కార్తీక మాసం - అచ్చంగా తెలుగు

కార్తీక మాసం

Share This

కార్తీక మాసం


కార్తీక మాసం అనగానే శివుడు, అభిషేకం, తెల్లారి చన్నీటి స్నానాలు, నక్తాలు, సాయంత్రం దీపాలు, దానాలు, నదీ సముద్ర స్నానాలు, వ్రతాలు, వనభోజనాలు...ఇలా ఎన్నో పుణ్య కర్మలు గుర్తుకు వస్తాయి. పవిత్రమైన భావన మనసంతా నిండి సత్సంకల్పం ఏర్పడుతుంది. దీనికి కారణాలు ఉన్నాయి. ఇది శరదృతువులో రెండవభాగం. అంటే చలి మొదలయ్యే సమయం. భారతదేశమంతటా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సూర్యుడు తులారాశినుండి వృశ్చికరాశిలో ప్రవేశించే శుభసమయం. ఈ సమయంలో గంగానది ద్రవరూపం దాల్చి సమస్త నదీనద జలాలలో ప్రవేశిస్తుంది. విష్ణు పాదమునుండి జన్మించిన గంగ ఇలా సమస్త జలాలలో నివసించటంతో ఆ జలాలన్నీ విష్ణు నివాసాలవుతాయని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో సహృదయతతో స్నాన, దాన, జప, పూజాదులు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అని కార్తీకపురాణం వివరిస్తుంది. వాటి వివరాలు:
1. కార్తీక సోమవారము నాడు:
కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరిస్తే శివానుగ్రహాన్ని పొందుతారని, వేయి ఆశ్వమేథ యాగాలను చేసిన ఫలము ఈ  సోమవార వ్రతం వలన కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది. ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలు:
1. ఉపవాసము - ఓపిక గలవారు పగలంతా భోజనం చేయకుండా ఉండి సాయంత్రం శివపూజ చేసి, చుక్కలు కనిపించిన తరువాత తులసి తీర్థం సేవించటం
2. ఏకభుక్తము - రోజంతా భుజించకుండా ఉండలేని వారు ఉదయం పూజాది కార్యక్రమాలు చేసుకొని, సాయంత్రం తీర్థాన్ని మాత్రమే సేవించటం
3. నక్తము - పగలంతా ఉపవాసం చేసి, రాత్రి నక్షత్రాలను చూసిన తరువాత భోజనము గాని, అల్పాహారం గాని చేయటం
4. అయాచితము - మనంతట మనము అడగకుండా ఇతరులు పిలిచి పెట్టే భోజనం స్వీకరించటం
5. స్నానము - పైవేవీ చేయటానికి ఓపిక లేకపోతే, మంత్ర పూర్వకముగా స్నానము, జపము చేసినా చాలు
6. తిలదానము - మంత్రము, జపము తెలియని వారు నువ్వులు దానం చేసినా చాలు.
ఈ పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము ఆచరించినట్లే. ఈ వ్రతం చేసే వారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేయటం విశేష ఫలితాన్నిస్తుంది.
స్నాన విశేషాలు:
ఈ నెలలో సూర్యాస్తమయమునకు ముందే లేచి భగవంతుని నామస్మరణతో, అభ్యంగనం లేకుండా స్నానం చేయాలి. వీలున్నవారు ప్రతిరోజూ నదీ స్నానం, సముద్ర స్నానం చేస్తే ఎంతో ప్రశస్తం. బ్రాహ్మీ ముహుర్తాన (తెల్లవారు జామున నాలుగు గంటల సమయం) చన్నీటి స్నానం నిజమైన కార్తీక స్నానం. గంగానది అన్ని జలాలలోనూ నివసిస్తుంది కాబట్టి అంతటి పవిత్రత ఈ స్నానానికి ఉంది. గంగేచ యమునేచైవ అన్న శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి. కార్తీక స్నానాలు సమస్త పాపనాశకాలు. సకల మలిన హరణాలు.
