ప్రేమతో నీ ఋషి – 9 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 9

Share This

ప్రేమతో నీ ఋషి – 9

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక చదవండి...)
ట్రాఫోడ్ సెంటర్ లో డిన్నర్ కు కలిసాకా, “నీ ఆఫీస్ పనులు ఎలా కొనసాగుతున్నాయి ? ఇంకేం చేస్తున్నావ్ ?” అని ఋషిని అడిగింది స్నిగ్ధ.
మాంచెస్టర్ సిటీ వెలుపల ఉన్న పెద్ద ఇండోర్ షాపింగ్ సెంటర్ ట్రాఫోడ్ సెంటర్. యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే, ఈ ట్రాఫోడ్ సెంటర్ కట్టేందుకు వేసిన ప్లాన్, అత్యంత విస్త్రుతమైనది, ఖరీదైనదిగా నిలిచిపోయింది. 1.4 మిలియన్ల చదరపు అడుగుల వైశాల్యంలో కట్టిన ఈ సెంటర్ కి ఏడాదికి 30 మిలియన్ల సందర్శకులు వస్తారని అంచనా. అందులో ఉన్న ఓరియంట్ అనే 1600 మంది పట్టే, ఫుడ్ కోర్ట్, 20 స్క్రీన్లు ఉన్న మల్టీప్లెక్స్ సినిమా హాల్లో వారు కలిసారు.
“ఋషి, ఇవాళ నన్ను ఆందోళనకు గురిచేసిన ఒక విషయం గురించి నీకు చెప్పాలి. ఎందుకో ఇవాళ మృణాళ్ నన్ను చూసిన విధానం నాకు నచ్చలేదు. దీని గురించి నువ్వు ఏమంటావ్ ?” వెంటనే తన భావాలను ఋషితో పంచుకుంది స్నిగ్ధ. ఆమె వ్యాకులంగా కనిపించింది.
“అలాగా ? ఈ గ్లాస్ నీళ్ళు తాగి ఒక్క క్షణం రిలాక్స్ అవ్వు. “ ఋషి ఆమె చాలా కలతచెంది ఉందని అర్ధం చేసుకుని, ఆమెకు కాస్త ఊరట కలిగించాలని అనుకున్నాడు. మృణాళ్, అప్సరలు తనకు వ్యక్తిగతంగా తెలియకపోయినా, వారి గురించి అంతకు ముందు స్నిగ్ధ మాటల్లో విన్నాడు.
“ఓకే, నన్ను కాస్త రిలాక్స్ అవ్వనివ్వు. నీ మూడ్ పాడుచేస్తే క్షమించు. ఉన్న పరిస్థితి కంటే నేను దాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకున్నానేమో అనిపిస్తుంది.”అంటూ క్షణం బాధపడింది స్నిగ్ధ.
ఋషి ఆమెను మళ్ళీ ఉత్సాహపరచాలని అనుకున్నాడు. అందుకే అల్లరిగా,”ఇది నిజమే కావచ్చు. మృణాళ్ అతని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని చూస్తున్నాడేమో, నువ్వే అతన్ని అపార్ధం చేసుకున్నావ్.”
“ఏంటి ?ఆరోగ్యం కోసమా ? నేను ఇప్పుడన్నది నీకు అర్ధం కాలేదు అనుకుంటా. అతని చూపులు – ఎవరైనా అలా స్కాన్ చేస్తున్నట్టు చూస్తే, ఎలా అనిపిస్తుందో నీకు తెలుసా?” అంది స్నిగ్ధ గొంతు పెంచుతూ.
ఋషి ఆమెను చల్లబరిచి, “స్నిగ్ధ, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాము. అతని చూపుల్ని తప్పుగా భావించకు. నిజానికి, కొన్నిసార్లు నేను కూడా స్త్రీలను అలా చూస్తాను. ఆ మాటకొస్తే, ప్రతి మగవాడు అందమైన స్త్రీని చూసినప్పుడు అలాగే చూస్తాడు. “
స్నిగ్ధకు అతను చెప్పింది నచ్చకపోయినా, అది వాస్తవమే అనిపించింది. కాని, అతను చెబుతున్న విధానం చూస్తే, దాని వెనుక ఏదో లాజిక్ ఉందని అర్ధం అయ్యింది. ఆమె అతనితో వాదించే మూడ్ లో లేదు, అందుకే అతని మాటల్ని వినసాగింది. అతని సాన్నిహిత్యంలో మనసు కుదురుకోవాలని ఆమె కోరిక.
