పంచుకునేందుకు... - అచ్చంగా తెలుగు

పంచుకునేందుకు...

Share This

 పంచుకునేందుకు... 

సమ్మెట ఉమాదేవి 

     
 
"హమ్మయ్యా   మీరు వచ్చేసారు ఆంటి ఇప్పుడ మాకెంతో ధైర్యంగా ఉంది."  ఎయిర్ పోర్ట్ నుండి వాసంతిని ఇంటికి తీసుకొస్తూ శ్రవణ్ అన్నాడు.
    నెలలు నిండి చేసుకోలేక పోతున్న దివిజ సంతోషానికి అంతే లేదు. వడలిపోయి నీరసంగా ఉన్న తన కూతురు దివిజను చూడగానే దిగులేసింది వాసంతికి .ఇక మనవడు సాందీప్  అమ్మమను చూసి సంబరపడి పొయాడు. రాత్రి బోజనాల దగ్గర..
     ''అమ్మా మళ్ళీ బాబే  పుట్టబోతున్నాడని  చెప్పారు కదా..  పేరు నీవే  నిర్ణయించాలి.''  అన్నది దివిజ.
      ''వీడు సాందీప్  కదా పుట్టేవాడికి సాకేత్  అని పెట్టుకుందాం..'' అన్నది.
     రెండు రోజుల తరువాత దగ్గరలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వెళ్లి  పుట్టబోయే వాడికి కావలసిన దుస్తులు. టవళ్ళు. డైపర్లు అన్నీ కొనుక్కున్నారు.
     " మొదటిసారి సిజేరియన్ అయ్యింది కాబట్టి ఈ సారి  కూడా సిజేరియన్ తప్పదు అని  సాధారణంగా అనుకునేదే. కాని ఇక్కడి డాక్టర్లు  మీరు అనవసరంగా ఆందోళన పడకండి మీకు  నాచురల్ డెలివరీ తప్పక అవుతుంది అని చెప్పారు.  నాచురల్ గా  కావడం కంటే కావలిసిందేముంది అనుకున్నాం  ఆంటి.. కాని దివిజ ఎందుకో  ఏడవ నెల వచ్చిన దగ్గర నుండి  ఏదో ఒక  ఇబ్బంది పడుతూనే ఉన్నది.'' చెప్పుకొచ్చాడు శ్రవణ్.
          ''దివిజ ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ బాధను పంచుకునేందుకు మీ అమ్మగారున్నారు ఇప్పుడు" అన్నాడు.
    '' నేనున్నానని పక్కన నిలబడడం తప్ప తన అవస్థ తానూ పడాల్సిన్దేగా'' మనసులో అనుకుంది వాసంతి.
    తానూ తెచ్చిన పిండి వంటలకు తోడు  ఏదో ఒకటి వండి పెట్టాలని చూస్తూ.. " ఇదో మీ తరం వాళ్ళు ఇలా చదువులంటూ ఉద్యోగాలంటూ  విదేశాలకు రాబట్టి మా  పెద్ద వాళ్ళకు కూడా విదేశీ యానం చేసే  యోగం వచ్చింది  .. లేకపోతే మా అంతటా మేమేయితే ఎక్కడకూ రాము కదా" అన్నది వాసంతి.
       "ఇక్కడ  బాహు బాలి సినిమాను చూసాం అమ్మమ్మా.." వచ్చీ రాని మాటలతో మనవాడు ముద్దు ముద్దుగా చెబుతుంటే ..
    " అమ్మ జర్మన్  థియేటర్ లో  సినిమా ప్రారంభానికి  ముందు మన జాతీయ గీతం విని ఆశ్చర్యం , ఆనందం పట్టలేక  పోయాను" అని దివిజ చెబితే ...
      ఆంటీ ఇక్కడ పశ్చిమ జర్మన్ అంబాసిలో  రాజమండ్రి వాస్తవ్యులు సంస్కృత పండితులయిన  శ్రీ దండి బాట్ల విశ్వనాథ శాస్త్రి గారి చిత్రపటం ఉన్నది  ఆంటీ.. ఫ్రాంక్ ఫర్డ్ లో జర్మనీ తెలుగు వెలుగు  అని ఇక్కడి  తెలుగు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంస్థ  ఉన్నది "  అని శ్రవణ చెప్పాడు. వారం రోజులు ఎలా గడిచి పోయాయో .. వాట్సపులకు లకు ఫోన్లకు అందని ఎన్నో కబుర్లు షేర్ చేసుకున్నారు.
                                                      * * *         * * *             * * *
     ఆ రోజు ఉదయం నుండే సన్నని నెప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నది. దానితో  సాయంత్రం  అందరూ డాక్టర్ దగరకు బయలు దేరారు.
      తాము  చేరుకున్న భవంతిని చూపించి..  ఇదే హాస్పిటల్ అని శ్రవణ్ అనగానే ఆశ్చర్య పోయింది. ఎదురుగా  పూల మొక్కలు, ఫవుంటేన్లు, కూర్చోడానికి చక్కటి ఏర్పాట్లు .. అది హాస్పిటల్లాగా అనిపించనే లేదు. ''మెల్లగా నడువమ్మా..'' దివిజా అంటూ ఆమెతో పాటు ముందుకు అడుగులు వేసింది.
