అందరూ మారాలి
పెయ్యేటి శ్రీదేవి
అవును. మారాలి. మార్చాలి. సమాజంలో అందరూ మారాలి. కానీ ఎవరు మారతారు? ఎవరు మారుతున్నారు? ఎవరూ ఎవరి పధ్ధతులూ మార్చుకోరు. ఏ ఒక్కరరికీ సమజ బాధ్యత లేదు. ఢిల్లీలో నిర్భయ పై జరిగిన దారుణమైన అత్యాచార సంఘటనకి దేశం మొత్తం కదిలి వచ్చింది. దోషులకు వెంటానే ఉరిశిక్ష వెయ్యమన్నారు. కాని వెంటనే ఎటువంటి కఠినచర్యలూ తీసుకోలేదు. వెంటనే నేరస్తులకి శిక్షలు వేసుంటే ఇప్పటిదాకా స్త్రీలపై ఎన్నో వేల అత్యాచారాలు జరిగుండేవి కావు. ప్రభుత్వం చేతకానితనం అలుసుగా తీసుకున్నారు. ఢిల్లీ సంఘటన తర్వాత ఇకముండు ఇలాటివి జరగకుండా సినిమావాళ్ళు సహితం ప్రమాణాలు చేసారు. టి.వి.ఛానెళ్లలో చర్చలతో హోరెత్తించేసారు. అందులో సినిమావాళ్ళూ వున్నారు. ఆ చర్చల్లో సినిమాల వల్ల కూడ ఇలా జరుగుతున్నయనేసరికి సినిమాలేం చేసాయంటూ సినిమావాళ్ళూ ఎగిరిపడ్డారు. ఇలా సినిమావాళ్ళనంటే సినిమావాళ్ళకి కోపం. టి.వి.ఛానెళ్లలో A to Z అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళనంటే వాళ్ళకీ కోపం. హింసని ప్రేరేపించే సీరియల్సు.......మరి వాళ్ళూ మారరు. రియాల్టీ షోస్ లో చిన్నపిల్లలకి సహితం ఎగుదుదిగుడు డ్రస్సులు వేయించి డాన్సులు చేయించి వావ్ సూపర్! అంటూ ఆనందిస్తారు. ఎగుడు దిగుడు బట్టలు వేసుకునే యాంకరమ్మలు! ఇలాంటివన్నీ నట్టింటో టి.వి.లో చూస్తుంటే వికారపు ఆలోచనలు కలగవా? నిర్భయ సంఘటన తరవాత ఏఒక్కరన్నా మారారా? ఏమన్నా అంటే తలిదండ్రులు పిల్లల్ని బాగా పెంచాలంటారు. ఇంట్లో టి.వి.ల్లోనే గాక, సెల్ ఫోన్లు, ఇంటర్ నెట్లు, ఇలా అన్నితిలోను చూడకూడనివన్నీ చూసేస్తుంటే ఎంత బుధ్ధిగా వున్నవారికైనా చెడు ఆలోచనలు కలుగుతాయి. ఇప్పటి ఈ రోజుల్లో నిండుగా చీర కట్టుకుని, జడ వేసుకుని, బొట్టు పెట్టుకుని, సంప్రదాయంగా తయారై, సంస్కారంగా కనిపించడం అనాగరికమనుకుంటున్నారో ఏమో మరి! పరమ చెత్తగా తయారైతేనే ఇప్పుదు నాగరికత. జుట్టు ఎగుడు దిగుడుగా కత్తిరించుకుని, ఆ జుట్టు విరబోసుకుని, బొట్టు లేకుండా, ఎగుడు దిగుడు బట్టలు వేసుకుని, ఎంత పరమ చెత్తగా కనబడితే అంత గొప్ప ఫేషన్! ఈ ఫేషన్లు ఏ విధంగా మారుతున్నాయంటే, రాను రానూ..........అటు తిరగేసి, ఇటు తిరగేసి..............లోపలి లంగాలు, డ్రాయర్లు, బాడీలు, స్నానం చేసొచ్చాక చుట్టుకునే తుండుగుడ్డలు ఒక ఫేషనైతే, ఒకప్పుడు ముష్టివాళ్ళు, లేక, దరిద్రంతో వేసుకున్న చిరిగిపోయిన, చిల్లులు, పీలికలున్న బట్టలే ఇప్పుడు సరికొత్త ఫేషన్! చీర సంప్రదాయం మార్చేసారు. ఇప్పటి రోజుల్లో చీర కూడా ఫేషన్ డ్రస్సు కిందకి చేర్చేసారు. ఆ చీర కట్టడం కూడా బాగా కిందికి కడతారు. పమిట వుండ వలసిన చోట వుండకుండా అనవసరంగా పక్కన పడేస్తారు. ఇలా అనేక రకాల అసభ్యకరమైన దుస్తులు వెసుకుని టి.వి.