ఇలా ఎందరున్నారు ?- 13 - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు ?- 13

Share This

ఇలా ఎందరున్నారు ?- 13   

అంగులూరి అంజనీదేవి




(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. అనంత్ తో సంకేత  ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని.  సంకేతను చూసేందుకు ఆమె ఇంటికి వస్తుంది అనంత్ తల్లి శరద్రుతి. ఇక చదవండి... )
పల్లవి భయంతో, కంగారుగా దాన్ని పట్టుకొని ఆపుతూ “కొట్టావంటే నా తల పగిలిపోతుంది. ఇప్పటికే కాలుపోయి కుంటుతున్నాను. తల పగిలిందంటే నేను ఎందుకూ పనికిరాకుండా పోతాను. నీ కెందుకు తల్లీ ఆపాపం! ఏదీ! ఇలా ఇవ్వు! దాన్నిక్కడ భద్రంగా దాచుకుంటా! నేను వెళ్ళేంతవరకు...” అంటూ లాప్ టాప్ ని లాక్కుని ఒల్లో పెట్టుకుంది. ఆ తర్వాత దాన్నే చూస్తూ...
“అనంత్ మంచి గిఫ్టే ఇచ్చాడు నీకు కానీ కోపం వచ్చినప్పుడు దీన్ని ఎవరిమీడకి ప్రయోగించకూడదు అని ఓ చిన్న స్లిప్ రాసి దీనిమీద అతికించి వుంటే బావుండేది...” అంది పల్లవి.
“మీకు పిల్లలెందరు?” ప్రశ్నలపరంపర మొదలైంది.
“ఇద్దరబ్బాయిలు. అనంత్ పెద్దబ్బాయి. నిశ్చల్ చిన్నబ్బాయి...” అంది శరదృతి.
కాంచనమాలకి నిరాశగా అన్పించినా దాన్ని పైకి కన్పించనీయకుండా మామూలగా ఓ నవ్వు నవ్వి “నాకు ఒక్కడే అబ్బాయి. శ్రీహర్ష. ఆశలన్నీ వాడిమీదనే పెట్టుకుని బి.టెక్. చదివిస్తున్నాను. మొన్ననే క్యాంపస్ ప్లేస్ మెంట్ లో జాబ్ వచ్చింది” అంటూ శ్రీహర్షకు ఏ కంపెనీలో జాబ్ వచ్చిందో చెప్పింది ప్రస్తుంతం ఏ కాలేజీలో చదువుతున్నాడో కూడా చెప్పింది.
...ముందు ఆ కంపెనీ పేరు వినగానే ఉలిక్కిపడింది శరదృతి. ఆ తర్వాత అబ్బురపడి అలాగే చూసింది... ఎవరైనా ఆ కంపెనీలో సెలెక్ట్ కావాలంటే మాటలు కాదు. మంచి పర్సంటేజ్ తో పాటు, పర్సనల్ స్కిల్స్ కూడా దండిగా వుండాలి. అంతమంచి కంపెనీ అది. అనంత్ కి అలాంటి మంచి కంపెనీలో రాలేదు.
అందుకు ఆమె ఆరోజు బాగా బాధపడుతూ ఉద్యోగం విషయంలో కూడా తన కోరిక కోరికగానే మిగిలిపోయిందని నిస్పృహగా వుంటే ‘ఏదో వచ్చింది, సంతోషించు. అది కూడా రాని వాళ్లు ఎంతమంది లేరు. వాడికి ఆ మాత్రం కూడా వస్తుందని నేను అనుకోలేదు. ప్రతిదానికి ఏడుపు ముఖమేనా? చూడలేక నేను చావాలి’ అంటూ తన భర్త చిరాకు పడగానే మామూలైపోయింది. అయినా లోపల మాత్రం అసంతృప్తి దహించివేస్తుంది. మామూలుగా కాదు. కానీ ఏం చెయ్యగలదు తను?
తనే కాదు ఏ తల్లి అయిన ఏం చెయ్యగలదు? పిల్లల్ని కన్నంత సులభంగా చదువుల్ని కనగలదా? ఉద్యోగాలను కనగలదా?
