ఇదో మార్గం!
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఈ వ్యవస్థలో తను బ్రతకలేక పోతున్నాడు అనుకునేవాడు మూర్ఖుడు. తను దర్జాగా బ్రతకడానికే ఈ వ్యవస్థ అనుకునేవాడు తెలివైనవాడు.
***
రాజారావు రాజాలా బ్రతకాలని కామోసు తల్లిదండ్రులు అతని చిన్నప్పుడు ఆ పేరు పెట్టారు. వాళ్లు వ్యవసాయ కూలీలుగా చాలా డక్కామొక్కీలు తిన్నారు. తమ కొడుకన్నా అలాంటి బాధలు పడకుండా హాయిగా బ్రతకాలన్న ముందుచూపుతో అతన్ని చదివించారు. చదువు విషయంలో ఏ లోటూ రాకుండా చాలాసార్లు తమ తలకాయ తాకట్టు పెట్టైనా కావలసిన ఏర్పాట్లు చేశారు. తమకి తమ పరిస్థితులకీ దూరంగా తమ దుర్భర జీవిత ఛాయ ఏ మాత్రం పడకుండా పట్నంలో హాస్టల్లో వుంచి చదివించసాగారు. రాజారావుకు అదంతా తెలుసు. తమ జీవితాలు బాగుపడాలన్న కసితో చదవసాగాడు. ఎక్కడా క్షణం వృధాచేసేవాడు కాదు. చదువు తమకి వెలుగు నిస్తుందని నమ్మేవాడు. చక్కటి చదువుకి మంచి ముగింపు మంచి సంపాదనతో కూడిన ఉద్యోగం అని అందరిలాగానే నమ్మాడు. అహర్నీశలూ ఆ స్పృహతోటే వుండే వాడు. తన తోటి వారు ‘యూనివర్సిటీలో చదువంటే ఎంజాయ్ చేయడానికేనని అలాంటి తరుణం మళ్లీ జీవితంలో రాదని’ ఎన్నో చెప్పేవారు. కాని రాజారావుది దృఢ సంకల్పం. మొక్కవోనిదీ మొండిదీను. మొత్తానికి రాజారావు యూనివర్సిటీ టాపర్ గా గుర్తింపబడ్డాడు. చదువు ముగిసిన నాటినుండే ఉద్యోగ వేటలో పడ్డాడు. అప్పుడు అతనికి వాస్తవ పరిస్థితి అవగతం కాసాగింది. చదువువేరు ఉద్యోగం వేరు. మంచిమార్కులు వచ్చినంత మాత్రాన మంచి ఉద్యోగం, కాదు.. కాదు అసలు ఉద్యోగం దొరకాలన్న నియమం లేదు. భవిష్యత్తు ఎండమావిగా కూడా గోచరించట్లేదు. ఇటు తన బ్రతుకు చౌరస్తాలో శిలా విగ్రహం అయింది. అటు తన తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశలు ఆవిరవబోతున్నాయి. పాపం ఒకటా రెండా ఎన్ని సంవత్సరాలనుంచి తల్లిదండ్రులు తనమీద ఆశల పెట్టుబడి పెట్టారు? తన బ్రతుకు చక్కగుండాలని, కనీసం వృద్ధాప్యంలోనైనా తన నీడలో వాళ్లు కాసింత సుఖపడాలని! ఏం చేయాలి? ఏం చేయాలి? మెదడుని దొలిచేసే ప్రశ్న. ఆశ అడుగంటిపోయి కొన్ని రోజులు నిరాశా నిస్పృహల్లో కాలం గడిపేశాడు. ఒకరోజు టీ తాగుదామని హోటల్ కెళ్లాడు. అక్కడున్న పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. అందులో వున్న ఒక వార్త అతన్ని ఆకర్షించింది. ఒంట్లో ఉత్తేజం, కళ్లలో తేజం చోటుచేసుకున్నాయి.
ఎక్కే వాళ్లుంటే ఈ జనం ఎప్పుడూ తమ భుజాలపై ఎక్కించుకోవడానికి సిద్ధంగా వుంటారు. దానికి ఉదాహరణగా రాజకీయనాయకులు, సినిమాస్టార్లు, స్వామీజీలని చెప్పుకోవచ్చు. తెలివిగా దోచుకునేవాడుంటే తమ కష్టార్జీతాన్ని పళ్లెంలో పెట్టి, హారతి పట్టి మరీ ఇస్తారు. దీనికి నకిలీ చిట్ ఫండ్, ఫైనాన్స్ సంస్థలే ఉదాహరణలు. ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది? నెల నెల టెన్షన్ తప్ప. ఏ నెల కా నెల వచ్చే సంపాదనతో గానుగెద్దు జీవితం. ఓ సినిమా కెళ్లి, షికారు కెళ్లి సుఖపడుతున్నా మనుకుంటారు కాని గడిపేది రెక్కాడితే గాని డొక్కాడని దిక్కుమాలిన జీవితం. తనలాంటి వాళ్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు బొత్తిగా గగన కుసుమాలు. ప్రైవేటు ఉద్యోగాల్లో నిత్యనరకం. ఎప్పుడు బెంచిమీద కూర్చో బెడతారో, అసలు ఉద్యోగంలోంచే పీకేస్తారో అని. ఇహ తనెలా బ్రతకాలి? తనవాళ్లని ఎలా చూసుకోవాలి? అందుకే..అందుకే రాజారావు కొత్త ఆలోచన చేశాడు. ఒక మూడేళ్లపాటు జీవిక కోసం దొరికిన ఉద్యోగాలు చేశాడు. అతని టార్గెట్ మాత్రం వేరేగా వుంది. దానికతనెప్పుడో ఫిక్స్ అయ్యాడు.