ఛానెళ్ళలో యాంకరమ్మలు, సినిమా నటీమణులు దర్శనమిస్తుంటే, అలాంటి వికారాలున్న ఆకారాలని చూస్తే ఎవరికన్నా కలుగు రిమ్మతెగులు. అందుకే వయసు మళ్ళిన మృగాళ్ళు కూడా వావి వరసలు మర్చిపోయి, చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారే తప్ప, ఎవ్వరూ మారరు. పొట్టి డ్రస్సులు వేస్తే వాటి వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయంటున్నారు. కాలేజి అమ్మాయిలు, పసిపిల్లలు, అరవై ఏళ్ళ వాళ్ళు, పాపం వాళ్ళేం పొట్టి డ్రస్సులు వేస్తారండి? అభం శుభం తెలియని ఎంతోమంది అమాయకుల మీద అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. మైనారిటీ తీరని వెధవల దగ్గర్నుంచి, ముసలి తాతల దాకా స్త్రీలపై దాడులు చేసి చంపేయడానికి వాళ్ళేం పాపం చేసారు? ఎందుకని? ఎందుకంటే....ఫేషన్ పేరుతో టి.వి. యాంకర్లు, సినిమా నటీమణులు అసభ్యకరమైన దుస్తులతో కనిపిస్తుంటే, ఇంకా హింసాత్మకమైన సీరియల్సు, సినిమాలు చూడడం వల్ల ఆ ప్రభావం సమాజం మీద పది మృగరాక్షసులు స్త్రీలపై దాడి చేసి చంపేస్తున్నారు. యాంకర్లు, సినీ నటీమణులు, మంత్రుల పిల్లలు రక్షణ వలయంలోనే వుంటారు. ఈ అసభ్యకరమైన ఫేషన్ దుస్తులవల్ల, హింసాత్మక సీరియల్సు, సినిమాల వల్ల మనుషుల ఆలోచనా విధానం మారిపోతోంది. స్త్రీలని నాశనం చేసే రాక్షస వికృతజాతి త్వర త్వరగా తయారై, గజ్జి, తామరలా దేశమంతా వ్యాపిస్తోంది. దేశంలో సినిమాలు, టి.వి.ల్లో సీరియల్సు, వార్తా ఛానెళ్ళలో చూపించే దృశ్యాల ప్రభావం ఎంతగా సమాజం మీద పడుతోందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. చాలా ఏళ్ళ క్రితం ఉత్తరాదిన ధనుంజయ అనే వ్యక్తి ఒక అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసాడు. ఇది జరిగిన కొన్నేళ్ళకి నేరం రుజువై అతడ్ని ఉరి తీసారు. మర్నాడు ఉరి తీస్తారనగా, తలారి ఉరితాడు పేనడం, ఉరితాడు వేళ్ళాడడం అన్ని వార్తాఛానెళ్ళలో చూపించారు. ఉరి తీసిన మర్నాడే పేపర్లలో వర్ణించి రాసారు. ఆ ప్రభావం సమాజం మీద ఎంతవరకు పడిందంటే, ఉత్తరాదిన ఏడుగురు పిల్లలు ఉరి అంటే ఎల్లా వుంటుందోనని ఆడుకుంటూ, చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు. అవే దృశ్యాలు సీరియల్సులో కూడా పెట్టారు. ఉరి అనే పేరుతో సినిమా తీసారు. దీన్ని బట్టి టి.వి.ఛానెళ్ళు, సినిమాల్లో చూపించే చెడు ప్రభావం సమాజం మీద చాలా తీవ్రంగా వుంటోంది. సినిమాలు, టి.వి.లే కాదు, ఇంకా వుంది చెప్పటానికి. మన భారతదేశం దిన దినాభివృధ్ధి చెందుతోంది కదా! అందుకే టి.