్నా దారివ్వండి బాబూ అర్జంటుగా.' ' ఇంకా మమ్మల్ని పక్కకి తప్పుకోమంటూ చెవిలో ఒకటే రొద పెడుతూ అట్నించిటు, ఇట్నించటు.........ఆ పక్కనించి, ఈ పక్కనించి దూరి మాకు అడ్డం తగులుతూ, మమ్మల్ని ఇబ్బంది పెట్టే వీడెవడండీ బాబూ?' ' ఎవడివయ్యా నువ్వు? కొత్తరకంగా వున్నావు?' ' నన్ను..........నన్ను......నేను .......నేను...........' ' ఊఁ ........నిన్ను.........నిన్ను. .......నువ్వెవరు? ఎందుకలా నీళ్ళు నములుతావు? ధైర్యంగా చెప్పు. ఎవర్నువ్వు? నీ పేరేమిటి?' ' నేను పాదచారిని. నన్ను మనిషి అంటారు. రెండుకాళ్ళ మనిషిని. మీరు కొంచెం దారిస్తే అర్జంటుగా ఇంటర్వ్యూకెళ్ళాలి బాబూ. టైమయిపోయింది. దయచేసి దారివ్వండి. రైలు పట్టాలు దాటితే అదే ఇంటర్వ్యూ ఆఫీసు.' ' హా........హా.........హా....... .హా........! మడిసంట........మడిసంట.........! హా.........హా........హా....... ...మడిసంట! ఈ భూప్రపంచంలో మేమింతమందిమి వుండగా ఇంకా కాళ్ళతో నడిచే మడిసున్నాడా? హా.........హా.....హా......హా.. ..... మడిసంటా........మడిసంట.......! మేమందరం ఎలిపోనాక, అప్పుడు నువ్వింటర్వ్యూ కాడికెల్లు బాబూ!' ఇంతలో గగనసీమలో హాయిగా ఎగురుతూ, ' ఏమిటో, భూమి మీద వెళ్ళేవాళ్ళకే ఇంత మిడిసిపాటుంటే, గాలిలో విహరించే నాకెంత గర్వం వుండాలి? ఐనా నా దారికడ్డొచ్చే వాళ్ళెవరు?' అనుకుంటూ గర్వాంధకారంలో ఓ పక్షిని ఢీకొని, జనావాసాలున్న ఓ ఆపార్ట్ మెంట్ మీద డాంమని పెద్ద శబ్దంతో కూలిపడింది పాపం ఓ విమానం! దాంతో ఆ అపార్ట్ మెంట్ కూడా టపటపా పేకమేడలా కుప్పకూలి, అందులో నివాసమున్న వాళ్లంతా దుర్మరణం చెందారు. అదే సమయానికి మరోచోట సైకిలు కారు కింద పడి నుజ్జు నుజ్జయింది! రైలు పట్టాలు తప్పి నదిలో పడింది! ఎదర బస్సుని తప్పించుకోబోయి ఓ కారు కంగారుగా వెళ్ళి చెట్టుకి గుద్దుకుంది! స్కూలు పిల్లలి తీసికెడుతున్న ఓ బస్సు స్పీడుగా వెడుతూ కాలవలో పడింది! నేను మాత్రం ఏం తక్కువనుకుంటూ, బస్సు కన్నా ముందర వెళ్ళాలని, లారీ కూడా ఓ పూరిపాకలోకి దూసుకెళ్ళి, అప్పుడే కూలి నాలి చేసుకుని వచ్చి హాయిగా నిద్రిస్తున్న ఓ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది.! ఇంతలో ఆటో రోడ్డుమీద అడ్డదిడ్డంగా స్పీడుగా వెడుతూ స్కూటరుకి డాషిచ్చింది. స్కూటరు నామరూపాల్లేకుండా తయారయింది! అదే సమయానికి కొంచెం ముందర, స్కూటరు రిక్షాకి తగిలి, రిక్షా చక్రం ఊడి రోడ్డుకడ్డంగా దొర్లుకుంటూ......... ఈ విధంగా............ రోడ్లన్నీ ఆటోలు, రిక్షాలు, స్కూటర్లు, సెవెన్ సీటర్లు, బస్సులు, లారీలు, కార్లు - ఇలా జనాభా కన్నా ఎక్కువ సంఖ్యలో వాహనాలెక్కువయిపోయి, ఇవన్నీ గుమిగూడి, రోడ్డు మీద అస్తవ్యస్తంగా, చిందరవందరగా, చెల్లాచెదురుగా సర్దుకోని ఇల్లులా, చీమ కూడా దూరే సందు లేకుండా వుంటే, రోడ్డు మీద నడిచి వెళ్ళేవాళ్ళకి ఏ దారీ లేక, భయం భయంగా ప్రాణాలరచేతిలో పెట్టుకుని, ఈ క్షణం రోడ్డు దాటితే చాలనుకుని, హమ్మయ్య, ఈ రోజుకి ధైర్యంగా, ఏ ఆపదా లేకుండా ట్రాఫిక్ గండం నించి ఇంటికి చేరుకోగలిగాం అన్న సంతృప్తి ఆ కాసేపే వున్నా, మళ్ళీ ఏరోజు ఎల్లా వుంటుందో చెప్పలేని పరిస్థితి! నడిచేవారికి రోడ్డు దాటడం దిన దిన గండమే! దేవుడు ఆయుష్షు వందేళ్ళు ఇచ్చినా, అందులో సగం ఆయుష్షుతో బతకడానిక్కూడా వీలు లేకుండా చేస్తున్నారు మన ట్రాఫిక్ నియంత్రణాధికార్లు, వాహన చోదకులు!
