చెప్ప సులభంబు చేయుటే చెడ్డ చిక్కు.
ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం
ఇంద్రియంబుల మది నిగ్రహించు మెపుడు,
ఇదియె పరమార్త మిద్దియే పదిలమనుచు
చెప్ప సులభంబు చేయుటే చెడ్డ చిక్కు.
అన్ని జీవుల పరమాత్మ అమరియుండు,
నీవు నేనను భేదంబు నెఱయ నీకు,
సకల ప్రాణుల సంతృప్తి సలుపు మనుచు,
చెప్ప సులభంబు చేయుటే చెడ్డ చిక్కు.
కన్నులరమోడ్చి కూర్చుండి కదలకుండ,
భృకుటి మధ్యంబునందున దృష్టినిల్పి,
ధ్యానమగ్నత నుండుటే ధన్య మనుచు,
చెప్ప సులభంబు చేయుటే చెడ్డ చిక్కు.
మదము, క్రోధంబు, లోభంబు, మత్సరంబు,
కామ, మోహంబులను ఆరు కలుషములను,
దరికి రానీయ బోకుము తరుము మనుచు,
చెప్ప సులభంబు చేయుటే చెడ్డ చిక్కు.
ధనము, కనకంబు, వస్తువుల్ ధ్వస్తమగుట
వీని నార్జింపగా నీవు ప్రీతి పడకు,
వాటి దరిచేరదీయుట పాపమనుచు,
చెప్ప సులభంబు చేయుటే చెడ్డ చిక్కు.
***
No comments:
Post a Comment