శివం – 18
(శివుడే చెబుతున్న కధలు )
రాజ కార్తీక్
9290523901
మంత్రి మరియు రాజ పరివారం అందరూ ఆందోళనలో “శివశివ” అని అంటున్నారు. ఉద్భవుడు ఉక్రోషంగా “ఎవరు ఎవరు అది, ఎన్నిసార్లు చెప్పాలి, మీ అందరికి కూడా మరొక్కమారు తీవ్ర హెచ్చరిక చేస్తున్నా.. ఎవరైనా ఆ శివుని పేరు ఎత్తినా, ఆయన నామాలు పలికినా, క్షమించమన్నా క్షమించను” అన్నాడు ఉగ్రుడై.
ఎవరికీ ఏమీ అర్ధం కావటం లేదు. జక్కన్న మాత్రము ఎర్రని కళ్ళతో లేచి మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఉద్భవుడు మౌనంగా చూస్తున్నాడు. అంటా నిశ్శబ్దం. మంత్రిగారు “జక్కన్నగారు, ఉండండి” అన్నాడు. ఉద్భావుడు “ఎవరినీ ఆపవలసిన అవసరం లేదు, ఎవరి ఇష్టం వారిది, ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని ఈ జక్కన్నగారు పండితులా లేక పామరులా.. హాహాహా..” అంటున్నాడు. “భటులారా, పదండి, ఆంతరంగిక మందిరానికి రాజభవనం వైపు” అంటున్నాడు. పల్లకీలో అందరూ పయనమయ్యారు. అక్కడి వారందరూ గుడికి చేరుకున్నారు. అందరూ అలవాటులో గుడి వైపు చూసి నమస్కారం చేసారు. వెంటనే ఉద్భవుడు వారందరి వైపు ఉగ్రంగా పరికించాడు. అందరూ సర్దుకున్నారు. రాజభవనం చేరారు. పల్లకి దిగిన ఉద్భావుడు తన రాజస్థానంలో నించొని “ఎవరైనా శివ నామస్మరణ చేస్తే వారికి దండన విధించబడుతుంది” అని ఆజ్ఞాపించాడు. అందరికీ ఏమి అర్ధం కాలేదు. సభలో కొంతమంది “ఏమి చోద్యం ఇది మహారాజా? ఈశ్వరుణ్ణి తలిస్తే శిక్షా?” మరి కొంతమంది ధైర్యం చేసి “రాజా! కొంతకాలం నుండి మిమ్మల్ని గమనిస్తున్నాము, మీకు కొంత మతి తప్పింది, సరైన వైద్యుణ్ణి పిలిచి పరిష్కరించుకున్దాము” అన్నారు. ఉద్భవుడు తీక్షణంగా చూస్తున్నాడు. రాజు మౌనం గమనించి మళ్ళీ అతని దగ్గరకి వెళ్లి, “సమయం మించి పోలేదు, శివ శివ శివ అని, శివుడికి .... చెప్పి ఉద్భవ రాజ, దయచేసి మంచి వైద్యుడికి చూపించుకుంటే అంటా బాగుంటుంది” అన్నాడు వెటకారంగా. ఉద్భావుడు ఆ వ్యక్తిని పట్టుకుని ఒక పిడి గుద్దు గుద్దాడు. అంతే అందరూ లేచి నిల్చున్నారు. ఆ గుడ్డుకి అతడికి మొహం రక్తస్రావం అయింది. కళ్ళు బైర్లు కమ్మాయి.. “ఓ మహా భక్తుడా, మా నాన్నగారి నుంచి గుడికి పంపిస్తున్న ద్రవ్యాన్ని ఎంతోకొంత మీరు స్వాహా చేసారు. అది గమనించి కూడా మిమ్మల్ని మేము భరించాము. ఈ రోజు మీరు శివా శివా శివా శివా.. అంటే చేసిన పాపం పోతుందా? పైగా రాజునైన నా ఆజ్ఞ నా ముందే పరిహసిస్తున్నావే? నీ లాంటి భగవంతుడి సొమ్ము తినే వారికి ఆ శివుడు ఏమి చేసాడు? ఒకవేళ ఆయన ఉంటె నీ తప్పు నీకిప్పుడే తెలియజేసేవాడు. చేసేది శివపూజ.. బుద్ధింతా.. ఛీ” అనేసరికి అందరూ స్తంభించారు. కొంతమంది పరివారం “వాడి ఆగడాలకి సరైన దండన లభించింది, ఇదివరకు నుండి వాడి ఆగడాలు మరీ ఎక్కువ, మహారాజు దృష్టికి తీసుకెలదామనుకున్నా కుదరలా. కానీ ఇప్పుడు ఉభావుడు అన్నీ ఎరిగిన వాడిలా చేస్తున్నాడు. కానీ శివనామస్మరణ నిషేధించడం అందరికీ రుచించటలా?”
మంత్రిగారు, “ఉద్భవా ఏమిటి ఇది, స్వయానా ఒక రాజువై నీవు ఇలా చేయవచ్చా?”
ఉద్భవుడు “స్వయానా రాజును ఇలా ఎవరైనా అనవచ్చా?” ఆగ్రహంగా
మంత్రి “శివనామస్మరణ చేయవద్దు” అని అనకూడదు మహారాజా..
ఉద్భవుడు “దేనికో..”
