ధనుర్మాసం - గోదా వైభవం
అక్కిరాజు ప్రసాద్
తదహం భక్త్యుపహ్రతమశ్నామి ప్రయతాత్మనః
భక్తితో సమర్పించే పత్రము, పుష్పము, పండు, నీరు ఏదైనా కూడా దానిని నేను స్వీకరిస్తాను.
- శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో శ్రీమద్భగవద్గీతలోని రాజవిద్యా రాజగుహ్య యోగ అధ్యాయము నుండి.
భక్తికి భావం, శుద్ధి ప్రాధానమని పరమాత్మ మనకు గీత ద్వారా చెప్పాడు. భక్తిలేని జ్ఞానం నిరుపయోగమైనదే. ఆ విధంగా ఎంత వైభవంగా పూజలు చేసినా ఎటువంటి ఫలితమూ ఉండదు. దానిని ఆచరించి మనకు మార్గదర్శకులైన వారెందరో. మారేడు దళాలతో శివుని పూజించి కన్నప్ప శ్రీకాళహస్తీశ్వరుడైన శివుని అనుగ్రహం పొందాడు. శబరి గురువులపై భక్తితో రామలక్ష్మణులకు ఎంగిలి ఫలాలను సమర్పించింది. దానిని స్వామి స్వీకరించి ఆమె గురువులకు ముక్తిని ప్రసాదించాడు. అలాగే, శ్రీకృష్ణుడు కుచేలుడు సమర్పించిన అటుకులను స్వీకరించి అతని దారిద్ర్యాన్ని తొలగించాడు. శ్రీకృష్ణుని తలనొప్పి తగ్గటానికి భక్తుల పాదధూళి అవసరమని చెప్పారు వైద్యులు. ఆయన పరమాత్మ, ఆయనకు తమ పాదధూళి తాకితే తమకు పాపం కలుగుతుంది అన్న భయంతో స్వామిని కన్న తల్లిదండ్రులు, తోబుట్టువు, బంధుజనం తమ పాదధూళి ఇవ్వటానికి భయపడ్డారు. కానీ, ఆయనను ప్రేమించిన గోపికలు మాత్రం, స్వామిపై గల ప్రేమతో, తమంకు నరకం కలిగినా సరే అని ధైర్యంగా పాదధూళిని సమర్పించారు. స్వామి తలనొప్పి తగ్గింది. అదీ ఆ భక్తులలో ఉన్న నిర్మలత్వం. వీటన్నిటిలోనూ మనకు సారూప్య గుణం - భక్తిలోని స్వచ్ఛత. ఈ నైర్మల్యం ఒక స్థాయిని దాటితే అది మధురభక్తికి దారి తీస్తుంది. మీరా, అన్నమయ్య, క్షేత్రయ్య ఇలా ఎందరో ఈ మధురభక్తిలో తరించారు. మధురభక్తికి మరో రూపం గోదా.
అటువంటి ప్రేమ, భక్తితోనే గోదాదేవి స్వామిని వరించింది. ప్రేమతో స్వామికై అల్లిన మాలలను తాను వేసుకొని, తరువాత స్వామికి సమర్పించింది. స్వామికై చేసిన నివేదనలను తొలుత తనకు నైవేద్యం పెట్టుకొని తరువాత స్వామికర్పించింది. శ్రీవిల్లిపుత్తూరులో కొన్ని వందల ఏళ్ల క్రితం అయోనిజగా శ్రీకృష్ణుని తులసివనంలో జన్మించింది గోదా. తొలుత ఆమెను కనుగొన్న పెరియాళ్వార్ (విష్ణుచిత్తునిగా ప్రసిద్ధి చెందాడు) ఆమెను పెంచి పెద్ద చేశాడు. ఆలయ అర్చకులు, విష్ణు చిత్తుడు సమకూర్చి అల్లిన పూమాలల కన్నా, గోదా ధరించటం వలన కలిగిన నిర్మలత్వానికి స్వామి బద్ధుడైనాడు. భక్తి ప్రేమల అపూర్వమైన కలయిక గోదా తత్త్వము. అర్చకులు యాంత్రికంగా అల్లి వేసిన మాలల కన్నా, గోదా ప్రేమతో అల్లి, తాను ధరించి, నీటిలో ప్రతిబింబాన్ని చూసుకొని తనకోసం పంపిన మాలలను స్వామి ఆనందంగా స్వీకరించాడు.
