సజీవ చిత్రాకారులు - ఆర్టిస్ట్ గిరిధర్ - అచ్చంగా తెలుగు

సజీవ చిత్రాకారులు - ఆర్టిస్ట్ గిరిధర్

Share This

సజీవ చిత్రాకారులు - ఆర్టిస్ట్ గిరిధర్ 

-భావరాజు పద్మిని 


చిత్రకళారంగంలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. ప్రముఖ చిత్రకారులైన తన తండ్రి – ఎ.వి.బాబు గారి వేలు పెట్టుకుని, ఆయన వద్ద ఓనమాలు నేర్చుకుని, తను ఎదిగేసరికి వచ్చిన కంప్యూటర్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, కాలానికి అనుగుణంగా తనను తాను మలచుకుంటూ, రాణిస్తున్న చిత్రకారులు – గిరిధర్ గారు. వారి పరిచయం ఈ నెల తెలుగు బొమ్మలో ప్రత్యేకించి, మీ కోసం.
నమస్కారమండి. మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. 
నమస్కారం. నా పేరు అరసవల్లి గిరిధర్. మా తాతగారిది భీమవరం, వాస్తు సిద్ధాంతి. ఆ తర్వాత నాన్నగారు వాళ్ళు
మచిలీపట్నం వచ్చేసారు. నేను పుట్టేసరికి వాళ్ళు విజయవాడ వచ్చేసారు. నా డిగ్రీ దాకా అక్కడే గడిచింది.
మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
మా నాన్నగారు ఆర్టిస్ట్ అండి. వారి పేరు విశ్వనాథ్ బాబు(A.V.Babu).  ఆయన కమర్షియల్ డిసైనింగ్, పబ్లిసిటీ డిసైన్స్, బ్లాక్ మేకింగ్ అవీ చేసేవారు.  చేసేవారు.  చిన్నప్పటినుండి ఆయన్ను చూసేవాడిని. ఆయనవద్ద నేర్చుకోడానికి వచ్చేవారు, ఆర్ట్ వాతావరణం ఉండడంతో ఆర్ట్ లోనే స్థిరపడ్డాను. ఆయనకు సాయపడడం, చూడడం వంటివాటితో చిత్రకళ పట్ల ఒక మక్కువ ఏర్పడింది.
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
డిగ్రీ(B.com) అయ్యాకా, నా తరం వచ్చేసరికి, అప్పటికే కంప్యూటర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఫుల్ టైం కంప్యూటర్స్ తో , నాన్నగారి వృత్తి కొనసాగిస్తూ, పుస్తకాలకి ముఖచిత్రాలు వెయ్యసాగాను. పెద్ద పెద్ద పబ్లికేషన్స్ నవోదయ వంటివి విజయవాడ లోనే ఉండడంతో వాళ్ళ పుస్తకాలకు ముఖచిత్రాలు వేసాను, ఇప్పటికి ఐదు వేల దాకా వేసి ఉంటాను. ఈ మధ్యన యండమూరి వీరేంద్రనాథ్ గారి మొత్తం టైటిల్స్ నేనే చేసాను. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో MFA కూడా చేసాను.
ఆ తర్వాత  ఈ కంప్యూటర్  వర్క్స్  బోర్ కొట్టి, పెయింటింగ్స్, పోర్త్రైట్స్, లైన్ డ్రాయింగ్స్, మొదలుపెట్టాను.
మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
ప్రత్యేకించి చిత్రకళను ఎక్కడా అభ్యసించలేదు. కాకపొతే, వేముల కామేశ్వరరావు గారని, మా పెదనాన్న గారు ఉన్నారు. ఆయన విజయవాడలో ప్రముఖ చిత్రకారులు. ఆయన మొన్నీమధ్యన రెండేళ్ళ క్రితం దాకా, అంటే  చనిపోయే ముందు దాకా 98 ఏళ్ళ పాటు బొమ్మలు వేస్తూనే ఉన్నారు. ఈ మధ్య తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకా, ఉగాది పురస్కారం ఇచ్చారు. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ప్రతి ఆదివారం ఆయనవద్దకు వెళ్లి, ఒక గంట కూర్చునేవాడిని, ఆయన చెప్పినట్టు వేసేవాడిని. ఇంకో నేపధ్యం ఏమిటంటే, మా నాన్నగారి మేనత్త కొడుకు, ఈశ్వర్ అని అనేక సినిమాలకు పబ్లిసిటీ డిసైనర్ ఉన్నారు. ఆయన దాదాపు పదివేల సినిమాలకు పైన పబ్లిసిటీ డిసైన్స్ చేసారు. ఆయన నాకు ఇన్స్పిరేషన్.
ఈశ్వర్ గారు, మా పెదనాన్నగారు, ఎస్. ఎం. పండిట్ నేను అభిమానించే చిత్రకారులు.
ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
ఒడిదుడుకులు ఉంటాయండి. కుటుంబాన్ని బాలన్స్ చేసుకుంటూ, బాధ్యతలు నిర్వహిస్తూ, బొమ్మలు వేసేవాడిని. నాన్నగారు ఈ వృత్తి వద్దన్నారు. ICWA కూడా రాసాను. కాని, చిత్రకళ పట్ల ఎనలేని మక్కువతో ఇందులోనే ఉండిపోయాను.
మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