చదువంటే అనంత్ కి కూడా చాలా ఇష్టం. చదువు గురించి అప్పుడప్పుడు చాలా గొప్పగా చెబుతుంటాడు. చదువు వల్ల చాలా సాధించవచ్చు అని కూడా అంటుంటాడు. అయినా పుస్తకం పట్టుకొని చదవాలంటే బుర్ర గోడకేసి కొట్టుకున్నట్లు బాధ పడతాడు. అటు, ఇటు తిరుగుతాడు. బోర్ అంటాడు. ‘ఇదెందుకో నాకు అర్ధం కావటం లేదు మమ్మీ!’ అని అటుంటాడు. మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఏడుస్తాడు.
ఎక్కడైనా పిల్లలకి మార్కులు రాకుంటే తల్లిదండ్రులు ఏడవాలి. పక్కింటి పిల్లలతో పోల్చుకుని ‘నా కడుపునా ఎలా పుట్టావురా!’ అని వాపోవాలి... కానీ అదేంటో తాము బాధపడబోతుండగా అది ముందే గ్రహించినట్లు అనంతే ఏడ్చేవాడు. వాడి ఏడుపు చూడలేక తన భర్త వెళ్లి టీచర్లకి డబ్బులిచ్చి మార్కులు వేయించేవాడు. స్కూల్ కి సరిగ్గా వెళ్ళాక అటెండెన్స్ తగ్గినా ఎవరికీ తెలియకుండా ఆ స్కూల్ టీచర్లకి పార్టీలు ఇచ్చి అటెండెన్స్ వేయించేవాడు...’ఇది మంచి పద్దతా?’ అని అడిగితే గర్వంగా నవ్వి.... డబ్బుతో కొనలేనిది ఏముంది చెప్పు?” అని సమర్ధించుకునేవాడు.
“ఎంతయినా డబ్బులిచ్చి వాడిని మీరు బాగా చెడగొడుతున్నారు. పాస్ కావటంలో వున్న ఆనందాన్ని, ప్రతిరోజు స్కూల్ కెళ్ళడంలో వున్న తృప్తిని వాడికి మీరు దూరం చేస్తున్నారు. చదువు అనేది అటెండెన్స్ రికార్డు లో, పాస్ సర్టిఫికెట్ లలో మాత్రమే ఉంటుందని మీరనుకుంటున్నారు. వాడు అనుకునేలా చేస్తున్నారు...”
“అయితే నన్నేం చెయ్యమంటావ్? నేను చేసింది తప్పంటావా?”
“నేను మీరు చేస్తున్నది తప్పు అనటం లేదు. వాడిని కూడా తప్పు పట్టడం లేదు. అలా చేయాల్సిన అవసరం రాకుండా చూసుకోమంటున్నాను. ఒకసారి ఫెయిలయినా పరవాలేదని మీరేం పట్టించుకోకుండా వదిలెయ్యండి! తర్వాత ఎలాగైనా పాస్ కావటానికి ప్రయత్నిస్తాడు. కష్టపడి చదువుతాడు...”
“ఈ లోపల వాడు ఫేయిలయ్యాడని తెలిస్తే నా స్నేహితుల ముందు నా పరువు పోతుంది. చిన్న కొడుకు చదివినట్లు పెద్ద కొడుకు చదవటం లేదని ఏది దొరిక్తే అది తీసుకొచ్చి నా నోట్లో పెడతారు. అసలే నా ఫ్రెండ్స్ దేశముదుర్లు! నాకెందుకో వాడు చదవటం లేదని నలుగురికి తెలిసేకన్నా ఇలా ఎప్పటికప్పుడు డబ్బులిచ్చి పాస్ చేయించడమే సులభంగా వుంది”.
“మీరు ఇలాంటి అభిప్రాయంలో వున్నన్ని రోజులు అనంత్ కి చదువు విలువ తెలిసి రాదు. చదవడు. నాకేం మానాన్న డబ్బులిచ్చి మార్కులేపిస్తాడన్నా భరోసాతోనే వుంటాడు. రేపు వాడ పెద్ద క్లాసులకి వచ్చినా ఇలాగే చేస్తాడు... ఎప్పుడైనా చదువు కామధేనువు లాంటిదని, ఎక్కడికెళ్ళినా అమ్మలాగా కాపాడుతుందని వాడికెలా తెలుస్తుంది? తండ్రిగా ఏది చెప్పినా వాడికి మీరే చెప్పాలి... అదేం అంటే! చిన్నవాడు నిశ్చల్ బాగా చదువుతున్నాడు కదా! అంటారు. వాడు బాగా చదివినంత మాత్రాన వీడికి వస్తుందా?