     ఆరు బయట వేసిన కుర్చీల్లో  కూర్చుని కొందరు ట్రే లల్లో తినుబండారాలు తెచ్చుకుని తింటున్నారు.  లోపలికి  వెళ్ళడానికి వాటంతట అవే తెరుచుకునే అద్దాల ద్వారాలు. కాస్త ముందుకు వెళ్ళగానే అద్దాల ఒక  పక్కన  అరమరాల్లో పండ్లూ, కేకులు, రకరకాల  బ్రెడ్స్, కూల్ డ్రింక్స్ అమ్ముతున్న స్టాల్.. తల పయికి ఎత్తి చూస్తే మూడు నాలుగు అంతస్థులలో బాల్కనిల్లో  పూలతో కనిపిస్తున్న  మొక్కలు.  ఓ పక్కన రిసెప్షన్ మరో  పక్కన లిఫ్టులు. అక్కడక్కడ  రాగి రంగు జుట్టుతో  కురచ దుస్తుల్లో తెల్లగా మెరసి పోతున్నఅమ్మాయిలు. ఐదో ఆరో నెలతో కడుపుతో ఉన్న అమ్మాయిలు. కొందరయితే పూర్ణ గర్భిణీలు కొందరు.  వాళ్ళతో పాటు వచ్చిన మొగ వాళ్ళు. లిఫ్ట్ లో  పయికి వెళ్ళగానే ..  శ్రవణ్ వేసి  ఉన్నఅద్దాల తలుపుల దగ్గరకు  వెళ్లి మీట నొక్కాడు . కాస్సేపటికి ఒకామె వచ్చి తలుపు తీసి హలో అని చిలుకలా పలికింది. " మాకు ఇవ్వాళా డాక్టర్ అప్పాయింట్ మెంట్ ఉంది" అని  వివరాలు చెప్పాడు శ్రవణ్.
       ఒకే రండి అంటూ లోనికి దారి తీసింది.  అక్కడ గది లో పెద్ద నీళ్ళ తొట్టి . పయిన  నక్షత్రాలు మెరుస్తున్నట్టు చిన్న చిన్న బల్బులు. ఈ  తొట్టి ఏమిటి  దివిజా విస్తు పోతూ అడిగింది వాసంతి .   ఇది  లేబర్ రూం అమ్మా..  ఇక్కడా ఈ తొట్టె లలోనే ప్రసవాలు చేయిస్తారు. అన్నది.
     ఇంతలోనే గులాబీ రంగు దుస్తుల్లో ఉన్న మరో  అమ్మాయి వచ్చి హలో అని అందరిని  పలుకరించి కరచాలనం చేసి తన  పేరు చెప్పింది.  ఆ పద్దతి వాసంతికి  బాగా నచ్చింది.  ఆ అమ్మాయి దివిజను  తీసుకు వెళ్ళి  స్త్రెచర్ పయి పడుకోబెట్టి  కడుపుకు రెండు రకాల బెల్ట్లు  పెట్టింది.  ఒకటి లోన  ఉన్న పాపాయి హార్ట్ బీట్ చెబుతుందట. మరొకటి అమ్మాయి నెప్పి తీవ్రతను చెబుతుందట. ఆమె గబగబా  జర్మన్ బాష లో ఏదో చెప్పి వెళ్ళిపోయింది .
     "ఇక్కడా ఇంగ్లీష్ అస్సలు పనికి రాదు ఆంటి. వాళ్ళ విద్య,  వైద్యం, బాంకింగ్, రైళ్ళు, బస్సులు రవాణా అన్నిరకాల  కార్య కలపాలయినా జర్మన్ లోనే సాగుతాయి. ఇంగ్లీష్  వచ్చిన వాళ్ళు చాల తక్కువ  మంది ఉంటారు. వివరించారు  శ్రవణ్. " బ్రిటన్ వీళ్ళకు పొరుగు  దేశమనే చెప్పాలి. అలాంటిది ఇక్కడా ఆ బాష ప్రభావం ఏమీ లేదు. కాని పూర్తిగా మరో ఖండంలో ఎంతో దూరాన ఉన్న మనం మానసికంగా బాషా బానిసలైపోయాము."  అనుకున్నది వాసంతి.
      దివిజకు ఆ బెల్ట్స్ పెట్టి రీడింగ్స్ నోట్  అవుతున్న సమయంలో శ్రవణ్ లు  చాల విషయాలే చెప్పాడు వాసంతికి. ఇక్కడా  కుటుంబనియంత్రణ లేదని, పుట్టిన పిల్లల  చదువు పెంపకం  విషయంలో ప్రభుత్వం భాగం పంచుకుంటుందని చెప్పాడు.  వారికి దేశ భక్తి,  జాతి స్పృహ ఎక్కువ అని, చరిత్రలో చదువుకున్న విషయం  జ్ఞాపకం వచ్చింది. అయితే సంస్కృతం వచ్చిన వాల్లకు జర్మన్ త్వరగా వస్తుంది అని విన్నది.  ఇక్కడ ఉన్న విదేశీయులు తమ పిల్లలను ఇంటర్నేషనల్  స్కూల్లో వేసి ఇంగ్లీష్ మీడియంలో  చదివించుకోవచ్చని.. అయితే విధిగా జర్మన్ మాత్రం నేర్చుకోవాలని  చెప్పాడు. వాళ్ళు చెప్పింది కాక వచ్చిన దగ్గరనుండి వాళ్ళ భాషాభిమానం వాళ్ళ సాంకేతిక అభివృద్ధి వస్తు సేవల వినియోగం గమనిస్తూ  సంబ్రమాశ్చర్యాలకు  లోనవుతూనే ఉన్నది.
     దివిజకు సిజేరియన్ ఎప్పుడు చేస్తాము అంటారో అనుకుంటూ  వాసంతి ఆలోచనలో ఉండగా పక్క గదుల్లోనుండి ఉండుండి  పెద్దగా మూలుగులు వినపడుతున్నాయి.  ప్రసవ వేదన పడుతున్న ఆ స్త్రీల  బాధకు.. రోదనే బాష.  ప్రపంచంలో ఏ మూల ఉన్న ఎలాంటి వేష బాష ల వారికయినా నెప్పి ఒకటే./ కన్నీళ్ళు ఒకటే .  ఏ అమ్మయినా ఈ  నెప్పులు.. ఈ బాధ పడాల్సిందే అనుకున్నది వాసంతి.