కార్తీక దీపారాధన వలన ఫలితాలు:
కార్తీక మాసంలో సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయటం వలన విశేషమైన ఫలం లభిస్తుంది. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో గానీ, చేత కాని వారు ఆముదంతోనైనా దీపం వెలిగిస్తే చాలా పుణ్యం కలుగుతుంది. ఇది మోక్ష ప్రదాయిని. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేది జ్యొతి. పరబ్రహ్మ స్వరూపము. సర్వేశ్వరుడైన శ్రీమహావిష్ణువు నిద్రనుండి లేచే సమయంలో ఆ పరమాత్మ చైతన్యంతో మనలను అనుసంధానం తొందరగా చేసేది ఈ దీపారాధన.
విష్ణుపూజ:
కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో భగవద్గీత పారాయణం చేసిన వారికి పాపాలన్నీ తొలగుతాయి. ఈ మాసంలో తులసీదళాలతో పూజ చేసే వారికి సమస్త పాపములు తొలగి విష్ణు సన్నిధి కలుగుతుంది.
శివపూజ:
శివుడు త్రిపురాసురులను సంహరించింది కార్తీక పౌర్ణమి నాడు. శివుడు అభిషేక ప్రియుడు. చెంబెడు నీళ్లతో అభిషేకం చేస్తే అనుగ్రహించే బోళాశంకరుడు. కార్తీక స్నానం చేసి శుద్ధమైన శరీరముతో, నిర్మలమైన మనసుతో అభిషేకం చేస్తే స్వామి కరుణ అపారంగా అందుతుంది. అలాగే, ఆయనలో సగభాగమైన గౌరికి త్రిలోచన గౌరీవ్రతం చేసేది శుద్ధ తదియనాడు. దీపారాధన, కుంకుమార్చన, నమక చమక సహిత రుద్రాభిషేకములు, రుద్ర హోమములు ఈ మాసములో విశేషమైన ఫలితాలను ఇస్తాయి.
వనభోజనం:
కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వనభోజనం చేయటం సమస్త పాపనాశకరం, సకల శుభకరం. జపతపహోమాదులు చేసిన ఫలితం ఈ వన భోజనానికి ఉంది. చేయవలసిన పద్ధతి - ఉసిరి చెట్టు ఉన్న వనంలో ఆ చెట్టు మూలాన విష్ణుమూర్తి సాలగ్రామాన్ని ఉంచి, గంధపుష్పాదులతో పూజించి అందరిని పిలిచి భోజనం పెట్టి, వారితో కలసి భోజనం చేయాలి.
దీపదానం:
కార్తీక మాసంలో దీపదానం చేయటం విష్ణుసన్నిధిలో దీప దానం చేసిన వారికి విష్ణుమూర్తికి గంధ పుష్పాదులతో అభిషేకం చేసిన ఫలితం లభిస్తుంది. ప్రతిరోజూ ప్రత్తిని శుభ్రపరచి, బియ్యప్పిండి లేదా గోధుమపిండితో ప్రమిద చేసి ఆవునెయ్యితో వెలిగించాలి. చివరిరోజున బ్రాహ్మణుని పిలిచి వెండి ప్రమిదె, దానిలో బంగారు రేకుతో వ్రత్తిని చేయించి, వీటిని బియ్యప్పిండి మధ్యలో ఉంచి, పూజా నివేదనలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి స్వయంగా దీపదానం చేయాలి. అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని, సకల సంపదలను ఇచ్చే దీపదానాన్ని చేస్తున్నాను అని పిండితో సహా దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. దీనివలన మనస్సు, వాక్కు, కర్మలలో గల పాపాలన్నీ తొలగిపోతాయి.