***
ఒకరోజు పత్రికా విలేఖరులు..ఛానెల్ టీవీ వాల్లందర్నీ పిలిచి ‘ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని’ గెట్ టు గెదర్ ఏర్పాటు చేశాడు.
పేపర్ వాళ్లకి కావలసింది భారీ సర్క్యులేషన్..టీవీ వాళ్లకి కావలసింది సెన్సేషన్..బిల బిల మంటూ వాలిపోయారు.
"నిన్నటిదాకా నేనూ మీలాంటి సామాన్యుడనే! కాని వారం క్రితం నాకు గత జన్మల తాలుకు స్పృహ కలిగింది. అది కలా? లేక నిజమా? అని నన్ను నేను ఈ వారం రోజులు పరిశీలించుకుని..పరీక్షించుకుని..మీ ముందుకొచ్చాను. నా గత జన్మలలో నేను హుందాగా జీవితం గడిపాను. రాజులకీ..నవాబులకీ చాలా దగ్గరగా వుండేవాడిని. కానీ ఈ రూపంతో..ఆహార్యంతో మాత్రం కాదండోయ్! మీరు ఏ రాజు గురించి అడిగినా వారి ఏ అలవాట్ల గురించి అడిగినా నేను సమాధానం చెబుతాను. నేను ఒక విధంగా భూత వర్తమాన కాలాలకి సంధానకర్తలాంటివాడిని. మహారాజులు తాము ఆపత్ సమయాల్లో వున్నప్పుడు తమ నిధులు భూమిలో నిక్షిప్తం చేశేవారు. అదృష్టవశాత్తు నేను వారికి ఆంతరింగికుడిని కాబట్టి నాకూ ఆ రహస్యాలు తెలిసేవుంటాయి. కానీ వాటిని స్ఫురణకు తెచ్చుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. ఇహ మీరు ప్రశ్నలు ఏవైనా వుంటే అడగవచ్చు."అంటూ ముగించాడు.
కొంతమంది విక్రమాదిత్యుడు..అక్బరు..లాంటి మహరాజుల గురించి పశ్నలు సంధించారు. రాజారావు తడుముకోకుండా సమాధానాలు చెప్పాడు.
"దీంట్లో గొప్పదనం ఏముంది? హిస్టరి పట్ల ఇంట్రస్టు వున్న ఏ ఒక్కరైనా ఈ సమాధానాలు చెబుతాడు. ఏవన్నా ముఖ్యమైనవీ, బయట ప్రపంచానికి తెలియనివీ చెప్పండి."అన్నాడు జర్నలిస్ట్ లలో తెలివైనవాడు.
’అయితే వినండి శ్రీకృష్ణదేవరాయలు గురించి లోకానికి తెలియనిది ఓ క్రొత్త విషయం చెబుతాను" అని అందరి ఒళ్లు గగుర్పొడిచేలాంటి విషయం సోదాహరణంగా చెప్పాడు.
అందరూ చప్పట్లు కొట్టి తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
"మీకో ముఖ్య విషయం.. మిమ్మల్ని నన్ను నమ్మమని చెప్పట్లేదు..నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగిందని మాత్రమే చెబుతున్నాను. అప్పటి విషయాలని నేను గుర్తుకు తెచ్చుకోవాలంటే నేను ప్రసవవేదన అనుభవించాల్సొస్తోంది. ఆ నొప్పి మీకు తెలియదు. నాకు మహరాజులు దాచిన నిగూఢ రహస్యాలు..నిధుల రహస్యాలు తెలిసే అవకాశం వుంది కానీ గ్యారంటీ ఇవ్వలేను. అది నా మెమరీ పవర్ మీద ఆధారపడివుంటుంది. ముఖ్యంగా మీరు నేనూ మనిషినేనన్న విషయం మరిచిపోకూడదు. కాకపోతే భగవదనుగ్రహం వల్ల పూర్వ జన్మల జ్ఞానం కలిగింది. అంతే! నాకు ప్రభుత్వం కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే నేను ఆ దిశగా అడుగులేస్తాను. నిన్న నా కలలో గొల్కొండ నవాబుల కాలంలో గోల్కొండ దగ్గర ఆరడుగుల గోతిలో ఒక వస్తువు దాచినట్టుగా జ్ఞప్తికి వచ్చింది." నా మెమరీ పవర్ తెలుసుకోవాలని నాకూ వుంది. అందుచేత రేపు నేను చెప్పిన చోట తవ్వితే నిజం నిగ్గుదేలచ్చు."అని ముగించాడు.
ఈ విషయం అంతటా దావానలంలా వ్యాపించింది.
మరుసటిరోజు గోల్కొండకి దగ్గరగా అతను చెప్పిన చోటున ఒక్ పాన్ షాప్ వుంది. ఆ పాన్ షాప్‍ని పక్కకి జరిపించి ప్రభుత్వ పురావస్తు శాఖ తవ్వకం మొదలెట్టింది.
ఆశ్చర్యం! సరిగ్గా ఆరడుగులు తవ్వగానే గోల్కొండనవాబుల కాలంనాటి అరుదైన వస్తువు బయట పడింది.
అందరూ రాజారావుకి బ్రహ్మరథం పట్టారు. ఉన్నట్టుండి అతను సెలబ్రిటీ అయిపోయాడు. ప్రభుత్వం వెంటనే అతనికి ఉండడానికి మంచి ఇల్లు..సెక్యూరిటీ ఏర్పాటు చేసింది.
రాజారావు అతని తల్లిదండ్రులని తన ఇంటికి తెప్పించేసుకున్నాడు.
వాళ్లకదంతా ఆశ్చర్యంగా..ఆనందంగా వుంది. వాళ్లు తమ కొడుకు గొప్పవాడవుతాడనుకున్నారు కాని మరీ అంత గొప్పవాడవుతాడనుకోలేదు.
రెండురోజుల తర్వాత ‘విజయనగర రాజులు అప్పుడు తన సలహా నచ్చి ఒక వెండి పాత్ర ఇచ్చారన్న విషయం గుర్తుకొచ్చిందని..దయచేసి విజయనగరంలోతను చెప్పిన చోట తవ్వితే ఆ విషయం బయటపడే అవకాశం వుందని’ పత్రికా విలేఖరుల సమావేశంలో చెప్పాడు.
మరుసటిరోజు హుటాహుటిన విజయనగంలో అతను చెప్పిన చోట తవ్వి ఆశ్చర్యపోయారు. అతను చెప్పినట్టు ఆ పాత్ర అక్కడ వుంది.
రాజారావు గొప్ప పాపులర్ అయిపోయాడు. హిస్టరీ ప్రొఫేసర్లు..లెక్చరర్లు..స్టూడెంట్లు అతన్ని కలిసి తమ తమ సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు.
ఒకసారి కోల్కతా అంటాడు..మరోసారి బొంబాయి రోడ్డు నడిమధ్యన అంటాడు. ఇంకోసారి మైసూర్ అంటాడు. తవ్విన చోటల్లా ఏదో వస్తువు బయట పడుతూనే వుంది.
అతను ఎప్పటికైనా ఏ నిధి విషయమైనా చెప్పకపోతాడా? అని ప్రభుత్వం..ప్రజలు ఆశగా చూస్తున్నారు.
***
కొన్నేళ్లక్రితం వివిధ ప్రాంతాల్లో వున్న పురాతన వస్తువులమ్మే షాపుల్లో ఆ వస్తువులు కొని, మరికొన్ని కొంతమంది నుంచి సేకరించి వాటిని కొన్ని కొన్ని ప్రాంతల్లో రాజారావు పాతాడని ఎవరికీ తెలిసే అవకాశం లేదు. హిస్టరీని ఆపోశన పట్టి అందులో నిష్ణాతుడయ్యాడని అస్సలు తెలిసే అవకాశమే లేదు. తెలివైనవాడు ఎదగడం పెద్ద కష్టమేం కాదు..కాకపోతే గోల్ సెట్ చేసుకుని అటుగా ముందడుగేయాలంతే.
ఆశ అందర్నీ నడిపిస్తుంది..ప్రభుత్వాన్ని కూడా!
అలా రాజారావు జీవితం నల్లేరు మీద బండినడకలా సాగిపోతోంది.
ఎంత కాదనుకున్నాఈ లోకం తెలివి..బలం..వున్నవాళ్లకే దాసోహం! మోసపోయిన వాడు ఒక ఏడుపు ఏడిచి మళ్లీ మోసపోవడానికి సిద్ధపడతాడు. తెలివైనవాడు అంచెలంచెలుగా అప్రతిహతంగా ఎదిగిపోతాడు. ఇది చర్వితచరణం.
***
No comments:
Post a Comment