ఆర్తరక్షామణి - వడ్డాది సుబ్బరాయకవి
పరిచయం - దేవరకొండ సుబ్రహ్మణ్యం
ఆర్తరక్షామణి శతకకర్త వడ్డాది సుబ్బరాయకవి (1854-1938) క్రీ.శ. 30.07.1854 (ఆనందనామ సంవత్సరం, శ్రావణ శుద్ధ పంచమీ ఆదివారం) నగరము తాలూకా పాసెర్లపూడి గ్రామములో సూరపరాజు, లచ్చమాంబలకు జన్మించినాడు. ఈతడు హరితస గోత్రుడు. నియోగిశాఖ బ్రాహ్మణుడు. శతకాంతమున గద్యములో చెప్పిన రీతి, "సరసకవితాదురంధర, పండిత ప్రకాండపరిషద్బహూకృత, "కవిశేఖర", "సూక్తిసుధానిధి" బిరుదాంకిత, వడ్డాది సాధువంశక్షీరనీరాక రాచ్చనామాత్య పౌత్ర, హరితసగోత్ర, పవిత్రగుణకదంబలక్ష్మాంబా గర్భశూక్తిముక్తాఫల, సూరపరాజప్రధానతనూభవ, విబుధభుదేయ సుబ్బరాయనామధేయ" వీరి తాతగారు రాచ్చనామాత్యులని, వీరికి కవిశేఖర, సూక్తిసుధానిధి అని బిరుదులు ఉన్నాయని తెలుస్తున్నది. వసురాయకవిగా ప్రఖ్యాతి నొందిన ఈకవి, పదకొండు ఏళ్ళ వరకు కోరంగిలో ఉండి తరువాత దొడ్డమ్మపేటలో విద్యాభ్యాసము చేసినాడు. పదమూడేండ్లవయసులోనే ఈ కవి సహిత్యములో, వ్యాకరణములో దిట్ట అనిపించుకొన్నవాడు. వీరికి దొడ్డమ్మపేటలో ఉన్నప్పుడే పందొమ్మిదవ ఏట మొదటి వివాహము జరుగుట, భార్య గతించుట సంభవించినది. ఆతరువాత వీరు రాజమహేంద్రవరములో కళాశాలలో అధ్యాపకునిగా చేరి అనేకమందికి విద్యాదానము నొనరించినారు. వీరిచే తరిఫీదు పొందినవారిలో అనేకమంది ఉన్నతపదవులను పొందటమే వీరి ప్రతిభకు తార్కాణము.
సుబ్బరాయకవి బహుగ్రంధకర్త. వీరి రచనలు 1. ప్రభోదచంద్రోదయము, 2. ఆంధ్రవేణీసంహారము, 3. అభిజ్ఞానశాకుంతలము, 4. మల్లికామారుతము, 5. విక్రమోర్వశీయము, 6. చండకౌశికనాటకము, 7. నృసింహవిశ్వరూపము, 8. గౌతమీజల మహిమానువర్ణనము, 9. భక్తచింతామణి, 10. ఆర్తరక్షామణి, 11. మేఘసందేశము, 12. నందనందన శతకము, 13. సతీ స్మృతి, 14. సుత స్మృతి, 15. వసురాయ చాటూక్తి ముక్తావళి, 16. శ్రీసూక్తి వసుప్రకాశము, 17. సుగుణప్రదర్శనము, 18. సుమనోమనోజ్ఞము, 19. సూర్యశతకము, 20. భామినీవిలాసము, 21. భగవత్కీర్తనలు, 22. కుందమాల.
వీనిలో వేణీసంహారము అను అనువాద నాటకము ప్రసిద్ధికెక్కినది. వసురాయకవి కవియేకాక నాటకప్రియుడు. నాటకరంగమున ధర్మరాజు పాత్రలో పద్యములను స్పష్టముగా చదివితే ప్రేక్షకులు తన్మయులయ్యేవారట. వీరు అనువదించిన అనేక సంస్కృత నాటకములు పాఠ్యగ్రంధములైనవి.
