శ్రీ ఏడిద నాగేశ్వరరావు - అచ్చంగా తెలుగు

శ్రీ ఏడిద నాగేశ్వరరావు

Share This

శ్రీ ఏడిద నాగేశ్వరరావు

పోడూరి శ్రీనివాసరావు

        
 కళాత్మక చిత్రాలు, విలువలున్న చిత్రాల గురించి, తెలుగు చలన చిత్ర రంగంలో ఆలోచిస్తే 70 – 80  దశకాల్లో ముందుగా గుర్తుకు వచ్చే పేరు ... మాస్ మార్గం నుంచి ప్రేక్షకుల దృష్టి సాహిత్య, సంగీత, కళాప్రధాన చిత్రాల వైపు మళ్లించిన వ్యక్తి....’కళాతపస్వి’ శ్రీ కె (కాశీనాధుని )విశ్వనాథ్.
          అంతకుముందు, కొన్ని మంచి సాంఘిక చిత్రాలకు దర్శకునిగా, అసోసియేట్ గా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించినప్పటికీ, ‘పూర్ణోదయా మూవీక్రియేషన్స్’ ఆవిర్భావంతో... ‘సిరిసిరిమువ్వ ‘ దర్శకత్వంతో 1978 లో ప్రేక్షకుల దృష్టిని కళాత్మక విలువలున్న చిత్రానికి మరల్చారు.
          అదొక్కటే కాదు... ఆ బ్యానర్ లో తీసిన పది చిత్రాలూ... భారతీయ చలనచిత్రరంగంలో... తెలుగు చలనచిత్రరంగంలో ... మణిపూసలై... చెదరని ముద్ర వేసాయి. ఆ బ్యానరు నిర్మాత...కళాచిత్రాల స్రష్ట...శ్రీ ఏడిద నాగేశ్వరరావు – పూర్ణోదయామూవీక్రియేషన్స్ – అధినేత.
          24.04.1934 న తూర్పు గోదావరిజిల్లా ‘కొత్తపేట’ బిడ్డ. వారి తండ్రి శ్రీ ఏడిద సత్తిరాజునాయుడుగారు.
          బాల్యం నుంచీ నటన అంటే చెప్పలేనంత ఇష్టం. చిన్నతనంలో స్త్రీ పాత్రలువేసి మెప్పించారు. కాకినాడ పి.ఆర్.కాలేజ్ లో శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ (ప్రసిద్ద నిర్మాత, నేటిమేటినటుడు జగపతిబాబు తండ్రి). శ్రీ హరనాథ్ రాజ్ (60 వ దశకంలో ప్రసిద్దనటుడు) – శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి సహాద్యాయులు. వారు ముగ్గురూ, ఆ రోజుల్లో, కాకినాడలో కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉండేవారు.
          శ్రీ నాగేశ్వరరావు నటన మీద మక్కువతో – నాటకాల్లో నటుడిగా, సినీనటుడిగా,డబ్బింగ్ కళాకారునిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించారు.
          సినీచిత్ర నిర్మాణరంగంపై దృష్టి సారించి 1978 లో “పూర్ణోదయమూవీ క్రియేషన్స్” ప్రారంభించారు. ప్రారంభచిత్రం –‘సిరిసిరిమువ్వ ‘ హిరోయిన్ మూగది హీరో డప్పు కొట్టుకునేవాడు. పెద్ద తారాగణమేమీ లేదు. అందరూ పెదవి విరిచారు. ఫైట్లు లేవు...భారీ సెట్టింగులు లేవు... ప్రముఖ తారాగణం అంతకన్నా లేరు... కొనడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు.
          కానీ నిర్మాత - శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు వీళ్లనెవరినీ నమ్ముకోలేదు కేవలం... కథను నమ్ముకున్నారు, సంగీతాన్ని నమ్ముకున్నారు, విశ్వనాథ్ ప్రతిభను నమ్ముకున్నారు. ఫలితం... మొదటిసినిమాయే బంపర్ విజయం సాధించింది. మూగపిల్లగా జయప్రద అభినయం, చంద్రమోహన్ అభినయ కౌశలం.. చిత్రాన్ని విజయపథంలో నడిపించాయి. శ్రావ్యమైన సంగీతం, సిరిసిరిమువ్వ పాటలు జనరంజకాలయ్యాయి. అంతేకాదు ‘మాస్కో ఫిలిం ఫెస్టివల్’ లో ప్రదర్శనకు ఎంపికయింది.
