విజ్ఞత - అచ్చంగా తెలుగు

 విజ్ఞత 

- సుసర్ల నాగజ్యోతి రమణ 


అది ఒక గొప్ప పేరున్న స్కూల్... అందులో  రెండవ  తరగతి చదివే శ్రావ్య రోజూ స్కూల్ నుండి వస్తూనే  పరిగెత్తుకొచ్చి," అమ్మా... !", అంటూ మీదకు ఎక్కేసి దీప్తి తో చాలా సేపు ఆడేస్తుంది......కానీ ఆరోజు అదోలా ఉండటం  గమనించింది దీప్తి. స్కూల్ లో ఫ్రెండ్స్ తో  ఎక్కువగా ఆడిందేమోలే అలసిపోయి ఉంటుందనిఅనుకుని స్నానం చేయించి  ,సాయంకాలం తనకిష్టమైన పకోడీలు చేసి పెట్టింది. ఎంతో ఇష్టం గా మళ్ళీ అడిగే శ్రావ్య ఆ రోజు పళ్ళెం లో పెట్టినవి సగం పైన వదిలెయ్యటం గమనించి విస్తుపోయింది దీప్తి.
     అలా శ్రావ్య  మరో రెండు మూడు రోజులు అదోరకమైన దిగులుతో  ఉండటం దీప్తిని ఆలోచనలో పడేసింది . మర్నాడు శ్రావ్యకు స్నానం చేయిస్తూ కుడి చెయ్యి మణి కట్టు మీద నల్లగా రెండు మచ్చలు చూసింది ,అక్కడ రుద్దుతుంటే అబ్బా నొప్పి అంటూ శ్రావ్య చేతిని వెనక్కు లాక్కుంది. దీప్తి శ్రావ్య మొహంవంక చూసి కళ్ళకింద నల్ల మచ్చలు కూడా వచ్చేస్తున్నాయేమిటీ దీనికి అనుకుంది.
"ఏమయ్యిందమ్మా ,నొప్పి ఎందుకు వచ్చింది?"  అని అడిగింది శ్రావ్యని.
"మరేమో మరేమో, స్కూల్ లో బల్ల తగిలిందమ్మా,"  అంటూ భయం భయంగా మాట దాట వేస్తున్న శ్రావ్యని చూసి,దీప్తి ఆలోచనలో పడింది.
ఈ మధ్యన దాదాపు ఒక పదిహేను రోజులనుండీ తనకు శ్రావ్య తో సరిగ్గా గడిపేందుకు సమయం చాలటం లేదు. మామ గారి అనారోగ్యం వల్ల ఆయన్ను హాస్పటల్ లో చేర్పించటం, అటూ ఇటూ పనీ తిరుగుడూ ,సరిగ్గా సమయానికి తన భర్త సుధీర్ కు ఆఫీసులో ప్రాజెక్ట్ వత్తిడీ, దానితో తమ భార్యా భర్తా ఇద్దరూ గబాగబా పిల్లకు ఇంత పెట్టి స్కూల్ కి పంపిస్తున్నామా లేదా అని చూస్తున్నారే కానీ, స్కూల్ లో ఏం జరుగుతోందో అదివరకటి లాగా రోజూ కబుర్లు చెప్తూ కనుక్కోవటానికి కుదరటం లేదు. అందుకే శ్రావ్య తనదగ్గిర ఏదో విషయం చెప్పలేక పోతోంది అని గ్రహించింది దీప్తి. అదే సంగతి భర్త సుధీర్ తో చర్చించింది.
ఆ మర్నాడు శ్రావ్యను స్కూల్ కి పంపలేదు. తనూ, భర్తా , మామగారు అందరూ తమ తో పాటే శ్రావ్యను ఉంచుకుని బోలెడన్ని కబుర్లు చెప్పారు. దీప్తి వంట చేస్తూ చిన్నప్పటి లా శ్రావ్యను వంటగదిలో గట్టు మీద కూర్చోబెట్టుకుని, కబుర్లు చెప్తూ పని పూర్తి చేసింది. ఆ సాయంత్రం అందరూ కలిసి పార్క్ కూ,హోటల్ కూ వెళ్ళి ఆనందంగా గడిపారు. రాత్రి కి దీప్తి అదివరకటి లాగా శ్రావ్యను జోలపాటలు పాడి నిద్ర పుచ్చింది.
మర్నాడు శ్రావ్యను స్కూల్ పంపటానికి తయారు చేస్తూ అంతకు ముందులానే "బంగారు తల్లీ, స్కూల్లో అందరూ నీతో బావుంటున్నారా? మీ  ఫ్రెండ్స్ అందరితో నువ్వు చక్కగా ఆడుకుంటున్నావా? నీ స్నాక్సూ, నీ వస్తువులూ షేర్ చేసుకుంటున్నావా?" అంటూ శ్రావ్యను అడిగింది దీప్తి.