అన్నదమ్ములు దేన్నైనా పంచుకోగలరు గాని చదువును పంచుకోగలరా? సంస్కారాన్ని పంచుకోగలరా? జ్ఞానాన్ని పంచుకోగలరా? అసలు చదువులేకపోతే మనిషికి పాపపుణ్యాలు తెలుస్తాయా? ఇహపరాలను సాధించగలుగుతారా? అందుకేనండి చదువును ఎవరైనా దొంగిలించలేనిది అంటారు. దాన్ని మీరు వాడికి దూరం చెయ్యకండి!” అని తను అనగానే కోపంతో తన భర్త ఎగిరేవాడు.
“అసలే నా బిజినెస్ వ్యవహారాల్లో మునిగి, తినటానికి కూడా టైం లేకుండా ఉన్నాను. ఇలాంటి చిల్లర విషయాలు చెప్పి నాకు తలనొప్పి తెప్పించకు... వాడికేమైంది ఇప్పుడు చదువుతున్నాడు కదా! ఏ పనీ లేకనే నువ్విలా తీవ్రంగా ఆలోచింది బుర్ర పాడు చేసుకుంటున్నావ్! నీకో విషయం చెప్పనా! అసలు వాడు చదవకపోయినా ఏమీ కాదు. నేను సంపాయించింది తింటూ గడిపితే చాలు. వాడు, వాడి పిల్లలు... నువ్వు కూడా! అర్ధమైందా” అనేవాడు. అప్పటి నుండి తను ఏమి అనేంది కాదు. తను మౌనంగా వుండటం చూసి...
“చూడు దృతి! నా వ్యాపారాల వత్తిడిలో పడి నేను ఎలాగూ అనుభవించలేదు. డబ్బు సంపాయించడం ఒక్కటే టార్గెట్ పెట్టుకొని బ్రతుకుతున్నాను. కనీసం వాడినైనా అనుభవించనీ! చదువు, చదువు అని వాడి వెంటబడి వాడికి మరో ప్రపంచం తెలియనియ్యకుండా చెయ్యకు... ఎవరో ఒకరు అనుభవించకపోతే ఈ డబ్బంతా ఏం చేసుకుంటాం! అందుకే వాడు అడిగింది ఎప్పుడూ కాదనకుండా, వాడికి ఏం కావాలన్న అందుబాటులోకి రావాలనే వాడు అడిగినంత డబ్బుని అందిస్తున్నాను. తప్పంటావా?” అనేవాడు ఎటూ చెప్పలేక అలాగే చూసేది తను ...
...ఎన్ని చెప్పినా ప్రపంచాన్ని మార్చగలిగే బలమైన ఆయుధం చదువే అన్నది ఆయన గ్రహించే స్థితిలో లేడన్నది మాత్రం అర్ధమైంది.
‘అలాంటి తండ్రులు ఉండబట్టే పిల్లలు ఉన్నది ఖర్చు పెట్టుకుంటూ సోమరిపోతులౌతున్నారు. ఉన్నతమైన స్థితిలోకి పోలేకపోతున్నారు. దీనివల్ల దేశానికి పనికొచ్చే పిల్లలు కరువైపోతున్నారు. ఇలా అవసరానికి మించిన డబ్బు ఎప్పటికైనా ప్రమాదకారే’... అని ఎలుగెత్తి అరవాలనిపించేది. అదీ చేయలేక...
అప్పటికీ అలాగే మౌనంగా వుంది అనంత్ విషయంలో... కానీ మొన్న తన అక్కయ్య చెప్పింది అనంత్ ఒక అమ్మాయిని తన గదికి రప్పించుకుంటున్నాడని... అది వినగానే ముందు షాకై ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించి. కనీసం ఈ అమ్మాయి విషయంలోనైనా తను కాస్త లోతుగా అలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని వచ్చింది.
“ఏంటి! ఆలోచిస్తున్నారు?” అంది కాంచనమాల శరదృతినే చూస్తూ.