ఈ మధ్య బాపు గారు చనిపోయినప్పుడు, మా ఆర్టిస్ట్ లు విజయవాడలో సంస్మరణ సభ పెట్టారు. ఆ సభ కోసం
బొమ్మను నన్నే వెయ్యమన్నారు. అది సింపుల్ పోర్ట్రైట్, ఒక్క పూటలో 3,4 గంటల్లో వేసాను. న్యూస్ పేపర్స్ లో కవేరేజ్ బాగా వచ్చింది, అందరూ మెచ్చుకున్నారు.
ఆ తర్వాత విజయవాడలో జరిగే పుస్తక మహోత్సవంలో, ప్రతి ఏడు చనిపోయిన సాహితీవేత్తల పేర్లతో డయాస్ పెడతారు. ఆ ఏడాది ‘బాపు సాహిత్య వేదిక’ అని పెట్టి, 11 రోజులూ పెయింటింగ్ ని డయాస్ మీద పెట్టారు. ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తాను.
ఒక పుస్తకం కోసం మాలతి చందూర్ గారి ముఖచిత్రం ఒకటి వేసాను. ఆ తర్వాత ఏడాది సాహిత్య వేదికకు ఆవిడ పేరే పెట్టి, ఆ 11 రోజులూ నేను వేసిన మాలతి గారి బొమ్మ వేదికపై పెట్టారు. ఇదీ నాకు దక్కిన అరుదైన గౌరవమే.
బాపు గారిని ఎప్పుడైనా కలిసారా ?
నేను ఒకసారి ఎప్పుడో బాపు-రమణ ల ముఖాముఖి లో బాపు గారిని కలిసాను, అంతే. తర్వాత బాపు గారు నా గురించి అడిగినట్టు, నవోదయ రామోహన్రావు గారు చెప్పారు. బాపు గారు గతంలో మాదిరెడ్డి సులోచన గారు వంటివారికి వేసిన ముఖచిత్రాలు  ఆ పుస్తకాలు రీ పబ్లిష్ చేస్తుంటే, నేను వేసాను. అది చూసి ఆయన నా గురించి అడిగారని తెలుసుకుని, చాలా సంతోషించాను.
మీరు పొందిన మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
నేను ఎక్కువ ప్రింట్ మీడియా లో కమర్షియల్ వర్క్స్ చేసాను. మనం సాహిత్యం పరంగా కృషి చేస్తేనే పేరొస్తుంది. 97 నుంచి, dtp, కలర్ వర్క్స్, డిసైనింగ్, అన్నీ చేస్తున్నాను.
బొమ్మలు అంటే, ఒకసారి వైజాగ్ వెళ్తున్నప్పుడు ఒక ఆదివాసీ స్త్రీని ఫోటో తీసి, బొమ్మ వేసాను, దానికి విశేషమైన ఆదరణ లభించింది.  దానికి ఎక్సిబిషన్ లో మూడో ప్రైజ్ వచ్చింది. మూడు సార్లు పెట్టినా, ప్రెస్ వాళ్ళు ఫోటోలు తీసుకుని, పేపర్ లో వేసారు.
చేత్తోనూ, కంప్యూటర్ మీదా కూడా బొమ్మలు వేస్తాను. కాని, పెయింటింగ్స్ వెయ్యటం మొదలు పెట్టాకే నాకు  గుర్తింపు లభించింది.
మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నా శ్రీమతి పేరు సంధ్య. తను నాకు అన్ని విధాలా సాయపడుతూ ఉంటుంది. తనూ కంప్యూటర్స్ అవీ నేర్చుకుంది.  Dtp వర్క్ అదీ చేస్తూ ఉంటుంది. నాకు చేదోడువాదోడుగా ఉంటుంది.
మా ఫ్రెండ్స్ అంతా కలిసి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో MFA. చేసాము. ‘విజయవాడ ఆర్ట్ సొసైటీ’ అన్న ఒక సంస్థ పెట్టాము. ఎక్సిబిషన్ లు, పిల్లలకి డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం చేస్తున్నాము.
మీ దృష్టిలో బొమ్మ అంటే ఎలా ఉండాలి ?
బొమ్మని చూస్తుంటే చూడాలని అనిపించాలి. ఒక సమ్మోహనంగా ఉండాలి. కళ్ళల్లో జీవం ఉట్టిపడాలి.
మోడరన్ ఆర్ట్ మీద నాకు అవగాహన లేదు. రియలిజం ఇష్టం, అయితే, మోడరన్ ఆర్ట్ ట్రైనింగ్ తీసుకున్న వారు వేస్తే, ఆ బొమ్మలు బాగుంటాయి.
భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
చాలా బాగుంది, కాని ఆదరణ తక్కువగా ఉంది. ఎక్సిబిషన్ లకు వచ్చి, చూసి వెళ్ళిపోతారు తప్ప కొనరు. మెచ్చుకుంటారు, కాని ప్రోత్సాహం ఉండదు. ఇక్కడ ఇదివరకు ఒక గేలరీ మొదలుపెట్టారు. అందులో బొమ్మలు పెడుతున్నాము. ఇప్పుడు ఆర్ట్ ను ఫుల్ టైం ప్రొఫెషన్ గా ఎవరూ తీసుకోవట్లేదు. అంతా పార్ట్ టైం చేసేవారే. నెమ్మదిగా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావిస్తున్నాను.
కృతఙ్ఞతలు గిరిధర్ గారు, మీరు మరెన్నో మంచిమంచి బొమ్మలు వేసి, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మనసారా కోరుకుంటున్నాము. నమస్కారం.

No comments:

Post a Comment

Pages