మాఊళ్ళో సంక్రాంతి మహత్యం
ఆండ్ర లలిత
నాన్నగారి దగ్గర నుంచే ఫోన్ అనుకుంటూ ఫోన్ ఎత్తి మాట్లాడింది. పండగకి ఆహ్వానిస్తే, ఏమి చెప్పాలో తెలీయక, చూద్దాము, నేను మళ్లీ రాత్రి లోపల చేస్తాను, అని ఫోన్ పెట్టేసింది రమ్య. రాహుల్ ని అడిగి సమాధానము ఇవ్వాలనుకుంది. రాహుల్కి ఫోన్ చేసింది కాని కలవలేదు. పోనీలే సాయంత్రము రాగానే చెప్పొచ్చు అనుకుంది. అనట్టు ఒక వేళ వెళ్తుంటే రేపే ప్రయాణము కదా! ఇంతలో పెట్టె సర్దేద్దాము, రాహుల్ వచ్చే లోపు, అని ఇద్దరి బట్టలు పెట్టలో సద్దింది. మనసులో తనలోతాను మాట్లాడుకోసాగింది. ఎంత బావుంటుందో, అందరిని చూసి తనివితీరా మాట్లాడేసి రావచ్చు అనుకుంది. వెళ్లితే బావుండును. అంతా ఏడు కొండలవాడి దయ. కాని ఆయనకి పల్లెటూళ్ళు అంటే అసలు ఇష్టము లేదు, మరి పెరిగింది పట్నవాసమాయే! అందుకే నన్ను అప్పుడప్పుడు పల్లెటూరు పిల్ల అని వెటకారముగా అంటారు. అప్పుడు ఉక్రోషము ముంచుకు వస్తుంది. తాడు తెగే వరకు లాగ కూడదు కదా! నాకు మా పల్లె సీమలకి అనుబంధము తెగిపోయినట్టేనా! ఈ ఆలోచనలు తన పుట్టింటి మీద బెంగని తెచ్చాయి. మరి ఒప్పుకుంటారా! అనుకుంది. నాకు వెళ్లాలని ఉంది. నాకు వెళ్లాలని ఉంది అని చెప్తే, ఏమో ఏమని అంటారో, అసలే ముభావమైన మనిషి. ఒప్పుకోకపోతే చెప్పి చూద్దాము, కాని కోపము వస్తే? ఏమో ఏమీ అర్థం అవటము లేదు. రాహుల్ కి ముందే నాన్నగారు మళ్ళీ ఫోన్ చేసిన సంగతి చెప్తే వత్తిడి వస్తుందేమో! అసలే పనిలో వత్తిడులు తప్పవు. ఇంట్లో కూడా ఎందుకు? ఎంతైనా అయనకి నొప్పించే పని ఎందుకు చేయటము. తనకి ఏమి ఇష్టమో అదే చేద్దాము. మళ్లీ ఎప్పుడైనా మా ఊరు వెళ్ళచ్చు అని అనుకుంది. ఇంతలో రాహుల్ ఆఫీసు నుంచి ఇంట్లోకి వస్తూ “అదేంటి రమ్యా నాకేసి తిరుగు, అలా! నీరసంగా ఉన్నావేంటి, ఒంట్లో బాగాలేదా! ఏమిటి రమ్యా తోచటం లేదా. షూ ఇప్పుకుంటూ, మంచి సినిమా ఆడుతోంది కల్యాణ్ సినిమా హాల్ లో. ఫస్ట్ షోకి వెళ్దాము. నీకు కామిడీ ఇష్టమని టికెట్లు కొన్నాను” అన్నాడు. “ఏమీలేదు బాగానే ఉన్నాను”, అంది రమ్య నాభిలోంచి ఛేదించుకుని మాటలు తెస్తూ. కాళ్లు చేతులు మొహము కడుక్కుని బట్టలు మార్చుకుని పడక కుర్చీలో కూర్చొనేటప్పటికి వేడి వేడి పకోడీల ప్లేటు చేతికి అందించింది. చిన్న బల్ల దగ్గరగా లాగి, కాఫీ దానిమీద పెట్టింది. “వేడిగా ఉంది కాఫీ, ఒక ఐదు నిమిషాలాగి త్రాగండి” అంది రమ్య. “మరి నీకు” అన్నాడు రాహుల్. “నేను తరువాత తింటాను లేండి. ఆఫీసులో అంతా బావుందా?” అంది రమ్య. “ ఆ...