****************************
ఇంతలో స్కూలు వదిలిపెట్టారు. ఆటోలోంచి ముద్దులొలికే ఒక చిన్నారిపాప వీపున పుస్తకాల సంచి, ఒక చేతిలో కేరేజితో దిగింది. ' పాపా! నీ పేరేమిటి?' ' మరేమో, నా పేరు సుజిత.' ' ఏం చదువుతున్నావు?' ' ఎల్.కె.జి. పెద్దయ్యాక అందరికి మంచిగా వైద్యం చేస్తూ మంచి డాక్టరునవుతాను.' ' అరె, నేనడక్కుండానే చెప్పేసావే?' ' తరువాతందరూ అడిగే ప్రశ్నదేగా, పెద్దయ్యాక నువ్వేం చేస్తావని? అందుకే ముందరే మీరడక్కుండానే చెప్పేసా. అంకుల్, ఇదే మా యిల్లు. కొంచెం రోడ్డు దాటించరా?' ' నేనూ అందుకే గంటనించీ ఇక్కడ నుంచున్నాను రోడ్డు దాటదామని. ఉండమ్మా. ఆ కారు, బస్సు, లారీ, ఆటోలు, అవన్నీ వెళ్ళిపోనీ. జాగర్త, నా చేయి గట్టిగా పట్టుకో.' ' ఆఁ..........రండంకుల్. అన్నీ వెళ్ళిపోయాయి.' ' లేదమ్మా. మళ్ళీ వస్తున్నాయి. అదుగో, ఆ రెండు కార్లూ, బస్సు వెళ్ళిపోనీ.' ' ఆఁ...........రండంకుల్. అన్నీ వెళ్ళిపోయాయి. ఈ రోజు నా బర్త్ డే. ఇప్పుడే ఫంక్షనుంది. మీరు కూడా వద్దురుగాని. ఊఁ.......గమ్మున రండి. భయపడకండి.' ' ఉండమ్మా. ఆ లారీ, సెవెన్ సీటరు వెళ్ళిపోనీ." ' ఆఁ....రండంకుల్. నేను జాగర్తగా తీసికెడతాను. నా చెయ్యి గట్టిగా పట్టుకోండి. ఊఁ........పట్టుకోండి. అయ్యో, చెయ్యి వదిలేసారా?' ' పాపా, ఆగు! పా.........పా......! పా........పా.........!' ఆ చిట్టిపాప రోడ్డు దాటి వెళ్ళలేక ఈ లోకం నించే శాశ్వాతంగా వెళ్ళిపోయింది భయంకరంగా లారీ కింద పడి! ఈలోగా ఆ పాప తండ్రి వచ్చాడు పాపని తీసికెళ్ళడానికి. ట్రాఫిక్ వల్ల రావడం లేటయిందట. కొంచెం ముందర వచ్చివుంటే ఆ పాప బతికేది. కనీసం నా చెయ్యి వదలకుండా పట్టుకున్నా ఆ పాప బతికేది. ఈ రోజు తన బర్త్ డే ఫంక్షనట. ఫంక్షనుకి నన్ను కూడ పిలిచింది. త్వరగా ఇంటికెళ్ళిపోవాలని నా చెయ్యి వదిలేసింది. నేనే ఆ పాప చెయ్యి గట్టిగా పట్టుకుని వుండాల్సింది. నాదే తప్పేమో. ఆ పాపని కాపాడలేకపోయాను. రోడ్డు దాటించలేని అసమర్థుడినయాను. నా కళ్ళముందే ఆ చిట్టితల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంటి నించి బయలుదేరాక, ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని, రోడ్డు దాటి వెళ్ళే పరిస్థితి లేక, అనేక వాహనాల వలయంలో చిక్కుకుని, ఇంటర్వ్యూకి కూడా టైముకి చేరుకోలేకపోయాను. దూరంగా వున్న ఆఫీసు వదిలేసి, దగ్గిరే కదా అని ఈ ఇంటర్వ్యూకి వెడదామంటే, ఏదీ లేకుండా అయిపోయింది. నా వల్ల ఆ పాప ప్రాణాలూ దక్కలేదు. నేనెందుకూ పనికిరాని వాడినయ్యానమ్మా. నాదే తప్పు.' అన్నయ్య చెప్పినదంతా విని బాధ పడి శ్రావ్య అంది, ' తప్పు నీది