     పంటి బిగువున నెప్పి భరిస్తున్న దివిజ  బాధ చూడలేక పోతున్నది . అలాగని ప్రసవపు నెప్పులు కావు అంటున్నారు. మొదటిసారి ఆపరేషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు సహజమయిన పద్ధతిలో ప్రసవం జరగాలంటే నెప్పులు తియ్యాలి కదా తన శరీరం సహకరించాలి కదా. వాసంతిలో  ఆందోళన  పెరిగి పోతున్నది.
    కాస్సేపటికి  ఒకరికి ఇద్దరు డాక్టర్లు డివిజను పరీక్షించి చూసి.. " ఇక  రిస్క్ తీసుకోకూడదు. ఆమెకు సిజేరియన్ తప్పదు.." అన్నారు. ఒక్కసారిగా దిగులు పడి పోయారు అందరు.
   " రేపు గురువారం చాలా ఆపరేషన్లు ఉన్నాయి. శుక్రా, శని, ఆది వారాల్లో ఆపరేషన్లు చెయ్యరు కాబట్టి సోమవారం రండి. ఆ రోజు సిజేరియన్ చేస్తాము" అన్నారు .
    "అదేమిటి మూడు రోజులు ఆపరేషన్లు చెయ్యరా ఎందుకు చెయ్యరు.?" ఆశ్చర్యంగా అడిగింది.
   "ఏమో అది వాళ్ళ రూల్ ఆంటి.." అన్నాడు శ్రవణ్
      ఏమి అర్ధంకాలేదు వాళ్ళకు సోమవారం అంటే ఇంకా నాలుగు రోజులు ఆగి ఐదో రోజు. ఈ లోగా దివిజకు ఏమయినా అయితే దేశం కాని దేశంలో ఎక్కడకు  పరుగు పెడతారు..? భయంతో బిగుసుకు పోయింది వాసంతి. అప్పటి దాక ఎంతో అందంగా ప్రశాంతంగా కనపడ్డ హాస్పిటల్ ఇప్పుడు  భయానకంగా  కనపడసాగింది వాసంతికి.  ఇండియా గుర్తుకువచ్చి కళ్ళల్లో నీళ్ళు  తిరిగాయి ..
     దానికి  తోడు ఉండుండి పదే పదే వినపడుతున్న సన్నని మూలుగులు, అరుపులకు. మనసు మరింత భారమయ్యింది.  ఏమి చెయ్యలేక ఇల్లు చేరారు. "ఈ ఆస్పత్రి కాక  మరే ఆస్పత్రి లేదా .?" అడిగింది.  వాసంతి
    " ఏ హాస్పటల్ అయినా అంతే  ఆంటి.. రేపు మనం వేరే ఎక్కడికయినా వెళ్లి  చెక్  అప్  చేయించినా .. వాళ్ళు ఈ మూడు రోజులు ఆపరేషన్ చెయ్యము అనే చెప్తారు. ఆది వారం ఆపరేషన్ చేస్తే వీళ్ళు  ప్రభుత్వానికి  సమాధానం చెప్పాలట. వినడానికి బాగున్నాయేమోగాని  ఈ రూల్స్  తలచుకుంటేనే భయమేస్తున్నది. ఈ శని  ఆదివారల్ల్లో  నెప్పులు మరింత  పెరిగిపోతే .. ఇంకా జరగరానిదేమయినా జరిగితే .. ఉన్న పళంగా దివిజను తీసుకుని ఇండియాకు పారి పోవాలని అనిపించింది  వాసంతికి.  ఇలా చిక్కుబడి పోయమేమిటి..? దిగులు కమ్మేసింది ఇద్దరినీ . దేవుడా నా కూతురిని నీవే రక్షించాలి. వేయి దండాలు పెట్టుకుంటూ ఉండిపోయింది.
    "మీరు ఆందోళన పడకండి ఆంటి ఏదయినా అయితె ఎమర్జెన్సి సర్వీసెస్ ఉంటాయి లెండి" అని అన్నాడు శ్రవణ్. మర్నాడు  కాగల కార్యం అదే తీరి పోయింది.
                                                 * * *         * * *             * * *
      ఉదయం లేచి  శ్రవణ్ అయిష్టంగానే ఆఫీస్ కి  వెళ్ళడానికి  సిద్దమయ్యాడు. అలా లిఫ్ట్ దగ్గరకు నడుస్తున్నాడో లేదో  " బాబు శ్రవణ్ మనం ఉన్నపళంగా ఆసుపత్రికి వెళ్ళాలి. దివిజకు ఉమ్మనీరు పోతున్నది " కంగారుగా  చెప్పింది.
      ఆస్పత్రికి చేరుకున్నాక.. అక్కడ చాలా సార్లు వీళ్ళు మాట్లాడిన ఇంగ్లీష్ కన్నా సైగలే  బాగా పనిచేసాయి. అత్యవసర పరిస్తితిగా రాసుకుని   దివిజను ఆపరేషన్ కు  సిద్దం చేసారు.  అవసరమయిన సంతకాలు పెట్టించుకున్నారు.  తెల్లని దుస్తుల్లో ఉన్న ఒక డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తున్న సమయం లోను ఆపరేషన్  తరువాత ఎలాంటి సమస్యలు రావోచ్చో వివరించి చెప్పింది. ఇలాగే అవుతుందని కాదు ఇలా కూడా జరగవచ్చని ముందే  హెచ్చరించడం మా విధి అని చెప్పారు.  ఆపరేషన్ థియేటర్ లోకి ఆమె భర్తను  అనుమతిస్తారని చెప్పారు. అలాగే మత్తు ఇచ్చే డాక్టర్ కూడా వచ్చి తనని పరిచయం  చేసుకున్నాడు.  ఉమ్మ నీరు చాలా ఎక్కువగా పోతున్నదని  త్వరగా థియేటర్ లోకి తీసుకెళ్ళి పోయారు.
