అద్దమరాతిరికాడ - అన్నమయ్య కీర్తనకు వివరణ
డా.తాడేపల్లి పతంజలి
అన్నమయ్య దృష్టిలో జీవుడు ప్రియురాలు ; దేవుడు ప్రియుడు. అందుకే “జీవుడిని ఆదరించవయ్యా!” అని వేంకటేశుని అన్నమయ్య శృంగార భక్తి నేపథ్యంలో ఈ కీర్తనలో వేడుకొంటున్నాడు. ****
1. అద్దమరాతిరి కాడ అలపు చూడక వచ్చె
వొద్దికతో బీటపై గూచుండబెట్టుకోవయ్యా
2. సారె జాఱు దురుముతో సతి నీఇంటికి రాగా
జీరల చెమట గారీ జెక్కులవెంట చేరి
సురటి విసరి చెంగలువలు ముడిచి
గారవించి పరపుపై గాగిలించుకోవయ్యా
3. పయ్యదకొంగెడలగ బరువున రాగాను
కయ్య మడిచీ జన్నులు కదలగను
చెయ్యి వురమున మోపి చెంగావి దుప్పటి గప్పి
వుయ్యాల మంచము మీద వొద్దిక చూపవయ్యా
4. గందపుబొట్టు గరగ కలసి నిన్నంటరాగా
చిందేటి మోవితేనెలు చిప్పిలీని
కందువ మోవి యాని కస్తూరి నుదుటబూసి
పొందుల శ్రీ వేంకటేశ పొసగించుకోవయ్యా (23-420 రేకు 1370)
****
1. స్వామీ ! నీకోసం నీప్రియురాలు అర్ధరాత్రి పూట, శ్రమ అనుకోకుండా వచ్చిందయ్యా ! విలాసముతో, స్నేహముతో ఆమెని నీపక్కన పీటపై కూచోబెట్టుకో!
2. స్వామీ ! ప్రియురాలు మాటి మాటికి జారే కొప్పుతో నీ ఇంటికి వచ్చింది ఆమె చెక్కిళ్ల బాటలో ప్రయాణము చేస్తూ చీరపై చెమటలు కారుతున్నాయి. పాపం..అంత కష్టపడి వచ్చింది కదా! ఆమె దగ్గరికి వెళ్లి విసనకర్రతో విసరు. అమె కొప్పులో ఎఱ్ఱకలువపూలు పెట్టి కొప్పు ముడువు. ఆవిడ సౌందర్యానికి తగిన గౌరవమిస్తూ పరపుపైన కౌగిలించుకోవయ్యా !
3. పైట కొంగు తొలగగా, బరువుతో ఆమె రాగా, తగాదాను పోగొట్టి స్తనములు కదులుతుండగా చేతిని రొమ్మున ఆనించి అందమైన ఎరుపు రంగు దుప్పటి కప్పి ఉయ్యాల బల్ల మీద ప్రేమ చూపించవయ్యా!
4. గంధపు బొట్టు కరిగిపోగా మొగము పైని చెమటతో అది కలిసిపోగా ,ఆమె నిన్ను అంటుకోవటానికి రాగా తన పెదవిలో చిందుతున్న తేనెలు పైకి ఉబుకుతున్నాయి. ప్రియమైన ఆ పెదవిని తాగి, కస్తురి సుగంధ ద్రవ్యమును నుదుటపై పూసి పొందులలో శ్రీ వేంకటేశా ! ఆమెను స్వీకరించవయ్యా !
********
పతంజలి - అన్నమయ్య వేంకటేశా ! నమస్సులు అన్నమయ్య - ఆశీస్సులు పతంజలి - స్వామీ ! అద్దమరాత్రి ...అంటే? అన్నమయ్య - అస్తి నాస్తి విచికిత్స అద్దమరాత్రి. ఆ స్థితిలో జ్ఞానోదయం పొంది దేవుడున్నాడని పరిపూర్ణంగా నమ్మి ఆయనను శరణుకోరిన ఒక జీవి ఊహా లోకంలో దైవ సాన్నిధ్యానికి బయలుదేరింది.ఆ జీవిని ప్రియురాలన్నాను.ఆమెను అనుగ్రహించమనే నా విన్నపమే ఈ పాటలోని పల్లవి. పతంజలి - క్షమించాలి. చన్నులు, పెదవుల తేనెలు? ఇవి మీరనుకొన్న ఆధ్యాత్మిక వాతావరణంలో ఎలా నప్పుతాయి? అన్నమయ్య - సాంకేతికతను ఆదరిస్తున్న మీ ఆధునిక యుగంలో ఈ సాంకేతిక- ప్రతీకాత్మక కవిత్వాన్ని ఎందుకు గ్రహించరు? సుఖదు:ఖములు, శీతోష్ణములు, పాప, పుణ్యములు- ఇవన్నీ ద్వంద్వములు. భగవద్గీత పదిహేనవ అధ్యాయము అయిదవ శ్లోకంలో “ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః” అన్నాడు భగవానుడు. ఆ ద్వాలకు ప్రతీక కీర్తనలోని స్తనముల జంట. చేతిని రొమ్మున ఆనించటమంటే ఆద్వంద్వవిముక్తిని జీవునికి కలిగించమని విన్నపము. పెదవుల తేనెలు ఇంద్రియ మాధుర్యాలు. మనం ఇంద్రియ మాధుర్యానికి లోబడితే భ్రష్టులమవుతాం. అదే- స్వామి వారు మన ఇంద్రియ మాధుర్యాలను గ్రహిస్తే – అంటే వాటిపై వ్యామోహాన్ని పోగొడితే ఉన్నతిని పొందుతాం. అది చేయమని మోవి యాని అని మూడవ చరణంలొ చెప్పాను.స్వస్తి. ఓమ్ నమో వేంకటేశాయ
No comments:
Post a Comment