బదరీనాథ్ ధాం యాత్ర - అచ్చంగా తెలుగు

బదరీనాథ్ ధాం యాత్ర

Share This

 బదరీనాథ్ ధాం యాత్ర 

కర్రా నాగలక్ష్మి 

       
భారత దేశం లో బదరీనాథ్ పేరుతెలియని హిందువు వుండరు అనడంలో అతిశయోక్తి లేదు . ఉత్తర భారతదేశంలో వున్న ముఖ్యమైన తీర్థ స్థానాలలో వొకటైన బదరీనాథ్ గురించి తెలుసుకుందాం .
         భారతదేశం లో వున్న నాలుగు ముఖ్యమైన యాత్రలైన రామేశ్వరం , ద్వారక , మధుర  బదరీనాథ్ లను చార్ ధామ్ యాత్ర అని అంటారు ప్రతి హిందువు తమ జీవిత కాలంలో యీ యాత్రలను చేసుకుంటే మొత్తం భారత దేశం లో వున్నా అన్ని తీర్ధ స్థానాలను దర్శించు కున్నంత పుణ్యం వస్తుందని ఆది శంకరులు చెప్పేరు .
     చార్ ధాం లలో వొకటైన బదరీనాథ్ ధామ్  గురించి తెలుసుకుందాం . బదరీనాథ్ ధామ్ ని " విశాల్ బదరి " అనికూడా అంటారు . యిది వైష్ణవుల 108 దివ్య దేశాలలో  107వ దివ్య దేశంగా , అతి పవిత్ర స్థలంగా చెప్పా బడింది . ప్రతీ సంవత్సరం అక్షయ తృతీయ నాడు మొదలయిన యీ యాత్ర ఆశ్వీజ శుక్ల దశమి వరకు కొనసాగుతుంది . యీ యాత్రను గురించి ఇప్పటికే చాలా మంది రాసే వుంటారు . బదరీనాథ్ గురించి గాని అక్కడకి ఎలా చేరుకోవాలి మొదలైన విషయాలలో యెవీ మార్పులు వుండవు . కాని అక్కడ దర్శనీయ స్థలాల గురించి మాత్రం చాలా విషయాలు యీ వ్యాసం ద్వారా పాఠకులకు తెలియ జేయ్యాలనేది ముఖ్య వుద్దేశ్యం .
        దేశరాజధాని ఢిల్లి నుంచి సుమారు 520 కిమీ దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఘరేవాల్ ప్రాంతంలో చమోలి జిల్లాలో వున్నది విశాల్ బదరి . ఢిల్లి నుంచి హరద్వార్ , ఋషికేశ్ వరకు రైల్ మార్గం కుడా వుంది . అక్కడ నుంచి అంతా ఘాట్ రోడ్డు మీద ప్రయాణం సాగుతుంది . దేవప్రయాగ , శ్రీనగర్ ( ఉత్తరా ఖండ్ ) , రుద్రప్రయాగ్ , కర్ణ ప్రయాగ్ , నంద ప్రయాగ్ , చమోలి , పిపల్ కోటి ,జోషిమఠ్ , గోవింద్ ఘాట్ , పాండుకేశ్వర్ అనే ప్రాంతాల మీదుగా యీ  ప్రయాణం సాగుతుంది .
         సాధారణం గా మే , జూన్ మాసాలలో చాలా మంది యీ యాత్ర ప్లాన్ చేసుకుంటారు . ఆ రెండు మాసాలూ భక్తుల రద్దీ వుండడం తో వుండడానికి వసతి దొరకటం చాలా యిబ్బంది అవుతుంది అంతే  కాకుండా దర్శనానికి కుడా చాల సమయం చలిలో వేచి వుండవలసి వస్తుంది . జులై , ఆగస్ట్ నెలలు వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆ రెండు మాసాలు కూడా విడిచి పెడితే సెప్టెంబర్ , అక్టోబర్ నెలలు యీ యాత్రకి అనువుగా వుంటాయి . మే , జూన్ నెలలలో వున్నంత చలి వుండదు , వాతావరణం ప్లెజెంట్ గా వుంటుంది . రద్దీ లేకపోవడంతో బదరీనాథునికి చేసే విష్ణు సహస్రనామ సేవ హారతి సేవలలో పాల్గొనవచ్చు .
