రాగింగ్
సుసర్ల నాగజ్యోతి రమణ
ఇంజనీరింగ్ కాలేజ్ లో నా మొదటి రోజది.... నాన్నగారు నాతో వచ్చినా కూడా నేను బిక్కు బిక్కు మంటూనే కాలేజ్ లోకి అడుగుపెట్టాను....ఒక వైపు ఉత్సాహం...ఇంకో వైపు భయమూ ....కలగలిపిన మొహలతో నాలాంటివాళ్ళు చాలామందే ఉన్నరక్కడ ...విశాలమైన ప్రాంగణం లో సమున్నతం గా, గంభీరం నిలచి ఉన్న కాలేజ్ బిల్డింగ్ రా రమ్మంటూ ఆహ్వానించింది. మా కాలేజ్ కి పేరూ ప్రఖ్యాతులు బాగా ఉన్నాయ్...కాంపస్ సెలెక్షన్స్ కు కూడా మా కాలేజ్ పెట్టింది పేరు ...అందుకే చాలా మంది ఈ కాలేజ్ లో సీట్ వస్తే బావుండనుకుంటారు .
కాలేజ్ కాంపస్ లోనే కాస్త దూరం గా ఒక వైపు గర్ల్స్ హాస్టల్, ఇంకోవైపు బాయ్స్ హాస్టల్, ఒక దానికొకటి ఏ మాత్రమూ కనపడని విధం గా , ఎవరూ చొరబడటానికి వీలులేకుండా జాగ్రత్తగా నిర్మించబడ్డాయి .....
మా ఊరు కాలేజ్ కి 60 కిలోమీటర్ల దూరం లో ఉంది ...ఆడపిల్ల బస్సుల్లో వెళ్ళిరావటం కష్టమంటూ ....నన్ను హాస్టల్ లో చేర్పించారు .
ఇంక హాస్టల్ లో మా రూం మేట్ సుబ్బలక్ష్మి . ఒక పల్లెటూరులో ఇంటర్ వరకూ తెలుగుమీడియం లో చదువుకుంది....తను వాళ్ళ కాలేజ్ ఫస్ట్ ...ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లో మంచి రాంక్ తెచ్చుకుని...ఈ కాలేజ్ లో సీట్ తెచ్చుకుంది....చాలా నెమ్మదస్తురాలు... మొహం లో అమాయకత్వం, ఇంగ్లిష్ గబ గబా మాట్లాడలేకపోవటం ...కొంచెం బెదురు చూపులూ తను పల్లెటూరి పిల్లని ఇట్టే తెలిసేలా చేస్తాయి .... వాళ్ళ నాన్న ఒక మోస్తరు రైతు.....పిల్ల బాగా చదువుకుని,మంచి ఉద్యోగం చెయ్యాలని ఎన్ని కష్టాలున్నా తనని చదివిస్తున్నారు .
మొదటి సంవత్సరం వాళ్ళకు క్లాస్ లు మొదలయ్యేసరికి, సీనియర్స్ కు సెలవలు ఉండటం వల్ల మేము హాయిగా కాలేజ్ కు వెళ్ళగలిగాము ...తరువాత సీనియర్లు వచ్చినా గానీ ,ప్రిన్సిపాల్ గారు చాలా గట్టి మనిషి అందుకే మాకు రాగింగ్ రూపంలో కాలేజ్ లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు....కానీ....
ఇంక హాస్టల్ లో మాత్రమూ రాగింగ్ బాగానే జరుగుతోంది.... మా సీనియర్లలో 3 వ సంవత్సరం చదువుతున్న హర్షిణి అని ఒక రాజకీయనాయకుడి కూతురు ఉంది ..వాళ్ళది అదే వూరు అయినా కూడా ఇంట్లో ఉండే రాజకీయ వాతావరణమూ హడావిడీ తన చదువుకు అడ్డంకి కాకూడదని తనను హాస్టల్ లో చేర్పించారు వాళ్ళ అమ్మగారు ..తనకు మంచి స్నేహితురాళ్ళుగా చెప్పుకునే వారిజ ,సుగుణ,ముగ్గురూ ఒకే రూం, ఒకే మాట,ఒకే బాట ....
