కార్తీక మాస ప్రాశస్త్యము - అచ్చంగా తెలుగు

కార్తీక మాస ప్రాశస్త్యము

Share This

కార్తీక మాస ప్రాశస్త్యము

చెరుకు రామమోహనరావు 


పాశ్చాత్యులు, వారిలో ఎ దేశస్థులో గుర్తులేదు, Light Trapping System అన్న ఒక పద్ధతిని వారి వారి పేర్లమీద ప్రచారమునకుతెచ్చినారు. మరి దేనికయినా ఒక మూలము అవసరము కదా! దానికి మూలము మన దేశమే! మనము పిలుచుకొనే దీపావళి, దీపోత్సవము , కార్తీక దీపారాధన ప్రభావమే వారి పుర్రెలో పుట్టిన భావము. అసలీ దీపోత్సవము వెనుక దాగియున్న శాస్త్రీయతను చూద్దాము. పంటల వర్షములు వర్ష ఋతువులో వర్షము పడుట మూలమున పెరిగిన పంటలు కోతలకు రావటముతోఅవి కోయుటవలన వానిపై నివసించిన కీటక,పతంగములు ఇళ్ళలోనికి రావటము ఎక్కువౌతుంది. భూమి లోపల చేరిన నీటి కారణమున అంతకు ముందు ఋతువులో గ్రహించిన వేడితో మిశ్రితమౌట వలన వివిధ వాయువులు (విషవాయువులు ఎక్కువగా వుంటాయి) ఆవిరులరూపములో వాతావరణములో ప్రవేశించుతాయి. పగలైతే సూర్య ప్రకాశము వుంటుంది కానీ రాత్రికి ఎట్లు ? అందుకే కార్తీక మాసములో నూనె దీపములు వెలిగించేది. మన ఋషులు ద్రష్టలు. వారు అనుగ్రహించిన విధానమే ఈ కార్తీక దీపారాధన. దీనికి కేవలము నూవుల నూనెను మాత్రమె ఉపయోగించ వలెనన్నది వారి యాదేశము. ఇందుకు ముఖ్యమైన కారణములు రెండు. ఒకటి ఆ దీపములనుండి వచ్చు పొగ విషవాయువులకు విరుగుడుగా పని చేస్తుంది. ఆ దీపమూల వెలుగులకు ఆకర్షింపబడి క్రిమి కీటక పతంగశలభములు, అందులో ఆహుతియగుట చేత మానవాళి రోగముల నుండి రక్షింపబడుతుంది. ఇంత గొప్ప విషయమును పేరుకొరకు ప్రాకులాడకుండా ప్రజలకు పంచినవారు మన ఋషులు. మనమేమి చేసినా వారి ఋణము తీరదు కానీ మనసారా మరచి పోకుండా వారిని తలచుకొంటూ వుందాము. ఇక కార్తీక మాసములోనికి అడుగు పెడదాము.
కృత్తికా నక్షత్రమునకు, పున్నమి చంద్రుడు దగ్గరగుటవల్లఈ మాసమునకుకార్తీక మాసమని పేరు. కార్తీకమాసంలో సూర్యుడు తులారాశియందు ప్రవేశించును. ఆ సమయమున సమస్త నదులు కూడా గంగానది తోసమానముగా విష్ణుమయమౌతాయనికార్తీక పురాణమున చెప్పబడినది. కార్తీకమాసంవర్షాకాలం ముగిసిన తరువాత వస్తుంది. అంటే శరదృతువులోని చివరి నెల కార్తీకము.అప్పటిదాకా వానలు పడి చిత్తడిగా ఉన్న భూములు పొడివారతాయి. అటు వానలు, ఇటు ఎండలు లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ఇటువంటి వాతావరణము ఇటు శరత్తులోను అటు వసంతములో వస్తాయి.అందువలన అన్ని పండుగలకు నోములకు  ఆలవాలము.
విష్ణుమూర్తి ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకుపక్రమించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. పరమ శివుడు త్రిపురాసురుడను రాక్షసుని కార్తీక పౌర్ణమి నాడు సంహరించి జగతిని కాపాడినాడని మనకు కార్తీక, శివ పురాణములద్వారా తెలియవస్తుంది.
ఈ మాసమున ప్రాతః కాలముననే లేచి శిరస్నానం చేసినవారు పుణ్యప్రదులౌతారని చెప్పబడినది.స్నానము , వాపీ కూప,తటాక నదీ జలములందు స్నానమాచరించ వలయునని యున్నది.ఆ విధముగా స్నానాదులను చేసి తమ జప తపములను దీక్షతో చేసుకొనేవారు అశ్వమేధ ఫలాన్ని పొందుతారని వసిష్ఠ మహర్షి వివరణ. ఈ కాలము నదీ స్త్నానములు చేయుట అంత సులభము కాదు . అందుకే‘ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు’ అని ఇంట్లో స్త్నానము చేసుకోనేటపుడు చెప్పుకొనవలెను.