అంతా బావుంది. ఒక నాలుగు గంటల ఆఫీసు పనుంది. చేసుకోవాలి. రాత్రి చేసేస్తాను. ఇంక మూడు రోజులు సెలవులు, సంక్రాంతి పండగ హడావిడి. మనము బయటికి వెళ్ళొచ్చు” అన్నాడు రాహుల్ ప్రేమతో. “మీ చిన్నప్పుడు ఎలా జరుపుకునేవారు సంక్రాంతి?” అంది రమ్య. “ ఆ... ఏ ఉంది. చక్కగా మంచి మంచి తినుబండారాలు తినటము చక్కగా ఆడుకోవటము, బయటికి వెళ్ళడము, లేదూ టీవీ లో క్రికెట్ మ్యాచ్ చూడటము. ఎలా ఉన్నాయి మా పండగ సంబరాలు” అన్నారు రాహుల్. “చాలా బావున్నాయి. కొత్త కొత్త రుచులు చవి చూస్తేనే కదా దాని అందము తెలిసేది” అంది రమ్య చిరునవ్వుతో. “ఎక్కడో అక్కడికి వెళ్దాము. ఎక్కడికి వెళ్దాము నువ్వే చెప్పు రమ్యా?”అన్నాడు రాహుల్. చేతులు నలుపుకుంటూ “మా నాన్నగారి దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. మనని కుటుంబ సమేతముగా పెద్ద పండగ సంక్రాంతికి, మా ఇంటికి ఆహ్వానించారు. నేను ఏ సంగతీ రాత్రికి చెప్తానన్నాను” అంది రమ్య. “ఆ... ఏమి వెళ్తాము. కుదరదు అని చెప్పేయవోయ్. దాని బదులు ఊటి వెళ్దాము” అన్నాడు రాహుల్. “ సరే మీ ఇష్టము” అంది రమ్య. “అయినా మీ ఊళ్లో వైఫై ఉండదు. మరి బయట ప్రపంచంతో కనెక్షన్ ఉండదు. ఒక సెల్ ఫోన్ పనిచేస్తుందా? ఒక లాప్టాటాప్ పని చేయదు. అసలే కరెంట్ కోత , ఏముంది ఆ ఊరులో. ఉక్క పోత, సమయము వృధా అంతే. నీకు వెళ్లాలని ఉంటే, నువ్వు వెళ్లేసి రా” అన్నాడు రాహుల్, పేపర్ చదువుతూ పడక కుర్చీలో కూర్చొని. “మా ఊళ్లో సెల్‌ఫోన్స్ పనిచేస్తాయి. ఎందుకు పనిచేయవు ప్రతీ వాళ్ల దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. చేతిలో ఒక రుమాలలా అయిపోయింది సెల్ ఫోన్. గజిబిజి నెట్ కనక్ట్ ఆన్ లైన్ తీసుకుందాము అప్పుడు మీ లాప్ టాప్, వైఫై పని చేస్తాయి. మా నాన్నగారితో చెప్తా మీకు పట్టు పంచలు పెట్టమని. అత్తయ్యగారికి కంచి పట్టు చీర కూడా పెట్ట మంటాను” అంది రమ్య. “ఉహూ నేను రాను, అంతే. నాకు బహుమతులు ఎందుకు! నిన్నే నాకు కానుకగా ఇచ్చినప్పుడు. నేను రాను నాకు ప్రొజెక్ట్ వర్కు ఉంది అని చెప్పు, మనము కొడైకెనాల్ వెళ్దాము. మనుగుడుపులలో మనము పడుకున్న గది పక్కన పశువుల పాక, ఆ పశువుల పాక నుంచి శబ్దాలు వాసనలు. పోనీ ఎలాగో అలాగ పడుకుందా మంటే గంగాళములో నీళ్లు పడుతున్న శబ్దము. ” అన్నాడు రాహుల్ చిరునవ్వుతో ఆట