శివం – 1 7
(శివుడే చెబుతున్న కధలు )
రాజ కార్తీక్
9290523901
రోజుల తరబడి ఉద్భవుడు ఆంతరంగిక మందిరంలోనే ఉన్నాడు. మంత్రికీ, రాజపరివారానికీ ఏమైనది అని ఒకటే ప్రశ్న. ఉద్భవుడి ఆంతరంగిక మందిరంలో ఏముందో ఎవరికీ తెలీదు. లోపలికి ఎవరికీ ప్రవేశం లేదు. ఒకానొకనాడు మంత్రి చొరవ చేసి మందిరంలోకి వెళ్ళటానికి ప్రయత్నించిన ఉద్భవుడు కుదురనివ్వలేదు. ఇక మంత్రి రాజవైద్యులను పిలిపించి ఇది ఏమన్నా మానసిక రోగమా అని ఆలోచించసాగాడు. అప్పుడప్పుడు మంత్రిగారు ఆంతరంగిక మందిరంలో ఏమి జరుగుతుందో అని తీక్షణంగా గోడ దగ్గర చెవి పెట్టి వినేవాడు. అతనికి ఉద్భవుడి రోదన చిన్నగా వినిపించేది, “కనబడతావా? కనబడవా” అనే మాటలు వినబడేవి. రాజసభ జరుగుతుండగా ఉద్భవుడి స్థితిని సరి చేయుటకు ఎంతోమంది ఋషులను, యోగులను వెంట బెట్టుకొని వచ్చేవాడు. కానీ వారి సమాధానం కూడా మౌనమే. కానీ ఒక ఋషి మాత్రము, ఉద్భవుడ్ని చూసి చేతులెత్తి నమస్కారం చేసేవాడు. ఉద్భవుడు ఏదో సైగ చేసేవాడు. ఈ తంతు జరుగుతూనే ఉంది.
ఇక, కొంతమంది పురోహితులు, వేదపండితులు “కార్తీకమాస” ఆరంభం నుండి ప్రత్యేక పూజల కోసం రాజుగార్ని ద్రవ్యము ఇవ్వమని ఆర్ధించారు. ఉద్భవుడి కన్నుల్లో ఏదో వెలుగు. “రేపు రండి” అని సైగ చేసి మళ్లి తన మందిరం లోకి వెళ్ళాడు. మంత్రిగారు రాజు కదలిక చూసి ఎంతగానో ఆనందపడ్డారు.
మరుసటిరోజు.... తీర్పు చెప్పు చోటు.....
పండితుల గూర్చి చర్చ జరుగుతుంది, ఉద్భవుడు పండిత జక్కన్న గూర్చి వాకబు చేయగా – “జక్కన్న కూతురు పాముకాటుకి చనిపోయింది, అందుకే జక్కన్న ఈ రోజు సభకు రాలేదు “ అని తెలుసుకొని హుటాహుటిన జక్కన్న ఇంటికి వెళ్ళారు. అక్కడ దృశ్యం – “జక్కన్న ఆ పసిబాలికను చూసి “తల్లి, చిట్టితల్లి, లేకలేక కలిగిన సంతానం నీవు, పరమేశ్వర నిన్ను తప్ప నేను ఎప్పుడూ ఏది తలవనే, అలాంటిది నాకా ఈ శిక్షా, విషప్రభావానికి ఆ చిన్నారి శరీరం నల్లగా అయ్యి, ఏడవని వారు లేరు, ఏదైన జక్కన్న కుటుంబానికి ఈ శిక్ష” అని అందరూ అనుకుంటున్నారు. ఉద్భవుడు మాత్రము కొయ్యగా నిలబడి ఉన్నారు. రాజుని చూసి జక్కన్న “ఆ దేవుడు నా యందు, చూపిన జాలి ఇదేనా? నేనేమి అపకారము చేసాను, ఏమి అపచారము చేసాను,కదలిరా భగవంతుడా, నా ఆయుష్షు పోసి, నా కూతుర్ని బ్రతికించు అని గొంతు ఎండిపోయేలా ఏడుస్తున్నాడు. జక్కన్న భార్య స్పృహ తప్పి పడిపోయింది, “పరమేశ్వర, నీ గుడికి ఎన్ని సార్లు వచ్చా, నా గుండె నీ కొక గుడిగా చేసా, నాకోసం ఒక్కసారి రావయ్యా, అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు, గుడిలోని దైవం కూడా, కాని ఉద్భవుడు ముందుకు నడిచి జక్కన్న పండితులతో “”రాని పట్టించుకోని దైవాన్ని పిలవటం మాని జరగాల్సిన తంతు చూడండి, ఆలస్యం చేస్తే ఆ చిన్నారి శరీరం మరింతగా... “ అంటున్నాడు. “రాని, లేని దైవం” అనేసరికి మంత్రి మరియు కొంతమంది రాజపరివారం వారు అవాక్కయ్యారు. సింహాసనం అధిష్టించింది మొదలు పరిశీలిస్తే ఉద్భవుడు ఏనాడు దేవాలయాన్ని సందర్శించలేదు, ఏ ఉత్సవంలో పాల్గొనలేదు, తనంతగా తాను ఏ దైవకార్యానికి ద్రవ్యం సమకూర్చలేదు.