కాదన్నయ్యా. బాధ్యత లేకుండా ప్రవర్తించే ప్రభుత్వాలది. ట్రాఫిక్ రూల్సుని ఏమాత్రం పాటించకుండా, నిర్లక్ష్యంగా, పొగరుమోత్తనంగా, వేగంగాను, అడ్డదిడ్డంగాను వాహనాలు నడిపే - ఏమని తిట్టాలో తెలీటల్లేదు - ఆ మహానుభావులది. ఎవరికి వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలి అన్న ధ్యాసేగాని, మనుషుల ప్రాణాలంటే లెఖ్క లేకుండా పోయింది.' ఇంకా తన అన్నని ఎలా ఓదార్చాలో అర్థం కాక, శ్రావ్య అతడి మనసు మళ్ళించడానికి టి.వి. ఆన్ చేసింది. ఆ టి.వి.లో కూడా ఓ యాక్సిడెంట్ గురించే వార్తలలో చెబుతూ, రక్తసిక్తమై పడివున్న సుజిత మృతదేహాన్ని చూపిస్తున్నారు. తల్లి స్పృహ తప్పి పడిపోయివుంది. తండ్రి భోరున ఏడుస్తున్నాడు. ట్రాఫిక్ లో ఇరుక్కుని త్వరగా వెళ్ళలేకపోయినందు వల్ల వున్న ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకున్నానని గుండెలు బాదుకుంటున్నాడు. ఆ టి.వి. విలేఖరి, జనంలో వున్న తన అన్న దగ్గరకు వెళ్ళి, మైకు అతడి ముందు పెట్టి, ' మీరు ఈ యాక్సిడెంటుని కళ్ళారా చూసారుగా, మా ప్రేక్షకులకి వివరాలు అందివ్వ గలరా?' అని అడుగుతున్నాడు. తన అన్న ఏడుస్తూ ఆవేశంగా అంటున్న మాటలు ఆసక్తిగా వినసాగింది శ్రావ్య. ' ఏం వివరాలు చెప్పమంటారు? ఇలా ఎంతమందో ఇంకా పూర్తిగా విరిసీ విరియని పాలుకారే అందాల లేత పసిడి బొమ్మలు మొగ్గలుగానే రాలిపోతుంటే, ఎంతోమంది యాక్సిడెంట్లలో మరణిస్తూంటే, కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయిపోయి, వరద వచ్చిన నదుల్లా మారిపోగా, ఆ రోడ్లమీద ఎంత జాగ్రత్తగా వెడుతున్నా, ఏ మ్యాన్ హోల్స్ లోనో, లేక గోతుల్లోనో పడి, ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతూంటే, ప్రభుత్వానికి గాని, అవినీతి డబ్బు సంపాదనకి అలవాటు పడిపోయి చలాన్లు రాయడంలోనే నిమగ్నమై వుండే రక్షకభటులకి గాని పట్టదా? అడ్డంగా, అడ్డదిడ్డంగా వాహనాలు యమదూతల్లా, చీమ దూరే సందు కూడా లేకుండా, కొద్దిపాటి వర్షానికే గోతులు పడిపోయిన రోడ్లమీద పరుగులు తీస్తూ, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఎవరికీ పట్టదా? అవును మరి. రాజకీయనాయకులకి వేరే రాజమార్గాలుంటాయి కాబట్టి సామాన్య ప్రజలు అనుభవించే ఇబ్బందులు పట్టించుకునే బాధ్యత, తీరిక, శ్రధ్ధ వారికుండదు. వారు రోడ్డు పైకి రాగానే, అన్ని వాహనాలని నిలుపుదల చేయిస్తారు. వారి వాహనాలు ఇంకో గంటకి వస్తాయనగా, ఈ క్షణం నించే ట్రాఫిక్ ని నియంత్రిస్తారు. ఇక విదేశీ ప్రముఖులొస్తే జరిగే హడావిడికి హద్దే వుండదు. ఆ ఏర్పాట్లన్నీ చూసి ఆ విదేశీ ప్రముఖులు వీళ్ళు చేసిన రాచమర్యాదలకి