శ్రీరామ కర్ణామృతము - అచ్చంగా తెలుగు

శ్రీరామ కర్ణామృతము

Share This

శ్రీరామ కర్ణామృతము

బల్లూరి ఉమాదేవి 


ప్రథమాశ్వాసము:-
ఆదిలో మంగళ శ్లోకములను వివరించి కవి ప్రథమాశ్వాసాన్ని ప్రారంభిస్తున్నాడు.
శ్లో:-శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం
శ్యామాంగం శశికోటి కాన్తవదనం చంచత్కలా కౌస్తుభం
సౌమ్యం సత్త్వగుణోత్తరం సుసరయూ తీరే వసంతం ప్రభుమ్
త్రాతారం సకలార్థ సిద్ధి సహితం వందే రఘూణాం ప్రభుమ్.                     : 1 :
తెలుగు అనువాద పద్యము:--
శా:శ్రీరామున్ శశికోటి కాంతి వదనున్ సీతా మనో నాయకున్
ధీరున్ విశ్వగురున్ బరేశు సరయూతీర ప్రచార హరిన్
ధారాభృత్సమ నీలుఁగౌస్తుభ ధరున్ ద్రాతన్ సుపర్వేశ్వరున్
శౌరిన్ సర్వఫలప్రదున్ గొలిచెదన్ సత్యాత్ము సౌమ్యాకృతిన్.
భావము:మూడు లోకములకు గురువైనవాడు,దేవతలలో శ్రేష్టుడైనవాడు,సీతామాతకు భర్త యైనవాడు కోటి చంద్రుల కాంతితో ప్రకాశించువాడు,ప్రకాశవంతమైన కౌస్తుభ రత్నాన్ని ధరించిన వాడు,సౌమ్యుడు,సత్త్వగుణసంపన్నుడు,సరయూ నదీ తీరమందు నివసించువాడు,ప్రభువు,రక్షకుడు,సకల కార్యసిద్ధులతో కూడినవాడు రఘువంశ  శ్రేష్టుడైన శ్రీరామునకు నమస్కరించు చున్నాను.
వ్యా:సకలగుణాభి రాముడైన శ్రీరాముని ఆకృతిని గుణగణాలను కవి వివరిస్తున్నాడు. ముల్లోకాలకు గురువు రాముడు.ఒక్క చంద్రుడే లోకానికి కాంతిస్తాడు.మరి రాముని మోము "కోటి చంద్రుల"కాంతితో ప్రకాశిస్తుందట.
ఇలా రఘువంశ కులతిలకుని గుణగణాలను అతి చక్కగా వివరిస్తున్నాడు.
శ్లో:శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.                                      : 2 :
తెలుగు అనువాద పద్యము:
ఉ:   శ్రీ రఘువీరు దాశరథి జిన్మయు సూర్యకుల ప్రదీపకున్
సారస పత్రనేత్రు దితిసంభవ జైత్రు మహీసుతాననాం
భోరుహ మిత్రు దీర్ఘకరు బుణ్య చరిత్రు జగత్పవిత్రు శృం
గార గుణాభిరాము ద్రిజగత్ప్రభు నెంతు హృదంతరంబునన్.
భావము: రఘువంశంలో పుట్టినవాడు దశరథుని పుత్రుడు,అప్రమేయుడు,సీతకు పతి యైన వాడు,రఘువంశమనే సముద్రానికి చంద్రుని వంటి వాడు,ఆజాను బాహుడు,పద్మపు రేకులవంటి విశాలమైన కన్నులు కల్గినవాడు,రాక్షసులను సంహరించు వాడైన శ్రీ రామునకు నమస్కరించు చున్నాను.
వ్యా:  తెలుగు వారందరికి చిరపరిచితమైన శ్లోకమిది.రాముని రూపు కళ్ళకు కట్టినట్లు వర్ణించే పద్యమిది.మోకాళ్ళవరకుచేతులుకలవాడట,పద్మమే విశాలంగా వుంటుంది.దాని ఆకులు ఇంకా విశాలంగా వుంటాయి.అలాంటి కన్నులున్నవాడు శ్రీరాముడు అని కవి వివరిస్తున్నాడు.
శ్లో:శ్రీరామం బలవైరి నీలచికురం స్మేరాననం శ్యామలం
కర్ణాంతాయత లోచనo సురవరం కారుణ్యపాథోనిధిం
