చిత్రకళా మాంత్రికుడు - ఆర్టిస్ట్ బాలాజీ - అచ్చంగా తెలుగు

చిత్రకళా మాంత్రికుడు - ఆర్టిస్ట్ బాలాజీ

Share This
చిత్రకళా మాంత్రికుడు - ఆర్టిస్ట్ బాలాజీ 

భావరాజు పద్మిని 

అతను సామాన్య రైతుబిడ్డ...

అందుకే మట్టిని ప్రేమించడం, పుడమితల్లితో మమేకమవ్వడం అలవోకగా అలవడ్డాయి. గుజ్జనగూళ్ళు కట్టుకునే చిన్నతనం నుంచే బొమ్మలు వెయ్యటం అంటే ఎంతో ఇష్టం. సరదాగా మొదలుపెట్టిన చిత్రకళ, సైకత శిల్పాల రూపకల్పన, ఒక తపస్సుగా మారింది. ఫలితం... వుడన్ ఆర్ట్స్, పెన్సిల్ ఆర్ట్స్, కలర్ పెన్సిల్ ఆర్ట్స్, పెయింటింగ్స్, ఇలా అన్నిరకాల వైవిధ్యమైన చిత్రకళావిద్యల్లో ప్రావీణ్యం సంపాదించి,  ' బాలు ఆర్ట్స్ పేరిట స్వంత సంస్థను' నెలకొల్పారు. అతి పిన్న వయసునుంచే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, పలు అవార్డులు, ప్రశంసలు పొందారు. చిన్న వయసులోనే తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటుతున్న ఆంధ్రప్రదేశ్ ఏకైక యువ సైకత శిల్పి,  చిత్రకారుడు  'ఆకునురి బాలాజీ వరప్రసాద్' గారితో ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి మీ కోసం...

 


నమస్కారం బాలాజీ గారు. మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి ?
జ. నమస్కారమండి. నా పేరు బాలాజీ వర ప్రసాద్ (బాలు), మా సంస్థ పేరు బాలు ఆర్ట్స్ అండ్ ఈవెంట్స్ . నా బాల్యం అంతా పల్లెవాడ కైకలూరు మండలం కృష్ణా జిల్లాలో గడిచింది. మా నాన్నగారు ఆకునూరు జనార్ధనరావు గారు, వ్యవసాయ కూలీ. అమ్మగారు నాగమణి, అక్కలు అర్చన(బి.ఏ), రాఘవమ్మ(ఏం.ఏ, బి.ఇ.డి ). నా శ్రీమతి పేరు లక్ష్మి (బి.టెక్ ) .నాకు ఇద్దరు అమ్మాయిలు రోషిని, సాధ్వి.

మీ విద్యాభ్యాసం గురించిన సంగతులు చెప్పండి.
నేను ఇంటర్మీడియట్ ఎ.కె.పి.ఎస్ జూనియర్ కాలేజీ దుంపగడపలో , డిగ్రీ
డి.ఎన్.ఆర్ కళాశాల భీమవరంలో , ఎం.బి.ఎ(HR ) నర్సాపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ లో చదివాను. కర్ణాటక యూనివర్సిటీ లో బి.ఎఫ్.ఎ చేసాను.

మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?
జ. మా ముత్తాతగారు కళాకారుడు అనేవారు.

చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
జ. 5 వ తరగతి నుంచి బొమ్మలు వేయడం పై మక్కువ పెంచుకున్నాను. మా తల్లిగారు, అక్కలు నన్ను బాగా ప్రోత్సహించేవారు. ప్రాధమిక పాఠశాల నుంచి 
ఉన్నత పాఠశాల వరకు పొందిన ఎన్నో బహుమతులు నన్ను కళ వైపు మరింత ఎక్కువ మక్కువ చూపే విధంగా ప్రోత్సాహం అందించాయి. కళాశాల స్థాయికి వచ్చిన తరువాత చదువుతో పాటు కళలో కూడా రాణించడం ప్రారంభం అయ్యింది.

చిత్రకళలో ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా ?
డిగ్రీ నుండి ప్రతి సంవత్సరం జరిగే బహుళ కళాశాల పోటీల్లో ఫైన్ ఆర్ట్స్ విభాగంలోని 1. క్లే మౌల్డింగ్ 2. ఆన్ ద స్టాప్ పెయింటింగ్ 3. కొల్లాజ్ 4. పోస్టర్ మేకింగ్ 5. ఇన్స్టాలేషన్   6. రంగోలి 7.కార్టూనింగ్ అనే 7 విభాగాల లోనూ ప్రతి సంవత్సరం బహుమతులు సాధించడం మా కళాశాలకు గర్వకారణమని

అధ్యాపకులు, స్నేహితులు అభినందించడం ఎప్పటికీ మరువలేను. 