          1970 దశకంలో హేమాహేమీలయిన నటులు శ్రీ NTR, కృష్ణ, ANR తదితరులు ‘మాస్ పంథా’ వైపు మళ్ళినపుడు కళాత్మక విలువలతో ‘సిరిసిరిమువ్వ‘చిత్రం నిర్మించడం సాహసమనే చెప్పాలి.
          శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు ‘పూర్ణోదయామూవీక్రియేషన్స్’ పతాకంపై కేవలం పది సినిమాలే నిర్మించారు. 1978 నుంచి 1992 వరకు వారు చిత్రనిర్మాణంలో ఉన్నారు. వారు నిర్మించిన పది సినిమాలూ కూడా సాహిత్య, సంగీత ప్రధానమైనవే...కళాత్మకమైనవే...చిత్రాల జాబితా చూసుకుంటే...
  1. సిరిసిరిమువ్వ(1978)
  2. తాయారమ్మ-బంగారయ్య(1979)
  3. శంకరాభరణం(1979)
  4. సీతాకోకచిలుక(1981)
  5. సాగరసంగమం(1983)
  6. సితార(1984)
  7. స్వాతిముత్యం(1986)
  8. స్వయంకృషి(1987)
  9. స్వరకల్పన(1989)
ఆపద్భాందవుడు (1992)
   పైన తెలిపిన పది సినిమాల్లో కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ ఆరుచిత్రాలకు దర్శకత్వం వహించారు. విలక్షణ దర్శకుడు ‘వంశీ’ రెండు చిత్రాలకు, ప్రసిద్ధ తమిళ దర్శకుడు శ్రీ భారతీరాజా ఒక చిత్రానికి, శ్రీ కొమ్మినేని శేషగిరిరావు ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు.
          శ్రీ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు, సిరిసిరిమువ్వ,శంకరాభరణం,  సాగరసంగమం,  స్వాతిముత్యం,  స్వయంకృషి, ఆపద్బాంధవుడు.
          ఈ చిత్రాలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. సిరిసిరిమువ్వ  గురించి ఇంతకు ముందే, పైన చర్చించుకున్నాము. ఇక ‘శంకరాభరణము’ విషయానికి వస్తే – సుమారు యాభై సంవత్సరాల వయసుగల ఛాందసబ్రాహ్మణుడు ఈ చిత్రంలో కథానాయకుడు. సంగీత విద్వాంసుడు. కథానాయకుని భార్య కథానాయిక కాదు. ఈ వెర్రి చాందసబ్రాహ్మణుడి విద్వత్తు (సంగీతం) మీద మోజు పెంచుకున్న, ఆరాధించుకున్న ఒక వేశ్య – కథానాయిక. కథాపరంగా భారీ సెట్టింగులు కానీ,హీరో హీరోయిన్ల మధ్య లవ్ సాంగ్స్ గానీ, డ్యూయట్లు గానీ, ఫైట్లు గానీ లేని చిత్రం శంకరాభరణం. మొదటి మూడు రోజులు థియేటర్లు ఖాళీ – నిర్మాత నెత్తిన చెంగువేసుకు పోయాడన్నారు. ఆ తర్వాత ఊపందుకుంది – ప్రభం’జనమే’ ప్రభంజనం. ప్రపంచస్థాయిలో విమర్శకుల ప్రశంసలనందుకుంది – ఈ చిత్రం. ఉత్తమ కథాచిత్రంగా, అత్యంత జనాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారమే గాక, 5 రాష్ట్ర నంది బహుమతులను సైతం కైవసం చేసుకుంది. అంతేకాక అనేక ప్రముఖ అంతర్జాతీయ చలన చిత్ర పండుగలలో సైతం ప్రదర్శింపబడింది. హీరో, విలన్లు, ఫైట్లు చుట్టూ తిరిగే మూస సినిమాలనుంచి, ప్రేక్షకుల దృష్టి పూర్తిగా, ఉత్తమకళా చిత్రాలవైపు మరల్చిన చిత్రరాజం – శంకరాభరణం.