    వంటరిగా అక్కడ మిగిలి పోయిన వాసంతికి గుండె చేతిలో పట్టుకుని కూర్చున్నట్లుంది. బోలెడన్ని విధి విధానాలు పాటించి.. అనుమతులు పొంది, సెలవు పొంది, బోలెడంత ఖర్చు పెట్టుకుని,  సముద్రాలు దాటి ఖండాలు దాటి వచ్చి.. అమ్మాయి   పక్కన నిలబడడం తప్ప ఆ బాధను  తుడిచేయ్యలేము కదా. ఇదంతా ఎంత అనివార్యం  అని సరి పెట్టుకుందామనుకున్నా గుండెల్లో తెలియని బాధ. కన్నుల్లో వద్దనుకున్నా ఊరుతున్న జల.. కాస్సేపు మనసు మళ్ళించుకున్దామని అటు ఇటు చూడసాగింది.  అంతమంది పేషంట్లున్నా  నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం అబ్బురమనిపిస్తున్నది. అడుగడుగునా  కష్టించి పని చేస్తున్న తెల్లని  దుస్తుల్లో ఉన్న  మిడ్  వైఫ్ లు.  వీల్ చైర్స్ లో  వస్తున్న పేషంట్లు .. ఒక మిడ్ వైఫే  అవలీలగా స్ట్రెచర్ ను తోసుకె ల్లిపోతున్నది.  మందులున్న ట్రాలీలు.. డస్ట్ బిన్ ఉన్న ట్రాలీలు తీసుకెళ్తున్నారు. అక్కడి రోగుల కోసం తెల్లని దుప్పట్లు పరిచిన మంచాలు పాల్తిన్ కవర్స్ తో కప్పి ఉన్నాయి. ప్రతి మంచానికి వీల్స్ ఉన్నాయి. ఎక్కడికయిన తరలించడానికి వీలుగా. ఎక్కడా మందుల  వాసన గాని అశుభ్రత  గాని లేదు. అమ్మాయికి ఎలా ఉందొ .. ఆపరేషన్ అయిందో లేదో .. ఆందోళనగా .. ఆపరేషన్ థియేటర్ వయిపు చూడ సాగింది. ఎంత వద్దనుకున్న గుండె వేగంగా  కొట్టుకోసాగింది.
   ఎట్టకేలకు .. 45 నిముషాలకు బాబు పుట్టాడని చెబుతూ తేలికయిన మనసుతో ప్రసన్నంగా నవ్వుతూ  శ్రవణ్  బయటకు వచ్చాడు. అమ్మాయి ఎలా ఉన్నది ..? అడిగింది వాసంతి .
       మనకు బాబును ఓ పది నిముషాల్లో ఇస్తారట .. దివిజను మరో గంట తరువాత  గది లోకి తీసుకొస్తారు అని చెప్పాడు.
     మరో పది నిముషాల్లో వాసంతిని శ్రవణ్ ని పిలిచి వాళ్ళకు బాబును చూపారు. అప్పుడే కళ్ళు విప్పిన పసి గుడ్డును అపురూపంగా పట్టుకున్ని సంబర పడ్డాడు శ్రవణ .. నర్స్ వచ్చి బాబును ఫోటో తీసింది. స్టాంపు పాడ్ పయి  బాబు పాదం అద్ది   తెల్లని కాగితం మీద  పాదము ముద్ర  వేయించింది.  బాబు  బరువు తూచి బరువు రాసుకుంది. తలకు టేప్ చుట్టి  బాబు తల కొలత,  నిలువుతా  టేప్ పెట్టి పొడవు రాసుకుంది.  అప్పుడు  శ్రవణ చేతికి ఇచ్చి కంగ్రాట్స్ చెప్పింది .  శ్రవణ్  వాసంతి చేతుల్లో పెట్టాడు ఇక రూం కి వెల్లమంది. వాసంతి బాబును ఎత్తుకుని గదిలోకి  వెళ్లబోతుంటే కాదు ఈ తొట్టె లో పడుకోబెట్టి తీసుకెళ్ళమని వీల్స్ ఉన్న చెక్క తొట్టె ఇచ్చింది ఆమె. అలాగే ఇద్ద్దరు గదిలోకి వెళ్ళగానే.. వాసంతి ఇంటినుండి తెచ్చిన మెత్తటి తువ్వాలు తో  బాగా తుడిచి మరో మెత్తని తువ్వాలులో చుట్టి వాళ్ళో పడుకోబెట్టుకుంది శ్రవణ్ ఇండియాకు  పోన్లు తనచేసుకుని తల్లి దండ్రులతోను  బంధు మిత్రులతోను అందాన్ని పంచుకుంటున్నాడు .. వాసంతి  దివిజను ఎప్పుడు గదిలోకి తెస్తారా అని ఆత్రంగా చూడ సాగింది. బాబు ఏడుస్తున్నాడు. తల్లి వచ్చాకే తన పాలే పట్టాలి అని చెప్పి వెళ్లారు. ఇండియాలో అయితే ఈ పాటికి  ఎ తేనే చుక్కో నాకిన్చేవారు.
    వాసంతి ఆందోళనలో ఉండగానే డివిజను తీసుకొచ్చారు. స్పృహలోనే ఉన్నది. హమ్మయ్య అనుకుని నిట్టూర్చింది  వాసంతి. నీరసంగా కళ్ళెత్తి బాబును చూసుకుంది . మరో గంటలో మీ  గదికి పంపిస్తారు. అప్పటిదాకా ఇక్కడే అని చెప్పి . సేలేన్  పెట్టి వెళ్ళింది  సిస్టర్. నిముషంలో వచ్చి  ఓ ట్రే లో దివిజకు ఏదో ఆహారం తెచ్చింది. వాసంతి ఆశ్చర్య పోయింది .. సిజేరియన్ అయిన గంటకే ఆహారమా..? మూత తీసి చూసింది రెండు బ్రెడ్  స్లైసులు, వెన్నా .. ఒక కప్పు తరుబూజ గుజ్జు..   గ్లాస్ నిండా పెరుగు.  పక్కనే  కాలి గ్లాస్  చెంచా.. బాలింతకు  రెండో రోజో మూడో రోజో కార్రప్పొడి  చారుతో పత్యం భోజనం. చపాతీ  కూరా  .. ఇవేవి కాదు  గంటకే ఇలాంటి తిండా..?   ఆలోచిస్తూ కూర్చోకుండా  "రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగే ఉండాలి  దివిజ  నీరసించి పోకుండా .." అనుకుంటూ.. రెండు బ్రెడ్  ముక్కలు,  తరబూజ గుజ్జు తినిపించింది.    ఏదయితే అడవుతుందని మజ్జిగ చేసి ఇచ్చింది.  ఎవరికయినా  చిన్న గాయం అయితే ముడుచుకుని పది రోజులు పడుకుంటారు.  అలాంటిది అప్పుడే కడుపు  కోయిన్చుకుని  బిడ్డను కని..  బాబుకు పాలు పట్టడానికి పచ్చి కడుపు తోనే వంగి బాబును అందుకుని పాలు పట్టడానికి ప్రయత్నించ సాగింది దివిజ  వేల వేల తల్లుల ప్రతినిధి ఈ  తల్లి కూడా.