డిగ్రీ రెండవ సంవత్సరంలో సరదాగా స్నేహితులతో కలిసి సముద్రతీరాన చేసిన మత్స్య సుందరి సైకత శిల్పం అక్కడివారిని ఆకర్షించడమే కాక, మరుసటిరోజు ‘సముద్రసుందరి’ అనే వార్తతో వార్తాపత్రికల్లో రావడంతో మంచి ప్రోత్సాహం లభించి అప్పటి నుండి సామాజిక పరిస్థితులపై అనేక సైకత శిల్పాలు చేసి పలువురి మన్ననలు పొందాను. 

తరువాత ఒరిస్సా టూరిజం వారు నిర్వహించే అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలలో పాల్గొని 42 మందితో 5 రోజులు తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ నుండి 7 వ స్థానం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని పలువురు రాజకీయ ప్రముఖులు సన్మానం చెయ్యడం మరువలేనిది. ఆ తర్వాత ఎం.బి.ఎ చదువుతుండగా సైకత శిల్ప ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం ‘విశిష్ట వ్యక్తి’ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది.
ఇప్పటివరకూ నేను ప్రభుత్వ సంబంధిత అంశాలపై, సాంఘిక, సాంస్కృతిక, సహజమైన అంశాలపై 200 లకు పైగా సైకత శిల్పాలు చేసాను.

మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
జ.  ఎం.ఎఫ్.హుస్సేన్, రవివర్మ.
ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను

ఎదుర్కున్నారు ?
జ. నేను చదువుకుంటున్నప్పుడు మా బంధువులు చాలామంది “ఆర్ట్స్ ఎందుకు , కూడు పెడతాయా ? చక్కగా చదువుకో.” అని చెప్పేవారు. ఆ తరువాత నెమ్మదిగా నాకు వస్తున్న గుర్తింపును చూసి, అందరూ పొగడసాగారు.

మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
పెయింటింగ్స్ లో ‘ఎ మాన్ ఎట్ వర్క్’ అనే పెయింటింగ్ రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించి పెట్టింది. సైకత శిల్పాలలో నేను పేరుపాలెం బీచ్ లో మొట్టమొదటగా చేసిన ‘సముద్ర సుందరి’ అన్న సాండ్ ఆర్ట్ నాకు మొట్టమొదట గుర్తింపును తెచ్చింది.

మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
జ. 1. అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలలో 7 వ స్థానం
     
  1. అంతర్జాతీయ మేనేజ్మెంట్ మీట్ లో ఆడ్ మేకింగ్ లో ప్రధమ స్థానం.
  2. ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం వారిచే ‘విశిష్ట వ్యక్తి’ పురస్కారం. 
  3. రాజమండ్రి లో 2013 లో జరిగిన స్టేట్ యూత్ ఫెస్టివల్లో 1. క్లే మౌల్డింగ్ లో ప్రధమ స్థానం 2. ఆన్ ద స్టాప్ పెయింటింగ్ లో రెండవ స్థానం 3. కొల్లాజ్ లో ప్రధమ స్థానం 4. పోస్టర్ మేకింగ్ లో రెండవ స్థానం  5. ఇన్స్టాలేషన్  లో ప్రధమ స్థానం  6. రంగోలి లో ప్రధమ స్థానం 7.కార్టూనింగ్ లో తృతీయ స్థానం దక్కాయి.
  4. హైదరాబాద్ రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్ లో పెయింటింగ్ విభాగంలో

    మొదటి స్థానం దక్కింది.
  5. ఉదయపూర్ జాతీయ యూత్ ఫెస్టివల్ లో కన్సోలేషన్ బహుమతిని సాధించాను. అంతేకాక, అనేక ప్రాంతీయ పోటీలలో అనేక బహుమతులు  గెలవడం జరిగింది.
  6. తాజాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం కూడా అందుకున్నాను. కొన్నిసార్లు ఆయన నా సైకత శిల్పాలను చూసి, ఎంతగానో అభినందించడం మర్చిపోలేని అంశం. 
మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
జ. నా విజయమే ధ్యేయంగా నన్ను ప్రోత్సహించే తల్లి, నా విజయానికి బాసటగా నిలిచే తండ్రి, నన్ను బాగా ప్రోత్సహించే నా అక్కలు, బావలు, నా తలలో నాలుకలా మెలిగే అర్ధాంగి, వీరంతా దొరకడం నా అదృష్టమని నేను భావిస్తాను. నన్ను అన్నివిధాలుగా ప్రోత్సహించే కుటుంబ సభ్యులు దొరకడం నాకొక గొప్ప వరం.
భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
జ. కష్టపడి నేర్చుకునే వాటికంటే, మీకు ఇష్టమైన వాటిమీద మక్కువ పెంచుకుంటే, మిమ్మల్ని మీరు వెలిగించుకోగలరు. ఇదే నేను ఇచ్చే సందేశమండి.
బాలాజీ గారి బొమ్మల కొలువును దిగువ సందర్శించండి.




1 comment:

Pages