వెన్నెల యానం – 9
భావరాజు పద్మిని
http://acchamgatelugu.com/%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-4
( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, ఆమెతో గతంలో తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటాడు శరత్. చంద్రికకు వాళ్ళ బావతో పెళ్లి కుదిరి, మరో నెల రోజుల్లో పెళ్లి ఉందనగా, చంద్రిక తల్లిదండ్రులు, అత్తయ్య కుటుంబం అంతా అనుకోకుండా కేదారనాథ్ వరదల్లో చనిపోతారు. చంద్రిక బావ కంపెనీ బాధ్యత ఆమె మీద పడుతుంది. కోట్లకు వారసురాలిగా ఒంటరిగా మిగిలిన చంద్రికకు ముగ్గురు యువకులు ప్రేమ ఉచ్చు బిగించాలని చూస్తూ ఉంటారు. ఈ లోపల అనుకోకుండా, పరిచయం అయ్యాడు శ్రీరాం. ఆక్సిడెంట్ అయ్యి, ఐ.సి.యు లో ఉన్న అతనికి ఎవరూ లేరు. అతనికి ఆసరాగా సాయి బాబా అనే అటెండర్ ను పెడుతుంది చంద్రిక. ఇక చదవండి...)
చంద్రిక మాట్లాడుతూ ఉండగానే, శరత్, చంద్రికప్రయాణిస్తున్న పడవ పాపికొండలు దాటి, సుమారు ఒకగంట ప్రయాణించాకా, ప్రకృతి అందాలకు నెలవైన పేరంటాలపల్లి అనే ఊరికి చేరుకుంది. ఒడ్డున పడవకు లంగరు వేసి, ఇద్దరూ పైకి నడవసాగారు.
“చంద్రా, ఇక్కడ ఏముంది ? ఇంతమంది చూసేందుకు వెళ్తున్నారు. నీకేమైనా తెలుసా ?” అడిగాడు శరత్.
“ఎన్నో ప్రకృతి అందాలకు పెట్టింది పేరు, ఈ పేరంటపల్లి గ్రామం. ఇక్కడ 36 కొండ రెడ్ల కుటుంబాలున్నాయి. వీరంతా వెదురు వస్తువుల తయారీతో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. పనస, జీడిమామిడి తోటలతో పాటు దట్టమైన చెట్లతో నిండిన పచ్చని కొండల నడుమ, ప్రశాంతతకు ఆలవాలంలా ఉంటుందీ గ్రామం. రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను, అభయారణ్యాలను కలుపుకొని, మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటం ఉంది. నిష్టా నియమాలతో గ్రామంలోని కొండ రెడ్ల మహిళలే ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తారు. ఎలాంటి కానుకలూ స్వీకరించరు. ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి.”
“అదేంటి చంద్రా... కొన్ని ఆశ్రమాలలోకి స్త్రీలను రానివ్వరు కదా, మరి స్త్రీలే ఆశ్రమం చూడడం ఏమిటీ, కానుకలు తీసుకోకపోవడం ఏమిటి?”
“ఆ కధనూ, చెబుతాను విను. ఇక్కడ పూర్వం బాలానంద స్వామి అనే ఒక సాధువు ఉండేవారు. ఇక్కడ ‘శ్రీరాముని వాకిటం’ అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధంలో రాజమండ్రి నుంచి బాలానంద స్వామి లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు.
పేరంటపల్లి స్వామిగా ప్రసిద్ధికెక్కిన బాలానందస్వామి జీవితంలో జరిగిన ఓ సంఘటన ఎంతైనా చెప్పుకోదగ్గది... కొండమీద పానపట్టంతో కూడిన శివలింగం సమీపంలో కుటీరం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటున్నారు స్వామి. ఆయనొక రోజు కుటీరానికి కొంతదూరంలో ఉన్న మామిడి చెట్టు వద్దకు పండ్లు కోసం వెళ్ళారు. కొంచెం ఎత్తులో ఉన్న కొమ్మకు మగ్గిన పండ్లు వ్రేలాడుతున్నాయి. అక్కడున్న దిమ్మపై కాలు వేసి పండ్లు కోయబోతున్న స్వామికి పెద్ద బిలం కనపడింది. అది అడవి పంది ఉండే బిలమని, బిలం నుండి పంది బయటకు వస్తే చావు తప్పదనీ అనుకున్నారు. అంతే- అంతవరకూ నిర్భీతమైన ఆయన హృదయంలో హఠాత్తుగా ఏ మూలనుంచో భయం బయలుదేరింది.