“ముద్దులొలికే చిన్నారిని మట్టిపాలు చేసేది ఈ చేతులతోనా, సంతానం కోసం తపస్సు చేసి నిన్ను ఆర్ధించి కన్నది ఈ చిట్టితల్లికి నూరేళ్ళు అప్పుడే నిండటం చూడటానికేనా” అని విలాపించసాగాడు జక్కన్న. “పరమేశ్వరా ఏది చేస్తావో ఎందుకు చేస్తావో, నీకే తెలుసు, నన్ను మాత్రము ఇహం మంతా మాయ అనక ఒడ్డున చేర్చు, అని బాలిక చెవి దగ్గర దింపుడుకళ్ళెం కోసం మూడు మార్లు ఏడుస్తూ పిలిచాడు కానీ లాభం లేదు.
ఉద్భవుడు “ఎన్నిసార్లు పిలిచినా లేనివారు రారు, చదువుకున్న పండితులు మీరు, అయిపోయినది వదలేసి ఇంటికి పోయి బ్రతికి ఉన్న నీ భార్యను పట్టించుకో, ఆపండి మీ కంటగంగా “ అన్నాడు కటువుగా.
మౌనం దాల్చిన ఉద్భవుడు ఏంటి ఈ మాట మాట్లాడటం ఏంటి అని అందరూ చూస్తున్నారు. ఉద్భవుడు తన పల్లకిని పిలిచి “జక్కన్నగారిని వారి ఇష్టానుసారంగా, ఇంటి దగ్గర దింపి రండి. జక్కన్న పల్లకి ఎక్కి “శివాలయం వైపు పోనివ్వండి, స్మశానం నుండి ఇంటికి వెళ్ళకూడదు” అని అన్నారు.
ఉద్భవుడు కోపంగా – “మీకు ఇంకను, బుద్ధిమాద్యం తొలగలేదు, ఇంటికి అయితే పల్లకిలో పొండి, గుడికైతే...” అన్నాడు కోపంగా. జక్కన్న మరొక్కమారు బిగ్గరగా “మహేశ్వరా, హరహర “ అని ఏడుస్తున్నాడు.
ఉద్భవుడు– “మరొక్కమారు పరమేశ్వరా, హరహరా... ఇలాంటి పలుకులు నా కళ్ళముందు పలికితే” అన్నాడు ఉగ్రుడై. నా చెవులకు వినబడేంత దూరంగా, ఆ శివుణ్ణి ఎవరైన తలిస్తే వారందరికీ అందుబాటులో ఉన్న శిక్ష విధిస్తాను.
అందరూ ఖిన్నులయ్యారు. ఏమిటి “శివ నామస్మరణ “ చేస్తే శిక్షా? ఇది ఎన్నడూ ఏ యుగంలోనూ జరగలేదే అని అందరూ చిత్తబ్రాంతులయ్యారు. జక్కన్న ఎన్నడూ ఏమాట మాట్లాడని రాజు ఉద్భవుడు ఏమిటి ఇలా? ఏమి జరుగుతుంది ఉద్భవుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఎవరికీ తెలీదు. నాకు తప్పా? అందరూ అనుకునేది ఒకటి, జరగబోయేది ఒకటి.
(సశేషం)
No comments:
Post a Comment