గోదా వైష్ణవ ఆళ్వారులలో ఏకైక మహిళ. వీరు రచించిన నాలుగు వేల పాశురాలలో గోదా పాడిన 30 పాశురాలు విశేషమైనవి. రేపల్లెలో రాధ ఎలాగో శ్రీవిల్లిపుత్తూరుకు గోదా అలాగ. మధురభక్తితో రోజంతా తనతో తిరిగే కృష్ణుని చూసి ఆనందించటం, రాత్రి విరహంతో ఉండటం, తెల్లవారగానే స్వామిని చూడాలన్న ఆతృత...ఈ విధంగా గోదా పాశురాలను రచించింది. చెలికత్తెలను లేపటం, చెలికత్తెలార, ఈ ధనుర్మాసం నెలరోజులూ మనం వ్రతం చేపట్టాం కదా. ఆ వ్రతమాచరించి స్వామిని పొందుదాం అని వారినందరినీ నిద్ర లేపి, స్వామి పరివారమునంతటినీ నిద్దురలేపి హడావిడి చేస్తుంది. స్వామి చేత తన శ్రీవ్రతమునకు కావలసిన సంభారములన్నిటినీ సమకూర్చే వాగ్దానం తీసుకుంటుంది. అలా స్వామిని కొలిచి స్వామిని తన సొంతం చేసుకుంది గోదా.
ఆండాళ్ అనగా రక్షకురాలు అని అర్థం. స్వయంగా శ్రీమహాలక్ష్మి యొక్క అవతారమైన గోదా తన అవ్యాజమైన ప్రేమకు, కరుణకు ప్రతీక. అందుకే ఆండాళ్‌గా పిలువబడింది. తిరుప్పావై అనగా శ్రీవ్రతము ఒక విశెషమైన వ్రతము. దీనిని మొదట గోపికలు ఆచరించారు. వారు కోరుకున్నది శ్రీకృష్ణునితో సంగమం. ఆండాళ్ దీనిని ఒక ఆత్మాశ్రయమైన కథగా నిరూపించి ముప్ఫై పాటలు పాడింది. కావ్యం చూస్తే కథేమీ ఉండదు, కానీ ఆండాళ్ ప్రేమానురాగాలకు, అవ్యాజమైన భక్తికి ప్రతిబింబంగా నిలిచింది. జగత్తులో అందరి జన్మకు సార్థకత ఏదో, దానికొరకు మనం ఏమి చేయాలో తెలియజేసేది తిరుప్పావై.
విష్ణుచిత్తులుగా పేరొందిన పెరియాళ్వారుకు ఆ పేరు వారు పాడిన స్తుతిప్రబంధములన వలన కాదు, వారి ఇంట్లో పెరిగిన గోదా పూమాలలను తన తలలో ధరించి తరువాత వటపత్రశాయికి సమర్పించటం వలన సిద్ధించింది అని దేశికులు చెప్పారు. మిగిలిన ఆళ్వారులంతా తమను తాము నాయికగా భావించుకొని సంయోగ వియొగ దశా వర్ణనలతో తమ హృదయాలను శృంగారించుకుంటే, గోదా స్వభావం భావనాప్రకర్ష నిరతిశయ సుందరం.
