అద్దె భాగవతం(టు లెట్) - అచ్చంగా తెలుగు

అద్దె భాగవతం(టు లెట్)

Share This
అద్దె భాగవతం(టు లెట్) 
 గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 


"తమ్ముడూ! త్వరగా ఒక యిల్లు కావాలి. చూసి పెడుదూ!" ఆఫీసులో కడుగు పెడుతూనే హడావిడిగా నా వద్దకొచ్చాడు సదానందం. "మా యింటిదగ్గర ప్రగతి ఎపార్టుమెంట్స్ లో ఇరవైలక్షలకో పోర్షనుంది. చూడమంటారా?" నా మాటలకు సదానందానికి చెమట్లు పట్టాయి. "తమ్ముడూ! నా జీతం నలభై వేలు దాటదు.అందులో కోతలు పోగా చేతికొచ్చేది ముప్ఫైవేలు. అలాంటిది ఇరవైలక్షలు ఎక్కడనుంచి తేనయ్యా?" నీళ్ళు నమిలాడతను. "బాంకునుంచి అప్పు తీసుకోండి" ఉచితసలహా పడేశాను. "బాంకువాళ్ళయినా ఒకనెలే యిస్తారు. ప్రతీనెలా అప్పివ్వరుగా!" ఈసారి నాకు కళ్ళు తిరిగాయి. "ప్రతీనెలా యివ్వటమేంటి? ఇంతకీ మీరడిగిన యిల్లు. ." "అద్దెకయ్యా!" నా మాటలు పూర్తికాకుండానే బదులిచ్చాడతను. "చంపేశారు. ఇల్లు కొంటానికేమో అనుకొన్నా. అయినా మీరు నాస్నేహితుడింట్లో జేరి ఏడాదేగా అయింది. అప్పుడే ఖాళీ చేయమన్నాడా?" "అతని బావమరిదికి ముంబాయినుంచి బదిలీ అయిందట. అందుకని ఖాళీ చేయమన్నారు" సదానందం మాటలకు నా మనసేదో కీడు శంకించింది. అతను అద్దెకుంటున్న యింటియజమాని నాకు ప్రాణస్నేహితుడు. నాకు తెలిసి అతనికి బావమరదుల్లేరు. సదానందం కొంచెం తిక్కమనిషి. తనకి పెళ్ళయిన కొత్తలో భార్యపోషణ ఖర్చులకు ప్రతీనెలా కొంతసొమ్ము పంపాలని తన మామకు ఉత్తరం వ్రాశాడు. ఆ దెబ్బకు మామగారు హడిలిపోయి పరుగున వచ్చాడు. "బాబూ! ఏమిటిది?"ఉత్తరాన్ని చూపిస్తూ అడిగాడు. "దాన్ని పోస్ట్ కార్డ్ అంటారు" "నేను దీన్ని ఏమంటారని అడగటం లేదయ్యా! దానిలో వ్రాసిన దాన్ని గురించి అడుగుతున్నా! మీ అమ్మాయిని నేనెందుకు పోషించాలని వ్రాశావ్! ఇంకా నా కూతురేంటయ్యా? అది నీకు భార్య అయిందిగా!" "నా భార్య అయితే మటుకు గీత మీ కూతురు కాదంటారా?" సదానందం ప్రశ్నకి కళ్ళు తిరిగాయతనికి. "గీత మా అమ్మాయే! కాదనను. కానీ. . ." "మరి. . .పెళ్ళయినంతమాత్రాన మీ అమ్మాయినొదిలేస్తారా? తన మంచిచెడ్డలు చూడరా?" అతని వితండవాదానికి మామగారు వెర్రిమొహం వేశాడు. అతన్ని దూరంనుంచి చూసిన నేను మధ్యలో కలుగజేసుకోక తప్పలేదు. "సదానందం! ఆయన పెళ్ళిలో నీకెంత యిచ్చారు?" అడిగాను. "లక్ష. పెళ్ళిఖర్చులకిచ్చారు. నేనే కాదు. పెళ్ళాడే ప్రతీవాడూ తీసుకొంటాడు" భుజాలు తడుముకొన్నాడు. పెళ్ళాడింది నువ్వూ, గీత అయితే పెళ్ళిఖర్చు ఆయనెందుకివ్వాలి? నీకు తెలుసా? నువ్వు రోజూ పూజించే దేవుడు. . .