గీత- అధీత 11
చెరుకు రామమోహనరావు
సమస్య : పంచ భూతాలయిన పృథివ్యాపస్తేజో వాయురాకాశములు విజృంభించితే మన పని అంతే !
సలహా : అదే మూర్ఖత్వమంటే ఇంత వరకూ విన్నదంతా పొట్టులా గాలికి కొట్టుకు పోతే , రెడ్డి గారొచ్చినారు మళ్ళీ మొదలెట్టం డన్న చందము అయినది.
ఒక చిన్న కథ గుర్తుకు వస్తూవుంది. ఒక పల్లెటూరిలో ఇద్దరు ప్రక్క ప్రక్క ఇంటి స్నేహితులు రోజూ పశువుల మేపను ప్రొద్దుటే పోయి చీకటి ప్రోద్దుకు తిరిగి వచ్చే వారు. ఇంటికి వచ్చి సేద తీర్చుకొని స్నానము చేసి భోజనము చేసి నిడురించేవారు. వీరి చేతిలో ఎప్పుడూ ఒక పొడవాటి కట్టె శరీరము పై కప్పుకోనేందుకు ఒక కంబడి వెంబడి ఉండేది. ఒకరోజు రాత్రి ఇద్దరూ తమ కట్టె కంబడి సమేతముగా భోజనాదులు ముగించుకొని వచ్చి పడుకొన్నారు, ఇంటిబయట వేసిన మంచాలపై. రెండవానికి నిదుర పట్టింది కానీ మొదటివాడు తన యింటికి చాలా దగ్గరలో ఎదో హడావిడి గమనించినాడు . తన కట్టె కంబలితో లేచినాడు . ఎవరో పండితుడు రామాయణము చెబుతున్నాడని విన్నాడు కానీ తానూ కూర్చుంటే చెప్పే వ్యక్తీ కనబడదు కాబట్టి తన కట్టె ఊతగా కంబడి గలిగిన వీపును వంచి నిలబడినాడు. కాసేపు గడిచిన పిమ్మట ఒక ఆకతాయి అతనిపైకి వెనకాల నుండి వురికి గుర్రముపైకి లంఘించిన చలన చిత్ర కథా నాయకుని మాదిరి కూర్చున్నాడు. కథలో అప్పుడే వాలీ సుగ్రీవ యుద్ధ ఘట్టములో వాలి సుగ్రీవుని గదతో బలంగా మోదే ఘట్టము జరుగుతూ వుంది. అప్పుడు పౌరాణికుడు వాలి గ్దాఘాతపు మోత 'ధన్' మణి వినిపించడము కుర్రవాడు కూర్చోవడము ఒక్కసారి జరుగుటతో అతడు కేవలమది అనుభూతిగా భావించి ఆసాంతము అదే భంగిమలో ఉండిపొయినాడు. తెలతెల వారగా కథ ముగిసింది. అతనికి వీపు పైన బరువు అప్పుడు తగ్గినట్లు అయినది. తన మంచము వద్దకు చేరుకోగానే అప్పుడే లేచిన మిత్రుడు ఎరా ఎకాడికి పోయివుందినావు అని అడిగినాడు. రామాయణము వినుటకని ఇతడు చెప్పినాడు. బాగుగా వుండినదా అన్నది అతని ప్రశ్న. ఇతని జవాబు " బాగో ఓగో నాకు అర్థము కాలేదుగానీ కథ ముగిసేవరకు ఎదో బరువుగానే వుండినదన్నాడు."
ఇపుడు మన పరిస్థితీ అదే !
పట్టు వదలని విక్రమార్కుడు మన కాదర్శము.
ఈ దేహమే పంచ భూతాత్మకము. పాదములు కాళ్ళవరకు భూమి, ఆపై కడుపు వరకు నీరు (ద్రవములు ) ( ఈ రెంటిని అర్థము చేసుకోగలము ) , గుండె వద్ద తేజస్సు (నీవార శూక మత్తన్వి పీతాభా స్వస్త్యణూపమా అన్నది వేదవాక్కు. తిరగబడ్డ పద్మపు మొగ్గ వద్ద వడ్లగింజకున్నంత ముల్లులా నీ లి రంగులో ప్రకాశించుతూ వుంది . దీనిని sinus node అని అంటారు.) ఆపైన ఊపిరితిత్తులనుండి నాసము (ముక్కు) వరకు వాయువు, ఆతరువాత
మిగిలింది ఆకాశము . ఆకాశమునకు అంతము లేదు ,ఆలోచనలకూ అంతము లేదు ,అది శిరస్సు( ఆజ్ఞ మరియు సహస్రార స్థానము.) కాబట్టి ఏది దానిలో కలిసి పోవలసిందే. ఈ విషయములో పరమాత్ముడు ఏమి చెప్పినాడంటే
నైనం ఛిన్దంతి శస్త్రాణి నైనం దహతి పావకః
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః 23 -- 2
శస్త్ర మ్మాత్మను చంపగలేదు అగ్నియు దానిని అంటగ లేదు
పయస్సు పవనము ప్రభావ హీనము
ఆత్మ యనంతము అజరామరము 23 -- 2
అచ్ఛైద్యో 2యమదాహ్యో 2యమక్లేద్యో 2శోష్య ఏనచ
నిత్యః సర్వగతః స్తాణు రచలో యం సనాతనః 23 -- ౩
చిరిగి పోవదది చిచ్చుయు నంటదు
తడిసి పోవదది తపనము చెందదు
ఎల్ల వేళలా ఎక్కడనైనా
స్థాణువు అచలము సనాతనమ్మది 23 -- ౩
ఆత్మను శస్త్రములు ఛేదించలేవు, నిప్పు తాకలేదు, నీరు ముంచలేదు గాలి తన ప్రభావమును అణుమాత్రము కూడా చూపించలేదు. చిరిగి పోదు చిచ్చు అంటే నిప్పు కాల్చలేదు, తడిసి పోదు తాపము చెందదు, అది కదలదు మెదలదు ఆకాలమీకాలమనక సర్వకాల సర్వావస్థలయందును అది యుండును. మరి ఉన్నదానిని గూర్చి ఏడవ పనిలేదు కదా అట్లే పోయేది వాస్తవమైనపుడు దానిని గూర్చి కూడా ఏడవ పని లేదు.
కాలము గడవక ముందే కర్తవ్యము పూర్తిచేయ నాలోచించు.
******************************************************
No comments:
Post a Comment