          ఉత్తరాఖంఢ్ రాష్ట్రం లోని చమోలి జిల్లాలో హిమాలయాలకూ , దేశ సరిహద్దుకు దగ్గరగా స్వఛ్ఛమైన జలాలతో ఉరుకులు పరుగులతో ప్రవహించే అలకనంద వొడ్డున వుంది యీ కోవెల .అలకనంద  నది దాటగానే కుడి వైపున ఆది కేదార్ మందిరం , నారదకుండం , ఉష్ణ కుండం వుంటాయి . బదరీనాధుని దర్శించుకొనే భక్తులు నారదకుండం దర్శించుకొని ఉష్ణకుండంలో స్నానాలు చేసుకొని ఆది కేదారేస్వరుని దర్శించుకొని బదరీనాధుని దర్శించుకుంటారు . కోవెల ముఖ్య ద్వారంలోకి ప్రవేశించగానే ఎడమచేతి వైపు చిన్న మందిరంలో లక్ష్మిదేవి
కొలువై వుంటుంది . అక్కడ నుంచి యింకా ముందుకి వెళితే వేదాంత దేశిక , రామానుజా చార్యుల మందిరాలను చూడొచ్చు . ఇంకొంచం ముందుకి వెళితే పెద్ద పెద్ద చెవులున్న రాక్షసుని విగ్రహం కనిపిస్తుంది యితని పేరు గంఠాకర్ణుడని యితడు అక్కడి క్షేత్రపాలకుడని రాసిన బోర్డ్ కనిపిస్తుంది . ప్రస్తుతం పాత విగ్రహానికి క్షతి కలగటం తో దాని స్థానే చిన్న విగ్రహం ప్రతిష్టించేరు .
అక్కడి పూజారులు గంటా కర్ణుని కధ యిలా చెప్తారు . వారు చెప్పిన ప్రకారం గంటాకర్ణుడు , రావణాసురుడు కుబేరునితో యుద్ధానికి వెళ్ళినపుడు అతని ముఖ్య సైన్యాధికారిగా వుండేవాడని ఆ యుద్ధములో రావణాసురుడు విజయం పొంది కుబేరుని సామ్రాజ్యమునకు గంటాకర్ణుని పట్టాభిషిక్తుని చేసి లంకకు వెళ్లిపోయెనట . గంటాకర్ణుడు కుబేరుని వద్దకు వెళ్లి అతని రాజ్యము అతనినే ఏలుకొమ్మని తాను శివ ధ్యానంలో గడుపుతానని కోరగా కుబేరుడు వోడిన రాజ్యం తిరిగి తీసుకొనుట వీరుల లక్షణం కాదని రాజ్యభారం  గంటాకర్ణునికే  విడిచిపెట్టి కుబేరుడు ' మానా ' గ్రామాన్ని ఆనుకొని వున్న కొండలలో తాను వొక కొండ రూపం ధరించెనని నేటికి కుడా కుబేరుడు ఆ పర్వతాలలో వొక పర్వతం గా వున్నాడని స్థానికుల నమ్మకం . గంటాకర్ణుడు దేవతలకు విధేయుడిగా పరిపాలన చేస్తూ తన భక్తితో శివుని మెప్పించి మోక్షాన్ని పొందుతాడు . గంటాకర్ణుని కోరిక మేరకు ఆ పెద్ద గంఠని దర్శించుకున్నవారికి కుడా మోక్షం కలిగేటట్లు శివుడు వరమిచ్చేడన్నది కధ .
        2013 లో సంభవించిన వరదలలో ఆ గంటకు గంటా కర్ణుని విగ్రహానికి క్షతి కలుగడంతో ఆరెండింటిని తొలగించేరు .