శ్రావ్య జవాబు చెప్పకుండా దీప్తి వంక అలా చూస్తూ నిల్చుంది.
దీప్తి ఒక నిమిషం ఆగి ,"బంగారూ అప్పుడప్పుడూ నీకింకో విషయము కూడా చెప్తూ ఉంటాను కదా ! నిన్ను ఎవరయినా ముట్టుకోకూడని చోట్ల ముట్టుకుంటున్నారా,  అలా ఏమైనా ఉంటే నాకు చెప్పాలి. మనిద్దరం ఫ్రెండ్స్ కదా !" అంటూ శ్రావ్యను దగ్గరకు తీసుకుంది.
వెంటనే శ్రావ్య వాళ్ళమ్మను గట్టిగా వాటేసుకుని," అమ్మా నాకీ స్కూల్ వద్దమ్మా, నేనీ స్కూల్ కి వెళ్ళను", అంటూ పెద్దగా ఏడ్చేసింది.
దీప్తి నిర్ఘాంత పోయింది....
శ్రావ్య వీపు నిమురుతూ బాగా ముద్దు చేసి," ఆ స్కూల్ నీకు నచ్చకపోతే నాన్నగారితో చెప్పి మార్పించేస్తాలేమ్మా, బంగారు తల్లీ" అంటూ ముందు భరోసా ఇచ్చింది. ఆ తరువాత మరి స్కూల్ నీకెందుకు నచ్చలేదో నాకు చెప్పు బంగారూ అంటూ అడిగింది.
శ్రావ్య చెప్పటం మొదలెట్టింది.....
"అమ్మా మరేమో మా స్కూల్ లో చాలా మంది అటెండర్ లు ఉన్నారు కదా, మేము టాయిలెట్  కు వెళ్తుంటే మా వెనకాలే వస్తారమ్మా. లోపల ఎక్కువ సేపు ఉంటే బైట గడిపెడతామని బెదిరిస్తారు. అందుకని నేను మొన్న మా ఫ్రెండ్ అపర్ణ టాయిలెట్ కు వెళుతుంటే బైట కాపలా నిల్చున్నాను. వాళ్ళు గడిపెడితే తలుపు నేను తియ్యొచ్చని , కానీ అపర్ణ లోపలికి వెళ్ళంగానే పక్కనే ఉన్న కిటికీ లోంచి ఒక అటెండర్ బైనాక్యులర్స్  పెట్టుకుని లోపలికి చూస్తున్నాడు. నాకు భయమేసి మా టీచర్ కి చెప్పటానికి పరిగెత్తాను, "టీచర్ టీచర్.." అని అరుస్తూ ,టీచర్ వినలేదు కానీ ,నేను రూం మెట్లెక్కేలోపల అక్కడే  ఉన్న ఇంకో అటెండర్ నా చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కాడమ్మా ,చెంప మీద కూడా కొట్టాడు. ఎవరికయినా చెపితే చంపేస్తాను అన్నాడు. అప్పటినుండీ స్కూల్ లో టాయిలెట్ కి వెళ్ళటం లేదు. రోజూ కడుపులో నొప్పి  వస్తోంది," అంటూ పెద్దగా ఏడ్చేసింది.
పైగా నువ్వు ,"మన ప్రైవేట్ పార్ట్స్ ఎవరూ చూడకూడదూ, ముట్టుకోకూడదూ అని చెప్పావుగా. అలా చేస్తే చెడ్డవాళ్ళం అవుతావు, అన్నావుగా ! ఇప్పుడు మా ఫ్రెండ్ చెడ్డ పిల్ల అవుతుందా?" అంటూ "వాళ్ళు నన్ను చూస్తే నేనూ చెడ్డపిల్లను అవుతాగా, అమ్మా!" అంటూ ఏడుస్తున్న శ్రావ్యను చూస్తుంటే దీప్తికి కళ్ళ నీళ్ళూ తిరిగాయి.
"నువ్వూ, మీ ఫ్రెండూ మంచి వాళ్ళే తల్లీ, చెడ్డవాళ్ళు ఆ వెధవలే. నువ్వు ఎప్పటికీ బంగారు తల్లివేరా, నాన్నా!" అంటూ బుజ్జగించింది. సుధీర్ తో చర్చించి తనకు తెలిసిఉన్న చాలామంది పెరెంట్స్ కూ, అపర్ణా వాళ్ళ అమ్మనాన్నలకూ ఫోన్ చేసి  విషయం వివరించింది దీప్తి .