శరదృతిఆలోచన నుంచి బయటపడి “ఏం లేదండీ! సంకేత మీ బంధువా? బందువైతే మీ శ్రీహర్షకి సరిపోతుందేమో కదా! అమ్మాయి కూడా చూడటానికి బాగుంది” అని అడిగింది. అలా అడక్కపోతే తనలో కలిగిన సందేహాలు అలాగే ఉంది పోతాయి. సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుకోవడం శరదృతికి అలవాటు.
“అలాంటి ఆలోచన మాఇంట్లో ఎవరికీ లేదు. ముఖ్యంగా శ్రీహర్షకి లేదు. వుంటే తెలిసిపోతుంది కదా! సంకేత బాగా చదువుతుందని మాత్రం అనుకుంటాం. చదువే లోకంగా వుంటుంది. మరీ ఈ సంవత్సరం అయితే కాలేజి అని, కోచింగ్ అని, అసలు ఇంట్లోనే వుండటం లేదు. బాగా కష్టపడే తత్త్వం తనది. మా బంధువు కాదు, మా వారి స్నేహితుడు నరసింహం కూతురు. తల్లి శశమ్మ. ఇద్దరు పొలం పనులు చేసుకుంటూ పల్లెటూరులో ఉంటారు. సంకేత యోగ క్షేమాలు మా మీదనే పెట్టారు. అంతా మేమే తనకి..” అంది.
సంకేత గురించి కావలసిన దానికన్నా ఎక్కువ సమాచారం వచ్చినట్లు తలపంకించి “ఇక వెళ్ళొస్తానండీ!” అంది శరదృతి.
“అప్పుడేనా! ఇంకా కొద్దిసేపు కూర్చోవచ్చు కదా! చాలా త్వరగా వెళ్తున్నట్లనిపిస్తుంది. ఎంతో కాలంగా కలసివుండి విడిపోతున్నట్లనిపిస్తుంది” అంది ఆత్మీయంగా..
శరదృతి నవ్వి “వస్తుంటాను అప్పుడప్పడు. ఇప్పుడేగా కలిసింది. అయినా ఎప్పుడు కలుస్తామో ఎప్పుడు విడిపోతామో మన చేతిలో లేదుగా!” అంటూ హాల్లోకి వెళ్ళి సంకేతతో చెప్పి, నీలిమను కూడా పలకరించి, పల్లవిని తీసుకొని కారువైపు నడిచింది. గేటు దాటకముందే పల్లవి వద్దంటున్నా నచ్చచెప్పి వరమ్మను కలిసింది. తానెవరో వరమ్మకి చెప్పి పరిచయం చేసుకుంది. వరమ్మను చూస్తుంటే గౌరవభావం కలిగింది శరదృతికి...
*****
          పల్లవికి విషయం తెలిసి నివ్వెరపోయింది. ఇలా జరిగిందేమిటి? ఇది సంకేతకి తెలిస్తే తట్టుకోగలదా? మాట్లాడడం ఇష్టం లేనప్పుడు ‘హలో హలో... మీ గొంతు విన్పించడం లేదు’ అంటూ కాల్ కట్ చేసినంత సులభంగా సంకేతను వదిలించుకున్నాడేమిటి అనంత్?’ ఇది నిజమా? లేక తానేమైనా తప్పుగా విన్నాదా!
          ... పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటోలో కూర్చుని కోచింగ్ సెంటర్ దగ్గరవున్న సంకేతను కలిసింది.
          “సంకేత!అనంత్ ఎక్కడ?” అంటూ చాలా మామూలుగానే అడగటానికి ప్రయత్నించింది విషయం వెంటనే చెప్పేకన్నా కొద్దికొద్దిగా చెబుదామన్న ఉద్దేశ్యంతో.
          “అనంత్ వారం రోజుల నుండి నాకు అందుబాటులో లేడు. ఎప్పుడు కాల్ చేసినా బిజీగా వున్నానంటున్నాడు. ఏం! ఎందుకు అనంత్ గురించి అడుగుతున్నావ్?”
          “ఏమి లేదు. ఒక్క నిమిషం అలా బయటకెల్దాం! వస్తావా?’
          “ఇప్పుడా! అంత టైము లేదు కదే!”