పొంగిపోయి ఆనందంతో, ' ఆహా, హైదరాబాద్ ఈజ్ వెరీగుడ్!' అని పత్రికా ప్రకటనలిచ్చేసి చక్కాపోతారు. ఇక రాజకీయ నాయకులు మాత్రం ఎన్ని కలలో కంటూ, ఎన్నికలలో గెలవడం దగ్గర్నించి, పదవులు కాపాడుకోవడం, పరస్పరం బురద జల్లుకోవడం, అందినంత రాబట్టుకోవడం వరకు ఆ గొడవలతోనే పాపం వ్యస్తంగా వుంటారు. తెల్లవారితే పేరు లేని పేరు పెట్టుకుని విదేశాలకి పరిగెట్టే ఈ నాయకులు అక్కడి ట్రాఫిక్ విధానాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకుని, ఆ పధ్ధతులని ఇక్కడ కూడా అమలు చేస్తే ఎంత బాగుండును! ఓ తల్లుల్లారా1 మీ పిల్లలకి మీరు ఏం కావాలంటే అది కొనిచ్చి, ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ వుంటారు. హంసతూలికా తల్పాలపైన పరుండబెట్టుకుంటూ వుంటారు. కాని బైట వాతావరణం అంత సున్నితంగా లేదు. కలకాలం హాయిగా జీవించేసే ఈ కాకుల రాజ్యంలో హంసలకి చోటు లేదు. కనికరం తెలియని ఈ కఠిన పాషాణ కర్కశ మానవ కౄరమృగాల అరణ్యంలో ఆ చిన్నారులు పెద్దయి మంచి డాక్టర్లుగాను, ఇంజనీర్లు గాను, మరో ఉన్నతోద్యోగులు గాను ఎదిగేవరకు కూడా ఈ మృగాలు బ్రతకనివ్వరు. ' ఎవరికి పుట్టావురా, ఎక్కి ఎక్కి ఏడిచేవు?' అన్నట్లు ప్రజల బాధలు మన పాలకులకి పట్టవు. కాసేపు ట్రాఫిక్ కఠినతరం చేయాలని హడావిడిగా స్టేట్ మెంట్లిచ్చేస్తారు. కాని ఆచరణ లోకి రావు. మళ్ళీ కథ మామూలే! పోయినవాళ్ళు ఎలాగూ తిరిగిరారు. ఈ అవినీతి ప్రభుత్వాల మధ్య నిండు నూరేళ్ళు బతికే అర్హత లేదు. మీ బాధ ఎవరూ తీర్చలేరు. మిమ్మల్ని ఓదార్చి అర్థం చేసుకునే వాళ్ళూ వుండరు. బంధువులు గాని, చుట్టుపక్కల వాళ్ళు గాని ఎవరూ పట్టించుకోరు. నవ్వితే ఏడుస్తారు. ఏడుస్తే మరింత ఏడిపిస్తారు. ' ఎవరికెవరు ఈ లోకంలో.....?' అని మీ మనసుకి ఊరటనిచ్చే ఒక వేదాంతం టాబ్లెట్టేసుకుని, ఆ మనసుని ఓదార్చి బుజ్జగించి జోకొట్టండి.' తన అన్నయ్య ఆవేశాన్ని, బాధని గమనిస్తున్న శ్రావ్యకి కూడా దుఃఖం ఆగలేదు. ఇంతలో ప్రసాదే బాధగా వెళ్ళి టి.వి. కట్టేసాడు. ఆ మర్నాడు పేపర్లో నాయకులంతా ఆ పాప మరణానికి తమ తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటిస్తూ, ఇకనించీ ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలయ్యేలా చూస్తామని రోటీన్ గా హామీలు గుప్పించారు.!
***************************
(హైదరాబాద్ రోడ్లమీద నియంత్రణ లేని ట్రాఫిక్ చూసి, ఆ మధ్య కాన్వెంటు నించి వస్తూ యాక్సిడెంటుకి గురైన రుచిత మరణం గురించి, ఇంకా తర్వాత మరో నలుగురు స్కూలు పిల్లలు యాక్సిడెంట్లకి గురయిన వార్తలు చూసి వ్యథతో వ్రాసిన రచన ఇది)
No comments:
Post a Comment