      కాస్సేపటికి నర్సులు వచ్చి ఈ అత్యవసర గది నుండి  వేరే  గది లోకి మారాలి. కాని మీకు ప్రత్యేకమయిన గది ఇవ్వడానికి కుదరదు ఇద్దరికి కలిపి ఒకే గది షేర్ చేసుకోవాలి అని చెప్పారు .. కాస్త ఇబ్బంది గానే అనిపించినా తప్పదు కాబట్టి ఏమనలేక ముందుకు సాగారు.
   గదిలోకి వెళ్ళగానే తెల్లని దేవకన్య లాంటి అమ్మాయి పక్క మంచం పయి నీరసంగా పడుకుని ఉన్నది. ఆ పక్కనే కుర్చీలో ఉన్న ఆమె భర్త 'హలో' అని పలుకరించాడు. ఆ అమ్మయి కూడా చాల చిన్నగా 'హలో' అన్నది. స్త్రేచార్  మీదనుండి అమ్మాయిని బెడ్ మీదకు చేర్చడం కాకుండా ఏకంగా వీల్స్ ఉన్న బెడ్ పయి దివిజను తీసుకొచ్చి ఆ బెడ్ ని   ఇక్కడ నిలిపారు .. అది సుఖంగా ననిపించిన ఏర్పాటు .
      నర్స్ వచ్చి దివిజ కొడుకుకు పక్క బెడ్  అమ్మాయి కూతురికి .. చేతులకు నేమ్ ట్యాగ్  వేసి ఇద్దరు  పిల్లలను తీసుకెళ్ళి హాస్పటల్ వారి దుస్తులు వేసి ఇచ్చారు. ఉయ్యాలలో  తెల్లని దుస్తుల్లో ఆ పసి కూనలు ముద్దులొలుకుతున్నారు. నర్స్ వచ్చి ఓ ఫైల్ ఇచ్చి వెళ్ళింది అందులో ఇందాక తీసిన బాబు ఫోటో ఒక పక్క, పాదం ముద్ర మరో  పక్క అతికించి ఉన్నాయి. మరో పేపర్ లో బాబు తల్లిదండ్రుల పేర్లు చిరునామా . బాబు పేరు కొలతలు బరువు అన్నే రాసి ఉన్నాయి .
      ఇరు జంటలు ఆ పిలల్లు ఎవరి పోలికలో పోల్చి చూసుకుంటూ మధ్య మధ్య  ఫోటోలు తీసుకుంటూ .. స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసుకుంటూ  సంబర పడుతున్నారు. వాసంతి ఆ పక్క బెడ్ అమ్మాయి కోసం ఇంకా పెద్ద వాళ్ళెవరు రాకపోవడం గమనించింది. మిడ్ వైఫ్ సహాయంతో  ఇద్దరు తల్లులు బిడ్డలకు పాలు పట్టడానికి ప్రయతించారు. కాస్సేపటి లో   "పిల్లలను నర్సింగ్ రూం కి  కి తీసుకెళ్ళి పోతాము" అని చెప్పి వెళ్ళింది నర్స్. ఏమి అర్ధం కాలేదు వాసంతి వాళ్ళకు. పక్క బెడ్  ఫెడరిక్ ని  అడిగారు. అతను వివరించాగానే తెల్ల బోయారు .
      "ఎందుకు అమ్మాయికి రెస్ట్ ఉండాలని  కాబోలు  నేను ఉంటానుగా బాబు .." ఇంగ్లీష్ లో చెప్పింది.   "ఆంటి మీకు తెలియదా రాత్రి తొమ్మిది అయ్యాక మనమెవ్వరం ఉండ కూడదు"  చెప్పాడు అతను. తెల్లబోయింది వాసంతి. కాస్సేపటికి వాళ్ళ బాబును.. పాపను తీసుకెళ్ళి పోయారు. మత్తు దిగుతున్న కొద్ది ఆపరేషన్ బాధ తెల్తున్తుంది. అప్పుడు దివిజ  పక్కన ఎవరూ లేకుంటే ఎలా ఏమీ అర్థం  కాలేదు. అంత నిర్దాక్షణ్యంగా పిల్లను వదిలి ఎలా వెళ్ళాలి ఎలాగయినా వాళ్ళను ఒప్పించి  అక్కడే ఉండగలిగితే బాగుండు  అని పదే పదే అనుకున్నది. శ్రవణ్ కూడా చాలా దిగులుగా వెను తిరిగాడు. దివిజకు వంద జాగర్తలు  చెప్పి కదలలేక కదిలింది వాసంతి.
                                               * * *         * * *             * * *
   మర్నాడు పొద్దున్నే పథ్యపు భోజనం సిద్దం చేసుకుని బయలు దేరుతుంటే .. సుసాన్ గుర్తుకు వచ్చింది.  పాపం అమ్మా అత్తా ఎవ్వరు రాలేదు. మనం తిండి అలవాటుంటే  ఆ పిల్లకు కూడా ఓ ముద్ద తీసుకెల్లేదాన్ని కదా అనుకున్నది. హాస్పటల్కి చేరుకునే సరికి సుసాన్ ' హలో' అని పలుకరించింది.