ఆండాళు పాడిన తిరుప్పావై ప్రబంధం ముప్ఫై పాశురాలే అయినా అది ఎంతో మనోజ్ఞంగా, రసభరితంగా, ఆనందసుందరంగా ఉంటుంది. ధ్వనులతో సుందరత్వాన్ని అలదే ఈ ప్రబంధం ప్రపంచం సాహిత్యంలోనే మృగ్యం. సంస్కృతంలో రామాయణం ఎలాగో ద్రావిడ భాషలో తిరుప్పావై అంత ప్రసిద్ధి చెందింది. ప్రణయాన్ని, సౌందర్య స్వరూపాన్ని, ఆనందానుభవాన్ని ముద్దుగా ముచ్చటగా నిరూపించేది తిరుప్పావై. గోపికా భావాన్ని తనలో నింపుకున్న గోదాదేవి ప్రణయత్వానికి ప్రతీక. గోవులు, గోపకులం, నేల-ఆకాశం, నీరు-గాలి, కొండలు-మబ్బులు చేతనాచేతన ప్రపంచమంతా ప్రణయోత్పుల్లంగా భాసిస్తుంది గోదా హృదయ సరోవరంలో. ప్రేమ యొక్క నిర్వచనం తెలిసిన వారికి ఈ ప్రబంధం అంత అందంగానూ, ఉదాత్తంగానూ కనబడుతుంది. శ్రీకృష్ణుని పత్ని అయిన నీల-స్వామి-గోదా - ఈ ముగ్గురినీ ప్రణ సౌందర్య ఆనంద ప్రతీకలుగా ప్రతిపాదిస్తుంది తిరుప్పావై.
తిరుప్పావైగా ప్రసిద్ధికెక్కిన గోదాదేవి పాడిన 30 పాటలు వైష్ణవాచార్యులందరికీ శిరోధార్యమైనాయి. కాళిదాసుకు కూడా అందనంత భావసౌందర్యం గోదా పాటలలో అనుభవించి గానం చేసింది. చిన్నవయసులోనే రోజుకొక పాట ఆశువుగా ఆ వటపత్రశాయికి అందించిన గోదా ఆ గానమాలికలతో పాటు తాను ధరించి విడిచిన పూల మాలను కూడా రంగనాథునికి సమర్పించింది.
మానవుని విపరీత ధోరణికి విసిగి మంచి నేర్పటానికి అవతరించిన మాధవుడు నీళా భవనంలో నిదురించి ఉండే సందర్భం. బిడ్డల దోషాలను క్షమించి, లాలలంతో సన్మార్గం చూపాలి, వారిని మరచి విడుచుట తగదు లేలెమ్మని శ్రీకృష్ణుని మేల్కొలిపి కర్తవ్యబోధ చేసిన ఉదార చరిత గోదా. ఈమె కూడా భగవంతునికి ఒక మాలిక అని భావించి ఆమెను కోతై అని పిలిచారు విష్ణుచిత్తులు. అదే గోదాగా మారింది. తండ్రి భగవంతుని కోసం గుచ్చిన మాలికలను ముందుగా తాను ధరించి అది స్వామికి తగినదా కాదా అని చూసుకునేది బాల గోదా. ఒకనాడు ఈ దృశ్యం తండ్రి కంట పడింది. అది తగదు అని తండ్రి ఆమెను దండించి ఆ మాలను స్వామికి వేయలేదు. స్వప్నంలో విష్ణుచిత్తునికి స్వామి సాక్షాత్కరించి తనకు గోదా ధరించిన మాలలే కావాలి అని అన్నాడు. ఆశ్చర్యపోయిన విష్ణుచిత్తుడు ఆమెను తనను రక్షించే తల్లి కాబట్టి ఆండాళ్ అని ప్రశంసించాడు. అదే ఆమె పేరయ్యింది. ఆముక్త మాల్యదగా ఆమె ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుని కొరకు రేపల్లెలో గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతాన్ని అనుకరిస్తూ 30 రోజులు శ్రీవ్రతాన్ని ఆచరించింది. రోజుకో పాటను స్వామికి ఆశువుగా గానం చేసింది. తన ఊరే గోకులంగా, తోటివారంతా గోపజనంగా, స్వామి మందిరం నందనందనుని భవనంగా, తానే గోపెమ్మగా భావించి గోపీత్వము పూర్తిగా పొందింది. చివరిరోజున శ్రీకృష్ణుడు ప్రసన్నుడై ఆమె అభీష్టాన్ని నెరవేరుస్తాను, సకల భోగాలను ప్రసాదిస్తాను అన్నాడు. గోదాదేవి భోగాలను పొందే రోజే భోగి అయ్యింది. మానవాళికి సన్మార్గాన్ని, ఉపనిషత్తుల సారాన్ని అందించే అపూరొపమైన విజ్ఞానగని ఈ తిరుప్పావై. ఇది పాడిన వారికి కామ్యములు తీరుతాయని గోదాదేవి తన ఆచరణలో నిరూపించింది.
