శ్రీధరమాధురి – 21
రాయిలోనే శిల్పం దాగి ఉన్నట్లు, మనిషిలోనే పరమాత్మ దాగిఉన్నారు. అరిషడ్వర్గాలు అనే అక్కర్లేని ముక్కల్ని తీసేస్తే, మనలోని పరమాత్మ మనకు ద్యోతకమవుతారు. మనలోని శిల్పాన్ని గుర్తించమంటూ, పూజ్య ఆచార్యులు శ్రీ వి.వి. శ్రీధర్ గురూజీ చెప్పిన అమృత వచనాలు... ఈ నెల శ్రీధరమాధురిలో మీ కోసం.
ఒక సన్యాసి చాలా గొప్ప శిల్పి. అతను తన ఉలి, సుత్తితో ఒక దైవవిగ్రహం చెక్కసాగాడు. గురువు శిల్పాన్ని చెక్కే విధానాన్ని చూసిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. చివరికి ఒక అందమైన దైవప్రతిమ రూపుదిద్దుకుంది.
శిష్యుడు – ఓ గురువర్యా, మీరు యెంత అందంగా దైవవిగ్రహాన్ని చెక్కారు ?
గురువు – హ హ హ ... నేను చెక్కలేదు. ఆ విగ్రహం ముందే రాతిలో దాగుంది. నేను అక్కర్లేని ముక్కల్ని తీసేసాను అంతే.
ఏదైనా మంచిది అంతమైపోతే, ఇంకా మేలైనది మొదలవుతుంది.
ఏదైనా మేలైనది ముగిసిపోతే, సర్వోత్తమమైనది మొదలవుతుంది.
సర్వోత్తమమైనది సమాప్తమైతే, తృప్తి మొదలవుతుంది.
తృప్తి అనేదే అన్ని ఆరంభాలకు ముగింపు.
బుద్ధిని అధిగమించాలి అంటే మీరు మౌనంగా ఉండాలి. మీరు మౌనంగా ఉంటే, మీరు వింటారు. మీరు గురువు మాటల్ని మనసుతో వింటారు. అప్పుడు మీరు హృదయం వైపు దృష్టిని కేంద్రీకరించి ఉంటారు. బుద్ధి నెమ్మదిగా నశిస్తుంది. అలా జరగాలంటే మీరు గురువు మాటల్ని మౌనంగా వినాలి. మీ సందేహాలన్నీ బుద్ధిలోంచి వస్తాయి. గురువుకు మీ సందేహాలు తెలిసినప్పుడు, అవి మీ బుద్ధి నుంచి వచ్చినవని, ఆయన గ్రహించి, నేరుగా మీకు సమాధానం ఇవ్వకపోవచ్చు. కాని, మీరు ఆయన చెప్పింది వింటూ ఉండగా, ఆయన అంతర్లీనంగా జవాబును ఇస్తారు. అయితే, బుద్ధిని అధిగమించాలని అనుకుంటున్నారా ? హృదయాన్ని బుద్ధిపై అజమాయిషీ చెయ్యనివ్వండి. ప్రశాంతత చేకూరుతుంది.
మనం జన్మించే ముందే దైవం వచ్చారు.
మనం మరణించాకే దైవం వెళ్ళిపోతారు.
ఆయన ఎల్లప్పుడూ మన హృదయంలోనే ఉన్నారు.
ఓ మనసా ? ఇక చింతలు ఎందుకు ?
శాశ్వతమైన తృప్తి అనేది, దైవంతో అనుబంధం వల్లనే సాధ్యం అవుతుంది. దైవంతో ఉండడం అనేది అతిగొప్ప పరమందానుభూతికి దారి తీస్తుంది.కాని, చాలామంది ప్రాపంచిక విషయాలతోనే తృప్తి పడిపోతారు. ఐహికమైన బంధాలు ఇచ్చే తృప్తి అశాశ్వతం. ఈ ఆనందం క్షణికం. దైవం శాశ్వతులు. అందుకే, దైవంతో మీ అనుబంధం కూడా శాశ్వతంగా ఉండి, పరమానందాన్ని కలిగిస్తుంది. దైవాన్ని కొనియాడండి. అంతా దైవేచ్చ, అనుగ్రహం, దయ.
