నవ దుర్గా రూపిణి యైన ఆది పరాశక్తి - అచ్చంగా తెలుగు

నవ దుర్గా రూపిణి యైన ఆది పరాశక్తి

Share This

నవ దుర్గా రూపిణి యైన ఆది పరాశక్తి

- అక్కిరాజు ప్రసాద్ 

నవరాత్రులు ముగిసిన తర్వాత విజయదశమి నాటి విశిష్టత:

ఆ జగదంబ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతుల రౌద్ర, సౌమ్య రూపాలలో మనలను కరుణించి, ఆశీర్వదిస్తోంది. నవరాత్రుల తదుపరి, శుద్ధ దశమి నాడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో చెడుపై మంచి విజయానికి సంకేతం గా శ్రీ రాజ రాజేశ్వరీ రూపంలో మనకు ఆ విజయవాటిక దుర్గమ్మ కనిపిస్తుంది. ఈ విజయానికి సూచనలు ఎన్నో - రాముడు రావణుని సంహరించటం (దానికి మనము రావణ దహనం చేయటం), పాండవుల  అజ్ఞాతవాసము పూర్తయి కురుక్షేత్ర సంగ్రామ ఘట్టానికి నాంది, మహిషాసుర మర్దనం - అన్నీ ఈ విజయ దశమి రోజునే.  ఉత్తరాదిన రావణ దహనం చాలా కన్నుల పండువగా చేస్తారు. అలాగే వంగ దేశంలో ఈ మహిషాసుర మర్దిని యొక్క దుర్గా పూజా ఉత్సవాలు ముగిసి ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉంటారు.
ఈ పండుగ మన దేశంలోనే కాదు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో కూడా జరుపుకుంటారు. ఉత్తరాదిన దసరాగా ఈ పండుగకు పేరు. ఇది దశ్ హరా అనే పదాలనుండి వచ్చింది. రావణుని రాముడు సంహరించటానికి సంకేతం ఇది. విజయదశమి దుర్మార్గంపై దైవత్వం యొక్క విజయానికి ప్రతీకగా ఎంతో వేడుకగా జరుపుకునే పండుగ. దసరాతో ముగిసే పదిరోజులలో ఉత్తరాదిన రామాయణ ఘట్టాలను ప్రదర్శిస్తారు. దీనికే రాంలీలా అని పేరు. దశమినాడు రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల ఎత్తైన బొమ్మలను తయారు చేసి వాటిలో బాణాసంచా పెట్టి కాల్చి సంబరాలు చేసుకుంటారు. దక్షిణాదిన ఈ నవరాత్రులలో బొమ్మల కొలువు పెట్టటం ఆనవాయితీ. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో ఈ సాంప్రదాయం చాలా ప్రసిద్ధి. రకరకాల బొమ్మలను చక్కగా అలంకరించి నిత్య పూజ చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని తమిళనాడు దేవాలయాలలో కూడా చూడవచ్చు. రకరకాల దేవతల బొమ్మలను, గ్రామీణ ప్రాంతపు జీవనాన్ని ప్రతిబింబించేలా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. పాడ్యమితో మొదలయ్యే ఈ కొలువు విజయదశమితో ముగుస్తుంది.
తెలంగాణా ప్రాంతంలో నవరాత్రులలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. వెదురు సిబ్బిపై పూలను అందంగా వరుసలు పేర్చి గౌరీ పూజ చేసి స్త్రీలు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. వాయనాలు ఇస్తారు. ఈ బతుకమ్మలను చివరిరోజున చెరువులో వదులుతారు.బెంగాలు, ఒడిషాలలో నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుతారు. గణేష నవరాత్రులలా అమ్మవారి విగ్రహాలను వీధి వీధులలో ఏర్పాటు చేసి నిత్యం పూజ చేసి వాటిని దశమి నాడు నిమజ్జనం చేస్తారు.
గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలలో గర్బా, డాండియా రాస్ ఇక్కడ ప్రజల దసరా ఉత్సవాలలో ప్రత్యేకత. నవరాత్రులలో ప్రజలు చక్కగా అందమైన దుస్తులు ధరించి కోలాటం ఆడుతూ నాట్యం చేస్తారు. గర్బా మన జనన మరణాల చక్రానికి ప్రతీకగా వలయాకారంలో తిరుగుతూ చేయగా డాండియా రాస్ స్త్రీ పురుషుల ఆనందకేళిగా కన్నుల పండువగా ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన వస్త్ర ధారణ ఉంటుంది. ఈ ఉత్సవాలు రాత్రిపూట జరుగుతాయి.
ఆంధ్రలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఈ నవరాత్రులలో జరుగుతాయి. అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో స్వామిని వేర్వేరు వాహనాలపై మాడవీధులలో ఊరేగిస్తారు. విజయదశమినాడు శ్రీదేవీ భూదేవీ సహిత స్వామి వార్ల ఉత్సవమూర్తులకు శ్రీవరాహ స్వామి సన్నిధిలో అవభృథ స్నానం చేయిస్తారు. స్వామి వారి సుదర్శన చక్రానికి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఈరోజు కోనేటిలో స్నానం చేస్తే ఆ చక్రస్నానం ఫలాన మన పాపాలన్నీ తొలగుతాయని నమ్మకం. నవరాత్రుల మొదటి రోజున బ్రహ్మోత్సవాల ఆరంభానికి ప్రతీకగా అధిరోహించబడిన గరుడ ధ్వజాన్ని నేడు అవరహోణం చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీశైలంలో భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవస్థనంలో నవరాత్రులలో అమ్మవారు వేర్వేరు నవదుర్గల అలంకారాలలో దర్శనమిస్తుంది. విజయదశమి నాడు చండీహోమము, రుద్రహోమములకు పూర్ణాహుతి చేస్తారు.
శమీ పూజ:
పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తాము ఇంద్రాది దేవతల వద్ద తపస్సు చేసి పొందిన ఆయుధాలను మూట గట్టి శమీ వృక్షము మీద ఉంచుతారు. ఈ అజ్ఞాత వాసాము ముగిసేంత వరకు ఈ శమీ వృక్షము వాళ్ల ఆయుధాలను కాపాడి పాండవులకు తప్ప మిగతా ఎవ్వరికీ అవి కనపడకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. తమ అజ్ఞాతవాసము ముగియగానే అర్జునాదులు వచ్చి శమీ పూజ చేసి ఆయుధాలను తీసుకొని తిరిగి తమ పూర్వ వైభవము, రాజసము, విజయ లక్ష్మిని పొందుతారు.
దీనికి ప్రతీకగా ప్రతియేటా విజయదశమి నాడు భారతీయులు శమీ వృక్షానికి పూజ చేసి, ఈ క్రింది శ్లోకము పఠించి, కాగితము మీద కుటుంబ సభ్యుల గోత్ర నామములు, ఈ శ్లోకము రాసి ఆ వృక్షము వద్ద ఉంచి, పూజించి ఇంటికి తెచ్చుకుంటారు. తెలంగాణా ప్రాంతంలో ఈ చెట్టును జమ్మి అని, ఉత్తరాదిన ఝండ్, తమిళంలో జంబు మారం అని పిలుస్తారు . ఈ శమీ ఆకులను బంగారముగా భావించి అందరికి పంచి తమ సోదర, సంఘీభావాన్ని తెలుపుతారు.
శమీ వృక్షము 
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం |
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ||

