ఈ 21 సంచికలుగా, ‘అచ్చంగా తెలుగు’ అంతర్జాల మాసపత్రిక ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిర్విఘ్నంగా విడుదల అవుతోంది అంటే, అది కేవలం పరిపూర్ణ గురుకటాక్షం, దైవబలం వల్ల మాత్రమే. అదే దైవేచ్చ దారి చూపగా... మా కుటుంబంలోని వారమే కలిసి, మీ అందరి అభిమాన బలంతో మరొక్క అడుగు ముందుకు వేసేందుకు సాహసిస్తున్నాము. అందులో భాగమే ‘మైండ్ మీడియా’ అనే మా ఆన్లైన్ రేడియో ప్రస్థానం. ఈ రేడియో ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే...
*తెలుగు ప్రభను, భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం.
*సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వెయ్యడం.
*మూస పోసినట్లు పాటల ప్రసారం మాత్రమే కాకుండా, మంచి స్క్రిప్ట్, వ్యాఖ్యానంతో శ్రోతలను అలరించే విధంగా కార్యక్రమాలను రూపొందించడం.
*ప్రస్తుతం ఉన్న కొందరు RJ ల లాగా, అర్ధంలేని వ్యాఖ్యలు, వచ్చీరాని తెలుగులో సంభాషణలు కాకుండా మంచి విలువలకు కట్టుబడి రేడియో నడపడం.
*మంచి సామాజిక స్పూర్తితో ముందు తరాలకు ఒక పెన్నిధిలా రేడియోను తీర్చిదిద్దడం.
మా ఈ చిన్ని ప్రయత్నానికి, మీ సహాయసహకారాలను అందిస్తారని, మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారని, ఆశిస్తూ,
కృతజ్ఞాతభివందనాలు సమర్పిస్తున్నాను.
ఇక ఎప్పటిలాగే నిత్యనూతనంగా ముస్తాబై వచ్చిన ఈ సంచికలో దా. గజల్ శ్రీనివాస్ గారితో ముఖాముఖి, ఆర్టిస్ట్ గిరిధర్ గారి ముఖాముఖి, కార్తీక మాసం గురించిన ప్రత్యేకమైన వ్యాసాల విశేషాలు ప్రత్యేకం. ఇవికాక మంచి కధలు, కవితలు, ప్రత్యేక శీర్షికలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. చదివి, అభిప్రాయాల రూపంలో మీ దీవెనలు అందించండి.
మా అంతరంగాలకు అద్దం పట్టే మా రేడియో ప్రోమో ను క్రింది లింక్ లో దర్శించండి.
No comments:
Post a Comment