సమస్య మనది - సలహా గీతది - 10
చెరుకు రామమోహనరావు
సమస్య : ఆత్మా నశ్వరమని ఎంత సమాధాన పరచుకొన్నా , నాకత్యంత ఆప్తులు పరమపదిస్తే వారి ప్రేమాభిమానాలను మరచి పోలేక పోవుచున్నాను ?
సలహా : వెర్రి వాడా .
చెలగ జలధి నీ జీవిత రంగము
కన నీవేమో కడలి తరంగము
పైకెగసినచో పడక తప్పదు
కడలి తోడనే కలువక తప్పదు
నీదగు పుట్టుక నిమిత్త మాత్రము
నీట కలుపుమా నీదగు ఆత్రము
నీ మెయి నీదగు కర్మల పాత్రము
నిజము నెరుగు మిది నిశ్చల సూత్రము
మనిషికి మూడు శరీరాలునాయి. అవి స్థూల, సూక్ష్మ , కారణ శరీరాలు. స్థూల శరీరము రక్తమాంసాది దాటు నిర్మితము. సూక్ష్మ దేహము సూక్ష్మేంద్రియ అంతఃకరణ సమన్వితము . కారణ శరీరము వాసనా భరితము. ఈ మూడు శరీరాలకు ఆత్మే సాక్షి. దేనితోనూ తాదాత్మ్యము చెందదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నంగా స్వ ప్రకాశ రూప రూపమై కర్తగా కానీ , భోక్తగా కానీ కాకుండా అన్నింటికీ చైతన్యాన్నిచ్చే ఆత్మా యే మహా కారణ శరీరంగా చెప్పబడింది.ఇది గాఢ నిద్రలో అనుభవానికి వచ్చే స్థితి. ఇదే తురీయావస్థ.జ్ఞాన శక్తి,ఇచ్ఛా శక్తి, క్రియా శక్తి స్థూల శరీర ధర్మాలు. స్థూల శరీరం - క్రియాశాక్తికీ , సూక్ష్మశరీరం- ఇచ్ఛాశక్తికీ , కారణశరీరం- జ్ఞానశక్తికీ ఆశ్రయాలుగా చెప్పబడ్డాయి . ఇది ఎంతో శ్రద్ధ తో ఆకళింపు చేసుకోవలసిన విషయము. చాలా సులభమైన ఒక ఉదాహరణ తీసుకొందాము.
ఒక క్రొవ్వొత్తి వుంది. పైకి అది ఒకటిగానే కనబడుతూ వుంది కానీ అందులో మూడు విషయాలు ఇమిడి వున్నాయి.
ఒకటి బయటికి కనిపించే క్రొవ్వు పదార్థము. రెండవది అందులో ఆసాంతము వున్న వత్తి. మూడవది కనిపించని వెలిగే శక్తి. వెలిగే శక్తి వేరొక రూపాన్ని సంతరించు కొంటూ వుంది .స్థూల సూక్ష్మ రూపాలు అంతరించుతున్నాయి.
భగవానుడైన శ్రీ కృష్ణుడు ఇదే విషయాన్ని నా వంటి అజ్ఞానికి అనువైన రీతిలో అర్థము చేయించుతున్నాడు.
వాసాంసి జీర్ణాని యథా నిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తాతా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ 22 -- 2
అంగవస్త్ర మది భంగ మైనచో
వేరుబట్ట కొని వేసుకొందుము
ఆత్మ కైననూ అదే విధముగా
వేరొక దేహము విడిదిగ మెలగును (స్వేచ్చానువాదము 22--2 )
ఆత్మ అవినాశి,అవ్యయము, అజము, అగోచరము, అవిభాజ్యము. ఒక చొక్కా చినిగితే వేరొక చొక్కా వేసుకోన్నంత సులభమయిన పని దానిది. మరి అది బ్రతికే వుండగా బాధ ఎందులకు అని ఎంతో విశదముగా వివరముగా విపులముగా చెబుతున్నాడు పరమాత్ముడు. కాబట్టి చింత వీడి చేయవలసిన పనిని చిత్త శుద్ధితో నిర్ణయించుకొని ఆచరించితే ఆ కర్మే లేక ఆకర్మ ఫలమే నీ విచక్షణకు ఆలంబన.
**********
No comments:
Post a Comment