వీరి సాంసారిక జీవితములో మానసికముగా అనేకకష్టములు ఎదురైనవి. వీరికి వరుసగా ఐదుగురు భార్యలు గతించిరి. ఆరవభార్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించిరి. మూడవభార్యకు ప్రహ్లాదమూర్తి అనునతడు పుట్టి 18 ఏండ్లవయసులో మరణించినాడు. సాహిత్య సీమలో ధ్రువతారగా వెలిగిన ఈ మహాకవి క్రీ.శ. 1938 సం|| మార్చ్ 2 వ తారీఖున స్వర్గస్థుడయ్యెను.
శతక పరిచయం:
ఆర్తరక్షామణీ శతకము భక్తిరస ప్రధానము. " రామా! యార్తరక్షామణి" మకుటంతో, 116 మత్తేభ శార్ధూల వృత్తాలలో రచించిన ఈ శతకము రామాయణ కధలనాధరంగా చేసుకొని శ్రీరాముని పై చెప్పినది. ఈశతకంలోని ప్రతిపద్యంలో భక్తి రసం తొణికిసలాడుతుంది. క్రింది పద్యాలను చూడండి.
మ. రవివంశంబున భారతక్షితి నయోధ్యన్ మర్త్యతం ద్రేత ను
ద్భవమై, పంక్తిరథుండు తండిరిగఁ, దత్కౌసల్య తల్లింగ, గా
రవ మారంగఁ బెరింగి, సిత సతిగా, రాజై చిరం బేలి తీ
వవనిన్, భక్తి భజింప నేఁడుఁ బ్రజ; రామా! యార్తరక్షామణీ
శా. శ్రీనాథుండని, చిన్మయుండని, ఋషిశ్రేష్ఠుల్ ప్రశంసించెరే
లా నిన్నొక్కని? సూర్యచంద్రకులజుల్ లాఁతుల్ నృపుల్ లేరె? యం
దేనిం గాని వచించిరే యటు? మహోత్కృష్టక్రియల్ సల్పరే
యానాఁడా ప్రభు? లీవు శ్రీహరివె; రామా! యార్తరక్షామణీ
శా. నీచారిత్రము క్షీరనీరధి; యటన్ నీ సద్గుణంబుల్ మణుల్;
నీచుల్ రాక్షసు లందులో మకరముల్; నీవే మహావిష్ణు వం;
దా చంద్రానన సీత తత్తనయ; నే నాసక్తిమైఁ దద్రసం
బాచాంతిం బొనరించుచుం దనియ; రామా! యార్త రక్షామణీ
తారకనామ మాహత్మ్యము అత్యద్భుతంగా వర్ణించిన తీరు చూడండి
మ. కలుషప్రాయపుజీవనంబును ద్రుటిం గావించెడున్ స్వచ్ఛమున్
దలఁపంగాఁ గతకంబు వోలెను భవన్నామంబు భవ్యంబు; మ
ర్త్యులకున్ మన్గడ నక్క ఱౌ సకలమున్ దొల్దొల్తఁ గల్పించి తీ;
వలసుల్ కానరు దాని వాడుకొన; రామా యార్తరక్షామణీ
శా. మాలల్ మాదిగబోయవాండ్రు మొదలౌ మర్త్యాధమవ్రాతముల్
మైలం భాసి తరింప వేఱు గలదే మార్గంబు? నీనామమే
మేలౌ మంత్రము వాండ్ర; కిందు గుఱి వాల్మీకుండె; హేమంబుగా
దా లోహంబునను స్పర్శవేధి? రఘురామా! యార్తరక్షామణీ
మ. తలక్రిందైనను మంచివిత్తు, ఫలవంతం బైననేలన్ మహా
ఫల మీఁజాలు; మరామరా యనుచు నవ్వాల్మీకి నీనామమున్
దలపైఁ బుట్టలు వెట్టునట్టు జపముందాఁ జల్పి, కల్పించెఁ గా
వ్యలలామంబు, భవచ్చరిత్రమును; రామా! యార్తరక్షామణీ!
రామాయణంలోని పలు సంఘటనలను అత్యంతమనోహరంగా చిత్రించిన కొన్ని పద్యాలను చూడండి.