          జాతీయ చలన చిత్ర అవార్డుల్లో – నాలుగు విభాగాల్లో బహుమతులు గెలుచుకుంది. రాష్ట్రప్రభుత్వం నంది అవార్డుల్లో – అయిదు విభాగాల్లో బహుమతులు గెలుచుకుంది. 1981 వ సంవత్సరం ఫ్రాన్స్ బెసంకాన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రజల బహుమతి (prize of the public)గెలుచుకుంది. శ్రీమతి వాణి జయరాం, శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం. శ్రీ కె.వి.మహదేవన్ లకు – పాటల విభాగంలో జాతీయ రాష్ట్రీయ బహుమతులనందించిందీ చిత్రం. CNN-IBN వారు ప్రకటించిన,ఎప్పటికీ నిలిచిపోయే భారతీయ 100 అత్యుత్తమ చిత్రాల్లో స్థానం సంపాదించుకుంది. 8 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శింపబడింది. తమిళ, మళయాళ భాషల్లోకి అనువదింపబడి, విశేషప్రజాదరణ పొందింది. హిందీలో జయప్రద, గిరీష్ కర్నాడ్ లతో ‘సుర్ సంగం’ పేరుతో పునర్మించబడినది. 2014 వ సంవత్సరంలో ఈ సినిమా తమిళచిత్రం తిరిగి విడుదల చేయబడింది.
          ఇంతటి ప్రాముఖ్యం సంతరించుకున్న, జాతీయ, అంతర్జాతీయ పురస్కారములందుకున్న ఈ గొప్ప కళాఖండంలో మరో కలికితురాయి – ఈ చిత్రంపై బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వరరావుగారు ఆగష్టు 8 నుంచి 10 వ తేదీ వరకు శ్రీనగర్ కాలనీలో గల సత్యసాయినిగమాగమంలో చేసిన ప్రవచనం. ఆధ్యాత్మిక విషయాలపైనే ప్రసంగించే శ్రీ కోటేశ్వరరావుగారు ఒక చలనచిత్రంపై మూడురోజులు ప్రవచించారంటే అది చెప్పుకోదగ్గ విశేషమే కదా! అంతకన్న గొప్ప కితాబ్, ప్రశంస ఇంకేముంటుంది.
          అలాగే 1983 లో విడుదలైన ‘సాగరసంగమం’ఎటువంటి సంచలనాలు సృష్టించిందో, ఎంతగొప్ప ప్రజాదరణ పొందిందో తెలియంది కాదు.భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్, అందాల జయప్రద జంటగా నటించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ నాట్యకౌశలం చూసి తీరవలసిందే, పాటలెంత గొప్పగా ఉన్నాయో, సంగీత సాహిత్య పరంగా ఎంత ప్రజాదరణ పొందాయో తెలియంది కాదు. విశ్వనాథ్ ప్రతిభకు అద్దంపట్టిందీ చిత్రం. రాష్ట్ర నంది అవార్డు పొందిందీ చిత్రం.
          తరువాత 1986 లో నిర్మించిన ‘స్వాతిముత్యం’ చిత్రం కూడా శ్రీ విశ్వనాథ్ దర్శకత్వంలోనే నిర్మించబడింది. ఇందులో కూడా కమల్ హాసన్, రాధిక జంటగా నటించారు. అమాయకుడిగా కమల్ హాసన్ నటన ఎంత జనాదరణ పొందిందో చెప్పక్కరలేదు. 3 జాతీయ పురస్కారములందుకుంది ఈ చిత్రం. ‘స్వాతిముత్యం’ సినిమా 1986 వ సంవత్సరంలో ‘అకాడమీ అవార్డ్’ కి ఉత్తమ విదేశీచిత్రంగా ఎంపిక చేయబడింది కానీ ‘నామినేట్’ చేయబడలేదు కాని మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది.