తిరుప్పావై వివరాలు:
తిరుప్పావైలో ప్రధానంగా ఆరు లక్షణాలు కనబడుతాయి:
1. పావై అనగా శ్రీవ్రతాన్ని ఆచరించటం
2. అందరితో కలిసి శ్రీవ్రతాన్ని ఆచరించటానికి వెళ్లటం
3. శ్రీకృష్ణుని నిదురలేపటం
4. అతని గుణవైభవాలను గానం చేయటం
5. వాటిని అందరికీ బోధించటం
6. అనన్యమైన సర్వశ్య శరణాగతి
మాసానాం మార్గశీర్షోహం అని గీతలో అన్నాడు శ్రీకృష్ణుడు. మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరం కాబట్టి గోదా ఈ శ్రీవ్రతం ఆచరించాటానికి ఆ మాసాన్ని ఎంచుకుంది. ద్రావిడులు రవి సంక్రమణాన్ని అనుసరిస్తారు కాబట్టి, ధనుర్మాసం అనగా రవి ధనూరాశిలో ప్రవేశించే రోజునుండి మకర రాశిలో ప్రవేశించే రోజు వరకు ఉండే ముప్ఫై రోజులు. ఈ సమయంలో శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానం ఎక్కువగా కలుగుతుంది. భగవంతుని ప్రేమించాలి అనిపించే కాలమే ధనుర్మాసం. అది గుర్తించటమే మార్గశీర్ష వ్రతం. శ్రీకృష్ణుని అనుగ్రహం తప్ప వేరే ఏదీ కోరకపోవటమే సంపద అని గోదా చెబుతుంది. ఇది కలవారంతా శ్రీకృష్ణ పరివారమే. మొదటి పాశురంలోనే గోదా దేశ, ప్రాంత, భాషా సరిహద్దులను తొలగిస్తుంది. స్వామి నామస్మరణతో స్నానం చేస్తే అన్నమయ కోశం శుద్ధవుతుంది. మితమైనా ఆహారం, తక్కువ మాట్లాడతం వలన ప్రాణమయ కోశం శుద్ధి అవుతుంది అని సూచిస్తుంది ఆండాళ్.
మనకు పట్టిన దేహము-ఆత్మ, స్వాతంత్ర్యము-పరదాస్యము, స్వరక్షణ-స్వాన్వయము, బంధులోలత, విషయ వాంఛలనే ఆరుదోషాలు సర్వోత్తముడైన కృష్ణుని నామాలను కీర్తించటం వలన తొలగుతాయని, జ్ఞానమనే పంట పండుతుందని ఆండాళ్ అంటుంది. జగద్గురువైన శ్రీకృష్ణుని ఆచార్యునిగా భావించి వ్రతాన్ని తనచేత జరిపించమని ప్రార్థిస్తుంది. హృదయాన్ని ప్రేమతో నింపుకొని, ఆ పుష్పాన్ని స్వామి పాదాల వద్ద సమర్పించి, స్వామిని స్మరించితే మనకు కలిగే ఆటంకాలన్నీ నిప్పులో పడిన దూదిలా నశిస్తాయని గోదా చెప్పింది. భగవంతుని యొక్క సకల గుణవైభవాలను పెద్దల ఉపదేశంతో తెలుసుకోవాలని, ఇది మొదటి దశ అని గోదా పాడింది. నిదురించే గోపబాలికలను సాత్విక నిద్రనుండి లెమ్మని ప్రార్థిస్తుంది. గోపకాంతలను విశేషమైన రీతిలో మేల్కొలిపి నందుని భవనంలో ప్రవేశిస్తుంది. తన నుతితో నంద యశోదలను, బలరామ కృష్ణులను మేల్కొలుపుతుంది.తరువాత స్వామిని నీళాదేవి మందిరంలో కాంచి మనోజ్ఞంగా నుతిస్తుంది. పల్లాండు పల్లాండు అని స్వామికి దృష్టి కలుగకుండు గాక అని మంగళాశసనం చేస్తుంది గోదా. మొత్తం ముప్ఫై పాశురాలలో సమస్త వేద సారమును, ఉపనిషద్ సారమును, గీతా సారమును మనోహరంగా అంతర్లీనంగా చెబుతుంది గోదా. అందుకే గోదా ఆళ్వారులలో ప్రసిద్ధి చెందింది. కృష్ణప్రాప్తి అనే సార్థకతను పొందింది. గోదా తిరుప్పావైతో పాటు నాచియార్ తిరుమొళి అనే అద్భుతమైన ప్రబంధాన్ని కూడా రచించింది.