పోరాటం ఉన్నచోట, ఒక కధ ఉంటుంది.
నమ్మకం ఉన్నచోట, అద్భుతాలు ఉంటాయి.
నిజం ఉన్నచోటే, శాంతి ఉంటుంది.
‘సంస్కారం’ అనే ప్రక్రియ మీ బుద్ధికి నియమాలు నేర్పుతుంది, ఇవి తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనలో కొన్ని ఊహలను, ముద్రలను, గుర్తులను సృష్టిస్తుంది. ఈ సంస్కారం యొక్క స్థాయిని బట్టి, ఊహలు, భావనలు ఏర్పడతాయి. ఇది తామే కర్తలమని, భావించడం వల్ల జరుగుతుంది. కర్తృత్వం వహించకుండా జీవించడం అలవర్చుకుంటే, ‘సంస్కారాలకు’ ‘వాసనలకు’ తావుండదు. కాని కేవలం దైవానుగ్రహమే ‘కర్తృత్వం’ వహించడం నుంచి ‘కర్తృత్వం వహించకపోవడం’ అనే అద్భుతమైన మార్పును తీసుకురాగలుగుతుంది. ఓ దైవమా, ఏదీ ఎన్నుకోకుండా, కర్తృత్వం వహించకుండా జీవించడం అనే సూత్రాన్ని పాటించేలా, మా అందరిపై మీ దయావర్షాన్ని కురిపించండి. అంతా దైవానుగ్రహం.
మాటల్లో దయ నమ్మకాన్ని కలిగిస్తుంది.
ఆలోచనల్లో దయ గాఢతను సృష్టిస్తుంది.
పంచడం/ఇవ్వడంలో దయ ప్రేమను సృష్టిస్తుంది.
మీరు చేసే పనులన్నింటిలో దైవాన్ని గుర్తించండి.
ధైర్యానికి తోడు నమ్మకం...
బాల్యదశ నుంచి ఎదుగుతూ ఉండగా, మనం చాలా చెత్తను పోగేసుకున్నాము – అహం,ఆశించడం, గర్వం, అసూయ,స్వార్ధం, అపోహలు, తర్కం, కారణాలు వెతుక్కోవడం, ఇటువంటివి. అమాయకత్వం, ఆశ్చర్యంతో కూడిన ఆ రోజుల్ని ఆస్వాదించాలి అంటే, మీరొక పసిపాపలా అవన్నీ వదిలేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. పిల్లలకు చాలా ధైర్యం ఉంటుంది. అమాయకమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్న వారు, అమితమైన ధైర్యాన్ని కలిగిఉండాలి. కాని, ఇప్పుడు మీరు ఆవకాయలా తయారయ్యారు. నూనెలో, ఉప్పులో, ఖారంలో నానిన మామిడికాయ ముక్కల్లా తయారయ్యారు. మీ సారమంతా మామిడి ముక్క పీల్చేస్తే, మీరు ఇవాళ ఊరగాయ లానే మిగిలారు కాని, మామిడికాయగా లేరు. చుట్టుకున్నవి విప్పుకోవడం అనేది చాలా పెద్ద పని. నేర్చుకున్నవి మరవడం కూడా పెద్దపనే. విడిచిపెట్టడం అనేదీ చాలా కష్టమైనదే.
మీ ప్రాపంచిక ఇబ్బందులు అన్నీ మీరు దైవాన్ని తెలుసుకునేందుకు మీకు ఉపయోగపడతాయి.
దైవం సుందరమైనవారు, అధ్భుతమైనవారు. ఆయన లీలలు గుహ్యమైనవి. పూర్తి నమ్మకం ఉన్నచోట మీరు ఆయన్ని అనుభూతి చెందగాలుగుతారు. దైవాన్ని కొనియాడండి.
***
No comments:
Post a Comment