శ్రీధరమాధురి -20 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -20

Share This

శ్రీధరమాధురి -20


మొగ్గ సహజంగా విచ్చుకుంటే, దాని సౌందర్యం, పరిమళం, వికాసం సంపూర్ణమవుతాయి. అదే ‘క్రమశిక్షణ’ అనే పేరుతో అర్ధం పర్ధం లేని నియమాలు పెట్టి, ఆ మొగ్గ రెక్కలు పీకి, బలవంతంగా రేకలు విప్పాలని చూస్తే, దాని వికాసం అసహజంగా ఉంటుంది. ‘క్రమశిక్షణ’ అనే పేరుతో తమనుతామేకాక ఇతరులను కూడా కట్టడి చెయ్యాలని చూసేవారు, ఈ  అంశంపై పూజ్య గురుదేవులు వి.వి.శ్రీధర్ గురూజీ అమృతవాక్కులను చదవాల్సిందే.
మీరు నిజంగా మీ గురువు యొక్క క్రమశిక్షణ గల సైనికులైతే, ఆయన మీకు చూపించిన జీవనమార్గాన్నే అనుసరించండి. ఎందుకంటే అదే ‘పరిపూర్ణమైన పధం.’ లేకపోతే మిమ్మల్ని మీరే వంచించుకునే భారాన్ని మోస్తున్నట్లే,
******
నేనొక కధ విన్నాను – మీ తర్కం – గురువుల పధ్ధతి
ధనికుడైన ఒక అమెరికన్ జీవిత చరమాంకంలో జీవితసత్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. అతను అనేకమంది గురువుల వద్దకు వెళ్ళాడు. వారిలో ఎవరూ అతనికి తృప్తిని కలిగించలేదు. అందరూ ఏవో పద్ధతులు చెప్తున్నారు, అన్నీ అహపు యాత్రలే. మళ్ళీ అన్వేషణ, మరో అహపు యాత్ర. అతనికి ఈ ఆట బాగా అర్ధమయ్యింది. చివరికి, ఎవరో అతనికి ఒక హిమాలయన్ గురువు వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చారు. అతను ఇండియాకు వచ్చి, అనేక ప్రాంతాల్లో సంచరించి, చివరకు ఆయన్ను గుర్తించాడు. ఆయన చాలా మామూలుగా ఉన్నారు. అతను ఆ గురువుని ఏమీ అడగకముందే ఆయన,” నీ వద్ద అమెరికన్ సిగరెట్లు ఉన్నాయా ?” అని అడిగారు. అతను అవాక్కయ్యాడు. ఒక పాకెట్ ఆయనకు అందించాడు. గురువు ఒకటి తీసుకుని తాగుతూ ఇలా అన్నారు – “నువ్వు అమెరికా కు తిరిగి వెళ్ళు. ఒక పెద్ద ట్రంక్ నిండా సిగరెట్లు తెచ్చి, అప్పుడు నాతో కూర్చో. అమెరికావే కాదు, ఇక్కడసలు సిగరెట్లే దొరకవు. అలాగే వెళ్ళేటప్పుడు నీ రిస్ట్ వాచీని వదిలి వెళ్ళు. నా దగ్గర లేదు, నాకు టైం తెలియట్లేదు. ఈసారి వచ్చేటప్పుడు సిగరెట్లు తేవడం మర్చిపోకు.”
అమెరికన్ ఇలా అడిగాడు – “ నేను పాటించాల్సిన పద్ధతులు ఏవైనా ఉన్నాయా గురువుగారు ?”
“నువ్వేం చెయ్యాలో నేను ఇందాకే చెప్పాను. వెనక్కు వెళ్లి, ఒక ట్రంక్ నిండా సిగరెట్లు తీసుకురా. ఇదే ప్రస్తుతానికి నువ్వు పాటించాల్సినది.”