మా సీనియర్లను మేము మేడం అని పిలవాలి ....వాళ్ళ రికార్డ్ లు వ్రాయటం, వాళ్ళ బట్టలు మడతెయ్యటం ,భోజనాల సమయం లో వాళ్ళకు అన్నీ వడ్డించిన ప్లేట్లు అందీయటం వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నాం రాగింగ్ పేరుతో....ఒక రోజు సుబ్బలక్ష్మి ని మూడు సార్లు మంచినీళ్ళు తెచ్చియ్యమన్నారు ....4 వసారి ఇంకేదో అడిగితే తను చెయ్యలేనని చేతులెత్తేసింది. హర్షిణీ మేడం భృకుటి ముడిపడింది . సాధారణం గా రాగింగ్ చేసేటప్పుడు జూనియర్స్ లో ఏ కాస్త అవిధేయత పొడచూపినా సీనియర్స్ సహించరు ...అయినా కానీ హర్షిణీ మేడం ఆ రోజు కు తనను ఓకే ఓకే అంటూ వదిలేసింది....అందరూ ఆశ్చర్యపోయారు...ఎందుకు వదిలేసిందో అర్ధం కాక..... ఆ మర్నాడు సాయంత్రం రాగింగ్ లో భాగం గా సీనియర్స్ మా రూం కు వచ్చారు....సుబ్బలక్ష్మి తన పెట్టే సర్దుకుంటొంది ...వెనక్కు తిరిగి ఉంది వీరి రాకను గుర్తించలేదు...నేను మాత్రం నమస్తే మేడం అంటూ విష్ చేశాను ....హర్షిణి సుబ్బలక్ష్మి వెనక్కు వెళ్ళి తన పెట్టెలో ఉన్న ఒక చీర తీసుకుంది....హలో సుబ్బలక్ష్మీ అంటూ తనే పలకరిస్తూ ....ఈ చీర ఎవరిదీ అంటూ అడిగింది....సుబ్బలక్ష్మి అది మా అమ్మచీర ,తనకు గుర్తుగా తెచ్చుకున్నాను అని చెప్పింది...ఓహో అలాగాంటూ ఆ చీరను ముగ్గురు ఫ్రెండ్సూ ఒకళ్ళ పైకి ఒకళ్ళు విసిరేసుకుంటూ ఆటమొదలెట్టారు....సుబ్బలక్ష్మి హడావిడిగా వాళ్ళ చేతుల్లోంచి వాళ్ళమ్మ చీరను లాక్కోబోయింది....ఆ పెనుగులాటలో హర్షిణి డ్రెస్స్ కొంచెం చిరిగింది ........వెంటనే హర్షిణి గొడవ మొదలెట్టింది.... తన డ్రెస్స్ ఖరీదు పదివేల రూపాయలనీ, అప్పటి కప్పుడు కొనివ్వాల్సిందే అంటూ ...సుబ్బలక్ష్మి తను వెంటనే కొనివ్వలేననీ, మూడు నాలుగు నెలల్లో కొనిస్తాననీ, అంత డబ్బులు వెంటనే సమకూర్చలేననీ చెప్పింది. ముందు రోజు అందరిలో తనకు ఎదురుచెప్పటం, ఆరోజు తనతో పెనుగులాడటం ఇదంతా హర్షిణికి ఒళ్ళు మండించింది ...ఒక్క వారం లోపల ఆ డబ్బులు కట్టటమో . అలాంటి డ్రెస్స్ కొనివ్వటమో చెయ్యాలనీ, లేకపోతే ఆ రోజు సుబ్బలక్ష్మి వంటిమీద ఉండే దుస్తులు తీయించి తమ టాయ్లెట్లు శుభ్రం చేయిస్తాననీ వార్నింగ్ ఇచ్చింది...సుబ్బలక్ష్మి ఎంత బ్రతిమిలాడినా తను ఒప్పుకోలేదు.... హాష్టలంతా వేడేక్కింది .....గరం గరం గా సీనియర్సూ, బిక్కు బిక్కుమంటూ జూనియర్స్ నిట్టూర్పులతో .....
ఆ రాత్రంతా సుబ్బలక్ష్మి ఏడుస్తూనే ఉంది...ఒక సాధారణ రైతు బిడ్డైన తను అంత డబ్బులు అప్పటికప్పుడు ఎలా తేవాలంటూ....జూనియర్స్ ని అందరి దగ్గిర డబ్బులూ కొంత కొంత సర్దమంటూ అడగాలన్నా ...హర్షిణి ఇచ్చిన వార్నింగ్ తో అందరూ సుబ్బలక్ష్మి ని తప్పుకునే తిరుగుతున్నారు.... విషయమంతా వార్డెన్ కు వివరించాము .....సీనియర్లతో మర్యాదగా ప్రవర్తించకపోతే అంతే మరి అని వార్డెన్ మమ్మల్నే తిట్టిపోసింది .....సరే మూడు రోజుల పాటు కాలేజ్ కి మామూలుగానే వెళ్ళొచ్చాము ...నాలుగోరోజు హర్షిణీ బృందం...మా రూం కి వచ్చి మళ్ళి ఇంకో రెండురోజులే సమయం ఉందని గుర్తు చేసి వెళ్ళారు....ఈ సారి మేము మా 4త్ ఇయర్ సీనియర్స్ దగ్గరకు వెళ్ళాము...ఎట్లా అయినా మా సుబ్బలక్ష్మి ని రక్షించమని ....వాళ్ళు కూడా మేమొక సారి చెప్పి చూస్తాము...కానీ వివాదాల్లోకి మమ్మల్ని లాగకండి ...మేము చదవాల్సింది చాలాఉంది అంటూ మమ్మల్ని సున్నితం గానే తిరస్కరించారు.