1987లో శ్రీ విశ్వనాథ్ దర్శకత్వంలోనే, మెగాస్టార్ చిరంజీవి,విజయశాంతి – హీరో హీరోయిన్లుగా నిర్మించబడిన ‘స్వయంకృషి ‘ కూడా ఒక గొప్ప విలువలున్న చిత్రంగా పేరొందింది. చెప్పులు కుట్టేవాని స్థాయి నుంచి, జోళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీ యజమానిగా ఎదిగిన చిరంజీవి పాత్రచిత్రణ, ఎదిగినా కూడా ఒదిగే ఉండాలన్న నీతి– ఈ చిత్ర విజయానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ చిత్రం కూడా నంది అవార్డుల పంట పండించుకుంది.
అలాగే 1992లో శ్రీ నాగేశ్వరరావు గారు నిర్మించిన చివరి సినిమా ‘ఆపద్బాంధవుడు‘ లో కూడా చిరంజీవే కథానాయకుడు,మీనాక్షిశేషాద్రి హీరోయిన్. దీనికి కూడా శ్రీ విశ్వనాథ్ దర్శకుడు. హాస్యబ్రహ్మగా తెలుగు ప్రేక్షకులకు ఎన్నో హాస్యచిత్రాల దర్శకునిగా పరిచితులైన శ్రీ జంద్యాల ఈ సినిమాలో ఒక ముఖ్యభూమికను ధరించారు. ఈ చిత్రం కూడా నంది అవార్డులు గెలుచుకుంది.
అదేవిధంగా 1979లో శ్రీ నాగేశ్వరరావు నిర్మించిన రెండవ చిత్రం –తాయారమ్మ-బంగారయ్య. శ్రీ కొమ్మినేని శేషగిరిరావుగారు ఈ చిత్ర దర్శకుడు. వయసు దృష్ట్యా, అపరిపక్వదశలో యువజంట చేసే తప్పులు, వారి కుటుంబ కలహాలూ – వారి కాపురాన్ని చక్కదిద్దే దిశలో ఒక వృద్ద దంపతులు చేసిన ప్రయత్నాలు – చక్కటి హాస్యంతో మేళవించి, జనరంజకంగా మలచిన హాస్యప్రధాన చిత్రం – తాయారమ్మా-బంగారయ్య. ఈ చిత్రం రాష్ట్ర నంది అవార్డును కైవసం చేసుకుంది.
ఇకపోతే 1981లో శ్రీ నాగేశ్వరరావుగారు ప్రసిద్ధ తమిళ దర్శకుడు శ్రీ భారతీరాజా దర్శకత్వంలో నిర్మించిన చిత్రం – సీతాకోకచిలుక. తమిళ కథానాయకుడు కార్తీక్, నూతన కథానాయిక ముచ్చెర్ల అరుణ – ఇందులో హీరో హీరోయిన్లు. ఒక క్రిస్టియన్ – ఒక హిందూ – యువతీ యువకుల ప్రేమకథా చిత్రం – ఈ సినిమా. మధురమైన సంగీతం, చక్కటి ఫోటోగ్రఫీ ఈ సినిమాకు పెట్టని ఆభరణాలు. నేటిమేటి హాస్యనటుడు శ్రీ ఆలీ ఈ చిత్రంతో సినీరంగానికి పరిచయమయ్యాడు. ఈ చిత్రం కూడా నంది బహుమతి గెలుచుకుంది.
1984లో తీసిన ‘సితార’, 1989లో నిర్మించిన ‘స్వరకల్పన’ శ్రీ వంశీ దర్శకత్వంలో నిర్మింపబడ్డ – పూర్ణోదయామూవీక్రియేషన్స్ వారి సినిమాలు.