మంత్రి “స్వయానా, నాకు మీ తండ్రి గారి వయస్సు ఉంది, మీ తండ్రి మహా శివభక్తులు, ఆయన చేసిన పుణ్యకార్యాలు అన్నీ ఇన్నీ కావు, వారు ఖచ్చితంగా శివైక్యం చెందారు, కానీ నీవు ఇలా చేయకూడదు నాయనా!”
ఉద్భవుడు “నీవు కాదు, మీరు.. మహారాజును గౌరవించాలి!”
మంత్రి “క్షమించండి మహారాజ, ఒక భక్తుణ్ణి తన భగవంతున్ని తలచవద్దు అని చెప్పటం మహాపాపం, రాజు ప్రజలందరికీ తండ్రి వంటి వాడు, తండ్రి తప్పు చేసిన.. ఎట్లు?”
ఉద్భవుడు “తండ్రికీ తెలుసు మంత్రివర్యా.. తప్పా లేక ఒప్పా అని, తండ్రి చెప్పినది అమలు చేయటం వరకే మీ అందరి పని”
మంత్రి “ఏమిటి నాయనా, నీ మౌనం నుండి వైరాగ్యం పుడుతుంది, నీ మనస్సు భక్తి వైపు మరలుతుంది, నీ గ్రంథపఠనం జ్ఞానం అవుతుంది, నీ ప్రజారంజన మనస్సు భగవంతున్ని ప్రసన్నం చేస్తుంది” అనుకున్నా.
ఉద్భవుడు – “మీరు అనుకుంటే దానికి ఎవరు బాధ్యులు మంత్రివర్యా? అయినా లేని ఆ దేవుణ్ణి కొలవటం ఎందుకు? చెప్పటం మరిచా, శివుణ్ణి కాదు, ఏ దేవుడ్ని కొలవకూడదు, అందరూ ఆయన స్వరూపాలేగా, ఇక వాదన వొద్దు, నా రాజ్యంలో శివనామస్మరణ, దైవనామస్మరణ, దైవక్రతువులు అన్నీ నిషేధించటమైనది.. అది రాజాజ్ఞ!”
మంత్రి “తప్పు రాజా, నీవు కొండంత పాపాన్ని మూట కట్టుకుంటున్నావు, ఆజ్ఞ అయితే వేయగాలవు కానీ, మనస్సు నీవు ఆపలేవుగా”
ఉద్భవుడు “మంచిదే, మహేశ్వరుడు మనస్సునేగా చూసేది, అలా మనసులో ధ్యానించుకోమనండి అందర్నీ”
ఇంతలో రాజపరివారంలో ఒక కపటి, తను ఎలాగైనా రాజ ప్రశంస పొంది అతనికి దగ్గర అవ్వాలనే వాడు లేచి “అవును మహారాజ, మీరు చెప్పింది నిజమే శివుడు లేడు, శివ శివ శివ అని వీరు చేసేది అంతా ఒక మూఢ నమ్మకం. మీరు చాలా మంచి పని చేసారు అని అన్నాడు రాజుని ప్రశంసించినట్టు. ఉద్భవుడు వాడికి ... ఒక ముష్టిఘాతం ఇచ్చాడు. వాడి మొహం కూడా ఇందాక వాడి మొహం వలెనె అయింది.
వాడు “రాజా.. మీరు నన్నెందుకు కొట్టారు?”
ఉద్భావుడు “శివ నామస్మరణ చేయవద్దు అంటే నా ముందే శివ శివ శివా అని అంటావా? శివుడు లేదు అంటావా? అందులోనే శివుడు వున్నాడు” వాడు తల గోక్కున్నాడు. అందరూ మౌనంగా చూస్తున్నారు.
ఉద్భవుడు “ఎవరక్కడ? భటులారా ముందు ఇతగాడి తగ్గర గుడి కోసం ఇచ్చిన వాటిని స్వాహా చేసాడు కదా, వాటిని ధర్మ వడ్డీతో వసూలు చేయండి, తదుపరి ఈ కపటిని, తన తల్లితండ్రులను చూసుకోకపోతే కొరడాతో కొట్టి హింసించండి, అని ఆజ్ఞ చేసాడు.
అప్పుడు అందరికీ గుర్తుకు వచ్చింది. “అతడు కాసుల కోసం, తన తల్లిదండ్రులను హింసిస్తున్నాడు.” భటులు వారందర్నీ లాక్కుని వెళ్ళారు. కొంతమంది పండితులు లేచి ఉద్భవుడికి ఏదో చెప్పబోయారు. అందర్నీ వారిస్తూ, ఈ రోజు సభ వాయిదా, రేపు తిరిగి మాట్లాడదాం. అంతవరకూ అందరూ మౌనం వహించండి. చెప్పానుగా శివ నామస్మరణ చేస్తే అందుబాటులో ఉన్న శిక్ష విధిస్తా అని, చూసారుగా వాళ్ళని.. అన్నాడు ఎంతో ఆగ్రహంగా.. సింహాసనానికి నమస్కరించి, ఎవర్నీ పట్టించుకోకుండా ఉద్భవుడు తన ఆంతరంగిక మందిరం వైపు నడిచాడు ఒంటరిగా. ఆంతరంగిక మందిరంలోకి వెళ్లి తలుపులు వేసాడు గట్టిగా..
(సశేషం...)
No comments:
Post a Comment