వి. వార్తా ఛానెళ్ళలో చూపించే నేరాలు-ఘోరాలు, అత్యాచారాల వార్తలు, రాత్రి పదకొండయితే ' ఇది పువ్వుల వేళ యనీ' అనే పేరుతో శృంగారభంగిమలు, ఇలా ఇవన్నీ చూపించడం అవసరమా? ఈ ప్రభావం సామాన్య స్త్రీలపై పడుతోంది కదా? ఇది చాలదన్నట్లు, సెల్ పోన్లు, ఇంటర్ నెట్లు, వీటిల్లో కూడా అడ్డమైన విడియోలు, ఫొటోలు పెట్టేస్తున్నారు. ఇవన్నీ విద్యార్థులు చూస్తే వికృతమైన ఆలోచనలు కలగవా? ఇంకా, కొన్ని పత్రికలలో, పేపర్లలో సరస శృంగార, సంసార శీర్షికలు, బొమ్మలు, ప్రశ్నలు-జవాబులు, ఇంకా ఎక్స్ పోజింగ్ కి వ్యతిరేకిని కానంటూ (లేకపోతే సినిమా ఛాన్సులు రావేమోనని వాళ్ళ భయం), నిండుగా బట్టలు వేసుకోడానికి సిగ్గుపడే సినిమా అమ్మళ్ళ బొమ్మలు........ఎవ్వరూ మారరు. టి.వి.లో వచ్చే హాస్య కార్యక్రమం పేరుతో, అందులో ఏమాత్రం హాస్యం కానరాక, ఏ మాత్రం నవ్వు రాకపోయినా, యాంకర్లకి, జడ్జిలకి మాత్రమే పగలబడి నవ్వు వచ్చే, పడక మంచం వేసేసి, స్టేజి కూడా బెడ్ రూమ్ గా మార్చేసే వెకిలి ప్రోగ్రాంలు......ఇలా అతి శక్తివంతమైన మీడియా అంతా జుగుప్స, వెకిలి హాస్యాలు, హింస, ఇలా అన్నీ చూపిస్తుంటే, మనుషుల్లో మంచితనం ఎక్కడుంటుంది? నిర్భయకి జరిగిన సంఘటన తరవాత ఏ ఒక్కరన్నా మారారా? మారదామని, మార్చాలని ప్రయత్నించారా? ఎవ్వరూ మారరు. నేరగాళ్ళకి ప్రభుత్వాలు కఠినశిక్షలు వెయ్యరు. పోలీసులనించీ రక్షణ లేదు. మహిళా దినోత్సవాలకి, టి.వి.ఛానెళ్ళ వారికి ఈ అత్యాచారాలు ఎలా రూపు మాపాలి, ఎందుకు జరుగుతున్నాయి, కారణాలేమిటి, తలిదండ్రుల బాధ్యత ఎంత, అంటూ చర్చనీయాంశాలుగా మారాయి గాని, సమాజ బాధ్యత అందరికీ వుండాలి అని అనుకోటల్లేదు. మంత్రుల దగ్గర్నించీ అందరూ ఆడవాళ్లదే తప్పంటారు. రాత్రి తొమ్మిదిగంటలకి బైట తిరగడం ఎందుకంటారు? రాత్రి కాదు, పగలూ జరుగుతున్నాయి. టి.వి.లు లేకముందు స్త్రీలు రాత్రి కూడా నిర్భయంగా తిరిగారు. నేరాలు జరగకుండా చేయాల్సింది పోయి, ప్రభుత్వాలు పెప్పర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోవాలని, కరాటేలు నేర్చుకోమని పిచ్చి సలహాలిచ్చారు. ఎదురు వాళ్ళే పెప్పర్ స్ప్రేలు చల్లి బంగారాలు దోచుకుంటున్నారు. బైట తిరగడం దాకా ఎందుకు, ఇంట్లోనే గృహిణులని కూడా ఏ పక్కవాడో నలుగుర్ని వెంటేసుకొచ్చి, అత్యాచారం చేసి చంపేస్తున్నాడు. ఢిల్లీ గేంగ్ రేప్ తర్వాత ఎన్ని వేల అత్యాచారాలు జరిగాయి! అప్పుడే కఠిన శిక్షలు వెయ్యకపోవడం వల్లనే కదా, అంతవరకు బుధ్ధిగా వున్నవాళ్ళు కూడా రేపిస్టులుగా తయారవుతున్నారు? ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు నర్తిస్తారు అనుకునే ఈ దేశంలో, స్త్రీని అక్కగా, అమ్మగా, దేవతగా కొలిచే ఈ దేశంలో, స్త్రీ ఆదిశక్తి, శక్తిస్వరూపిణి, దుర్గగా కొలిచే ఈ దేశంలో స్త్రీలపై ఇంత దారుణాలా? ఇది దేశానికే అరిష్టం. ఇలాంటి అరిష్టాలు జరగకుండా స్త్రీజాతిని రక్షించండి. దయచేసి అందరూ మారండి.
' మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ రాగములో....అనురాగములో....తరగని పెన్నిధి మగువ ' ********************
No comments:
Post a Comment