అందరూ కూడా హర్షిణి తనను సుబ్బలక్ష్మి ఎదిరించింది కాబట్టి , ఆ పిల్లను బెదిరించాలని ఇదంతా చేస్తోంది అనుకున్నారు కానీ, తన ఈగో దెబ్బతింది కాబట్టి , తన ఆధిక్యతను నిరూపించుకోవాలని బలం గా అనుకుంటోంది అని గమనించలేక పొయ్యారు....
మర్నాడు తెల్లవారం గానే మళ్ళీ డబ్బు రెడీ చేశావా అంటూ సుబ్బలక్ష్మి ని నిలదీశారు మిత్రత్రయం ......సుబ్బలక్ష్మి తలవంచుకుని నిలబడింది....సరే ఎల్లుండి పదిగంటలకు రెడీ గా ఉండు ...అని చెప్పి వెళ్ళిపొయ్యారు....ఆ రోజు అర్ధ రాత్రి సుబ్బలక్ష్మి నోట్స్ లో ఏదో వ్రాసుకోవటం గమనించాను....నేను కావాలనే కొంచెము మూలుగుతూ పక్కకు తిరిగాను...తను వెంటనే పుస్తకం మూసేసి వచ్చి పడుకుంది....
ఆ మర్నాడు నాకు కాస్త తలనొప్పిగా ఉందని నేను కాలేజీకి రానని చెప్పి రూం లోనే ఉండిపొయ్యాను ....సుబ్బలక్ష్మి అన్యమనస్కం గానే కాలేజ్ కి వెళ్ళింది ...నేను తను ఒక పక్కగా పెట్టుకున్నా ఆ ప్రత్యేకమైన నోట్స్ తీసి చదివాను......అందులో " అమ్మా,నాన్నా నన్ను క్షమించండి...వచ్చే జన్మలో కూడా మీకే పుట్టాలని కోరుకుంటున్నాను " అని వ్రాసుకుంది.....నేను చేసింది తప్పే....కానీ సుబ్బలక్ష్మి నా రూం మేట్ ....తనకు ఏమీ జరగకూడదనే నేను రహస్యం గా చదివాను.....
మర్నాడు పదిగంటల సమయం .....హర్షిణీ వాళ్ళు రమ్మంటున్నారని ఆయా వచ్చి మమ్మల్ని పిలుచుకెళ్ళింది .....వారిజ ,సుగుణ చేతుల్లో అధునాతన సెల్ ఫోన్స్ ఉన్నాయి ...రికార్డింగ్ మోడ్ లో ....సుబ్బలక్ష్మి దగ్గర అంత డబ్బు లేదనేది నిర్వివాదాంశం .....సుబ్బలక్ష్మి హర్షిణి చేతులు పట్టుకుని బ్రతిమాలుతోంది...నన్నఏమీ చెయ్య వద్దు మేడం అంటూ ఏద్చేస్తోంది ....అందరమూ చూస్తున్నాము.....హర్షిణి డబ్బుల్లేకపోతే....నువ్వు చెయ్యాల్సిన పని చెప్పానుకదా ....ఊ రా అంటూ సుబ్బలక్ష్మి చున్నీ మీద చెయ్యి వేసింది...ఇంతలో ...అమ్మా వారిజా ! నీ చేతిలో ఫోన్ ఇలా ఇవ్వుతల్లీ,నేనయితే వీడియో సరిగ్గా తీస్తాను అంటూ ఒక గొంతు వినిపించింది ......అంతే హర్షిణి నిర్ఘాంత పోయి వెనక్కు తిరిగింది...అక్కడ ఎర్రబడ్డ కళ్ళతో హర్షిణీ వాళ్ళ అమ్మగారున్నారు .....ఒక్కసారి గా హర్షిణీ సుబ్బలక్ష్మి చున్నీ ని వదిలేసింది....