శ్రీనివాసుడు తన పెళ్ళిఖర్చుకి మామగారు ఆకాశరాజు దగ్గర డబ్బు తీసుకోలేదు. కుబేరుడి దగ్గర అప్పుచేశాట్ట. అంతటి దేవుడే మామగారినుంచి కట్నం తీసుకోలేదే! మనం కట్నం తీసుకోవటం భావ్యమేనంటావా?" "అంటే. . .మరెందుకిచ్చినట్లు?" "తన కూతుర్ని నువ్వు జీవితాంతం పోషించాలని. నువ్వేకాదూ! ప్రతీమగాడు తెలుసుకోవాల్సిన విషయమిది. ఆయనిచ్చిన డబ్బు బాంకులో వేస్తే వచ్చే వడ్డీనే నువ్వామె తిండికి ఖర్చు పెడుతున్నావ్!" "నేను బాంకులో వేయలేదే?" "అది నీ తప్పు. దానికి ఆయనెలా బాధ్యుడవుతాడు? ఆ లెక్కప్రకారం ఆయన నీకు డబ్బివ్వక్కర్లేదు. పోతే ఆమె నీకు చేసే సేవలన్నిటికీ నువ్వే . . .లెక్కలేద్దామా?" చెబుతున్న నాకో నమస్కారం చేసి మామగారికి డబ్బుకోసం మళ్ళీ ఉత్తరం వ్రాయలేదు. ఆ సదానందమే ఉద్యోగరీత్యా నాలుగైదు ఊళ్ళు తిరిగి పదిహేనేళ్ళ తరువాత మళ్ళీ యీ ఊరొచ్చాడు. పూర్వపరిచయం వల్ల అతన్ని నాస్నేహితుడింట్లో అద్దెకి దించాను. ఇతనేదో తిక్కపని చేయటం వల్ల మావాడు యిల్లు ఖాళీచేయమని ఉంటాడు. అదేదో కనుక్కొందామని వాడింటికెళ్ళాను.మా యిద్దరి మధ్య మాటల్లో నాకు తెలిసినదేమిటంటే- సదానందం భార్య గీత బాత్రూంలో కాలుజారి పడింది. ఆసుపత్రి ఖర్చు పాతికవేలు వరకూ అయింది. ఆమె యింటికొచ్చాక సదానందం మావాడి యింటిపైకి దాడికెళ్ళాడు. "బాత్రూం నాచు పట్టేసింది. శుభ్రం చేయించండి" సదానందం డిమాండుకు మావాడవాక్కయ్యాడు. "ఇంట్లో మీ ఆవిడ ఖాళీగానే ఉందిగా! శుభ్రం చేసుకోమనండి" లోనుంచి మావాడి ఆర్ధాంగి వాగ్బాణం దూసుకొచ్చింది. "ఆ యిల్లు మీదయితే మేమెందుకు శుభ్రం చేయాలి?" ఈసారి ఆవిడే లోనుంచి దూసుకొచ్చింది. "మీరు వాడుకొంటున్నారుగా! సబ్బుతో స్నానం చేస్తే సహజంగానే గచ్చు నాచు పడుతుంది. స్నానాలవగానే రోజూ సబ్బునురగ పడ్డ నేలను చీపురేసి చిమ్మేస్తే నాచు పట్టదు. అలా చేయకే మీ ఆవిడ కాలుజారి పడింది" "నాకిప్పుడు పాతికవేలు ఖర్చయింది. ఎవరిస్తారు?" "బాగుంది. మీ ఆవిడకి కాలు విరిగితే మీరు వైద్యం చేయించుకొన్నారు.