ఫలసాయం
వేదుల సుభద్ర
"ఆదీ! నువ్వూ, అమ్మా రెడీనా?" బాల్కనీలోంచే అరిచాడు.
" యస్ నాన్నా, " అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆద్విక్. ఏడేళ్ళ వాడి చేతిలో చిన్న కవర్, వీపుకి వేసుకున్న రంగు. రంగుల బేక్ పాక్.
" అమ్మ కూడా వచ్చేసింది" అన్నాడు ఆద్విక్ నవ్వుతూ..
మరో రెండు నిమిషాల్లో వాళ్ళ ఫ్లాట్ కి తాళం వేసుకుని మూడు అంతస్థులు క్రిందకి మెట్లమీదుగా వెళ్ళారు. సాధ్యమైనంతవరకూ లిఫ్ట్ ఉపయోగించరు వాళ్ళు. అపార్ట్మెంట్ గేట్ దగ్గరే కనిపించారు సంజయ్, శ్రీనిధి, పిల్లలు అదితి, అద్వితి..
"రెడీ!" అన్నాడు విక్రం వాళ్ళను చూస్తూ..
"యస్ అంకుల్" ఉత్సాహంగా అన్నారు వాళ్ళిద్దరూ.. చిన్న పాప అద్వితి, ఆద్విక్ క్లాస్మేట్స్. వెళ్ళే చోటుగురించి వాడిద్వారా తనకే ఎక్కువ తెలుసును అన్న గర్వం ఆమె ముఖంలో ఎంత దాచుకుందామన్నా దాగడంలేదు. 'ఎప్పుడెప్పుడు వెళ్ళి చూస్తానా? అనిపిస్తోంది నాకు ' అంది వాడితో
" ఒక్క కార్ చాలు కదా మనందరికీ?", అంటూ విక్రం తమ కారు దగ్గరకి నడిచాడు. మగవాళ్ళిద్దరూ ముందు, ఆడవాళ్ళూ, పిల్లలూ వెనకా కూర్చున్నారు. తమతో తెచ్చిన చాపా, రెండు మూడు బుట్టలూ, బాగ్, దుప్పటీ అన్నీ కార్ బూట్ లో సర్దింది రేఖ.
" ఇరవై కిలోమీటర్లుంటుంది, అంతే! అరగంట, లేదా నలభై నిమిషాల్లో వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఎక్కువ లేకపోతే" అన్నాడు విక్రం.
"ఓ కే' అన్నాడు సంజయ్ చిరునవ్వుతో. వాళ్ళు కూడా అదే అపార్ట్మెంట్స్ లో మరొక బ్లాక్ లో ఉంటారు. రేఖా, సంజయ్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తారు శ్రీనిధి తప్ప మిగతా ముగ్గురూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. శ్రీనిధి టీచర్. తన పిల్లల స్కూల్ లోనే పనిచేస్తుంది.
"ఆర్ వీ ఆల్ సెట్?" అన్నాడు విక్రం పిల్లలవైపు చూస్తూ. "యస్" అన్నారు ముగ్గురూ..
" నాకు పూర్తిగా చెప్పలేదు అద్వితి, అయినా కూడా నాకు చాలా ఉత్సాహంగా ఉంది" అంది పెద్దమ్మాయి అదితి కొంచం కోపంగా.
" చెప్పడమెందుకు బంగారు, నువ్వే చూస్తావుగా? ఒకేసారి చూస్తే ఆ ఆనందం ఇంకా ఎక్కువ, అది వాళ్ళిద్దరికీ లేదు కదా!" అని రహస్యంగా చెప్పింది రేఖ ఆ పిల్ల చెవిలో. ఆ మాటలకి ఎంతో నవ్వు వచ్చింది అదితికి. 'రైట్ ఆంటీ" అంది.
కార్ సిటీ పొలిమేరలవైపు పరుగుతీసింది. పది కిలోమీటర్లు దాటగానే అద్దాలు కిందకి దించాడు విక్రం. చల్లటి గాలి మెత్తగా వీస్తోంది. గాలిలో తేడాని అందరికంటే ముందు కనిపెట్టింది శ్రీనిధి.
" అబ్బా, ఎంత హాయిగా ఉందో ఈ గాలి, ఫ్రెష్ అండ్ క్రిస్ప్' అంది నవ్వుతూ..అవునన్నట్టుగా చూసింది రేఖ.