గోదాకు వైష్ణవ సాంప్రదాయంలో అత్యున్నతమైన స్థానం ఉంది. గోదా పాడిన తిరుప్పావై ధనుర్మాస సమయంలో దక్షిణ భారత దేశపు వైష్ణవాలయాలలో భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ క్షేత్రాలన్నిటిలోనూ ఆండాళ్‌కు ప్రత్యేక సన్నిధి ఉంటుంది. ఆండాళ్ వైభవానికి సూచికగా మార్గశిర మాసంలో పావై నొంబు అనే పర్వాన్ని నిర్వహిస్తారు. అలగే ఆషాఢ మాసంలో ఆడి పూరం ఉత్సవాలను నిర్వహిస్తారు. శ్రీవిల్లిపుత్తూరులో వెయ్యి ఏళ్లకు పైగా పురాతనమైన వటపత్రశాయి మందిరము, ఆండాళ్ మందిరము ఉన్నాయి. ఈ క్షేత్రంలో ప్రధాన దేవాలయం 11 అంతస్తుల, 192 అడుగుల ఎత్తులో విష్ణుచిత్తునిచే కట్టబడింది. మదురై నుండి 74 కిలోమీటర్లో దూరంలో శ్రీవిల్లిపుత్తూరు ఉంది. ధనుర్మాసంలో శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్, శ్రీకృష్ణుల వైభవం, అలాగే శ్రీరంగంలో రంగనాథస్వామి, ఆండాళ్‌ల వైభం చెప్పనలవి కాదు. అనుభవైకవేద్యం. ఈ సమయంలో ఈ క్షేత్రాలను దర్శించి తీరవల్సిందే.
తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ ఆండాళ్‌పై అద్భుతమైన సంకీర్తన రచించారు. ఈమెను చూడికుడుత్త నాంచారిగా వర్ణించారు. చూడికుడుత నాంచారి: గోదాదేవి చూడి కుడుత అనేది తమిళ పదం. తాను ధరించిన మాలను స్వామికి ఇచ్చిన అని దాని అర్థం, అలా చేసింది గోదాదేవి కాబట్టి ఆమెను చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట.
చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
సోబానే సోబానే సోబానే సోబానే
శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు
కాముని తల్లియట చక్కదనాలకేమరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి
కలశాబ్ధి కూతురట గంభీరాలకేమరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి
అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి
చూడికుడుత నాంచారి: గోదాదేవి (చూడి కుడుత అనేది తమిళ పదం. తాను ధరించిన మాలను స్వామికి ఇచ్చిన అని దాని అర్థం, అలా చేసింది గోదాదేవి కాబట్టి ఆమెను చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట).