                       *********
గురువుతో ఉండాలంటే మీకు చాలా ధైర్యం ఉండాలి, ఎందుకంటే గురువు చాలా ధైర్యవంతులు. ఆమె/ఆయన పిరికివారు కాదు. గురువులు చాలా ప్రత్యేకమైనవారు, ప్రతి గురువు విశిష్టమైన వారు. ఒకరితో ఒకరిని పోల్చకూడదు. కొన్నిసార్లు వారి పద్ధతులు చాలా విప్లవాత్మకంగా ఉంటాయి. గురువులు ఉ. వారు ‘తర్కపు ఆలోచనలను’ అనుసరించారు. శిష్యుడి పద్ధతిని మార్చి, అతన్ని దైవసన్నిధికి తీసుకురావడానికి, గురువు చాలా కఠినమైన ప్రయాణం చేస్తారు. అంతరాత్మను గుర్తించేలా శిష్యుడిని తయారుచెయ్యడమే ఆయన ప్రధాన లక్ష్యం. గురువు శిష్యుడిని పరమసత్యానికి దగ్గరగా తీసుకువెళ్ళి, ‘దైవం’ అనే విశ్వచైతన్యపు సౌందర్యాన్ని వీక్షించేలా చేస్తారు. ఆయన చర్యలను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తే అది నిరర్ధకం అవుతుంది. కాబట్టి, శిష్యుడు గురువునుంచి ‘ఊహించని దాన్ని’ ఎదుర్కునేందుకు సిద్ధపడాలి. శిష్యుడు అంటే శిక్షణ పొందేవాడు, క్రమశిక్షణ కలవాడు. ‘డిసిప్లైన్’ అన్న పదం నుంచే ‘డిసైపుల్’ అన్న పదం వచ్చింది. గురువుతో ఎన్నో సంవత్సరాలు ఉన్నాకా, శిష్యుడు ‘భక్తుడు/దాసుడు’ అనే ఉన్నత స్థాయికి చేరతాడు. శిష్యుడి కంటే దాసుడికి గురువును గురించిన మెరుగైన అవగాహన ఉంటుంది. నిజానికి ఈ స్థితిలో గురువుకీ, శిష్యుడికీ మాటలతో సంప్రదింపులు అవసరం లేదు. అదంతా ‘టెలీపతి’. ఆ దశలో దాసుడు నిజంగా గురువుతో జీవిస్తాడు. అది ఆదిభౌతికమైన ఉనికి. భౌతికంగా గురువును చూసేందుకు తపన ఉండదు. దాసుడు గురువును తనలోనే అనుభూతి చెందుతాడు. ఇప్పుడా దాసుడు ఆశ్చర్యంతో, మహావిశ్వాసంతో ఉప్పొంగుతూ ఉంటాడు. తర్కం పూర్తిగా ఆగిపోతుంది. ‘శిష్యుడు’ ‘దాసుడిగా’ మారిన ఈ దశలో అతను దైవాన్ని అనుభూతి చెందుతాడు. దక్షిణామూర్తిని చూడగలుగుతాడు. అంతా దైవేచ్చ, అనుగ్రహం, దయ.
 *******
ఆ రోజుల్లో నాకు శ్రీ నీలకంఠ్ పురోహిత్ అనే స్నేహితుడు ఉండేవాడు. అతను అఘోరి, వామాచార వంశానికి చెందినవాడు. కాని, చాలా మంచివాడు. తన విద్యల ద్వారా ప్రజలకు ఎంతో సాయపడేవాడు. చాలా నిబద్ధత కలవాడు. నేను మిధ్యా క్రమశిక్షణని నమ్మనని మీకు బాగా తెలుసు కదా. అతను ఉదయం 3.30 కు బ్రహ్మముహూర్తంలో లేచేవాడు. ఒకసారి నేనతనితో ఒకరోజు ఉన్నాను. ముందురాత్రి అతను నాకు ఉదయాన్నే మేలుకోవడం గురించి చెప్పాడు. ఆ సమయంలో ధ్యానం యెంత ప్రయోజనకరంగా ఉంటుందో చెప్పాడు. అలా చెయ్యగల అతని నిబద్ధతను నేను కొనియాడాను. దైవానికి వారి విశిష్టమైన మార్గాలు ఉంటాయని చెప్పాను. తెల్లారట్ట లేవడం గురించి ఎలాగైనా నన్ను ఒప్పించాలని అతను చూస్తున్నాడు. అది నా పధ్ధతి కాదని చెప్పాను. ఒక ప్రయోగికి క్రమశిక్షణ ఉండాలని అతను అన్నాడు. నేను బిగ్గరగా నవ్వసాగాను.
నీలకంఠ్ : ఎందుకు నవ్వుతున్నారు ?
నేను : ఏదో దృశ్యం నాకు కనిపించింది, అందుకే నవ్వుతున్నాను.
నీలకంఠ్ : నాకూ చెప్తే, నేనూ నవ్వుతాను కదా.
నేను : సారి, నేను చెప్పలేను.
తర్వాతిరోజు ఉదయం నేను అక్కడినుంచి బయలుదేరబోతూ, నీలకంఠ్ శిష్యుడిని అతని గురించి అడిగాను. శిష్యుడు అతని గది తలుపు తెరిచాడు. నీలకంఠ్ గురకపెడుతున్నాడు, నా వాచ్ ఉదయం 10 గం. అయిందని చూపుతోంది. ఇప్పుడు నాకు నవ్వడం ఇష్టం లేదు, ఎందుకంటే అది అతనికి నిద్రాభంగం కలిగిస్తుంది. నేను చిరునవ్వులు నవ్వి, అతని శిష్యుడితో – నేను వెళ్ళిపోయానని అతనికి చెప్పు, అని నిష్క్రమించాను. అంతా దైవానుగ్రహం.
*******
బుద్ధుడు ఇలా అన్నాడు – క్రమశిక్షణా రహితమైన మనసు కంటే అవిధేయత లేదు.
నేనిలా చెప్పాను – నాకు నిబద్ధత లేకుండా, అవిధేయంగా ఉండడం చాలా ఇష్టం. ఆయన నవ్వి, ‘నువ్వు అసాధ్యుడివి’ అన్నారు. నేను – ఇదొక విప్లవాత్మకమైన మార్గం , అన్నాను. మాలో అభిప్రాయ భేదాలున్నా మేము మంచి స్నేహితులం. ఇది మీకు అర్ధవంతంగా అనిపిస్తోందా ?
*******
బుద్ధుడిలా అన్నాడు – ‘ఆకాశంలో ఎక్కడో మార్గం లేదు, హృదయంలోనే ఉంది.
నేను ఆశ్చర్యంగా చూసాను – క్రమశిక్షణ గల నడవడి గురించి, విధేయత గురించి, ఇంతగా మాట్లాడే ఇతనికీ మనసుంది, అనుకుని ఇలా అన్నాను – ‘మీకూ మనసుంది కనుక మీరూ క్రమశిక్షణా రహితంగా ఉండి తీరాలి. ఎందుకంటే, మనసుకు తేడాలు తెలీవు, కలుషితమైన బుద్దే భేదాలు ఎంచుతుంది.’ ఇద్దరం బిగ్గరగా నవ్వసాగాము.
*********
అన్షో ఒక గొప్ప గురువు, నిబద్ధతకు ప్రాణ మిస్తారు. ఉదయం 11 గం. తర్వాత ఆయన ఎప్పుడూ తినేవారు కాదు. ఒక కాలేజి లో వేదాంతం బోధిస్తున్న ‘టార్జాన్’ అనే మరొక గురువును ఆయన కలిసారు. టార్జాన్ అతిగా తాగేవారు. టార్జాన్ అన్షో ను కలిసి తాగేందుకు ఆహ్వానించారు, అన్షో నిరాకరించారు.
టార్జాన్ ఇలా అన్నారు – నువ్వు కనీసం మనిషివి కూడా కాదు.
అన్షో – నువ్వడిగింది నేను చెయ్యనంత మాత్రాన నేను ‘మనిషి’ అని పిలిపించుకునే అర్హత కోల్పోతానా ? సరే, నేను మనిషిని కాకపొతే మరెవరిని ?
టార్జాన్ – ‘నువ్వు బుద్ధుడివి’ అన్నారు.
*******
తండ్రి మిలటరీ ఆఫీసర్. ఎప్పుడూ కఠినంగా ఉండేవారు. ముఖ్యంగా తినేటప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. రాం ఏదో చెప్పాలనుకున్నాడు, కాని తండ్రి సైగ చేసి బెదిరించాడు.
15 నిముషాల తర్వాత, డిన్నర్ ముగిసింది.
తండ్రి – రాం, డిన్నర్ టేబుల్ మీద ఏదో చెప్పాలనుకున్నావు కదా, ఏంటది ?
రాం – వదిలెయ్యండి నాన్నా, అంతా అయిపోయింది.
నాన్న కోపంగా ఇలా అన్నారు – ‘నీవు ఏమి చెప్పాలనుకున్నావో, అది చెప్పమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.
రాం – నాన్నా, మీ ఆహారంలో ఒక బొద్దింక ఉంది. అదే మీకు చెప్పాలని అనుకున్నాను. కాని, సమయానికి చెప్పలేకపోయాను.
తండ్రి టాయిలెట్ లోకి పరుగుతీసాడు...
********
అతను - నేను చాలా నిబద్ధత కలవాడిని గురూజీ. నేను - ఓహో, చాలా గొప్ప సంగతి, నీవంటి అరుదైన వ్యక్తిని కలవడం ఆనందంగా ఉంది. అతను - మరి మీరో ? నేను - నేను పూర్తిగా క్రమశిక్షణ లేనివాడిని. అతను - ఎందుకలాగ ? నేను - లక్ష్యాలు, విజయాల్ని మనతో కలిపే వారధి క్రమశిక్షణ అని నాకు చాలా కాలం క్రితం చెప్పబడింది. నా విషయంలో లక్ష్యాలు కాని, సాధించాల్సినవి కాని ఏమీ లేవు, కాబట్టి క్రమశిక్షణ లేదు. నీకు లక్ష్యాలున్నాయి. సాధించాల్సినవి ఉన్నాయి, బరువు బాధ్యతలున్నాయి, ఎందుకంటే నీ విషయంలో నీవే కర్తవి. జీవితంలో ఈ అహపు యాత్ర ఫలించాలి అంటే, నీకు క్రమశిక్షణ కావాలి. నేను సాధించాల్సినవి ఏమీ లేవు. ఎందుకంటే నేను కర్తను కాదు. అందుకే, దైవానుగ్రహం వల్ల నేను పూర్తిగా నిబద్ధత లేనివాడిని.
*********
సాధువు - మీ గురుకులం యొక్క ఉద్దేశం ఏమిటి ? నేను బిగ్గరగా నవ్వసాగాను. సాధువు - ఎందుకు నవ్వుతున్నారు ? నేను - సరే మహాన్, నా గురుకులం లక్ష్యం అందరినీ మూర్ఖుల్ని చెయ్యడం. మా గురుకులంలో సరదాగా గురువు శిష్యుల్ని, శిష్యులు గురువుల్ని మోసగిస్తారు. మీ ఆశ్రమంలా మతపరమైనవి, ఆధ్యాత్మికమైనవి ఏమీ లేవు. మీరు శిష్యులకు యోగా, గీత నేర్పుతారు. క్రమశిక్షణతో మెలగడం నేర్పుతారు. మేము క్రమశిక్షణ నేర్పము, అది లేకుండా ఉండడమే ముఖ్యం. ఇప్పుడా సాధువు నాతో మాట్లాడడం లేదు. చాలా సంతోషం. మరో వికెట్ డౌన్.
**********
అతి క్రమశిక్షణ, పరిపక్వత కోసం ప్రయాస జీవితాన్ని యాంత్రికంగా మారుస్తాయి. జీవితంలో పరిపూర్ణంగా ఉండండి. పూర్తిగా నిబద్ధత లేకుండా ఉండమని నేను చెప్పట్లేదు. కాని, అతిగా చేసేది ఏదైనా విపరీతాలకు దారి తీస్తుంది. సమతుల్యతతో మెలుగుతూ, జీవితపు మాధుర్యాన్ని ఆస్వాదించండి.
*********
లక్ష్యాలకు, వాటి సాధనకు మధ్య వారధి వంటిది క్రమశిక్షణ. ఇప్పుడు మీకు తెలిసిందా నేనెందుకు క్రమశిక్షణకు కట్టుబడి ఉండనో ?
************
ఎవరో ఇలా అన్నారు - అతను సంపూర్ణుడు, కేవలం నిజమే మాట్లాడతాడు, సభ్యత కలవాడు, క్రమశిక్షణ కలవాడు, పద్దతిగా ఉంటాడు, మంచివాడు, ముక్కుసూటిగా ఉంటాడు. నేనిలా అనుకున్నాను - నేను అసంపూర్ణుడిని, ఎప్పుడో కాని నిజం చెప్పను, సభ్యత పాటించను, క్రమశిక్షణ లేనివాడిని, ఒక పధ్ధతి అంటూ లేనివాడిని, ఎల్లప్పుడూ మంచిగానే ఉండను, వక్రబుద్ధి కలవాడిని. నేను అతని వంక చూసి నవ్వి, ఇలా అన్నాను - అతను తిన్నగా ఉన్నాడు కనుక ఇతరులచే నరకబడే(బాధించబడే) అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నేను వంకరగా ఉంటాను కనుక, నా జోలికి ఎవరూ రారు.' నిజమే, కట్టెలు నరికేవారు తిన్నగా పెరిగిన చెట్లనే, తేలిగ్గా నరకచ్చని ఎంచుకుంటారు, కాని వంకర తిరిగిన చెట్లని, వదిలేస్తారు.
************
నేను నా జీవితంలో బాగా గంభీరంగా ఉండే వ్యక్తులను చూసాను. వారెప్పుడూ మందంగా ఉంటూ, ఇతరులను భయపెడుతూ ఉంటారు. నిజానికి, నేను వారిని చూసి జాలిపడుతూ, నవ్వుతూ ఉంటాను. వారి అహం వారిని తమ ఆప్తులతో, స్నేహితులతో హాయిగా కలిసిమెలిసి ఉండకుండా అడ్డుపడుతోంది. కొంతవరకు వారు మానసిక పక్వత లేనివారు. వారం క్రితం దైవం నాకు అటువంటి వ్యక్తిని కలిసే అవకాశాన్ని ఇచ్చారు. నేను నవ్వడం మొదలుపెట్టాను.
అతను - నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు ?
నేను - చాలా సేపటి నుంచి గంభీరమైన మొహం పెట్టుకుని కనిపిస్తూ, మీరు నాకు ఎంతో వినోదం కల్పిస్తున్నారు.
అతను - ఏం చెయ్యాలి ? ఎప్పుడూ అంతా నన్ను కవ్విస్తూనే ఉంటారు.
నేను - అటువంటివారు అనేవి విని వదిలెయ్యండి, శ్రద్ధగా ఆలకించవద్దు.
అతను - నన్ను చూసి నవ్వుతూ, మీరూ నన్ను కవ్విస్తున్నారు.
అది వినగానే నేను నవ్వు ఆపుకోలేక, బిగ్గరగా నవ్వసాగాను.
అతను - అంతగా ఎందుకు నవ్వుతున్నారు ?
నేను - సర్, మీ ఉద్రేకంలో, మీ పొట్ట బాగా ఉబ్బి, మీ ప్యాంటు జిప్ తెరుచుకుంది, ఇది నాకు మరింత నవ్వు తెప్పించింది.
అతను వెంటనే వెనక్కి తిరిగి జిప్ వేసుకునేందుకు వంగాడు. అలా వంగడంలో అతని ప్యాంటు వెనుకవైపు చిరిగి తెరుచుకుంది.
నేను నవ్వుతూ అక్కడినుంచి నిష్క్రమించాను, అల్లరి నవ్వుల వెల్లువ, అంతా దైవానుగ్రహం.
***********
మీ జీవితాన్ని మరీ క్రమబద్ధంగా ఉంచకండి. అతిగా నిబద్ధత కలిగిన జీవితం యాంత్రికంగా ఉండి, చివరకు బోర్ కొట్టేలా, నైరాశ్యం కలిగేలా చేస్తుంది. మరీ క్రమశిక్షణ కలవారు జీవితంలోని ఏదో ఒక దశలో ఊపిరాడనట్లు ఉక్కిరిబిక్కిరి అవుతారు. జీవితం సంపూర్ణమైనది. సరదాగా ఉండండి. తీవ్రమైన విషయాలు కూడా ఒకసారి మీరు వాటి వంక చూడగానే నవ్వించే విధంగా మారిపోవాలి. బాగా నవ్వండి. హృదయంలో వినోదాన్ని నింపుకుని అన్నింటివంకా చూడండి. అప్పుడు తీవ్రమైన విషయాలు కూడా నవ్వేలా చేస్తాయి. పరిపూర్ణమైన, సమతుల్యమైన జీవితాన్ని గడపండి. ఒక లీటరు ఆముదం తాగినట్లు గంభీరంగా మొహం పెట్టుకుని ఉండకండి. దైవానుగ్రహంతో జీవితాన్ని ఆస్వాదించండి. సరదాగా ఉండండి.
*************

No comments:

Post a Comment

Pages