ఇక ఆదికేదార్ కధ 

                      శివుడు పార్వతీ సమేతుడై యిక్కడ నివాసముండేవాడట . మహా భారత యుద్ధానంతరము విచలిత మనస్కుడయిన విష్ణుమూర్తి మహర్షుల సలహాను అనుసరించి తపస్సు చేసుకొనేందుకు అనువైన ప్రదేశాన్ని వెతుకగా విష్ణుమూర్తికి ఆదికేదార్ ప్రాంతం తపస్సాచరించుటకు అనువైనదిగా తోచుతుంది .కాని అప్పటికే శివ పార్వతులు అక్కడ నివాసముండుట చూచి ఆ ప్రదేశమును కపటము ద్వారా జయించి అక్కడ తపస్సు చేసుకోవాలని తలంచుతాడు . అందులో భాగంగా పార్వతీ  పరమేశ్వరులు వ్యాహ్యాళికి పోవు మార్గం లో చిన్న బాలుని రూపం లో రోదిస్తూ ఉంటాడు . బాలుని పై జాలితో పరమేశ్వరుడు వారిస్తున్నా వినక పార్వతి ఆ బాలుని తమ నివాసానికి తెచ్చి సపర్యలు చేస్తుంది . మరునాడు పార్వతీ పరమేశ్వరులు వ్యాహ్యాళికి వెళ్లగా విష్ణుమూర్తి తపస్సమాధిలో మునిగిపోతాడు . తిరిగి వచ్చిన పర్వతీ పరమేశ్వరులు తేజోమూర్తి అయిన విష్ణు మూర్తిని చూచి జరిగిన మోసము గ్రహించి విష్ణుమూర్తికి యిష్ఠమైన శనగపప్పు ఆప్రదేశములో పండ కోడదనే  శాపాన్ని పెట్టి యిప్పటి కేదార్ కు చేరుకుంటారు . యిక్కడ యితర పదార్ధములతో పాటు శనగ పప్పును నైవేద్యం గా సమర్పించడం కనిపిస్తుంది .
బదరీనాధ్ కోవెల దగ్గరనుంచి అలక నంద వొడ్డునే సుమారు వొక కిలొమీటరు దూరంలో విష్ణుమూర్తి బాలుని రూపం లో పార్వతికి లభించిన చోటు ను చూడొచ్చు .
        వైకుంఠము లో విష్ణుమూర్తి ని కానక అతనిని వెతుకుతూ భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ఆ కురుస్తున్న హిమపాతం మధ్యలో తపస్సమాధిలో వున్నవిష్ణుముర్తిని చూచి తాను బదరిక వృక్షముగా మారి తన స్వామిని హిమాపాతము నుండి కాపాడుతూ వుంటుంది . కాలాంతరమున విష్ణుమూర్తి మనస్సు శాన్తించగా యిహలోకానికి వచ్చి తనరక్షణకై బదరికా వృక్షముగా అవతరించిన లక్ష్మిని గుర్తించి తాను ఆ ప్రదేశములో బదరీనాధునిగా పిలువబడి పూజింపబడతానని చెప్పెను .
         గర్భ గుడిలో రెండు చేతులలో శంఖు , చక్రాలు ధరించి యోగముద్రలో తామరపువ్వుపై కూర్చున్న నాలుగు చేతుల బదరీనాధుని విగ్రహం తో పాటు కుబేరుడు , నార నారాయణులు  ,నారదుడు , గరుత్మంతుడు , ఉద్దవుడు , నవదుర్గలు మిగతా కొన్ని దేవతా మూర్తులను చూడొచ్చు .
          బదరి నాథ్ కోవేలకి అరకిలొమీటరు దూరంలో బ్రహ్మ కపాలంలో చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తే చనిపోయిన వారికి ఊర్ధ్వలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు . బ్రహ్మ నాలుగో ముఖం అన్నీ తప్పుడు మాటలు మాట్లడేదట దానికి ఆగ్రహించిన విష్ణుమూర్తి తన చక్రంతో ఆ తలను ఖండించగా అది భూలోకంలో యిక్కడ పడిందట .