సోముడు అనగా చంద్రుడు శివుని మౌళియందు ఉంటాడు కాబట్టి కార్తీక సోమవారం శివునికి ఎంతో ప్రీతికర మైనది. నిజానికి ఈ మాసములోని ప్రతి రోజూ అత్యంత పుణ్య ప్రదమైనదే! ఈ మాసములో నైనా కుటుంబీకులు ప్రతిరోజూ తెల్లవారుఝాముననే లేచి నదీ తటాకములందు కాకపోయినా ఇంటిలోనేస్నానము చేసిసంప్రదాయ దుస్తులు ధరించి శివ దర్శనము కావించి ధూప దీప నైవేద్యములు సమర్పించి స్వామికి రుద్రాబిషేకం జరిపించిన చేసిన పాపాలుపోయి మోక్ష ప్రాప్తి కలుగును అని కార్తీక పురాణము తెలుపుతున్నది. అసలు కార్తీక స్నానమును గూర్చి ఈ శ్లోకమును ఒకసారి చదవండి.
కార్తీకేహం కరిష్యామి ప్రాతఃస్నానంజనార్దన
ప్రీత్యర్థతవదేవేశ దామోదరమయస్సహః
ఓ జనార్దనా, దేవతలకు అధిపతివైన దామోదరా నిన్ను ప్రసన్నము చేసుకొనుటకు నేను కార్తీక మాసమందు ప్రాతః కాలమందే స్నాన మాచరిస్తున్నాను.ఈ మాసములో చేసే పవిత్ర కర్మలను ' కార్తీక దామోదర ప్రీత్యర్థం' అని ఆరంభింప వలెనని శాస్త్రములు చెబుతున్నాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. తులసి చెంత హరిపూజసత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ అత్యంత పుణ్యప్రదం. అసలు తులసి అంటేనే తులనమునకు సాటి లేనిది అని అర్థము .కాబట్టి తులసి అంత ప్రధానము, పవిత్రము అయినది. ఆషాఢ ఏకాదశి (శయనైకాదశి) నాడు యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణువుకార్తీక ఏకాదశి నాడుమేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయని ముందే చెప్పుకున్నాము. అందుచేత 'త్యజనిద్రాం జగత్పతే, త్వయిస్సుప్తే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్" (నీవు నిదురించితే లోకము నిదురిస్తుంది,నీవుమేలుకొంటే లోకము మేలుకుంటుంది, కాబట్టి స్వామీ నిద్ర వదులు ) అనే మంత్రంతో ప్రార్థనచేసి, శ్రీమహావిష్ణువును అర్చించి, ఉపవాసముంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో అనుకున్న కార్యాలు చేకూరుతాయన్నది పెద్దల మాట. అలాగే ఈ రోజున భాగవతంలో "అంబరిషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు జరుగుతుందన్నది ఆర్యవాక్కు.
అదేవిధంగా...
అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియో శివః’ అన్నది పెదాల మాట.అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును అన్నది శాస్త్ర వచనము. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయముగా ఈ ప్రదోషకాలము చెప్పబడినది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ |
అని ఒక్క బిల్వ దళము శివునికర్పించితే ఎంతటి పాపమైనా పటాపంచాలే !
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
కార్తీకమాసానికి సమానమైన మాసము, సత్యయుగంతో సమానమైన యుగము,వేదములతో సమానమైన శాస్త్రము, గంగ తో సమానమైన నది ఏదీ లేదన్నది శాస్త్ర వచనము.
ఈ మాసంలో వస్తద్రానం, హిరణ్యదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు పొందడమే కాకుండా, తేజస్సు, యశస్సు, కార్యసిద్ధి, జ్ఞానలబ్ధి, సౌభాగ్యాలు కలుగుతాయి.కార్తీక శుద్ధ పౌర్ణమినాడు కేదారేశ్వర వ్రతమాచరిస్తే సమస్త సౌభాగ్యములు కలుగునని వ్రతరాజము తెలుపుతున్నది, శుక్ల దశమి నాడు ”యాజ్ఞవల్క్య జయంతి ”శుక్ల ఏకాదశి' మహా పర్వ దినము నక్తము పాటించి అంటే రాత్రి దాకా భోజనము లేకుండా యుండిచంద్ర దర్శనము అయిన తరువాత శివుని దర్శించి భోజనం చేస్తారు, ఆలయాలలో ఆకాశ దీపాలు పెడతారు, ఈ మాసమునందలి శుక్ల ద్వాదశి ని ”చిలుకు ద్వాదశి లేక క్షీరాబ్ధి ద్వాదశి ”అంటారు. క్షీరసాగర మంథన ఫలితమును దేవతలు ఈ దినము పొందినట్లుగా చెప్పుకొంటారు.