మ. పదధూళిన్ శిల భామ యయ్యెఁ; బ్రబలుల్ పైకెత్త శక్యంబుగా
నిది, విలెక్కిడుచోఁ దునింగె; నృపులన్ వెన్నాడి ముయ్యేడుమా
ర్లు, దలల్ గొట్టినదిట్ట, నీయెదురఁ గేల్మోడ్చెన్; జరిత్రంబు నీ
యది చిత్రం, బతిమానుషంబు గద; రామా! యార్తరక్షామణీ
మ. వనితం జంపిన నద్ది శూరతకు లోపం బంచు, దుశ్శీల శూ
ర్పణఖం బుచ్చితి చెక్కి ముక్కు సెవు; లుగ్రందాటకం, బ్రహ్మఘా
తిని గానన్, గురునానతిం గెడపి ఖ్యాతిం గాంచి తాబాల్య మ
త్యనఘశ్లాఘ్యగుణాకరుండ వని; రామా! యార్తరక్షామణీ
మ. నది దాఁటించె గుహుండు మున్; శబరి పండ్లం బెట్టెఁ దర్వాత; న
ప్పిదపన్ భానుజుతోడ నేస్తమును గల్పించెన్ హనూమంతుఁ; డె
య్యది యిమ్మూఁటికి సాటి గాదు త్వదరణ్యావాసవృత్తంబులం;
దది, య, ద్దయ్యది, భక్తిపూతములు; రామా! యార్తరక్షామణి
ఈ శతకములో దృష్టాంతములు సామెతలు అనేకములు. సందర్భానుసారంగా వాడటంలో ఈ కవి అందెవేసిన చెయ్యి.
శా. కాకిం గోకిల యించుమించుగ నొకాకారంబునం దోఁచెడీం
గా; కంఠస్వర ముప్పు గప్పుర మనంగా నొప్పు నా రెంటి; కిం
తే కా కౌ నవి గర్భశత్రు; లొకదానిం గేర కుండంగ నొం
దాక న్నెల్గును, వాని కూడ్చితివి; రామా! యార్తరక్షామణీ
మ. అరియాకుల్ బలె, నెంతవారలకునే నాపత్తులున్ సంపదల్,
దిరుగం గాలము, వచ్చు వంతమెయి; నేదిం గాద యారెండిటం
దిర; మిక్కటులఁ గాచు ధైర్యమ యనన్ దృష్టాంతమౌ దీవ; శ్రీ
హరికిన్ నీకె ఘటిల్లె గష్టములు; రామా! యార్తరక్షామణీ
ఇటువంటివే మరిన్ని;
1. తనయుల్ సల్పినతప్పు లెప్పగిదిన్ దండ్రుల్ దయం దిద్దుకొండ్రనిశంబున్ క్షమియించి 2. తలక్రిందైనను మంచివిత్తు, ఫలవంతం బైన నేలన్ మహాఫలమీజాలు; 3. కవులందు గనుపట్టుఁ గొందఱయెడం గక్కుర్తి 4. మనుజాధీశులు లోకరంజనము సామాన్యంబుగాఁ జూడ, కిచ్చను వర్తింత్రు; ప్రజానుకూలతయె యుష్మన్ముఖ్యకృత్యంబు; 5. పలుపూబోండ్లను బెండ్లియాడు టవనీపాల స్వభావంబు
ఇలాచెప్పుకుంటూ పోతే ప్రతిపద్యము ఒక అమృతధార. నీతిభక్తి మయము.
మ. శకవర్షంబుల వేదభూత వసుభూసంఖ్యం దదాంగీరసన్
మకరంపున్నెలఁ గృష్ణపక్షదశమిన్ మందాఖ్యవారంబునం
ఫొకపద్యంబు రచించి, మాసమునకున్ యుష్మత్కృపాలబ్ధి నీ
యకలంకార్థకృతిన్ ముగించితిని; రామా భక్తమందారమా
శకసంవత్సరం 1854, ఆంగీరస సంవత్సరం మాఘబహుళ దశమి ఆదివారంకి సమానమైన 19 ఫిబ్రవరి 1933 న ఈశతకరచన సంపూర్ణమయింది.
మీరుచదివండి. అందరిచేతా చదివించండి.
No comments:
Post a Comment