           బదరీ నాధ్ నుండి భారత దేశపు సరిహద్దు ఆఖరు జనావాస గ్రామంగా పిలువా బడే " మానా " గ్రామం మూడు కిలోమీటర్ల దూరం లో వుంటుంది .
భారత దేశపు ఆఖరి టీ  దుకాణం లో వేడివేడి తీ తాగి సేద తీరి వినాయకుడి గుహ , వ్యాస గుహల్ని దర్శించు కోవచ్చు . వ్యాస గుహలో వ్యాసుడు కూర్చొని మహాభారత కధ చెప్పగా వినాయకుడు గణేశ గుహలో కూర్చొని మహాభారతాన్ని రచించెనని చెప్తారు . వ్యాసగుహకు కొద్ది దూరం లో భీంపుల్  దగ్గర ఉదృతంగా ప్రవించే సరస్వతీ నది కొద్ది అడుగుల దూరంలో అంతర్వాహిని అయిపోతుంది . పెద్ద శబ్దం తో ప్రవహిస్తూ తన మహాభారత రచనకు ఆటంకం కలిగిస్తున్న సరస్వతిని హోరు తగ్గించుకోనమని వ్యాసుడు కోరగా సరస్వతి నది వ్యాసుని మాట పెడ చెవిన పెట్టడంతో వ్యాసుడు  అంతర్వాహిని కమ్మని శాపమిస్తాడు . యిక్కడ  అంతర్వాహిని అయిన సరస్వతీ నది తిరిగి అలహాబాద్ లో పైకి వచ్చి గంగా , యమునలతో సంగమిస్తుంది .
భీమ్ పుల్ నుంచి వొక కిమీ దూరంలో చిన్న మహాలక్ష్మి మందిరం చూడొచ్చు విష్ణుమూర్తిని వెతుకుతూ వచ్చినప్పుడు లక్ష్మీ దేవి మొదట కాలు పెట్టిన ప్రదేశంగా చెప్తారు . రెండు కిలోమీటర్లు నడిచి వెళితే ద్రౌపతి సమాధిని చూడొచ్చు . అక్కడి నుంచి మరో కిలోమీటరు నడిస్తే కుంతీదేవి సమాధి చూడొచ్చు . కుంతీ దేవి సమాధి నుంచి " వసుధార " మరో మూడు కోలోమీటర్ల దూరం వుంటుంది . కాని వసుధార వరకు వెళ్ళాలంటే మిలటరీ పెర్మిషన్ తెచ్చుకోవాలి . అందుకే మేము కుంతీదేవి సమాధి వరకు వెళ్లి కూడా వసుధార వెళ్లలేకపోయేం . వ్యాస గుహ దగ్గర వున్న కొండలపై వో గుఱ్ఱం ఆకారం కనిపిస్తుంది . అది విష్ణు మూర్తిని దివి నుంచి భువికి తెచ్చిన గుఱ్ఱంగా చెప్తారు . వ్యాస గుహ దగ్గర వున్న స్థానికులని ఎవరిని అడిగినా దీనిని చూపిస్తారు .
              యింకా యిక్కడ చూడ వలసిన ప్రదేశాలు యివి నవదుర్గా  మందిరం , శివకోవెల , చరణ పాదుక , ఊర్వశి మందిరం , పంచ శిలలుగా చెప్పబడే నర శిల నారాయణ శిల , నారద శిల , గరుడ శిల , వరాహ శిల  , పంచ ధారలుగా చెప్పే నాలుగు వేద ధారలు , వసుధార లు .
         బదరినాథ్ మందిర ప్రాంగణం లోంచి వెనుక వైపుకి చూస్తే నరశిల , నారాయణశిల కనిపిస్తాయి , వాటిపైన కాషాయరంగు పతాకాలు వుండడం కూడా గమనించ వచ్చు . నారదశిల , గరుడశిలలు ఉష్ణకుండం దగ్గర చూడొచ్చు . వరాహశిలఅలకనంద నది దాటి మందిరానికి వచ్చేటప్పుడు అలకనంద నదిలో కుడివైపున చూడొచ్చు .
వేదధారలుగా పిలువబడే నాలుగు ధారలు మానా గ్రామం వెళ్ళే దారిలో కొండల మీంచి రోడ్డు మీదకు ప్రవహిస్తూ కనిపిస్తాయి . వసుధార భీంపూల్ దగ్గర నుంచి దూరంగా కొండలలో వాతావరణం బాగుంటే కనిపిస్తుంది .