పట్టిస్తూ. “ఆ గది ఏర్పాటు గా ఉంటుందని ఇచ్చారు” అని బుంగ మూతితో అంది రమ్య “వద్దు అంటే వద్దు. ఇంకా ఆ షాక్ నుంచి బయటికి రాలేదు. మర్చిపోయావా! అదీకాక మొహమాటము పేట్టేసి కొసరు కొసరు వడ్డించటము పోట్టలో నొప్పి వచ్చేసింది. అన్నీ మర్చిపోయావా రమ్యా! నువ్వు మర్చిపోయావేమో కాని నేనెలా మర్చిపోగలను? అసలు రమ్యా మీ ఊరు గొప్పతనమేమిటోయ్” అన్నాడు రాహుల్. “మా అమ్మని మీకు ఇష్టమైన కమ్మటి మినపసున్ని ఉండలు పెట్టమంటాను. మిమల్ని మొహమాట పెట్టద్దని చెప్తాను. మీరు పడుకునేందుకు పందిరిపట్టు మంచం ఇయ్యమంటాను. మా ఊళ్లో సంక్రాంతి వేడుకలే వేరు. పట్న వాసులకి ఆ వేడుకలు ఏమి తెలుసు?”అంది రమ్య. “అంత విశిష్టత ఏమిటో?” అన్నాడు రాహుల్ ఆతృతగా. “అయితే వినండి. అసలు మా ఊరు సెఖినేటిపల్లి అందమే వేరు. అక్కడ గుడలోంచి చక్కటి అన్నమాచార్యుల వారి కీర్తనలు, మనని తెల్లావారుఝామున మెల్లిగా లేపుతాయి. పచ్చని చెట్లు, పాడి పంటలు, పక్షుల కూతలు - ప్రకృతి సౌందర్యము ఉట్టిపడుతూ ఉంటుంది. రాత్రి ఆరుబయట పడుకుంటే ఆ కొబ్బరి చెట్లు, వేప చెట్ల చల్ల గాలి, సన్నజాజుల గుభాళింపు ఎంత బావుంటుందో. ఆ అందాలే వేరు లేండి. కాలుష్యము లేని వాతావరణము లాగే మనసులు మమతలు. మా ఇంటి ఎదురుగా చెరువులో ఎన్ని తామర పువ్వులో. ఆ అందం పట్న వాసములో ఎక్కడ ఉంటాయి. ఆ సంక్రాంతి సంబరాలే వేరు. నెల రోజుల నుంచి మొదలౌతాయి. గడపలకి పసుపు వ్రాసి అలంకరిస్తారు. మంచి మంచి ముగ్గులు, దాని మీద చక్కగా అలంకరించిన గొబ్బెమ్మలు, మధ్యానానికి ఆ గొబ్బెమలను పిడకలు చేస్తారు. ఆ పిడకలు భోగి మంటకి, రథసప్తమికి వాడతారు. హరిదాసులు హరి నామము పాడుతూ, పొద్దున్నే వస్తారు. వాళ్లని ధాన్యముతో సన్మానిస్తారు. భలే హడావిడిగా ఉంటుంది. ఎందుకుండదు - సంక్రాంతికి పాడి పంట పుష్కలంగా ఇంటికి వస్తాయి. మరి ఏడాది నుంచి పడిన శ్రమ, అందరితో పంచుకుంటూ ఆ సంతోషములో మర్చిపోతారు. ధనుర్మాసములో సూర్యోదయము సమయములో, ఆ లేత పొగ మంచు తెర ఛేదించుకుని ధాన్యము బస్తాలతో నిండిన ఎడ్ల బళ్లు, ఒక దాని వెనక ఒకటి వస్తుంటే ఆ దృశ్యము చూచేటప్పుడు కలిగే ఆనందమే వేరు. పచ్చ గడ్డి మోపులుతో నిండిన ఎడ్ల బళ్లు ఇంకా ఎన్నెనో. పొద్దున్నే పొలం గట్టున నడుస్తుంటే దారి పొడుగునా చెరుకు గెడలు, మోక్కజొన్నపొత్తులు, జామకాయలు, తేగలు, ముంజికాయలు ఇంకా ఎన్నెనో తింటూ ఆడుతు పాడుతూ నడి చేయవచ్చు”అంది రమ్య. “అయితే