సమర్థ సద్గురు సాయినాథుల సమాధి:

కుగ్రామంలో ఉంటూ, మతాలకు, కులాలకు అతీతంగా, యద్భావం తద్భవతి అన్నది గురువు పట్ల ఎలా ఉండాలో, శ్రద్ధ, సాబురీలతో (సంతోషము,నిష్ఠలతో కూడిన ఓరిమి) ఎలా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్ష మార్గులము కాగలమో అతి సామాన్యునికి అర్థం అయ్యేలా జీవించి ఉదాహరణగా నిలిచిన దత్తావతారుడు ఆ సాయినాథుడు.  సిరిసంపదలకు దూరంగా, మనుషులకు వారి వారి వ్యక్తిత్వాలను, పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఆధ్యాత్మిక మార్గాలను బోధ చేసిన సద్గురువు సాయినాథుడు. మతవైషమ్యాలతో అట్టుడుకుతున్న దక్కన్ పీఠభూమి మరాఠా ప్రాంతాలలో హిందూ-ముస్లిం ప్రజల ఐక్యతకు ప్రతీక సాయినాథుడు. ఎన్నో లీలలను, అద్భుతాలను చేసిన అవతార పురుషుడు సాయినాథుడు. 1918 సంవత్సరములో విజయదశమి నాడు సమర్థ సద్గురు సాయి బాబా షిర్డీ గ్రామంలో సమాధి చెందారు. అక్కడ ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ రోజు సాయినాథుని సచ్చరిత్ర పారాయణకు చాలా విశేషమైన రోజు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
ఇలా విజయదశమి భారత దేశంలో ఎంతో ప్రాశస్త్యమున్న పండుగ. ప్రజలు ఎంతో వేడుకగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునేపండుగ. పండుగలు ప్రజలను ఆఇకమత్యంతో ఉంచటంతో పాటు వారిలో భగవద్భక్తి, ఆనందానురాగాలు నింపుతాయి. అదే మన సనాతనధర్మం యొక్క గొప్పతనం.

No comments:

Post a Comment

Pages