కార్తీక మాసంలో పుణ్యతిథులు:
సోమవారములతో పాటు కాకుండా కార్తీక మాసంలో వచ్చే విశెషమైన పుణ్యతిథులు:
శుక్ల పక్షంలో:
- పాడ్యమినాడు ఆకాశ దీపదర్శనము. ఈ దీపాన్ని ఇంటి ముంగిట కానీ లేదా విష్ణు లేదా శివాలయాలలో వెలిగించాలి.
- విదియనాడు భగినీ హస్త భోజనం, అనగా సోదరులు సోదరి ఇంట భోజనం చేయాలి. అక్కాచెల్లెళ్లకు బహుమతులు, వస్త్రాలు ఇచ్చి ఆనందంగా ఉండే రోజు.
- తదియనాడు త్రిలోచనగౌరీవ్రతము. చేయలేని వారు గౌరికి కుంకుమార్చన చేయవచ్చు.
- చవితినాడు నాగుల చవితి. శివునికి ఆభరణమైన నాగేంద్రుని ప్రీతితో పూజిస్తే దోష హరణము. శుభకరము.
- పంచమినాడు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి. ఈ పర్వదినాన్ని జ్ఞాన పంచమిగా కూడా జరుపుకుంటారు.
- షష్టి నాడు ఇష్టమైన ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే ఫలం.
- సప్తమి నాడు సూర్యుని ఆరాదించి దానం చేస్తే విశేషమైన ఫలితాలుంటాయి.
- అష్టమి నాడు గోవుని పూజిస్తే ఎంతో మంచిది. గోపాలాష్టమిగా దీనికి పేరు.
- నవమి మొదలు ద్వాదశి పారణ వరకు విష్ణువును మూడు రాత్రులు కొలవాలి.
- ద్వాదశి నాడు క్షీరాబ్ధి ద్వాదశి. క్షీరాబ్ధి ద్వాదశి నాడు శ్రీమహావిష్ణువు పాలకడలిలో నిద్రలేచే రోజు. ఈరోజు పెరుగన్నము, గోవు, వస్త్రములు దానము చేస్తే విశేష ఫలితము. ఈ ద్వాదశి చిలుక ద్వాదశిగా కూడ చెప్పబడింది.
- త్రయోదశినాడు సాలగ్రామ శిలలు దానం చేస్తే ఎంతో మంచిది. ఉపవాసం ఉత్తమం.
- చతుర్దశి నాడు నువ్వులు, ఇనుము దానం చేస్తే మంచిది. ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండాలి.
- కార్తీక పౌర్ణమి నాడు శ్రీమహావిష్ణువును కార్తీక దామోదరునిగా తలచి సాలగ్రామానికి పూజ చేసి తులసీ బృందావనాన్ని ఏర్పాటు చేస్తారు. శ్రీమహాలక్ష్మి రూపమైన తులసికి ఆ కార్తీక దామోదరునికి విహాహం చేస్తారు. అనంతరం ఉసిరిక, దీపదానాలు చేస్తారు. దేవాలయాలలో జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు. దీపాలతో అలంకరిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవటం అత్యంత శుభప్రదం. కార్తీక మాసంలో లక్ష్మీదేవి ఉసిరి చెట్టులోని అణువణువునందు నివసించి యుంటుంది. అందుకని ఉసిరి దానం చేయటం, ఉసిరి చెట్టు వద్ద దామోదరునికి పూజ చేసి వన భోజనాలు చేయటం శుభప్రదం.
- బహుళ పక్షంలోని పదిహేనురోజులలో కూడా స్నానాలు, నక్తాలు ఉండి, ఇతోధికంగా దానాలు చేయటం ఎంతో మంచిది.
ఇలా ఈ నెలమొత్తం దైవంతో అనుసంధానం చేసుకొనటానికి ఉత్తమమైన అవకాశం, సమయం. అందరం వీలైనంత పాటిద్దాం. శివకేశవుల అనుగ్రహాన్ని పొందుదాం. ​

No comments:

Post a Comment

Pages