సరే, రమంటావ్. సరే ఈ ఒక్కసారి వస్తాను. నీ కోసం” అన్నాడు రాహుల్. రమ్యకి మనసులో ఈ ఒక్క సారి అన్న పదం చాలా భాద వేసింది. అప్పగింతలప్పుడు కూడా అంత భాద రాలేదు, కాని బయటికి ఒక చిరునవ్వుతో “ సర్లేండి” అని మాట దాటించేసింది రమ్య. అవును కాని రమ్యా, అసలు సంక్రాంతి వేడుకలు అక్కడ ఎలా జరుపు కుంటారు అన్నాడు రాహుల్ ఈ పండగ కుటుంబమంతా కలిసి జరుపుకునే పండగ. హరి నామము పాడుతూ వచ్చే హరి దాసుకి చిన్న పిల్లలు చేత బియ్యము వేయిస్తారు. మొదటి రోజు భోగి. తెల్లారుగట్ల భోగి మంట వేస్తారు. పులగంతొ రోజు మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రము చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. పేరంటం చేస్తారు. ఎంత మంది దీవిస్తే అంత బావుంటుందని. మర్నాడు ఆ సూర్యనారాయణ మూర్తికి పరమాన్నము నివేదన చేస్తారు దక్షిణాయనము నుండి ఉత్తరాయణము ప్రవేశించే సందర్బముగా. కనుమ నాడు పెద్దల పేరున పెట్టుకుంటారు, వారిని తలుచుకుని. కనుమ నాడు పశువులను కూడా చక్కగా అలంకరిస్తారు. పెంపుడు జంతువులని అలంకరిస్తారు. రైతులు, పాలేర్లని సంతోష పెడతారు. అందరికి కృతజ్ఞత చెప్పు కోవటము ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. రైతులు కష్టపడి ఉండక పోతే ఆ ధాన్యము ఇంటికి రాదు కదా. అన్నట్టు ఆ రోజు పోటీలు కూడా పెడ్తారు...పశువుల పోటీలు. వరి కంకెలు యొక్క కుచ్చులు చూరికి వేల్లాడదీస్తారు. పిచ్చుకలు పక్షులు అవి తింటే శుభము జరుగుతుందని. ఇంకా కందులు, పెసలు, నవ ధాన్యలు ఇంటి ఆవరణలో జల్లుతారు శుభమని. పెద్దవాళ్లు పక్షుల రూపంలో వచ్చి తింటారుట. అలా అన్ని జీవరాశులని పేరు పేరున సంతోషపెట్టటానికి చూస్తారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తారు. మరి ఒక్కసారి మీకు నచ్చితే మరి వాళ్ల ఆనందంలో పాల్గొందామా అండీ ! అంది రమ్య ఆతృతగా రాహుల్ కళ్లలోకి చూస్తూ. “ఇవన్నీ చూడాలని ఉంది రమ్యా. అయితే తప్పకుండా వెళ్దాము” అన్నాడు రాహుల్ రమ్యతో. ********* రమ్యా రాహుల్ సరదా సరదాగా సినిమా చూసి వస్తుంటే, రమ్య ఆకాశములోని నక్షత్రాలని చూపిస్తూ, “అదుగోండి సప్త ఋషి మండలము. ఆ తోకలో చివర నుంచి రెండవ నక్షత్రం పక్కన వున్నది అరుంథతి నక్షత్రం. పెళ్ళిలో మథ్యాన్నమైనా అదిగో అంటారు మనము సరే అనేస్తాము అంది నవ్వుతూ. అలాగే మనము అలా చుక్కలు జోడిస్తూ ఎలా చెప్తామో, అలా మనము నక్షత్రాలు