ఆ మర్నాడు దీప్తీ సుధీర్ ల హెచ్చరికలు అందుకున్న అపర్ణ తల్లి తండ్రులూ, ఇంకొంతమంది పిల్లల తల్లితండ్రులూ,దీప్తీ సుధీర్ లతో బాటు ప్రిన్సిపల్ ను కలిశారు. ముందర ఆ ప్రిన్సిపాల్ తమ స్కూల్ లో అలాంటి సంఘటనలు జరిగే అవకాశమే లేదనీ, ఎన్నో ఏళ్ళుగా  ఏ గొడవలూ లేకుండా విజయవంతముగా నడపబడుతున్న స్కూల్ తమది కాబట్టి , పిల్లలు చెపుతున్న విషయం నమ్మదగ్గదిగా అనిపించటం లేదంటూ ఇంకొంతమంది పిల్లల్ని కూడా పిలిపించి అడిగింది. వాళ్ళు కూడా శ్రావ్య చెప్పింది నిజమేనని నిర్ధారించాక, ఆ అటెండర్ లు ఎవరో చెపితే వారిని మాత్రమూ విధులనుండి తప్పిస్తామనీ, మర్నాటి నుండి శ్రావ్య, అపర్ణలు స్కూల్ కి మామూలుగా రావచ్చని చెప్పింది . అయినా బాధ్యత గల ప్రిన్సిపాల్ గా ఆవిడ పోలిస్ రిపోర్ట్ ఇవ్వాలని తల్లితండ్రులు పట్టుబట్టారు. అది జరిగే పని కాదనీ ప్రస్తుతం ఉన్న అటెండర్ల లో చాలా మంది తమ బస్ డ్రైవర్ ల పిల్లలేననీ, వారంతా చాలా కాలంగా నమ్మకస్తులుగా పని చేస్తున్నవారనీ, పైగా ఒకసారి వాళ్ళందరినీ అవమానిస్తే గొడవ చేస్తారనీ, అందువలన స్కూల్ రెప్యుటేషన్ ఇంకా ఎక్కువాగా దెబ్బతింటుందనీ, ఎలాగూ చెడు ప్రవర్తన ఉన్నవారినిపని లోంచి తీసేస్తాము కాబట్టీ, పోలీస్ రిపోర్ట్ ఇచ్చే అవసరం లేదని మాట్లాడింది. శ్రావ్య మాత్రమూ  ఇంక ఆ స్కూల్ కి రాననీ ,మళ్ళీ  ఆ అటెండర్ ల ఫ్రెండ్స్ తనని కొడతారనీ భయపడుతూ ఏడుపుమొదలెట్టింది.
పేరెంట్స్ అందరూ ప్రిన్సిపాల్ ని మళ్ళీ అడిగారు, మీరు పోలిస్ రిపోర్ట్ ఇస్తేనే మంచిదనీ, ఇంతమంది జనాలు తిరిగే స్కూల్ లోనే ఇంతకు తెగించిన వాళ్ళూ, రేపు బస్సులో పిల్లలు వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఏమైనా చెయ్యొచ్చు. మా పిల్లల్ని ఇలాంటి దుర్మార్గాలకు బలి ఇవ్వటానికి కని మేము స్కూల్ కి పంపటంలేదు. వారికి సరి అయిన  విద్య నడవడీ నేర్పటానికి పంపుతున్నాము కాబట్టి,  ఇలాంటి  సంఘటనలను మొగ్గలోనే త్రుంచేయాలి అంటూ గోల చేశారు. ఈ లోపలే ఒక పేరెంట్ ఫోన్ అందుకున్న పోలిస్ ఇన్ స్పెక్టర్ స్కూల్ కి రానే వచ్చారు. ఆయన్ను చూసి ఇబ్బంది పడిన ప్రిన్సిపాల్, అపర్ణావాళ్ళ పేరెంట్స్ ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడింది. ఆ తరువాత అపర్ణా వాళ్ళ తల్లితండ్రులు అపర్ణ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, పోలిస్ రిపోర్ట్ ఇవ్వటానికి అంగీకరించలేమనీ, దయచేసి ఆ విషయాని అక్కడితో వదిలేసి వేరే ప్రత్యామ్నాయాలను వెదుకుదామనీ అందరితో చెప్పారు. కానీ తాము రిపోర్ట్ ఇస్తామని ముందుకొచ్చిన దీప్తీసుధీర్ లను  ఆ ఇన్ స్పెక్టరే వారించారు. అసలు సంఘటనలో బాధపడాల్సిన పిల్ల వైపు వాళ్ళు ముందుకురావటం లేదు. మీరెందుకండీ మీ పాపను కోర్ట్ లూ, మీడియాల ముందుకు తేవటం ఆలోచించుకోండి. వీలయితే వెంటనే మీ పాపను ఈ స్కూల్ లోంచి తీసేసి సరి అయిన విలువలున్న స్కూల్ లో చేర్చుకోండి. అంటూ సలహా ఇచ్చాడు. ప్రిన్సిపాల్ తో కూడా మీ స్కూల్ లో ఇలాంటి సంఘటనలు మరి జరుగకుండా చూసుకోవాల్సిన భాద్యతను గుర్తెరిగి ప్రవర్తించమంటూ ,హెచ్చరించి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత శ్రావ్యను తీసుకుని ఒక రెండేళ్ళ క్రితమే కొత్త గా మొదలెట్టిన స్కూల్ ప్రిన్సిపాల్ ను కలిశారు దీప్తీ సుధీర్ లు ఆవిడకు జరిగినదంతా చెప్పి, మీ స్కూల్ లొ అలాంటి సంఘటనలు ఎదురుకావని మీరు భరోసా ఇస్తే మా అమ్మాయిని మీ స్కూల్ లో చేర్పిస్తామని చెప్పారు. ఆవిడ ఒక డాక్టర్ కూడానూ! ఇలాంటి సంఘటనలు పిల్లల మనసును చాలా ప్రభావితం చేస్తాయనీ, అయినా కానీ మళ్ళీ చక్కని వాతావరణం లో చదవగలిగితే పిల్లలు ఇలాంటి వాటిని మరచిపోయే అవకాశం ఉందని చెప్పింది.