అది తనలోని సర్వాంతర్యామి యందు ఉండే అవిశ్వాసానికి చిహ్నం అనిపించింది. భగవానుని యందు సంపూర్ణ విశ్వాసం ఎలా స్థిరపరచుకోవాలా అన్న ఆలోచన తలెత్తింది. కొండమీద ఉండే జంతువులు ఆ మామిడి చెట్టు ప్రక్కగా ప్రవహించే వాగువద్దకు వచ్చి నీరు త్రాగుతాయి. ఆ సంగతి స్వామికి బాగా తెలుసు. తనలో దాగొనివున్న అవిశ్వాసాన్ని పోగొట్టుకోవాలనుకున్న ఆయన- ఏది భయానికి కారణమైందో ఆ ప్రమాదాన్నే కోరి తెచ్చుకోవాలనుకున్నారు. జంతువులు నీరు త్రాగడానికి వచ్చే దారికి అడ్డంగా పడుకొని, సర్వాంతర్యామి భావనలో లీనమై అలాగే నిద్రపోయారు. అలవాటు ప్రకారం జంతువులు నీరు త్రాగడానికి ఆ ప్రదేశానికి వచ్చాయి. దారిలో పడి వున్న మనిషి శరీరాన్ని చూసి ఠక్కున ఆగిపోయాయి. అక్కడి నేల వాసన చూశాయి. వాటికేమర్థమైందో వెనుదిరిగి వెళ్లిపోయాయి. వసించే జీవుల ప్రవర్తనలోగల దివ్య చైతన్యమే వాసుదేవుడు.ఆయనా సమయంలో జంతువుల్లోని క్రౌర్యాన్ని మాయం చేశాడో, అసలు వాటికి దప్పికే లేకుండా చేశాడో తెలీదు. వాటివల్ల స్వామివారికి ఎలాంటి కీడూ జరగలేదు. అచంచల విశ్వాసంతో ఏకైక లక్ష్యతత్పరులై వారు తపస్సు కొనసాగించి, సర్వాంతర్యామితో ఏకత్వానుభూతినే సాధించగలిగారు బాలానంద స్వామివారు.
బాలానంద స్వామి గిరిజనులకు ఎంతో సేవ చేశారు. గోదావరి జిల్లా గ్రామాల వారందరికీ ఆయనమీద భక్తి. ఆయన వృద్ధాప్యంలో అస్వస్థులై రాజమండ్రిలో కాలం చేసినప్పుడు భౌతికకాయాన్ని లాంచీలో రాజమండ్రి నుంచి పేరంటపల్లి తీసుకెళ్లారు. లాంచీ వస్తున్న సంగతి తీరగ్రామాల వాళ్ళందరికీ తెలిసింది. ప్రతి ఊరి రేవులోనూ లాంచీ ఆపారు. ఊళ్ళకు ఊళ్ళు పిల్లా పాపాతో గోదావరి గట్టుకు కదలి వెళ్ళి భౌతికకాయాన్ని దర్శించుకుని కన్నీటి తర్పణం విడిచి వచ్చాయి. ఇప్పటికీ ఇక్కడివారికి స్వామివారంటే అపారమైన భక్తి, ప్రేమ. ఆ ప్రేమతోనే వారు సేవ చేస్తారు.” అంటూ నడక ఆపి అతన్నే చూస్తూ , “ శరత్, మనం కష్టపడితే ఎంతో డబ్బు సంపాదించవచ్చు, కాని, ఒక్క మనిషి మనస్సులో స్థానం సంపాదించుకున్నా, అది ఎన్నో కోట్ల రూపాయిలకంటే విలువైనదని, నేను భావిస్తాను. తాను దేహం విడిచినా, అమాయకులైన ఈ గిరిజనుల మనస్సుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు స్వామివారు, ఇన్ని తరాల తర్వాత కూడా వారి సేవ చెయ్యడం గొప్ప సంగతి కదా !” అంది చంద్రిక.
“నిజమే చంద్రా... నువ్వు స్వామివారి చెబుతుంటే, నా మనసు భక్తితో ఆర్ధ్రమయింది. చాలా మహనీయులు ఆయన. అది సరేగాని, మరి ఈ గిరిజనులకు సంపాదన, భుక్తి ఎలాగ ? ఆశ్రమ ఖర్చులు ఎలా నడుస్తాయి ?” సందేహంగా చూసాడు శరత్.