          “ ఆమాట కొస్తే నేను కూడా నెట్ కెళ్ళి మినీ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి... ఒక ముఖ్యమైన విషయం చెబుతాను... అది విని నువ్వు ఎమోషనల్ గా ఫీలవొద్దు మరి... అలా అని నాకు మాట ఇవ్వు...” అంది చేయి చూపిస్తూ.
          ఇంత చిన్న వయసులో అంత బరువు డైలాగు అవసరమా! నాకు తెలియకుండా నేను ఫీలయ్యే విషయాలేమి లేవు”  అంటూ నెత్తిమీద ఒకటి మొట్టింది సంకేత సరదాగా.
          “అంటే నీకు ముందే తెలుసా?” ఆశ్చర్యపోయింది పల్లవి.
          “ఎందుకంతగా ఆశ్చర్యపోతావ్! నాకెందుకు తెలియదు...! నాకు అటెండెన్స్ తగ్గి డిటేయిండ్ అయ్యానని నాకు తెలియదా? థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో రెండు సబ్జెక్టులు, సెకండ్ సెమ్ లో మూడు సబ్జెక్టులు పోయాయని తెలియదా? నేను డిటెయిండ్ కావటం వల్ల మళ్లీ థర్డ్ ఇయర్లోనే కూర్చోవలసి వుంటుంది. అందరు బి.టెక్. నాలుగు సంవత్సరాలు చదివితే నేను ఐదు సంవత్సరాలు చదవవలసి ఉంటుందని తెలియదా?
          ఇదంతా నాకు ముందే తెలుసు. నా విషయంలో నాకు తెలియకుండా ఏదీ జరగదు. అయిన ఏదో తృప్తి నన్ను బ్రతికిస్తుంది. అనంత్ నావాడు అన్న ఒకే ఒక్క ఆనందం ఒకప్పటి నా లక్ష్యాన్ని డామినేట్ చేస్తుంది... నీకు ఆశ్చర్యం కలగొచ్చు. అంతగా తిరిగే శివానికి మంచి మార్క్స్ వచ్చాయి. అటెండెన్స్ కూడా వుంది అని... శివాని ఏదీసరిగా చెయ్యదు. మధ్యలో వదిలేసి మళ్లీ మొదలెడుతుంది.నేను అలా కాదు. ఏదైనా ఒకపని తలబెడితే పూర్తయ్యేదాకా వదలను. నా పట్టుదల నీకు తెలియదు. అనంత్ ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అతన్ని ఆనందంగా ఉంచాలనుకున్నాను. అలాగే ఉన్నాను. సెకండ్ థింక్ ఉండదు నా దగ్గర.... ఇక టైం గురించి ఆలోచించదలుచుకోలేదు. నువ్వు, శ్రావ్య, హిందూ, శివాని ఇంకా ప్రెండ్స్ అంతా ఫోర్త్ ఇయర్లో కి వెళ్ళినా, ‘ అయ్యో! నేను వెళ్ళలేకపోయానే అనే బాధ కూడా నాకు లేదు.... ఎందుకంటే నేను అనంత్ భార్యని కాబోతున్నాను. ఇంకేం తక్కువ చెప్పు?” అంది సంకేత.
          “...అనంత్ నిన్ను పెళ్ళి చేసుకోవటం లేదట...” నెమ్మదిగా అంది పల్లవి.
షాక్! షాక్! షాక్ ! గుండె పగిలిపోయే షాక్!
బయట సంబంధాలు ఏవో చూస్తున్నట్లు తెలిసింది. అది నీకు చెప్పటానికి ఇప్పుడొచ్చాను...” ఇంకా నెమ్మదిగా అంది పల్లవి.
సంకేతకి అది తేరుకోలేని షాక్!
అయినా తేరుకుంది... “నేను నమ్మలేకపోతున్నాను పల్లవీ! ఇప్పుడే అనంత్ ని కలసి విషయం తెలుసుకుంటాను...” అంటూ కోచింగ్ సెంటర్ నుండి బయటకొచ్చి గబగబా ఆటో ఎక్కింది సంకేత... పల్లవి నెట్ షాప్ కి వెళ్లింది.