“నీకు తెలుసా స్నిగ్ధా ! జర్మన్ సైంటిస్ట్ లు స్త్రీల వక్షాన్ని చూడడం ఆరోగ్యకరమైన అలవాటని, పురుషులకు చాలా గొప్ప వ్యాయామమని, అలా చూసే పురుషుల జీవితకాలం మరో 5 ఏళ్ళు పెరుగుతుందని కనుగొన్నారు. ఇది వారి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి, తద్వారా రక్తప్రసరణను పెంచుతుందట. ఇది ఆరోగ్యానికి చాలా కీలకమట.” కొంటెగా నవ్వుతూ అన్నాడు ఋషి.
“నాన్సెన్స్ “అనుకోకుండా అనేసింది స్నిగ్ధ. ఇటువంటి తెలివితక్కువ అంశాలు నాకు చెప్పకు. నీకు ఆడవాళ్ళ వంక చూడడం అంటే ఇష్టమని నాకు తెలుసు. ఇది పురుషులకు సహజమేనని నాకు తెలిసినా, ఇవాళ మృణాళ్ మనసులో ఉన్నది వేరే అభిప్రాయమనిపించింది. నేను అతన్ని అతనికి ఇష్టమైన రంగు గురించి అడిగితే, స్పష్టంగా నీలిచిత్రాలు అంటే ఇష్టమని చెప్పాడు. ఇడియట్!!”
“నిజమే, అతను నిజంగానే ఇడియట్.” ఋషి వెంటనే అంగీకించాడు. ఋషి తనను సమర్ధిస్తున్నందుకు   స్నిగ్ధ, ఆ తర్వాత ఈ విషయంలో అతను మాట్లాడేది వినేవరకూ ఆనందించింది.
“వాడు నిజంగానే ఇడియట్, ఎందుకంటే నీలిచిత్రాలకు ఆ పేరు వాటిలో వాడే ఫిలిం రంగు వల్ల రాలేదు. USA చరిత్రలో కొన్ని నైతిక నియమాలు ఉండేవి. వాటిని ‘బ్లూ లాస్ ‘ అనేవారు. ఆల్కహాల్ అమ్మకం వంటి కొన్ని విషయాలపై ఈ నియమాలు నిబంధనలు విధించాయి. బ్లూ లాస్ ను ఉల్లంఘించిన వారికి దాదాపు మరణశిక్ష విధించినంత పని చెయ్యడంతో, వాటిని అంతా బ్లడీ లాస్ అనేవారు. ఆ రోజుల్లో ఆ లా ను ఉల్లంఘించి, సమాజంలోకి విడుదల అయినవన్నీ ఆ రోజుల్లో ఒక బ్లూ ట్యాగ్ ను కలిగి ఉండేవి. బ్లూ ఫిలిమ్స్ అనేవి కూడా, ఆ విధంగా నైతికపరంగా బాన్ చెయ్యబడి, ఎలాగో సమాజంలోకి వచ్చినవే. ఇప్పుడు USA లో ఆ నియమాలు లేనప్పటికీ, బ్లూ అనే పదం ఆ ఫిలిమ్స్ తో అలాగే ఉండిపోయింది. “ ఋషి స్నిగ్ధ స్పందన కోసం చూడసాగాడు. ఆమె నవ్వుతోంది.
“నువ్వు అసాధ్యుడివి ఋషి. నీకు నన్ను ఎలా నవ్వించాలో తెలుసు. నా ముఖంపై నువ్వు తీసుకురాగలిగిన చిరునవ్వే, నువ్వంటే ఇష్టపడేలా చేసింది. నీ సమక్షంలో నాకు ఏ బెంగలు ఉండవు, నా ఆరోగ్యం గులాబీలా విరబూస్తుంది, చీర్స్,” అంటూ చెబుతూ, స్నిగ్ధ అభినందించింది.
వాళ్ళు డిన్నర్ కు ఆర్డర్ చేసి, సంభాషణ కొనసాగించారు.
“ఇప్పుడు గులాబీరంగు అనే మాట మాట్లాడకు. పింక్ మూవీస్ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. జపాన్ లో సెన్సార్షిప్ చట్టాల ప్రకారం, స్త్రీలను కొన్ని కోణాల్లో చూపకూడదు. దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న అక్కడి డైరెక్టర్లు, కొన్ని ఆర్ట్ పీస్ లతో సినిమాలు తీసారు. సెన్సార్షిప్ నియమాలను ఉల్లంఘించకుండానే అవి చూసేవారికి మోహాన్ని కలిగిస్తాయి. దీనికి ఎంతో సృజన, కళాదృష్టి కావాలి. వీటికీ USA లోని నీలిచిత్రాలకి ఎంతో తేడా ఉంది. “