దానికి మమ్మల్నేమి చేయమన్నారు?" "బాత్రూం. .సరే! వాడుకొన్నాం కనుక నాచుపట్టింది. పెరడు మేము వాడటం లేదే! అక్కడ గడ్డి పెరిగిపోతోంది. దాని సంగతేమిటి? ఆ గడ్డిలో పురుగు, పుట్రా జేరి యింట్లోకొస్తాయి కద!" "మీరు ఉదయం, సాయంత్రం అక్కడ వాకింగ్ చేయండి. ఒంటికి మంచిది. నలుగురూ పెరిగేచోట గడ్డి పెరగదంటారు కూడా!"ఉచిత సలహా పడేసిందామె. దానికి సదానందం ఆమెను, ఆమె ఏడుతరాలవారినీ తిట్టిపోశాడు. తను వాడని ప్రాంతంలో పెరిగే గడ్డిని యింటివాళ్ళే పీకించాలన్నది సదానందం వాదన. ఎవరి పెరట్లో గడ్డి వాళ్ళే పీకించుకోవాలన్నది ఆమె వాదన. వారంరోజులపాటు జరిగిన పోరాట ఫలితంగా సదానందం యిల్లు ఖాళీ చేయక తప్పదని మావాడు చెప్పటంతో సదానందానికి యిల్లు వెతక్క తప్పలేదు. ఆరోజు సాయంత్రం మా ఆఫీసుకి దగ్గరలో టు-లెట్ బోర్డ్ కనిపించి లోనికెళ్ళాం. ఇల్లు సదుపాయంగానే ఉంది. అయిదువేలు అద్దె, ఇరవైవేలు అడ్వాన్సు అడిగారు. "పూర్వం నెలయ్యాక అద్దె యిచ్చేవాళ్ళం. కొన్నాళ్ళకి అద్దె ముందే యివ్వాలంటే సరేనన్నాం. ఇప్పుడు వేలకివేలు ముందిమ్మంటే ఎలా చస్తాం తమ్ముడూ?" యింటాయన ముందే సదానందం అడుగుతుంటే నా కాళ్ళు వణికాయి. "చచ్చి మా యిల్లు మైలపరచొద్దు సార్! దానికోసం మరో కొంప చూసుకోండి" కటువుగా చెప్పాడతను. "సారీ సర్! పరిహాసలాట్టం మావాడికలవాటు లెండి" ఆయనకి సర్దిచెప్పి, సదానందానికి ప్రస్తుత పరిస్థితులు వివరించాను. "చూడు సదానందం! పూర్వం అద్దెకుండేవాళ్ళు నెల కాగానే ఠంచనుగా అద్దె యిచ్చేసేవాళ్ళు. కొంతమంది రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేస్తుండటంతో నెల అద్దె అడ్వాన్స్ ఆనవాయితీ అయింది. ప్రస్తుతం యిల్లు ఖాళీ చేసేవాళ్ళు యిల్లు పాడుచేసి పోతున్నారని రిపేరు ఖర్చులుగా వేలు అడ్వాన్స్ అంటున్నారు. అంతేకదండీ!" "అంతే అంతే!" నా మాటలకు వంత పాడాడతను. ఇంకా అక్కడే ఉంటే సదానందం మాటలకు ఏ పార్టులు పోతాయోనని ఆ ఎపార్టుమెంట్ నుంచి బలవంతంగా యీడ్చుకొచ్చాను. మరో యిల్లు చూద్దామంటే సదానందం వద్దన్నాడు. రెండువారాల తరువాత నాసీటు వద్దకొచ్చి "అదే యిల్లు సెటిల్ చేశాను తమ్ముడూ! సాయంత్రం వెళ్ళి అడ్వాన్సిద్దాం" అన్నాడు సదానందం. " పాతింట్లోనే సర్దుకొన్నావనుకొన్నా! ఆ యిల్లు యింకా ఉందంటావా?" అడిగానతన్ని. "నిన్ననేగా