... సంకేత ఆటోలో అరగంట ప్రయాణం చేసి అనంత్ వుండే అపార్టుమెంటులో ఐదవ అంతస్తులో వున్న అనంత్ గదికి వెళ్ళాలంటే లిఫ్ట్ పనిచెయ్యలేదు... మెట్ల మీద పరిగెత్తుకుంటూ ఒకేసారి రెండు రెండు మెట్లెక్కుతూ వెళ్లింది.
అక్కడ అనంత్ లేడు. ఆ గదిని రియల్ ఎస్టేట్ వాళ్ళకి నిన్ననే రెంట్ కి ఇచ్చినట్లు అక్కడున్న పనిపిల్లాడు చెప్పాడు.
అది వినగానే ఇంకా షాక్ అయింది సంకేత...
తనకి చెప్పకుండా అనంత్ ఎక్కడికి వెళ్ళాడు?
వారం రోజులనుండి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అంటున్నాడు. ఏం మాట్లాడినా డ్రై, డ్రైగా మాట్లాడుతునాడు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడి ‘ఒకే ఉండనా!సంకేత!’ అంటున్నాడు. తనకేమో అతనితో ఇంకా ఇంకా మాట్లాడాలని, ఎటైనా వెళ్లాలని, కలిసి కూర్చుని గడపాలని... అలా వున్నపుడు కలిగే అద్భుతమైన ఫీలింగ్ ను గుప్పెట్లో బంధించినట్లు గుండెలో నిక్షిప్తం చేసుకోవాలని వుంటోంది.
మరి తనకి అనిపించినట్లు అతనికి అనిపించడంలేదా?
ఎందుకు అనిపించదు? అలా అనిపించే కదా! వీలైనప్పుడు కాలేజీకి దూరమై, పుస్తకాలకి దూరమై ఇంకా చాలావాటికి దూరమై నిద్రపోదామన్నా నిద్రరాక, తిందామన్నా తినలేక,మనసుపెట్టే బాధని, దాహాన్ని తీర్చుకోవడం కోసం పరిసరాలను మరిచి తిరిగాడు.ఇప్పుడేమో తనకి తెలియకుండానే గదిని ఖాళీ చేశాడు. అలా చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది?
అందులో ఆ గది తామిద్దరు కలసి తిరిగిన గది... ‘ ఆ గదిలో అనంత్ తోపాటు తనకి కూడా గొప్ప సాన్నిహిత్యం వుంది... అది గుర్తొస్తున్నా కొద్ది గుండెను ఇనపపిడికిలితో పిసికినట్లవుతోంది.
అక్కడో క్షణం కూడా నిలబడాలనిపించలేదు.
ఒకప్పుడు అదే మెట్లమీద ఎవరూ చూడకుండా అనంత్ తో పోటీపడి ఎక్కేది,దిగేది. అదెంతో సరదాగా వుండేది ఇద్దరికీ... ఎప్పుడో తప్ప లిఫ్ట్ ఉపయోగించుకునే వాళ్లు కాదు.
ఇప్పుడా మెట్లు దిగాలంటే వచ్చినంత వేగంగా దిగలేకపోతుంది. ఏదో నీరసం, దిగులు గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి.
మెట్లు దిగి పక్కకి తిరగగానే లిఫ్ట్ బాయ్ కన్పించి ఎప్పటిలాగే ‘నమస్తే మేడమ్!’ అన్నాడు.
పైకి చూపించి ‘అనంత్ సార్ ఇప్పుడెక్కడున్నారు?” అంది. ఆమె గొంతు ఆమెకే కొత్తగా విన్పిస్తోంది. తనం శరీరంలో, తన మనసులో ఓ భాగమైన అనంత్ గురించి తను వేరేవాళ్లను అడగటం వింతగా అన్పిస్తోంది. అనంత్ కి..తనకి ...మధ్యన కొన్ని యోజనాల దూరం పెరిగిపోతున్నట్లు భయంగా వుంది.
“ఇప్పుడు అనంత్ సార్ అక్కడ లేరు మేడం! దాన్ని రెంట్ కి ఇచ్చేశారు... అనంత్ సార్ వాళ్ల ఫ్యామిలీ ఇదే అపార్టుమెంటులో ఫోర్ నాట్ ఒన్ లో వున్నారు. వాళ్ళు ఈ మధ్యనే ఖమ్మం నుండి ఇక్కడికి మారారు. ఇంకా వివరాలు కావాలంటే అదిగో అక్కడ కూర్చుని వున్నారు ఆ సార్ ని అడగండి!” అంటూ కుడి వైపు బాల్కానీలో కూర్చుని వున్న దేవరాయుడి వైపు చూపించాడు లిఫ్ట్ బాయ్.