 పర్యవసానం... ఆ స్కూల్ లోపలకు ఇప్పుడు మగ అటెండర్లు ఎవ్వరూ పోరు. స్కూల్ కారిడార్లలో నిఘా కెమేరాలు చోటు చేసుకున్నాయి. టీచర్లు కూడా వేరే వేషాలు వెయ్యకుండా గమనించటం కోసం. క్రొత్త స్కూల్ ప్రిన్సిపాల్ ప్రతి సోమవారమూ అసెంబ్లీలో మగపిల్లలు ఆడపిల్లలతో ఎలా సజావుగా ప్రవర్తించాలో, ఆడపిల్లలు కూడా మగపిల్లల్తో ఎలా హద్దుమీరకుండా ప్రవర్తించాలో, వివరిస్తూ ఉపన్యాసం ఇస్తుంది. తల్లి తండ్రీ పిల్లలకు మంచీ చెడూ గుర్తించటంలో తర్ఫీదునివ్వటం లోని ప్రాముఖ్యతను గురించి మానసిక నిపుణులచేత ఆ స్కూల్ లో ప్రతి సంవత్సరమూ స్కూల్ ప్రారంభంలో పిల్లల తల్లితండ్రులకు ఒక ఉపన్యాసం ఇప్పించబడుతుంది.
అలాగే స్కూల్ బస్సుల్లో జీ పీ ఎస్ పధ్ధతి ప్రవేశపెట్టింది ,ప్రతి బస్సునూ మానిటర్ చెయ్యటం కోసం ప్రతి బస్సులో కూడా ఒక ఆయమ్మ, లేడీ టీచర్  చివరి పిల్ల బస్ దిగేదాకా ఉండేలా చర్య తీసుకుని,బస్సు రూట్లనూ,సమయపాలననూ సవరించింది. పిల్లలు ముఖ్యం అనుకునే తలి తండ్రులున్న శ్రావ్య పూర్వపు స్నేహితులు కూడా స్కూల్ మారారు , ఇదే స్కూల్ లో కూడా కొంతమంది చేరారు. అపర్ణ వేరే ఊరు వెళ్ళిపోయింది. ఆ స్కూల్ ఇప్పుడు విద్యార్ధులకు రక్షణను అందించే విషయములో ఆ పట్టణం లోనే మొదటి స్థానం పొందింది. ఇప్పుడు శ్రావ్య  కొత్త స్కూల్ లో చక్కని భద్రత నిస్తున్న వాతావరణంలో చదువుకుంటూ ,మంచి  భవిష్యత్తును పొందే దిశగా తన విద్యార్ధి దశను కొనసాగిస్తోంది.
పైగా కొత్త స్కూల్ లోకి అడుగు పెట్టంగానే అందమైన అక్షరాలతో " స్పర్శను గుర్తించగలిగే విజ్ఞత  శిశువుకు అమ్మ కడుపులో ఉన్నప్పటినుండే మొదలవుతుంది ...అమ్మ ఒడే మొదటి బడి....తల్లిదండ్రుల అనురాగమే బిడ్డకు అసలయిన జీవిత భీమా" అని వ్రాసి ఉండటాన్ని అందరూ ప్రతి రోజూ చదివేలా " స్కూల్ రిసెప్షన్ లో గోడ మీద వ్రాసి ఉంచారు.

No comments:

Post a Comment

Pages