        "ఎలా ఉందమ్మా.." దివిజను  అడిగింది.
        "రాత్రి  బాగా నెప్పిగా ఉన్నది అంటే నర్స్ ఇద్దరికీ ఇంజంక్షన్ చేసి వెళ్ళింది." అని చెప్పింది.
       ''ఆ  అమ్మయేమిటి ఇంకా  ఆసుపత్రి వాళ్ళిచ్చిన ఆపరేషన్  గౌన్ లోనే  అలాగే ఉన్నది. బట్టలన్నా మార్చుకోలేదు. ఓపిక లేదేమో. వంటి మీద గుడ్డలు ఎటుపోతున్నాయో కూడా చూసుకోవడం లేదు. కాళ్ళ మీద దుప్పటయినా కప్పుకోలేదు. ఇంకా పసి తనం పోనీ అమ్మాయిలా  అమాయకంగా  ఉన్నది  " అనుకున్నది.
     టేబిల్ పయిన ఆస్పత్రి వాళ్ళు ఇచ్చిన ఆహారపు ట్రే  కనపడింది. మళ్ళీ మరో రకం బ్రెడ్డు  వెన్న,  సూపు, చీజ్  యేవో మాంసపు ముక్కలు.. పండ్ల ముక్కలు పెట్టి ఉన్నాయి. అవేవి ముట్టని దివిజ అమ్మ తెచ్చిన సొంటి  కారపు ముద్దా, చారన్నం  తిన్నది. శ్రవణ్ బయటకు వెళ్లి పోయాక  పక్క బెడ్ వంక చూసి... "ఏమి తిన్నావమ్మా.." సైగ చేసి అడిగింది ఆమె . ట్రే వంక చూపింది.
      "అతడు పొద్దుటే వచ్చి బోలెడు ముద్దులు పెట్టి వెళ్లి పోయాడామ్మా. తినడానికి మాత్రం   ఏమీ తేలేదు. ఈ ఆమ్మయి రాత్రి కూడా ఏమి తినలేదు. అలా నీరసంగా పడుకుని ఉన్నది. ఉదయం పాపను తెచ్చి ఇచ్చారు. సరిగ్గా ఎత్తుకోవడం కూడా రావడం లేదు. చాలా నీరసంగా ఉన్నది" అని చెప్పింది దివిజ.
     సుసాన్ పాపను తన మీద వేసుకున్నది. పాప మెడ నిలువక మరో వయిపు పడిపోతున్నది. వాసంతి వెళ్లి సరి చేసింది. ఆ అమ్మాయి మంచి నీళ్ళకోసం టేబిల్ వంక వంగబోతే వెళ్లి నీళ్ళ సీస ఇచ్చి వచ్చింది. దివిజకు మందులు వేసినప్పుడు ఆ అమ్మాయికి కూడా మాత్రలు ఇచ్చింది. ఆ  అమ్మాయికి అలా నిద్ర పట్టిందో లేదో పాప లేచింది. ఆ అమ్మయి లేవబోతుంటే  "పచ్చి కడుపు .. అలా వేగంగా లేవకు.."  అంటూ పాపను ఉయ్యాలలో నుండి తీసి ఇచ్చింది. పాపకు పాలు పట్టడం అస్సలు రావడం సుసాన్ కి వాసంతి వెళ్లి ఎలా పట్టాలో చెప్పసాగింది. ఆ గది  మీ  ఇద్దరికీ   షేరింగ్ .. అన్న మాటను  సార్థకం చేస్తూ..  పసి వాణ్ణి చూసుకుంటూనే  దివిజను చూసుకుంటూ సుసాన్ కూడా చూసుకోసాగింది వాసంతి. మర్నాటికి ఇద్దరూ తల్లులు లేచి కాస్త లేచి నాలుగడుగులు వేసారు.
     అక్కడి ఆస్పత్రి లో ఏర్పాట్లకు మాత్రం కొదవ లేదు. కాని  పిల్లలకు తామున్న గదిలో  డయిపర్లు మార్చకూడదు. పక్క గదిలోకి వెళ్లి  డయిపర్ మార్చుకురావాలి. అంత వరకు బాగున్నది. కాని  చేతులతో పసిపిల్లలను ఎత్తుకుని తీసుకెళ్ల కూడదు.  చక్రాల తొట్టె లోనే  పడుకోబెట్టీ తోసుకుని  తీసుకెల్లాలి. కొన్ని  వింతగా అనిపించాయి. కాని ఆ గదిలో యూజ్ అండ్ త్రో బెడ్ షీట్లు, డయిపర్లు, గ్లవుస్లు.. వైప్స్ ఎన్నయినా వాడుకోవచ్చు, పిల్లలకు వల్లే డిస్పోజల్ బాటిల్ లో పాలు కలిపి ఇస్తున్నారు. మరో గదిలో  పెద్ద వాళ్ళ  కోసం సోడా వాటర్ , మంచినీళ్ళు  టీ, కాఫీ  డికాషన్, షుగర్, మిల్క్, పాక్స్  ఉన్నాయి.
     ఆ రోజు సుసాన్ వేరే దుస్తులు  వేసుకున్నది . అమ్మయికంగా నిద్ర పోతున్నది. ఆ అమ్మాయి  ఓ పిల్లను  కన్న తల్లిలా లేదు. శాపవశాత్తు భూమి మీద్దకు వచ్చిన గాంధర్వ కన్యలా ఉన్నది.
      "ఇదే ఇండియా అయితే మనకోసం ఎంతమంది వచ్చే వాళ్ళు కదమ్మా" .. అన్నది దివిజ .