దేవరాయుడి వైపు చూడగానే గతుక్కుమంది సంకేత.
“ఈయనగారి దగ్గరికి వెళ్తే! అనంత్ తో తన ప్రేమ వ్యవహారం తెలిస్తే? ఇన్ని రోజులు అనంత్ పెట్టిన తిండికి, ఇచ్చిన బహుమతులకి డబ్బులు కట్టమని అడుగుతాడేమో! ఆయన తత్త్వం అదేకదా! తన దగ్గర ఒక్కరూపాయి కూడా లేదు...” అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి అనంత్ సెల్ ఫోన్ కి కాల్ చేసింది.
అనంత్ సెల్ ఫోన్ నుండి ‘ప్రస్తుతం ఈ నెంబరు అందుబాటులో లేదు’ అని విన్పించింది. మరోసారి ‘స్విచ్ ఆఫ్’ అని విన్పించింది.... నమ్మలేకపోతోంది. సంకేత...అతనిలాగే అతని సెల్ ఫోన్ కూడా ఎప్పటికి ఫుల్ చార్జింగ్ లో ఉంటుంది. ఇప్పుడేమై వుంటుంది. కొంతమంది అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ ని మార్చినట్టే సిమ్ లు కూడా మారుస్తుంటారట... అనంత్ కూడా లాగే ‘సిమ్’ మార్చాడా? ఒకవేళ సిమ్ మారిస్తే తనకి కాల్ చేసి నంబర్ చెప్పాలిగా! ఏదైనా వెంటనే చెప్పే అనంత్ ఇదెందుకు చెప్పలేదు...?
          ఏదో జరిగింది. ఇదేదో మిస్టరీగా ఉంది.
          ఆంటీవాళ్లు ఈ అపార్ట్ మెంట్ లోకి వస్తున్నట్లు కూడా చెప్పలేదు.
          “ఎవర్రా అది?” కంచులా మోగింది దేవరాయుడి కంఠం
          “అనంత్ సార్ కావాలట సార్!”  అన్నాడు లిఫ్ట్ బాయ్ వినయంగా.
          “రాయల్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాడని చెప్పు! క్యాంపస్ సెలెక్షన్స్ లో తనకి ఉద్యోగం వచ్చిందని స్నేహితులకి పార్టీ ఇస్తున్నాడు... ఆ అమ్మాయికి ఇంకేదైనా పనివుందేమో ఫోర్ నాట్ ఒన్ కు వెళ్లమని చెప్పు శరదృతి ఉందిగా!” అన్నాడు సముద్రపు ఆకుపచ్చరంగు చుడీదార్ లో వున్న సంకేతను పరిశీలనగా చూస్తూ ...
          ఆ మాటలు సంకేత విన్నది. ఆమెకెందుకో శరదృతిని కలవాలనిపించలేదు. మొన్న తన దగ్గరకి వచ్చి తనని చూసి, తను నచ్చక అనంత్ ని తనతో సంబంధం తెంచుకోమని చెప్పిందేమోనన్న చిన్న అనుమానం వచ్చింది. అందుకే ఇప్పుడు వెళ్లి ఆంటీకి మళ్ళీ కన్పించటం అర్ధం లేనిపని అనుకుంది.
          అక్కడనుండి నెమ్మదిగా కదిలి గేటు దాటి రోడ్డు మీదకి వచ్చింది. ఏం చేయాలో తెలియని దానిలా వస్తున్న ఆటోని ఆపి ఎక్కి కూర్చుంది.
          ఇంటికెల్లాలనిపించడంలేదు. అనంత్ ని చూడాలని, అనంత్ తో మాట్లాడాలని వుంది. అనంత్ తో మాట్లాడకుండా ఇంటికేల్లినా ఇంట్లో ఉండలేదు. గోడకి తాకిన బంతిలా మళ్ళీ అనంత్ దగ్గరకే వస్తుంది..
          అందుకే ఆటోవాడికి చెప్పి రాయల్ రెస్టారెంట్ దగ్గర దిగింది.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages