శ్రీరామ కర్ణామృతము. - అచ్చంగా తెలుగు

శ్రీరామ కర్ణామృతము.

Share This

శ్రీరామ కర్ణామృతము.

- బల్లూరి ఉమాదేవి


శ్రీరామకర్ణామృతము అనుగ్రంథము నాలుగాశ్వాసములతో కూడిన గ్రంథరాజము.చెవులకు అమృతము వలె ఆనందము కలిగించునది అనే అర్థంలో ఈ గ్రంథము వ్రాయబడింది.437 శ్లోకములతో కూడిన ఈగ్రంథములో కొన్ని శ్లోకములు శ్రీరాముని స్తోత్రం చేస్తాయి.కొన్ని రామనామ మహిమను తెలిపితే మరికొన్నిసీతాదేవిని,లక్ష్మణుని,హనుమంతుని వర్ణిస్తాయి.మరికొన్ని వాల్మీకి రామాయణం చదవడం వల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తాయి.మొత్తంమీద పాఠకులగు శ్రీరామభక్తుల కర్ణములకు అమృతమే. ఈగ్రంథము  శ్రీ శంకరభగవత్పాదుల కృతమని ఈగ్రంథాన్ని పద్యానువాదం చేసిన "సిద్ధకవి"అభిప్రాయము.కాదని కొందరి మతము. కర్త యెవరైననూ వివిధ ఛందస్సులలో శ్రీ రామ స్తోత్రములను చెవులకు ఇంపొదవునట్లు రచించుటచేత ఈ గ్రంథమునకీ పేరు సార్థకమైనది. మనభారతీయులు ఏది వ్రాసినా,ఏపని చేసినా మంగళ శ్లోకములతో ప్రారంభిస్తారు.అలాగే ఈకవి కూడా 12 మంగళ శ్లోకములతో ఈగ్రంథాన్ని ఆరంభించారు.మరి మనం కూడా ఆస్వాదిద్దామా!  

శ్లో:  మంగళం భగవాన్ విష్ణుః మంగళం మధుసూధనః 
మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజః.
అనువాద పద్యము. 
శా:శ్రీరామున్ భువనాభిరాము ఘనరాజీవాప్త ధాముం బరం 
ధాముంబావన నాముఁబాలిత మునీంద్ర స్తోము నీలాంబుద 
శ్యామున్ సన్నుత సోము భానుకుల దుగ్ధాంబోధి సోమున్ మహో 
ద్ధామ ప్రాభవదైత్య భీము నతసుత్రామున్ మదిన్ గొల్చెదన్. 
          ************ 
శ్లో:మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే 
చక్రవర్తి తనూజాయ  సార్వభౌమాయ మంగళం.    1 
శ్లో:వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే 
పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.                                                             2 
పై రెండు శ్లోకములకు సిద్ధకవి అనువాదము చేసిన పద్యము 
చం:ప్రకటిత కోసలేంద్రునకు భవ్యగుణాబ్ధికి చక్రవర్తి పు 
త్రకునకు సార్వభౌమునకు రామునకున్ నిగమాంత వేదికిన్ 
సకమల మేఘవర్ణునకు సర్వ జగజ్జన మోహన స్వరూ 
పకునకు బుణ్య కీర్తికిఁగృపానిధి కెప్పుడు భద్ర మయ్యెడున్.
భావము:కోసలదేశమునకు అధిపతి యైనవాడు,మంచి గుణములకు సముద్రుడైన వాడు,చక్రవర్తియైన దశరథునకు పుత్రుడైనవాడు,సార్వభౌముడైనవాడు,వేదముల వల్ల,వేదాంతముల వల్ల తెలియ దగిన వాడు,నీలమేఘము వంటి శరీర కాంతి గలవాడు పురుషులను కూడ మోహింప చేయు శక్తిగలవాడు పవిత్రమైన కీర్తి కలిగినట్టి శ్రీరామచంద్రునకు శుభమగు గాక.
వ్యా:సకల గుణాభి రామునకు జనావళికి భద్రమొసగే రామునకు శుభముకోరుతూ సిద్ధకవి చెప్పినపద్యమిది.
శ్లో:విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీ పతేః 
భాగ్యానాం పరిపాకాయ భవ్య రూప్య మంగళం. 3 
శ్లో:పితృభక్తాయ సతతం భ్రాతృభిః స్సహ సీతయా 
నందితాఖిల లోకాయ రామచంద్రాయ మంగళం.    4 
తెలుగు అనువాద పద్యము:-
చం:ప్రకట విదేహ భాగ్యపరిపాకునకున్ ముదితాంతరంగ కౌ
శికునకు పితృభక్తునకు శీలికి భూమి సుతా సుమిత్ర పు
త్రక సహిత ప్రకాశునకు ఁబ్రస్తుత సాధుజనైక భవ్య మూ
ర్తికి రఘురామచంద్రున కరిస్ఫుట పాణికి భద్రమయ్యెడున్.
భావము: విశ్వామిత్రునకు యిష్టుడైన వానికి,జనకమహారాజు భాగ్యముల పంట యైనవానికి,మంచిరూపము కలిగిన వానికి సీతాలక్ష్మణులతో కూడి లోకములను ఆనందింప చేసినశ్రీరామచంద్రునకు శుభమగుగాక.
వ్యా:లోకములనానందింప చేయు  రామునకు కవులిరువురు శుభము పలుకుతున్నారు.
శ్లో: త్యక్త సాకేత వాసాయచిత్రకూట విహారిణే 
సేవ్యాయసర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం 5 
శ్లో:సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసి ధారిణే 
సంసేవ్యాయ సదా భక్త్యా సానుజాయాస్తు మంగళం 6.
తెలుగు అనువాద పద్యము
ఉ:హరికయోధ్యసౌఖ్య పరిహారికి సంచిత చిత్రకూటసం
చారి కుదారికిన్ వినుత సంయమికిన్ శరచాపధారికిన్
క్ష్మారమణీజ లక్ష్మణ సమన్విత మూర్తికి భవ్యకీర్తికిన్
శ్రీరఘురామచంద్రునకు సేవక శేవధికీన్ శుభంబగున్.
భావము:అయోధ్యా పట్టణమును విడిచినట్టియు,చిత్రకూట పర్వతమున సంచరించు చూ,మునులచే సేవింపబడుతూ,నాయకశ్రేష్టుడై
సీతా లక్ష్మణులతో కూడి ధనుర్బాణాదులనుధరించి భక్తులచే సేవించ దగినట్టి శ్రీరామునకు శుభమగు గాక.
వ్యా:తండ్రి మాట మేరకు అడవులకెళ్ళిన రామునకు కవులు మంగళము పలుకు చున్నారు.
శ్లో:దండకారణ్య వాసాయ ఖండితామర శత్రవే 
గృధ్ర రాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం7 
శ్లో:సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే 
సౌలభ్య పరిపూర్ణాయ సత్త్వోద్రిక్తాయ మంగళం 8
తెలుగు అనువాద పద్యము.
చం:అరివిధ్వంసికి దండకావన విహారామోదికిన్ గృధ్ర శే
ఖరనిఃశ్రేయ సదాయికిన్ శబరి సాకాంక్షార్పితారణ్య మా
ధురిశోధ్య ఫల భోక్తుకున్ ప్రవిలసద్దోసారికిన్ శౌరికిన్
వర సౌలభ్య గుణ ప్రపూర్ణునకు నానా భద్రముల్ చేకురున్.
భావము:దండకారణ్యములో నివసించి రాక్షసులను చంపి జటాయువునకు మోక్షమొసగి శబరి యొసంగిన ఫలములను కోరిన భక్త సులభుడైన సత్త్వ గుణ ప్ధానుడైన శ్రీరామచంద్రునకు శుభమగు గాక.
వ్యా:దుష్ట శిక్షణ,శిష్ట రక్షణా తత్తరత భక్తుల ననుగ్రహించే తీరు చక్కగా వివరింప బడినది.
శ్లో:హనూమత్సమ వేతాయ హరీశాభీష్ట దాయినే 
వాలి ప్రమథ నాయాస్తు మహాధీరాయ మంగళం.             9 
శ్లో:శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే 
జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం                     10. 
తెలుగు అనువాద పద్యము:
ఉ:పాలిత వాయు సూనునకు భక్తకపి ప్రవరేష్ట దాయికిన్
వాలివిదారికిన్ ధృతికి వారిధి సేతు నిబంధన క్రియా
శాలికి వీరరామునకు జండ పరాక్రమ పఙ్తికంఠ ని
ర్మూలన కేళికిన్ నృపతి ముఖ్య లలామునకున్ శుభంబగున్.
భావము:ఆంజనేయునితో కూడి సుగ్రీవునకు మేలొనరించి,వాలిని చంపిన రఘువంశ వీరుడైన వారిధి దాటి రాక్షసరాజైన రావణుని జయించినట్టి రణధీరుడైనట్టి రామునకు శుభమగు గాక.
వ్యా:కిష్కింధాకాండ సుందరకాండ కథ యంతయూ ఈశ్లోకములలో వివరింప బడినది.
శ్లో:అయోధ్య నగరీం దివ్యా మభిషిక్తాయ సీతయా 
రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం.                          11. 
శ్లో:విభీషణకృతే ప్రీత్యా విశ్వాభీష్ట ప్రదాయినే 
జానకీ ప్రాణనాథాయ సదా రామాయ మంగళం.
తెలుగు అనువాద పద్యము:
ప్రకటాయోధ్యపురిన్ ధరాతనయతో బ్రాపించి రాజాధి నా
యక సంస్తుత్య ధరాభిషేకము నిజంబై యున్నలోకాధి నా
యక రత్నంబునకున్ విభీషణ ప్రపంచాభీష్ట సంధాయికిన్
మకుటాకల్ప విభూషితాంగునకు నానా భద్రముల్ చేకురున్.
భావము:దివ్యమైన అయోధ్యలో ప్రవేశించి సీతామాతతో పట్టాభిషిక్తుడై విభీషణునకానందము కల్గించినట్టి సీతా ప్రాణనాథునకు శుభమగుగాక.
వ్యా:12 మంగళ శ్లోకములతో రామాయణ కథ సంక్షిప్తముగా చెప్పబడినది.
                                             (సశేషము.)

No comments:

Post a Comment

Pages