 ఊర్వశి మందిరం 

       సతీదేవి మొక్క 108 పీఠాలలొ యిది వొకటి .యిక్కడ సతీ దేవి యొక్క ఊరువు భాగం పడిందని అంటారు . యీ ప్రదేశం లోనే విశ్వామిత్రుని  ఊరువులనుంచి ఊర్వశి వుద్భవించిందని అంటారు . యీ మందిరం చాలా చిన్నది . యిది బదరీనాథ్ గ్రామంలో వుంటుంది . స్థానికులు దీనిని 'ఊర్వశి మాతా మందిర్ ' గా వ్యవహరిస్తారు .
                చరణ్ పాదుక -- బదరీనాథ్ కోవెల వెనుక వైపునుంచి కాలి బాటన వెళితే స్వఛ్చమైన నవ్వు మొహాలతో ఆప్యాయంగా పలుకరించి టీ తాగండి ,భోజనం చేసి వెళ్ళండి అని పిలిచే స్టానికుల యిళ్ల మధ్య నుంచి వెళ్ళితే కొంత దూరంలో " అఘొరీ బాబా ఆశ్రమం " కనిపిస్తుంది . దానిని దాటుకొని స్వచ్చమైన సెలయేరు ప్రక్కగా పచ్చని కొండ చరియలలో ప్రయాణం చేస్తూ నాలుగు కిలోమీటర్లు నడిస్తే చరణ్ పాదుక చేరుకోవచ్చు . యిక్కడ నారాయణుడు తన పాదరక్షలు విడిచి పెట్టి ఆదికేదార్ వెళ్ళేడనేది యిక్కడ ప్రచారంలో వున్న కధ .
           శంకరాచార్యులు  బదరీ నాథ్  గురించి వేదాలలో చదివి యీ ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చి విగ్రహాలు నారద కుండంలో వున్నట్లు తెలుసుకొని వాటిని బయటికి తీయించి తిరిగి ప్రతిష్ఠించి పూజలు చేసి తనతో కుడా వచ్చిన నంబూద్రి బ్రాహ్మణులను నిత్య పూజాది కార్య క్రమాలు నిర్వర్తించుటకు నియమించెనని చెప్తారు .యిప్పటికి యిక్కడ నంబూద్రి వంశస్తులే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . శంకరా చార్యులచే నిర్మించ బడ్డ యీ దేవాలయం రెండు మూడు మార్లు జరిగిన ప్రకృతి విపరీతాలకు నేలకూలిందని అంటారు . 2013 లో సంభవించిన వరదలలో యీ కోవెలకు ఎక్కువ హాని జరుగలేదు .
           యీ యాత్ర సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే జరుగుతుంది . మిగతా ఆరునెలలు కోవెల తలుపులు మూసివేస్తారు . యీ ప్రాంతంలో కార్తీక మాసం మొదలు వైశాఖ మాసం వరకు హిమపాతం విపరీతంగా వుండడంతో యిక్కడి ప్రజలు యీ ఆరునెలలు ఆణి మఠ్ , జోషిమఠ్ లలో గడుపుతారు . యీ ఆరునెలలు బదరీ నాథుని మూర్తులను ఆణి మఠ్ లో వున్న కోవెలలో వుంచి పూజలు నిర్వహిస్తారు . యీ కోవేలని వృద్ద బదరి అని అంటారు . వైశాఖ మాసంలో వచ్చే శుక్ల తదియ నాడు బదరీ కోవెల తలుపులు ఆ జిల్లా కలెక్టర్ సమీపంలో తెరుస్తారు . తలపులు మూసినప్పటి అఖండ దీపం ఆరునెలల తరువాత కూడా వెలుగుతూ వుండడం వో విశేషం . ఆ రోజున అఖండ దీపం దర్శించు కోడానికి ప్రపంచ నలుమూలాల నుంచి వేలాది భక్తులు తరలి వస్తారు .
           ఉత్తరాఖండ్ యాత్రలు  చేసుకోనే వారికి ముఖ్యంగా చేసే సూచన యేంటంటే తగినన్ని వులెన్స్ పట్టుకు వెళ్ళడం , అందాజుగా వారం రోజులు యాత్ర అంటే మరో నాలుగు రోజులు కలుపుకొని అన్ని రోజులకు సరిపడే విధంగా ప్రణాళిక వేసుకుంటే మంచిది . యెటువంటి ప్రాకృతిక విపత్తులు లేకుండా యాత్ర జరిగితే మంచిదే కాని పర్వత ప్రాంతాలలో వాతావరణం లో హెచ్చు తగ్గులు విపరీతం గా వుంటాయి . అన్నింటికీ తగు జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞుల లక్షణం .
            యాత్రలు ఎందుకు చెయ్యాలి అంటే మనిషిలో సహన శక్తిని పెంచుతుందట . భగవన్నామ స్మరణతో యాత్ర మొదలు పెట్టండి .

No comments:

Post a Comment

Pages