వలపులధికము సేయు వైభవములు - అచ్చంగా తెలుగు

వలపులధికము సేయు వైభవములు

Share This
అన్నమయ్య  భక్తి(శృంగార)  మాధురి-

వలపులధికము సేయు వైభవములు

 -డా. తాడేపల్లి పతంజలి


 వేంకటేశ్వరుడు , పద్మావతీదేవి తోటలో విహరిస్తున్నారు. సరస సంభాషణాలలో ఉన్నట్టుండి వేంకటేశ్వరుడు “వలపులధికము సేయు వైభవములు”  (ప్రేమలు- వైభవాలను  ఎక్కువ చేస్తాయి”) అన్నాడు. “వైభవాలంటే... “పద్మావతీదేవి ప్రశ్నించకుండానే కళ్లతోటి ప్రశ్నించింది. “వైభవాలంటే ఐశ్వర్యములు..గొప్పతనాలు... నువ్వు నన్ను ప్రేమించడం వల్ల కదా.. నాకు గొప్పతనం.ఇదివరకు నాకు గొప్పతనముండేది. నీ వలపుతో ఆ గొప్పతనపు వైభోగము ఇంకా పెరిగింది.”వేంకటేశుడు జవాబిస్తూనే “తలపోతలు తలపులను  అధికము చేస్తాయి.”అన్నాడు. “తలపోతలు...”అమ్మ అర్థోక్తిలో ఆగింది “ఆలోచనలు  అభిప్రాయాలను అధికము చేస్తాయి.నిన్ను ఎలాగయినా కలవాలని నా అలోచన. ఇలా కలవాలని ఒక అభిప్రాయము వస్తుంది. ఆ ఆభిప్రాయాన్ని  ఆలోచన బలపరుస్తుంది.” “అబ్బో..”పద్మావతీదేవి ముద్దుగా వెక్కిరించింది. కీర్తన పల్లవించింది. చరణము 01. “కోపం-  కోరికలను అధికము చేస్తుంది. బాధ   - తహతహలని ఎక్కువ చేస్తుంది.. కోపము,బాధ  ఈ రెండూ కూడా మోహాలను అధికము చేస్తాయి. ఏం చేస్తాము !?” అంటూ వేంకటేశ్వరుడు నిట్టూర్చాడు. “మీరు దగ్గరికి వస్తారు. నేను రానివ్వను. అప్పుడు మీకు కోపము వస్తుంది. ఆ కోపము మీ కోరికలను అధికము చేస్తుంది.నాకు దూరమయిన బాధ మీ తహతహలని ఎక్కువ చేస్తుంది. కోపము , బాధ ఈరెండూ కలిసిపోయి మోహాలను ఎక్కువ చేస్తాయి.అవునా? “వేంకటేశుని నిర్వచనాలను పద్మావతి వివరిస్తూ, చిలిపిగా దూరంగా స్వామివారిని నెట్టింది.  చరణము 02. “ఆసక్తులు గౌరవాలను  అధికము చేస్తాయి. కోరికలు బలహీనతలను అధికము చేస్తాయి. ఆసక్తులు, కోరికలు రెండూ మాటిమాటికి ఆనందపు కూడికలను పెంచుతాయి. ఏమంటాము.!?”వేంకటేశ్వరుడు  పద్మావతి కళ్లలోని తన ప్రతి బింబాన్ని ఆసక్తిగా చూస్తూ అన్నాడు. “ఈ ఆసక్తి  ఏమి గౌరవం పెంచుతుంది స్వామీ !” పద్మావతి నవ్వుతూ అంది. “లోకాలన్నీ నా వైపు ఆసక్తిగా చూస్తుంటే నేను నీ వైపు ఆసక్తిగా చూస్తున్నాను. ఇది నీకు గౌరవం పెంచటమే కదా !” “అబ్బో !” నవ్వుతున్న  పద్మావతీదేవి బుగ్గలు సొట్ట బడ్డాయి. తరువాత చర్యకు బుగ్గలను తుడుచుకొంటూ ,పద్మావతి కోపం నటిస్తూ స్వామి వారిని చూసింది. “కోరిక బలహీనతలను అధికం చేయటమంటే ఏమిటో చెప్పటానికి అలా చేసాను. అంతే. వేరే ఉద్దేశ్యం లేదు” వేంకటేశుడు తన చర్యను సమర్థించుకొన్నాడు. “ఆసక్తి , కోరిక కలిస్తే మాటిమాటికి ఆనందపు కూడికే. తీసివేత లేదు.”వేంకటేశుని నవ్వులతో తొటలోని పూలు విరబూసాయి. చరణము 03 “అందము ఒకటిగా అయ్యే విషయాలను ఎక్కువ చేస్తుంది. కలయికలు ప్రణయ కోపాలను ఎక్కువ చేస్తాయి. అందములు, కలయికలు- అద్భుతమయిన, ఆశ్చర్యమయిన, అపురూపమయిన వేంకటేశ్వరుని దయలను అధికము చేస్తాయి.” “అబ్బో ! అబ్బో ! నేను చెప్పకుండానే నువ్వే మొదలుపెట్టావు? “వేంకటేశ్వరుడు అన్నాడూ. “అన్నమయ్యకు మీకంటే ముందుగా ప్రసాదం పెట్టింది నేను.మీ చేతల్లోని తీపిని , దయని, తన కీర్తనల్లోకి ముందుగా ప్రవహింపచేసింది నేనే! అమ్మని నేను” “అలాగా ! అయ్య మీద అమ్మ  దయ ఎప్పుడూ ఉండు గాక !” వేంకటేశ్వరుడు భావ గర్భితంగా అన్నాడు.
****
                పల్లవి వలపులధికము సేయు వైభవములు తలఁపు లధికము సేయుఁ దలపోఁతలు చ.1: కోపమధికము సేయుఁ గోరికలు తాప మధికము సేయు దమకంబులు కోపంబుఁ దాపంబుఁ గూడ నధికము సేయు యేపయిన మోహముల నేమందమే చ.2: మచ్చికధికము సేయు మన్ననలు యిచ్చ లధికము సేయు నీరసములు మచ్చికలు నిచ్చలును మగుడ నధికము సేయు- నెచ్చరిక కూటముల నేమందమే చ.3: అందమధికము సేయుఁ నైక్యములు పొందులధికము సేయుఁ బొలయలుకలు అందములుఁ బొందులును నలరనధికముసేయు- నెందు నరుఁదగు వేంకటేశు కృపలు  (రేకు:      0024-04    సం:    01-146) ***    

No comments:

Post a Comment

Pages