లాంటి చుక్కలు వేసి చక్కటి ముగ్గులు పెడ్తూ ఒకటి నేర్చుకుంటాము. మన జీవితపు నక్షత్రాలు జోడించుకుంటూ, అదే “connecting the dots” ముందుకు ఎలా సాగి పోవాలి అని” అంది రమ్య . రాహుల్ “వహ్వా వహ్వా” అన్నారు. మర్నాడు ప్రోద్దున్నే కారులో సెఖినేటిపల్లికి సంతోషముగా బయలుదేరివెళ్ళారు. రమ్య అద్దంపట్టినట్టు చెప్పటముతో అసలే ప్రకృతి ప్రేమికుడేమో భలే బాగా నచ్చి పోయింది రాహుల్కి. రమ్యా భలే బాగా వర్ణించావు. భలే బావుంది మీ ఊరు. మన పెళ్ళికి వర్షాలు కదా, అందుకే చిరాకు వచ్చింది. ఇంతలో ఇల్లు వచ్చింది. ఆత్మీయతతో స్వాగతము పలికారు. పెళ్ళి వారి ఇల్లు లాగా ఉంది. పండగకి ఇలా చూడటము ఇదే మొదట సారి. ఆశ్చర్యచకితుడై యాడు రాహుల్. అప్పుడు అర్థమైనది రాహుల్కి పండగ అంటే ఇచ్చి పుచ్చు కోవటాలు దాని వెనుకనున్న వత్తిడులు, అలకలు, ఆర్భాటాలు ఒక ప్రక్కైతే, పండగ అనే నాణానికి మరోవైపు ఆత్మీయతలు సంతోషాలు అవి వ్యక్త పరిచేందుకు చిన్న చిన్న బహుమతులు ఇచ్చి పుచ్చు కుంటూ అందరితో సంతోషముగా గడిపే వేదిక అని. అరమరికలు లేకుండా అందరితో గడపడములో సమయము తెలియలేదు. మాటలు, ఆటలు, పాటలు, అసలు నిద్రా రాలేదు. చాలా నచ్చింది ఆ వాతావరణము. ఆత్మీయతలు అనురాగాలు తన మనసులో చెరగని ముద్ర వేసాయి. అదే కాదు పశువుల శాలలో పశువుల మెడ నిమిరి గడ్డి ,ధానా పెట్టేవాడు రెండు పూటల. “రమ్యా అలా పొలము గట్టుని కాశితో నడిచి కొంచం సేపులో వస్తాను” అని పొలానికి బయల్దేరాడు రాహుల్. “తోందరగా వచ్చేయండి” అంది రమ్య . పొలం గట్టున నడుస్తూ కొబ్బరి బొండాలు త్రాగుతూ ఆడుతూ పాడుతూ అలుపు సలుపు లేకుండా ఇంటికి వచ్చారు రాహుల్ కాశి. భోజనాలు తరువాత పట్నానికి బయల్దేరారు రమ్యా రాహుల్. రాహుల్ కారు ఎక్కిన మొదలు ముభావముగా ఉన్నారని రమ్య గమనించింది. “ఇంత వరుకు బానే ఉన్నారు కదా! మళ్లీ ఎందుకు అలా ఉన్నారు? మా ఊరు నచ్చలేదా? పోనిలేండి రావద్దు. నేను ఏమన్నా మనసు కష్ట పెట్టానా, లేక ఎవరైనా మీ మనసుని బాధ పెట్టారా చెప్పండి. నేను అలా చూడలేను” అంది రమ్య. రాహుల్ రమ్య చేయి తన చేతిలోకి తీసుకుని “ నాకు మీ ఊరు చాలా నచ్చింది. ఆ అమాయకపు మనషులూ, ప్రశాంతమైన వాతావరణము, అరమరికలు లేని మనస్తత్వాలు కలిగిన మనుషులు, మరి వాళ్ళని వదలాలంటే ఎంత బాధవచ్చిందో రమ్యా.” రమ్య పొట్ట ఉబ్బేలా నవ్వింది. ఎందుకు అంత నవ్వుతావు. “నిజము! ఆ పల్లెసీమల అందాలు. మనము అందరికి