     "మనకు సరే ఈ అమ్మాయిని చూస్తే జాలేస్తున్నది. ఆమెకి పాప ఆకలి కూడా తెలియడం లేదు. వంటి మీద గుడ్డలు ఎటుపోతున్నాయో తెలియడం లేదు. వాళ్ళు ఇచ్చే చల్లని జూస్ లు తాగేస్తున్నది. ఏమిటో పాపం అని బాధ పడింది వాసంతి.
     గుడ్డల విషయం లో వాళ్ళు అంతేనమ్మ వాళ్ళకు పెద్దగా పట్టింపులు ఉండవు. కాని ఆ అమ్మయి కోసం ఎవరూ రాలేదు ఎందుకో మరి" .. ఇద్దరూ బాధ పడ్డారు. ఇద్దరు మాటల్లో ఉండగానే సుసాన్ వాళ్ళ  పాప లేచింది. సుసాన్ అలసి పోయి పడుకున్నది కదా అని వాసంతి తనే లేచి పాపను తీసుకుని పాలసీసతో  పాలు తాగించింది. పాప పడుకున్నది.
     ఎప్పటికో సుసాన్ లేచింది." బేబీ ఫీడింగ్.." అంటూ పాపను ఉయ్యాలలో తీసుకెళ్ల సాగింది. తాను తాగించాను అని చెప్పసరికి చాల సంతోష పడింది. వచ్చీ రాని  కొన్ని ఇంగ్లీష్ ముక్కలతో కొన్న సైగలతో  తమది స్వీడన్ అని అమ్మ నాన్నలు చాలా దూరాన ఉన్నారని. అమ్మకు సెలవు దొరకక రాలేదని .. వారం రోజుల్లో వస్తారని చెప్పింది. ఫెడరిక్  ఉద్యోగం కోసం ఇక్కడకు ఆరేళ్ళ క్రితం  వచ్చామని జర్మన్ బాగా నేర్చుకున్నామని చెప్పింది.  తను కిండర్ గార్డెన్ స్కూల్ టీచర్ని అని కాని ఈ సవత్సరం ఇంట్లోనే ఉండి పాపను చూసుకుంటాను అని చెప్పింది. దివిజ గురించి వాసంతి గురించి అడిగి తెలుసుకున్నది.
     వాసంతికి.. ఇందాక పాపను  ఎత్తుకున్నప్పుడు "పాప  గొంతు గుర గుర మంటున్నది ఆ  జూసులు  తాగాకమ్మా" అని చెప్పాలని అనిపించింది. కాని ఆ అమ్మాయి ఆ బ్రెడ్డు ముక్కలు జూసుల మీదే ఉంటున్నది. ఇక ఏమి చెప్పాలి" అని ఊరుకున్నది. శ్రవణ్ సాందీప్ ను తీసుకుని రావడం  సుసాన్ భర్త ఫెడరిక్ రావడం ఓకే సారి జరిగింది. సుసాన్ తొట్టిలో బాబును పడుకోబెట్టుకుని భర్తను తీసుకుని హాస్పటల్ ఆవరణలోకి బయటకు వెళ్ళింది . "అయ్యో చల్ల గాలి అసుర సంధ్య వేళా అలా వెళ్తున్నదేమిటి"  అనుకున్నది.  కాని ఎలా వారించగలదు ఊరుకున్నది. సాందీప్ తన చిన్ని తమ్ముణ్ణి  వళ్ళో పెట్టుకుని మురిసి ఆడుకుంటూంటే వాళ్ళతో గడిచిపోయింది.
                                             * * *         * * *             * * *
       " హమ్మయ్య ఈ రెండు రోజలు గడిస్తే ఎల్లుండి దివిజ బాబు ఇంటికి వచ్చేస్తారు" అనుకుంటూ శ్రవణ్ వాసంతి హాస్పటల్కి బయలు దేరారు. ఆ రోజు  శనివారం కావడం తో పొద్దున్నే సుసాన్ కోసం ఇద్దరు ముగ్గురు స్నేహితులు పూల గుత్తులు పట్టుకని వచ్చారు. సుసాన్ చిన్న పిల్లల సంబర పడిపోతుంటే...   "మనిషికి మనిషి తోడు  తన కోసం తన వాళ్ళు వచ్చే సరికి సుసాన్ ముఖం ఎలా వెలిగి పోతున్నదో" అనుకుంటూ  వాసంతి దివిజ ఇద్దరూ చాలా సంతోష పడ్డారు. వచ్చిన వాళ్ళకు దివిజ వాళ్ళ వంక చూపి వాళ్ళు  ఎంతో సహాయంగా ఉన్నారని ఫెడరిక్ సుసాన్ ఇద్దరూ చెప్పారు.. అలాగే  దివిజ వాళ్ళకు వాళ్ళు తన ఫ్రెండ్స్ అని చెప్పింది.`సుసాన్ . అందరూ కలిసి మళ్ళీ పాపను తీసుకుని హాస్పటల్ ఆవరణలోకి  బయటకు వెళ్లారు.
   ఓ గంట గడిచాక సుసాన్ పాపను తీసుకుని వచ్చింది. ఫెడరిక్ బయటకు వెళ్ళాడు అని చెప్పింది.  పాప పడుకున్నది కదా అని సుసాన్ బాత్రూంకి వెళ్ళింది. సుసాన్ వాళ్ళ పాప లేచి ఏడవడం మొదలు పెట్టింది.  వెళ్లి తోట్టేలోని పాపను ఎత్తుకున్నది. వాసంతి ఉలిక్కి పడింది.  పాపకు భారకం ఎక్కువయి. ఎగ శ్వాసలు వస్తున్నాయి.
        సుసాన్ బాత్రూం నుండి రాగానే.. సైగలతో పాపకు  బాగో లేదని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళమని చెప్పింది వాసంతి . సుసాన్ కంగారుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు పిల్లల డాక్టర్ ను పిలిపించి  చూపించారు. బయటకు వెళ్ళిన ఫెడరిక్ వచ్చేసాడు. ఇద్దరూ చాలా కంగారు పడ్డారు ..