ఇందులో ‘సితార’ సినిమా – శ్రీ వంశీ రచించిన ‘మహల్లో కోయిల’ నవల ఆధారంగా నిర్మించబడ్డ చిత్రం. అందాల అభినేత్రి భానుప్రియ, సుమన్ ఈ చిత్రంలో కథానాయికా నాయకులు. శ్రీ వంశీ ప్రతీఫ్రేమును అందంగా తీర్చిదిద్దుతూ అద్భుతమైన ఫోటోగ్రఫి తో భానుప్రియ అందాలను, ఏమాత్రం అశ్లీనతలేకుండా, ఎంతో అందంగా, చూపించిన చిత్రం – సితార. చక్కటి పాటలు, ఇంపైన సంగీతం, సొంపైన సాహిత్యం వంశీ ముద్ర – సినిమా ఆద్యంతం కనిపిస్తుంది. ఈ సినిమా కూడా రాష్ట్ర నంది అవార్డు లను గెలుచుకుంది.
1989లో నిర్మితమైన ‘స్వరకల్పన’ – పేరుకు తగినట్లుగానే స్వరాలను మేళవించి, చక్కటికథతో తెలుగుప్రేక్షకులకు కనువిందు చేసిందీ చిత్రం. ఈ చిత్రంతో శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు, తన కుమారుడైన ‘ఏడిద శ్రీరాం’ ను కథా నాయకుడిగా తెలుగు సినీరంగానికి పరిచయం చేశారు. ఈ చిత్రం ఆర్ధికంగా అంత విజయం సాధించనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును కైవసం చేసుకుంది.
ఈ విధంగా శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు నిర్మించిన పది సినిమాలూ కూడా అత్యంత జనాదరణ పొందిన చిత్రాలుగా,సాహితీ, సారస్క్రుతిక, సంగీత విలువలున్న చిత్రాలుగా పేరు పొందాయి. పది చిత్రాలు కూడా, రాష్ట్ర నంది బహుమతులుగాని,జాతీయ అవార్డులను గాని కైవసం చేసుకున్నాయి. తెలుగుప్రేక్షకులకు కళాత్మక విలువలను పరిచయం చేసాయి. కథాబలం ఉన్నపుడు, పెద్ద స్టార్లు లేకపోయినా, భారీ సెట్టింగులు లేకపోయినా, ఫైటింగులు లేకపోయినా గోప్పచిత్రాలను తీయవచ్చని తెలియజెప్పాయి. చిన్న తారాగణంతో, మంచికథతో ఉత్తమ సంగీత, సాహిత్యాలతో అవార్డులను సైతం గెలుచుకోవచ్చని, జాతీయస్థాయికి వెళ్లగలిగే సత్తా, తెలుగుచిత్రాలకు సైతం ఉందని చాటి చెప్పాయి.
ఇటువంటి ఉత్తమ చిత్రాల నిర్మాత –ఉత్తమాభిరుచి గల నిర్మాత – తెలుగు సినిమా కీర్తిని జాతీయస్థాయికి తీసికెల్లగలిగిన నిర్మాత – శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు.
వీరు తెలుగు సినీ నిర్మాతల కౌన్సిల్ – కార్యదర్శిగా, రాష్ట్ర నంది అవార్డుల కమిటీ అధ్యక్షునిగా, జాతీయ చలనచిత్ర, అవార్డుల కమిటీ సభ్యునిగా తన సేవలనందించారు.
మూడు జాతీయ అవార్డులను, అనేక నంది అవార్డులను గెలుచుకున్న చిత్రాలను నిర్మించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు చిరస్మరణీయుడు.
వారి ఇంటికి పెట్టుకున్న పేరు – ‘శంకరాభరణం’. వీరు చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా ‘దాదాసాహెబ్ఫాల్కే అవార్డు’కు నామినేట్ చేయబడ్డారు.
తెలుగు చలనచిత్ర కీర్తిబావుటా రెపరెపలాడించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు, కళనే ఊపిరిగా నమ్ముకుని, అన్నీ కళాత్మక చిత్రాలనే నిర్మించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారి అన్ని చిత్రాలకూ రాష్ట్ర ప్రభుత్వ నందులు గానీ, జాతీయస్థాయి అవార్డులు గాని పొందాయి. శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారు తన 81 ఏళ్లవయస్సులో 04.10.2015 వ తేదీన స్వర్గాస్తులైనప్పటికీ, తెలుగు చలనచిత్రరంగంలో ఆయనో ధృవతార.

No comments:

Post a Comment

Pages