నేనూ, మా ఆవిడా చూసొచ్చాం" అన్నాడు. ఆ సాయంత్రం యిద్దరూ కలిసి వెళ్ళేసరికి యింటాయన గుమ్మంలోనే ఎదురయ్యాడు. "ఏమండీ! నిన్నటివరకూ మీ యింటికి టు-లెట్ బోర్డుండాలి. ఏదీ?" సదానందం సకిలించాడు. "అద్దెకిచ్చేశాం"ధుమధుమలాడుతూ చెప్పాడాయన. "ఇల్లేగాక టు-లెట్ బోర్డులు కూడా అద్దెకిస్తారా? గొప్ప జోక్ కద తమ్ముడూ!" యీసారి యికిలించాడు. "ఇల్లే యిచ్చేశాం. బోర్డ్ యింట్లోనే ఉంది. రోజుకో యాభై యిస్తే మీ మెళ్ళో వేస్తా" ఆయన మాటలకు సర్రున లేచాడు సదానందం. అతన్ని మించిపోయాడా యింటాయన. నాకు సంగతి అర్ధం కాకపోయినా సర్ది చెప్పబోయాను. "ఊరుకోవయ్యా! మీవాడు సరదాగా మాట్లాడుతాడంటే నిజమనుకొన్నా!ఇల్లు ఖాళీగానే ఉంది గానీ యీయనకు అద్దెకివ్వను" ఖండితంగా చెప్పాడాయన. "ఏమైందండీ?" "పదిమందీ చూసిపోవటానికి పెళ్ళికి పిల్లనివ్వటం లేదండీ! ఇల్లు అద్దెకిస్తున్నా!మీవాడు రోజుకొకణ్ణి తెచ్చాడు. చిలకజోస్యం వాట్ట. . .హస్తసాముద్రికుడు, జ్యోతిష్కుడు, వాస్తు తెలిసినవాడు అంటూ యిల్లు చూపించాడు. వాళ్ళు వంటిల్లు దిక్కు మార్చాలి, అక్కడ బాత్రూం తీసేయాలని చెప్పటం, అలా చేయండని యీయన నాకు ఆర్డరేయటం. చూడండీ! నేను నా జాతకానికి తగ్గట్టుగా అన్నీ చూపించే యీ యిల్లు కట్టుకొన్నాను. అద్దెకుండేవాళ్ళ జాతకాలకనుకూలంగా యిళ్ళు కట్టాలంటే, మీరిచ్చే బోడి అద్దెకోసం, పదేపదే యిల్లు పడగొట్టి కట్టించాల్సి ఉంటుంది. మీ జాతకానికి నప్పకపోతే నాయింట్లో దిగొద్దు. అంతేగాని అలా చేయండని ఆర్డరేయటానికి ఈయనెవడు? నేను తను చెప్పినట్లల్లా చేయటానికి ఆయనకి యిల్లు కట్టిచ్చే కాంట్రాక్టర్నీ కాదు, యీ యిల్లు అతని సొంతమూ కాదు. రాత్రివేళ రోజుకొక్కడు నా యింటికొచ్చి పోతుంటే చుట్టుపక్కల నా గురించి, నా కుటుంబం గురించి ఏమనుకొంటారో ఆలోచించండి. ఈయన వాలకం చూస్తూంటే, ముందు విడివిడిగా వాళ్ళకి నాయిల్లు చూపించి, అందరూ మూకుమ్మడిగా ఏ అర్ధరాత్రో కొల్లగొట్టడానికి వస్తారనిపిస్తోంది. ఇల్లు ఖాళీగా ఉన్నా ఫరవాలేదు, యిలాంటోడికి అద్దెకివ్వటం బుద్ధి తక్కువ" అని మా మొహం మీదే ధడేలున తలుపేసేశాడు. నా పరువు చెమటరూపంలో ప్రక్కనున్న మురుక్కాలవలో పడి బంగాళాఖాతం వైపు సాగిపోతుంటే సదానందం చూస్తూ నిలబడ్డాడు.

No comments:

Post a Comment

Pages