ఈ దినము సాయంకాలము ఉసిరిక చెట్టు క్రింద, తులసి చెట్టు వద్ద పూజలు చేస్తారు. ఈ మాసము వనభోజనములకు ఎంతో వనరైనది. మనకు ' కరతలామలకము' అన్న ఒక సామెత వుంది. ఆమలకము అంటే ఉసిరిక కాయ.దానికి అనేకమయిన ఔషధగుణములున్నాయి. కార్తీక మాసములో ఆ చెట్టు ఇంకా ప్రతిభావంతమౌతుందట. అందుకే ఈ మాసములో ఆ చెట్టుకు పూజ చేసి దాని క్రింద భోజనము చేయుట శుభప్రదమని అని పురాణ వివరణ.కార్తీక మాసపు శుక్ల పక్షములో వనభోజనము చేసినవారు పాప విముక్తులై విష్ణు ధామాన్ని పొందుతారు అన్న విషయము మనకు ఈ శ్లోకము ద్వారా తెలియుచున్నది.
యః కార్తీకే శితే పక్షేవనభోజన మాచరేత్
సయాతి వైష్ణవం ధామ సర్వ పాపై ప్రముచ్యతే
ఈ మాసము అన్ని శివ క్షేత్రాలూ క్రిక్కిరిసి వుంటాయి. నేను చాలా క్లుప్తముగా ఈ మాసము నందు అరుణాచల క్షేత్రమును గూర్చి మీ ముందుంచుతాను.
భూమండలంలోనే అతి పెద్ద స్వయంభు మూర్తి కలిగిన క్షేత్రము అరుణాచలము లేకతిరువణ్ణామలై. పర్వతంపైన వున్న ఒక్కొక్క రాయి ఒక్కొక్క స్వయంభు లింగం. అడుగుకొక లింగం చొప్పున చిన్న చిన్న శకలాలుసైతం కోటాను కోట్ల లింగాలు అని అగస్త్యులవారు అన్నదిఆధ్యాత్మిక రహస్యం.అరుణాచలమేపరమేశ్వరుని పుణ్యప్రదమైనశరీరమని తెలియజేయడం వల్ల, పొద్దు గడపడానికో కారణం లేకనో పర్వత ఆరోహణ చెయ్యకూడదు. మొక్కు బడి అయితే పర్వతం మీద కాలు మోపవచ్చు. కార్తీక దీపంనాడు, జ్యోతికవసరమైన నూనె, నెయ్యి, పత్తి కర్పూరము తీసుకొని పోవచ్చు. ఈ కైంకర్యాల గురించి తెలియని వారికి సహాయపడడానికి కొండనెక్క వచ్చు. మిగతా సమయాలలో కారణం లేకుండా కొండనెక్కడానికి ప్రయత్నము చేయకూడదు.శివనామ కీర్తన చేస్తూ కొండనెక్కేవారికి ఫలం అధికముగా ఉంటుంది.
పలుసిద్ధ పురుషులు ఆధ్యాత్మిక పరమైన మహిమగల మూలికల తైలాలను కార్తీకదీపం రోజున, ఉపయోగించే ఆవు నేతిలోమిశ్రమం చేస్తారు. వాటి మహిమతో, వెలుగుతున్న జ్యోతినుండి వెలువడే పవిత్రమైన ధూమంగాలితో కలిసి భూమండలంలోనే కాక యితరలోకాలలో సైతం ప్రసరించి దుష్ట శక్తులను నశింప జేస్తుంది.
సిద్ధపురుషులు, బ్రహ్మజ్ఞానులవంటి మహితాత్ములు చేసిన పూజాఫలములను , మూలికాతైల కర్పూర ములతోవెలిగింపబడినజ్యోతిరూపములో ప్రస్ఫుటము కాగా వానినిధరించి భగవంతుడుప్రకాశిస్తున్నాడు. మానవుని ప్రయత్నంవల్ల జ్వలింపచేసిన జ్యోతి మాదిరి కనుపించినా, భగవంతుడు తన భక్తులనుజ్యోతిరూపంలో కటాక్షించే పవిత్రమైన రోజు ఈ దీపోత్సవ దినము.ఈ సమయంలో పర్వతపు అంచులలోనక్షత్ర్రములవలె ప్రకాశించేవి,జ్యోతులు లేకదివిటీలు కావు. అవి మహర్షులు, దేవతల పవిత్ర స్వరూములగు నక్షత్రములని విశ్వాసము. భక్తీ భావము ఒకటైతే భగవంతుడు కనిపిస్తాడు.
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుం విష్ణోశ్చ హృదయం శివం
యథా శివమయోర్విష్ణుః ఏవం విష్ణు మయఃశివః
యధాంతరన్నపశ్యామి తథామే స్వస్తిరాయుషి
శివకేశవ అభేదమును ఎవరు గుర్తించుతారో వారు కలకాలమూ సుఖ సంతోషాలతో తులతూగుతారు.
స్వస్తి.

No comments:

Post a Comment

Pages