చెబుదాము. పల్లెటూరు అందాలు మరియు పండగలు గురించి” అన్నాడు రాహుల్. “బావుంది ఇంకా చెప్పండి! మీరు ఇలా చెప్తుంటే ఎంత బావుందో తెలుసా!” “ఊ.. అయితే విను! అన్నదాతా సుఖీభవ అంటారు మన పెద్దలు. ఈ పల్లెలు పొలాలు లేక పోతే మనము జీవించగలమా! మన పల్లెటూళ్ళు మన వెన్ను పూస. ఇంత వరకు నేను గ్రహించలేదు. మనని ముందడుగు వెయ్యమని చెప్తూ మనకి అండగా నిలబడతాయి. మరి మనము? మనము నేర్చుకున్న విజ్ఞానము తో వాళ్లకి సహాయ పడితే మన జన్మ సార్థకము. అలా మనని చూసి మరి కొందరికి ప్రేరణ కలుగు తుంది. అలా వానర సైన్యములా ఒకొక్క రాయి వేసుకుంటూ మన పల్లెలను బాగు చేద్దామనే లక్ష్యాని సాధించగలము. అదీకాకుండా, కొత్త జంటలు వాళ్ల మనోభావాలు ఒకరివి ఒకరు అర్థము చేసుకుని పంచుకునే ఉద్దేశ్యములో సమయము ఇచ్చుకోలేక పోతున్నారు, దానివల్ల వాళ్ళ మథ్య అవగాహనలు సరైన పక్వానికి రాకుండానే విడిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి పండుగలాంటి అవకాశాలవల్ల అవగాహన పెరగవచ్చు. ఏదన్నా ఫలించటానికి ఒక నిర్ణీత సమయము కావాలి రమ్యా!” అంటూ రహుల్ ఆలోచనలు పరిగులెత్తసాగాయి. ఇక నీగురించి వస్తే, నా మనసుని అర్థము చేసుకుని ఇదే చెయ్యాలి అని అనకుండా, చక్కగా మీ ఊరు పండగలు గురించి చెప్పినందుకు నీకు నా జోహార్లు. నాణానికి మరో పక్క అనట్లు ప్రతీ కార్యానికన్నా, సమస్యకన్నా, పరిశోధనలేక చర్చ అంశయానికయినా మరో పక్క తప్పక ఉంటుందని చక్కగా చెప్పావు. మనము దేని మీదన్నా ఒక నిర్ణయము తీసుకునే ముందు రెండు పక్కలా వినో, చదివో, చూసో అర్థము చేసుకోవాలి. ముందు అన్నింటికన్నా ముఖ్యము ఒకరి భావాలు ఒకరు అర్థము చేసుకుంటే ఎంత బావుంటుందో. ప్రతీ మనిషికి మనస్తత్వము వేరు. ఒక కార్యము సఫలీకృతము చెయ్యాలంటే దాంట్లో చేతులు కలిపే ప్రతీ ఒక్కరికీ సహనము, సద్దుబాటు, ఉత్సుకత తోడవ్వాలి. అప్పుడే అది ఫలిస్తుంది. మనము అర్థము చేసుకుని ఈ సంఘములో జీవించ గలిగితే ఎంత బావుంటుందో మనలా. ఇప్పుడు అర్థమైంది. సంక్రాంతి ఎదో ఒక పండగ కాదు, అది ఒక సంఘీభావం పెంచే మహత్తరమైన ఘట్టం. ఏమంటావు రమ్య. రమ్యకి మాటలు రాలేదు. ఆనంద భాష్పాలు వచ్చాయి. రమ్య రాహుల్తో అంది ఓరగా చూస్తూ ఈ సారి మీకు ఇష్టమైనట్టు చేసుకుందామని. ఇలా సంక్రాంతి పండుగతో వాళ్ల అందమైన జీవన ప్రయాణములో నక్షత్రాల లాంటి చుక్కలు జోడించుకుంటూ ముందుకు సాగి పోయారు.
No comments:
Post a Comment