శోణాంభోరుహ పాద పల్లవ యుగం క్షోణీ తనూజాయుతం
రాజత్కుండల గండ భాగ యుగళం రామం సదాహం భజే.                   :  3  :
తెలుగు పద్యము:
మ:హరి నీలాలకు సుస్మితానను ఘన శ్యామాంగు దేవేశు సుం
దర కర్ణాంతవిలోచనున్ రఘువరున్ ధాత్రీ తనూజాధిపున్
గరుణాంబోనిధి రత్నకుండల లసద్గండస్థలున్ నవ్య భా
సురతామ్రాంబుజ పల్లవాంఘ్రి యగు సుశ్లోకున్ బ్ర
శంసించెదన్.
భావము:ఇంద్ర నీల మాణిక్యములవంటి నల్లని వెంట్రుకలు కలవాడు,చిరునవ్వులు చిందించు మోము కలవాడు,చెవులపర్యంతము వ్యాపించిన కన్నులు కలవాడు,దేవతలలో శ్రేష్టుడు,దయాసాగరుడు,ఎర్రని పద్మములవంటి పాదములు గలవాడు సీతా సమేతుడైనవాడు బ్రకాశించు కుండలములుగల గండస్థలములు కల శ్రీ రాముని ఎల్లప్పుడూ సేవించెదను.
వ్యా:ఇంతకు ముందు పద్యంలోఆజానుబాహుడని వర్ణించగా ఇప్పుడీపద్యంలో ఆకర్ణాయుత నేత్రుడైనశ్రీరామచంద్రునిస్తుతిస్తున్నారు
శ్లో:శ్రీరామం జగదేకవీర మమలం సీతా మనోరంజనమ్
కౌసల్యావరనందనం రఘుపతిం కాకుత్స్థ వంశోద్భవమ్
లోకానామభిరామ మంగళకర వ్యాపార పారాయణమ్
వందేహం జనఘోర పాపనికర ధ్వంసం విభుం రాఘవం.                : 4 :
తెలుగు అనువాదపద్యము:
శ్రీ రామున్ జగదేకవీరు నమలున్ సీతామనోరంజనున్
గారుణ్యాకరు గోసలేశ్వర సుతాగర్భాబ్ధి చంద్రోదయున్
ఘోరాఘౌఘతమిస్ర కంజ సఖు గాకుత్ స్థాన్వయున్ రాఘవున్
శూరున్ లోకపవిత్రు రామవిభు సుశ్లోకున్ మదిన్ గొల్చెదన్.
భావము:జగములయందు వీరుడును నిర్మలుడును సీతాదేవి మనస్సును రంజింప చేయువాడును కౌసల్యాసుతుడైనవాడు కాకుత్ స్థ వంశోద్భవుండును లోకాలకు హితకరమైనపనులు చేయువాడును పాపములు పోగొట్టువాడునూ అగు రామునకు నమస్కరించుచున్నాను.
వ్యా:శ్రీరామచంద్రుని అనేకవిశేషణాలతో వర్ణించి నమస్కరించడం ఇందులో అగుపిస్తుంది.
శ్లో:శ్రీరామం జగదీశ్వరం జనకజాజానిం జనానందనమ్
జంతూనాం జనకం జనార్తి హరణం లోకేశ్వరం శాశ్వతమ్
జాబాల్యాది మునీశ్వరైఃపరివృతం జాజ్వల్యమానం సదా
జంఘాలం జమదగ్ని సూను హరణం జాతాను కంపం భజే.                  : 5 :
తెలుగు అనువాదపద్యము:
శ్రీ రామున్ జగదీశ్వరున్ జనకపుత్రీ నాథు మౌనీంద్ర
సంఘారూఢావుతు సజ్జనార్తిహరు జంఘాలున్  బరీభావ కృ
ద్దూరీ ప్రాభవ భార్గవున్ సకల జంతు ప్రాణ రక్షున్ సుప
ర్వారాధ్యున్ రఘువర్యు శాశ్వతు జనాహ్లాదున్  భజింతున్ మదిన్.
భావము : జగదాధిపతి యైనవాడు జనరంజకుడైనవాడు సీతాపతి ప్రాణులను పుట్టించువాడు జనుల బాధలను హరించువాడు లోకాలకధిపతియైనవాడు జాబాలి మొదలైన మునులతో మెలిగినవాడు ప్రకాశించెడివాడు పిక్కపుష్టి కల్గినవాడు పరశురావుని గర్వమును హరించినవాడు దయార్ద్రహృదయుడైన రాముని సేవించు చున్నాను.

No comments:

Post a Comment

Pages