“ఋషి, ఇక చాలు, ఆపేయ్. నీ మగ మనసులోని భావాలు అన్నీ బయటపెట్టడం మొదలుపెడితే, ఇక వాటికి అంతుండదు. మగవారితో ఇటువంటి విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. కాని, నీతో ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది నాకు ఏ మాత్రం ఇబ్బందికరంగా అనిపించట్లేదు. స్త్రీలతో ఈ విషయాలు మాట్లాడడంలో నీకో ప్రత్యేకమైన శైలి ఉంది.” అభినందించింది స్నిగ్ధ. వారిద్దరూ డిన్నర్ కోసం నిరీక్షించసాగారు.
“ఋషి నీ వర్క్ ఎలా సాగుతోంది ? ఆర్ట్ ఫండ్ ఎలా కొనసాగుతోంది ? దీని కోసం నా సాయం ఏమైనా కావాలా ?”ఋషి ఆమెకు దీన్నుంచి ఒక బ్రేక్ కావాలని తెలుసుకున్నాడు, అందుకే టాపిక్ మార్చాలనుకుని, తనే చొరవ తీసుకుని, “ చక్కగా సాగుతోంది. అవసరమైనప్పుడు తప్పకుండా నిన్ను ఇబ్బంది పెడతాను. సరేగాని, నువ్వు ఇప్పుడు తాగుతున్న సూప్ గురించి ఒక ప్రశ్న అడగనివ్వు. టమాటో అనేది పండు క్రిందకు వస్తుందా, లేక కూరగాయల క్రిందికా ?”
అతని ఉద్దేశాన్ని కనిపెట్టిన స్నిగ్ధ “ఈ విషయంలో కోర్ట్ ఏమంది ?” అని అడిగింది.
“టమాటో కూరగాయల క్రిందికి వస్తుంది అంది. “జవాబిచ్చాడు ఋషి.
“కాని నువ్వు అదే నిజమని ఎలా నమ్ముతున్నావ్ ?” ఆసక్తిగా వినసాగింది స్నిగ్ధ.
“కోర్ట్ కూడా అది ఫలమేనని నమ్ముతోంది. కాని పళ్ళ లాగా కాక, దాన్ని కూరల్లో ఎందుకు చేర్చారంటే, అది భోజనం ముందు ఇచ్చే సలాడ్ లో సర్వ్ చేస్తారు కనుక. డెసర్ట్ ఐటమ్స్ లో ఇతర పళ్ళతో కలిపి దీన్ని పెట్టరు.” వివరిస్తూ, చెదరని చిరునవ్వుతో సంభాషణ కొనసాగించాడు ఋషి. స్నిగ్ధ మూడ్ ఇప్పుడు పూర్తిగా మామూలుగా మారిందని గుర్తించాడు.
ఇద్దరూ డిన్నర్ పూర్తి చెయ్యబోతూ ఉండగా, ఋషి ఇలా అన్నాడు, “స్నిగ్ధ జోక్స్ ప్రక్కన  నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. మృణాళ్ తో జాగ్రత్తగా ఉండు. నీకు నా సాయం కావాలంటే, వెంటనే చెప్పు. నువ్వు అతనికి దగ్గరగా ఉంటూ పనిచెయ్యాలి కనుక, ఏదైనా అసహ్యంగా ప్రవర్తిస్తే గమనిస్తూ ఉండు. కొన్నిసార్లు కొందరు పురుషులు యెంత విచిత్రంగా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. జాగ్రత్త !” అన్నాడు ఋషి.
ఋషి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, తనకు జాగ్రత్తలు చెప్పి, ఊరడించినందుకు స్నిగ్ధ ఆనందపడుతూ, అభినందించింది.
అతనికి దగ్గరగా వచ్చి, “ఋషి, నీ ఆసరా తీసుకోవచ్చని, నాకు తెలుసు. ఇప్పుడు కాస్త హాయిగా ఉంది. ఏదైనా ఇబ్బంది ఉంటే నీకు చెప్తాను.” అంది. వాళ్ళిద్దరూ, డిన్నర్ ముగించి తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
(సశేషం..)

No comments:

Post a Comment

Pages