ఆవిడ చూపులకు హర్షిణి తల వాలిపోయింది....నిన్ను నేను ఇలా పెంచానా? నా పెంపకం లో ఏ లోపం నిన్నిలా తయారు చేసింది అంటూ ...ఆవిడ కళ్ళనీళ్ళతో తనని ప్రశ్నించారు ....అంతే కాక సుబ్బలక్ష్మి చెయ్యి పట్టుకుని ఆవిడ నాకూతురు చెయ్యబోయిన పనికి మమ్మల్ని నువ్వు మన్నించాలమ్మా ...అంటూ సుబ్బలక్ష్మి ని కోరారావిడ .....ఇంకెప్పుడయినా సరే నాకూతురు వల్ల ఎవరికి కష్టం కలిగినా ,శిక్ష నేను అనుభవిస్తాను,అలా వ్రాసి ఇస్తాను కూడా , ఎందుకంటే ....దాన్ని సరిగ్గా పెంచాను అనుకున్నాను....ఇవ్వాళ తెలిసింది నాది సరి అయిన పెంపకం కాదన్నది...అది ఒక రాజకీయ నాయకుని కూతురిగా ఎలా ప్రవర్తించినా ఎదురు లేదనుకుంది కానీ,దాని ప్రవర్తనతో అసలు వాళ్ళ నాన్నగారికి రాజకీయ భవిష్యత్తే లేకుండా పోయే అవకాశం ఉందని తెలుసుకోలేకపోయింది ...తన ప్రాణమెంతో ,తన అభిమానమెంతో ,ఇంకో ఆడపిల్లకు కూడా అంతే అని ఆలోచించలేకపోయింది .... అని చెప్తుంటే హర్షిణి మ్రాన్ పడిపోయింది.....వెంటనే హర్షిణి వాళ్ళమ్మతో ...వద్దమ్మా నేనెప్పుడూ ఇలా ప్రవర్తించను నన్ను క్షమించమ్మా అంటూ వాళ్ళమ్మను హత్తుకుపోయింది ...సుబ్బలక్ష్మికి కూడా క్షమార్పణలు చెప్పింది .....
ఇదంతా అసలు ఎలా సాధ్యపడింది ? విజిటింగ్ అవర్స్ కాకపోయినా ఆవిడెలా లోపలకు రాగలిగింది అని అందరూ ఆశ్చర్యపోయారు సుబ్బలక్ష్మితో సహా ..... ఏదేమైనా కధ సుఖాంతమయ్యింది హమ్మయ్య అనుకున్నారందరూ .....
యిలా జరగటానికి కారణం వెతుకుతూ ....రెండురోజుల వెనక్కు వెళితే , ఆ రోజు సుబ్బలక్ష్మి నోట్స్ చదివిన నేను, .... ఆ తరువాత హాస్టల్ లో అందరూ దాదాపు వెళ్ళిపోయ్యాక నేను మళ్ళి మా వారెడెన్ ను కలిశాను......ఆవిడకు సుబ్బలక్ష్మి నోట్స్ చూపించాను....ఆవిడ వాళ్ళు సీనియర్లు, డబ్బూ ,పలుకుబడీ ఉన్న పెద్దల సంతానం.... వాళ్ళను కోప్పడ్డా లొంగరు,పైపెచ్చు అనవసరపు రాధ్ధాంతం సృష్టిస్తే కష్టం ...అలా అని ఒక బాధ్యత గల వార్డెన్ గా నేను ఘోరం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేను ....విద్యార్ధుల బ్రతుకులు క్షణికావేశాలకు నాసనమవటం చూస్తూ కూర్చోలేను ...దీన్ని ఆపక పోతే నా ఉద్యోగధర్మానికీ, సమాజానికీ ద్రోహం చేసినట్టే అంటూ ఒక ప్లాన్ ప్రకారమూ హర్షిణీ వాళ్ళమ్మగారికి ఫోన్ చేసి విషయము వివరించారు ...మేమిద్దరమూ కలిసి సంఘటన జరిగే సమయానికి ఆవిడ ఇక్కడకు వచ్చేలా ప్లాన్ చేసి ,ఈ సంగతి ఎవరికీ తెలియకుండా ఉండేలా జాగ్రత్తపడ్డాము ......
నా ద్వారా ఈ విషయము తెలిసిన సుబ్బలక్ష్మి చక్కని ఆలోచనతో తనను అవమానం పాలుకాకుండా రక్షించిన వార్డెన్ కు చేతులెత్తి మొక్కింది....ఆ తరువాత వార్డెన్ సుబ్బలక్ష్మిని మందలించారు....కష్టమొస్తే ముందు అమ్మానాన్నలకు విషయము వివరించాలి కానీ...చనిపోవాలనే నిర్ణయాలు తల్లితండ్రులకెంత మనస్తాపం కలిగిస్తాయో ఆలోచించలేనివాళ్ళు ఏం బిడ్డలంటూ కోప్పడ్డారు ......
మొత్తానికి నాకూ ,సుబ్బలక్ష్మికీ,వార్డెన్ గారికే తెలిసిన నిజం గుంభనంగా ...రాగింగ్ కు బలి కాకుండా విద్యార్ధుల జీవితాలు నిలిచినందుకు గర్వపడుతోంది.....
No comments:
Post a Comment