“ఇక్కడివారికి సహాయం చేసే ఉద్దేశ్యం వుంటే, ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప వేరే డబ్బు, వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా బాధపడతారు. ఆ ఆలయం చాలా శక్తివంతమైనదవటంవల్ల అక్కడ తగుమాత్రమే మాట్లాడాలి అదీ మంచిమాటలే. ఇక్కడ పూజారి వుండడు, పూజకు సంకల్పం కూడా ఎవరూ చెప్పకూడదు. సంకల్పం వల్ల సూర్య చంద్రాదుల సాక్షిగా కోరికలు వెలిబుచ్చటమవుతుందని వీరి నమ్మకం. జన్మ రాహిత్యానికి ఈ సంకల్పము ప్రతిబంధకమని వీరు భావిస్తారు. దేవునికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాత్రం ఆశ్రమంలో వండిన పదార్ధాలే పెట్టాలి. శుచి, శుభ్రత కోసం ఈ నియమం పెట్టారు.ఈ దేవాలయం చేరుకోవటానికి మనం కొంచెం దూరం కొండమీదకి ఎక్కాలి.” అంటూ చెప్పసాగింది చంద్రిక.
“అరె, ఈ వెదురు పూలు, చక్కటి వస్తువులు యెంత బాగున్నాయో కదా...” దారిలో అటూఇటూ నిల్చుని, గిరిజనులు అమ్ముతున్న పువ్వుల్ని చూస్తూ అన్నాడు శరత్.
“గిరిజన మహిళలు చక్కటి వెదురు బొమ్మలు అద్బుతంగా ఉంటాయి శరత్, ఇవే వారికి సంపాదన మార్గాలు. ఆ ఉన్నంతలోనే మళ్ళీ భక్తిగా ఆశ్రమానికి వాడతారు. వెళ్ళేటప్పుడు కొనుక్కుని వెళ్దాం, పద... అదిగో ఆ కనిపించేదే బాలానంద స్వామి ఆశ్రమం.” అంటూ చూపింది చంద్రిక.
ఇద్దరూ లోపలకు వెళ్లి, నిండు మనసులతో తమ జంటను దీవించమని, ప్రార్ధించారు. గుడి బైటికి రాగానే దేవాలయానికి వడ్డాణం లాగా కొండలనుండి ప్రవహించే జలపాతం కనిపించింది. అక్కడ పిల్లలూ, పెద్దలూ అంతా చేరి కేరింతలతో ఆడుతున్నారు. నీళ్ళల్లోకి చెయ్యి పెట్టగానే చల్లగా తగిలి జివ్వుమంది శరత్ కి.
“ ఎక్కడో కొండల్లో నుంచి జాలువారే ఈ జలపాతం మండు వేసవిలో సైతం మంచును తలపిస్తుంది.” ఇంత ఎండలోనూ చేతికి షాక్ కొట్టినట్టు అయ్యింది కదూ !భలే, భలే... అంది చంద్రిక ఉడికిస్తూ.
“అవును, కాని నువ్వు నా అర్ధాంగివి కనుక, న్యాయంగా ఈ షాక్ లో సగభాగం నీది...” అంటూ ఆమెపైకి నీరు చిమ్మాడు శరత్.
“ష్... ఇక్కడ అట్టే అల్లరి చెయ్యకూడదు అని చెప్పానా, కాసిన్ని నీళ్ళు త్రాగుదాం, ఇటురా శరత్”పిలిచింది చంద్రిక.
శరత్ అటు వెళ్ళగానే తన దోసిట్లోకి తీసిన నీళ్ళు అతని నెత్తిన పోసేసి, మౌనంగా నిల్చుంది. ఇద్దరూ కాసేపు అలాగే నీళ్ళలో ఆదుకుని, ఆ నీళ్ళు తాగి, అక్కడున్న చిన్న హోటల్ లో టిఫిన్ తిని, క్రిందికి దిగుతూ వెదురు బొమ్మలు కొనుక్కుని, మళ్ళీ పడవలో ప్రయాణం కొనసాగించారు.
“సరే, ఆ శ్రీ కధ సస్పెన్స్ లో ఆపావు, చెప్పవూ...” అడిగాడు శరత్.
“ఉహు, చెప్పాలంటే, నేను చెప్పినట్టు అనాలి, దేవిని ప్రసన్నం చేసుకోవాలి.... అని డిమాండ్ చేస్తా ఉన్నాం అజ్జక్షా...”
“అగ్రీడ్... మీ డిమాండులు చెప్పండి మేడం...”
“ఆ నాతో పాటు చెప్పు... ఓ దేవుడా, ఓ మంచి దేవుడా...”
“ఓ దేవుడా, ఓ మంచి దేవుడా...”
“నాకు... ప్రపంచంలోకే...” ఆ ఆ, చెప్పు చెప్పు...
“నాకు... ప్రపంచంలోకే...”
“అందమైన, తెలివైన, గుణవంతురాలైన భార్యను ఇచ్చావు...”
“ఆ చెప్పినట్టేలే...”
“అలా కుదరదు, ఒప్పందం ఒప్పందమే...”
“అందమైన, తెలివైన, గుణవంతురాలైన భార్యను ఇచ్చావు...”
“కాని...”
“కాని ???”
(సశేషం..)
No comments:
Post a Comment