సతులారా! మన గోదాదేవి పతితో కూడియున్నది. పెండ్లిపాటలు పాడండి. (సోబాన అనే పదం కలిగిన పాటలు పెళ్లి పాటలుగా ప్రాచుర్యం పొందాయి)
ఈమె శ్రీమహాలక్ష్మి యట, అలంకారాలకు (శృంగారమునకు) ఏమి తక్కువ? మన్మథుని తల్లియట, చక్కదనాలు ఏమి తక్కువ? చంద్రుని తోబుట్టువట (క్షీర సాగర మథనంలో లక్ష్మితో పాటు చంద్రుడు కూడా ఆవిర్భవించాడు కాబట్టి వారిద్దరు తోబుట్టువులయ్యారు), ప్రసన్నత మరియు కళకు ఏమి తక్కువ? ఈ గోదాదేవి చాల కోమలమైన శరీరము కలది.
ఈమె సముద్రుని కూతురట, గంభీరానికేమి తక్కువ? తలచితే లోకానికి తల్లియట దయకేమి తక్కువ? నీటినుండి పుట్టిన కమలంలో నివసిస్తుందట చల్లదనానికేమి తక్కువ? ఈ గోదాదేవి అన్నీ అపరిమితంగా కలిగినది.
ఈమె దేవతల వందనాలు పొందినదట, అటువంటి మహిమలకేమి తక్కువ? అమృతానికి చుట్టమట (క్షీర సాగర మథనంలో అమృతము కూడా ఉద్భవించింది కాబట్టి) మరి ఆనందాలకేమి తక్కువ? కౌమార్యంలో ఉన్న ఈమెను ఆత్రుతతో శ్రీవేంకటేశుడు తానే వచ్చి పెండ్లాడాడు.
అన్నమాచార్యుల వారు గోదా వైభవాన్ని ఈ సంకీర్తన ద్వారా అద్భుతంగా వివరించారు. శ్రీరంగనాథుని పుట్టుకతోనే కొలిచిన గోదా శ్రీమహాలక్ష్మి అవతారంగా దర్శించి ఈ సంకీర్తనను మనకు అందించారు. గోదాదేవి శృంగారాన్ని, సౌందర్యాన్ని, తల్లి ప్రేమను, కరుణను, కళలను, మహిమలను, గాంభీర్యాన్ని, కోమలత్వాన్ని అద్భుతమైన ఉపమానములతో లక్ష్మీదేవితో పోల్చి ఈ కీర్తనకు దివ్యత్వాన్ని చేకూర్చారు. ఆమె ఈ గుణాలను గమనించి శ్రీరంగనాథుడు వచ్చి పెండ్లాడిన సందర్భంగా సతులను సోబాన పాడరమ్మా అని కోరుతున్నాడు సంకీర్తనాచార్యుడు. పదకవితా పితామహుని భావ సంపద, భక్తి జ్ఞాన సౌరభాలు ఈ సంకీర్తన ద్వారా ప్రకాశిస్తున్నాయి. తల్లిలో ఉండే సర్వ సులక్షణాలను అన్నమయ్య ఇందులో పొందుపరచారు.
విష్ణుచిత్తుని ఇంట జన్మించిన ఆ లోకమాత శ్రీరంగనాథునితో ఏకమయ్యే అద్భుతమైన అవతరణిక తిరుప్పావై. ఆ తిరుప్పావైలోని ఘట్టాలను ఎందరో సంకీర్తనాచార్యులు తమ భావాలలో వ్యక్తపరచారు. గోదావైభవాన్ని స్వయంగా శ్రీవిల్లిపుత్తూరులో దర్శించి తరించిన అన్నమాచార్యుల వారు దానిని తిరుమల-తిరుపతిలో వెలసిన వేంకటేశుడు-అలమేల్మంగల వైభవానుభూతికి సారూప్యంగా వర్ణించారు. తన జీవితాన్ని శ్రీరంగంలోని రంగనాథునికి సమర్పించిన గోదా 'నేను' అన్న భావాన్ని త్యజించి స్వామిలో ఐక్యమయ్యింది. అందుకే లోకవంద్య అయ్యింది.
లోకాస్సమస్తా సుఖినోభవంతు!
*****
No comments:
Post a Comment