        మూడు నాలుగు గంటలు ఆ పాపకు ఏమిటేమిటో వైద్యం చేసారు.. పాప  సెల్వికి ఊపిరి తిత్తుల్లో  కఫం  నిండిపోయిందని  యేవో ఇంజక్షన్లు ఇచ్చారు. నెబ్లైజర్  పెట్టారు. సుసాన్ ఫెడరిక్   ఇద్దరూ  ఆందోళనగా అటూ ఇటూ  తిరుగుతూనే ఉన్నారు.  సుసాన్ కుట్లు కదిలి పోతాయి  అలా  వేగంగా నడవద్దు అని చెప్పాలనిపించి కూడా సుసాన్ బాధ చూసి  ఏమి చెప్పలేక పోయారు. అయిన వాళ్ళెవరన్న తోడు ఉంటె  సుసాన్ ను ఇక్కడే ఉంచి పెద్ద వాళ్ళు తిరిగే వల్లేమో. కనీసం ధైర్యం చెప్పే వాల్లేమో ..దానికి తోడు ఓ రెండు గంటల వరకు పాపను వాళ్ళకు ఇవ్వలేదు. వాసంతి బతిమాలినా సుసాన్ ఏమి తినకుండా  దిగులుగా కళ్ళు తుడుచుకుంటూ  కూర్చుండి పోయింది.
         కాస్సేపటికి ఓ డాక్టర్ లోనికి వచ్చి జర్మన్ భాషలో వాళ్ళకు  ఏదో చెప్ప సాగింది.  ఆ దంపతులిద్దరి ముఖ కవళికలు మారిపోయాయి. డాక్టర్ మరో పది నిముషాలు మాట్లాడి  వెళ్లిపోయింది.
     డాక్టర్ అటు వెళ్ళగానే  అకస్మాతుగా  సుసాన్ బెడ్ పై పడిపోయి గట్టిగా ఏడవసాగింది.  ఫెడరిక్ ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. కాని  ఆమె ఏడ్పు ఆపడం లేదు.  వాసంతికి దివిజకు ఏమి అర్ధం కాలేదు.
   " పాపను వేరే  హాస్పిటల్ కి పంపిస్తున్నారు .. ఉన్నపళంగా అక్కడకు పాపను తీసుకెళ్ళమని చెప్పారు." అని  ఫెడరిక్ చెప్పాడు.
    సిజేరియన్ అయిన నాలుగు రోజులకే .. కుట్లు కూడా ఆరకముందే ఆ పాపను పెట్టుకుని ఎక్కడకని  తిరుగుతుంది సుసాన్ అలాగని పాలు  తాగే పసిపాపను తల్లిని వదిలి ఎలా పంపుతారు  వాసంతికి , దివిజకు, శ్రవణ్ కి చాల బాధనిపించింది.
      "మీ వాళ్ళను పిలిపించక పోయారా.." అని అడిగింది. వాసంతి
    " ఎవరు  రావాలన్నా నాలుగైదు రోజులయినా పడుతుంది ఆంటి" అని చెప్పాడు.
    "అయ్యో .. పచ్చి బాలింతవు అలా ఎడవకమ్మా.. పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు కదా పాపకు నయమయిపోతుందిలే. ఈ సమయంలో  అలా ఏడవకూడదు." సుసాన్ ని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. వాసంతి భాష అర్ధం కాకున్నా ఆ ఓదార్పు భావం అర్దమయి మరింత గట్టిగా ఏడ్చింది.
  అంతలోనే  కాస్సేపటికి తేరుకుని ఇద్దరూ అన్నీ సర్దుకున్నారు.
      "ఇక వెళ్తాను.." అని చెప్పింది. వాసంతికి  శ్రవణ్ కి  దివిజకు మనసంతా భారమయ్యింది.
    మళ్ళీ  తొట్టె లోని పాపను ఎత్తుకుని గుండెలకు హత్తుకుని బయటకు వెళ్ళబోతూ వెనక్కు మళ్లి   ఫెడరిక్ వంక సాటిగా చూస్తూ  ఏడుస్తూ పెద్దగా  ఏదేదో అంటూ మళ్ళీ బోరుమన్నది సుసాన్. ఏమంటున్నదో అర్ధం కాలేదు వాళ్ళకు. . ఫెడరిక్ వాళ్ళ వంకా ఇబ్బందిగా చూస్తూ.. తల వంచుకు చెప్పాడు.
         "అయిన వాళ్ళందినీ వదులుకుని సంపాదనంటూ సేవింగ్స్ అంటూ ఇంత దూరం వస్తాము. మన  సేవింగ్స్ బాగానే ఉంటాయి. కాని  షేరింగ్సె మిస్ అవుతాయి. ఇవ్వాల మనం మంచీ చెడు చెప్పే పెద్ద వల్లనే మిస్  అయ్యాము.. మనకు తోడుండే  మనవాళ్ళను మిస్ అయ్యాం. పాపకు ఏమౌతుందో నాకు చాలా భయంగా ఉంది  అంటున్నది "
          తలవంచుకుని తొట్టెలో పాపను  తోసుకుంటూ బరువుగా అడుగు  లేస్తూ ముందుకు  నడవ సాగారు  ఫెడరిక్ .. దంపతులు
          వాసంతి గిర్రున వెనుతిరిగి దివిజా  శ్రవణ్ ల వంక చూసింది ..'' అమ్మ బాబు బాగానే ఉన్నాడు. నేనూ కాస్త కోలుకున్నాను కదా . ఏదయినా  అవసరమయితే  నర్సుల సహాయం తీసుకుంటానులే ..'' అన్నది దివిజ
        వాసంతి వేగంగా నడిచి .. సుసాను చేయి అందుకున్నది . సంబ్రమా శ్చర్యాలతో  చూస్తున్న సుసాన్ భుజం చుట్టూ చేయి వేసి వాళ్ళతో పాటు ముందుకు నడిచింది.
                                           * * *         * * *             * * *

No comments:

Post a Comment

Pages