ఎండ తగుమాత్రం గా ఉంది, నునువెచ్చని సూర్యకిరణాలకి మెల్లగా హొయలుపోతూ వీస్తోంది గాలి. పిల్లలు కూడా ఆ తేడాని గమనించారు. మరో ఎనిమిది కిలోమీటర్లు మెయిన్ రోడ్ మీద సాగాకా, రోడ్డుకి ఎడంవైపు తిప్పాడు విక్రం.
" రెండు కిలోమీటర్లు లోపలకి వెళ్ళాలి, కొద్దిగా రోడ్ బావుండదు. పిల్లలు మీరు కూర్చోవాలి, లేకపోతే దెబ్బ తగలచ్చు" అన్నాడు. ఒకటి రెండు చోట్ల చిన్న గుంటలు తప్ప రోడ్డు పర్వాలేదు అన్నట్టుగా ఉంది.
"గ్రీన్ హేపీనెస్ " అని రాసి ఉన్న పెద్ద గేట్ కి పక్కగా ఆపాడు విక్రం. సుమారుగా నాలుగెకరాల స్థలం అది. పెద్ద గేట్, దాని పక్కన గోడ, ఆ పైన ముళ్ళ వైరున్న కంచే వేసి ఉంది చుట్టూ. గేటుకు కుడి పక్కన వాచ్ మాన్ కోసం రూము, దానికి కొద్దిగా పక్కకే మోటారు ఉన్న షెడ్ ఉన్నాయి. అక్కడనించి చిన్న చిన్న కాలువలు తవ్వి ఉన్నాయి.
గేట్ కి ఎదురుగా ఆ స్థలాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ కాస్త విశాలంగా ఉన్న కాలి బాట. బాటకిరువైపులా రకరకాల చెట్లు. కుడివైపున్నది పెద్ద పొలంలా ఉంది, అందులో అనేకరకాల పళ్ళ చెట్లూ, కూరగాయల మొక్కలూ, పూల చెట్లూ ఉన్నాయి. ఎడమ వైపున్న స్థలాన్ని మాత్రం చిన్న చిన్న భాగాలుగా విభజించారు, అన్ని ప్లాట్ ల లోనూ ఆకుపచ్చని చెక్కబోర్డులు పెట్టి ఉన్నాయి.
" నా ప్లాట్ చూపిస్తాను రండి" అంటూ పరిగెత్తాడు ఆద్విక్.
'దిస్ ప్లాట్ బిలాంగ్స్ టూ ఆద్విక్, రేఖ అండ్ విక్రం' అని సంతోషంగా పైకి గట్టిగా చదివి ఐదు అంకె వేసి ఉన్న ఆ ప్లాట్ ని చూపించాడు. నాలుగైదు వందల చదరపు అడుగులుంటుందేమో ఆ స్థలం. చుట్టూ చక్కని పూల అంచు పేర్చినట్టుగా పూల మొక్కలున్నాయి. మధ్యలో ఆకు కూరలూ, కూరగాయల మొక్కలు కనిపిస్తున్నాయి. బెండ, టొమాటో, పచ్చిమిరప, వంగ లాంటి మొక్కలున్నాయి.
" అంకుల్ ఇది మీదా? అంటే ఇందులో ఇన్ని వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ మీవేనా? నేను ముట్టుకోవచ్చా? అడిగింది అదితి.
"అవును, ఇవి మనవే. ముట్టుకోవడమేం, కోసుకుందాం " అన్నాడు విక్రం.
" మీరు వెజిటబుల్స్ ఇక్కడనించే తీసుకుంటారా? షాప్ లో కొనరా?" అంది అద్వితి కూడా ఆశ్చర్యంగా.
" వారానికి ఒకసారి వచ్చి కొసుకుంటాం కదా, అందుకే షాప్ ల్లో ఎక్కువగా కొనాల్సిన అవసరం ఉండదు" అంది రేఖ.
" ఇప్పుడు నేను ఎలా కొస్తానో, చూడు!" అన్నాడు ఆద్విక్ అద్వితి తో,
రేఖా, విక్రం, ఆద్విక్ ముగ్గురూ, కాళ్ళకి సాక్స్, చేతికి తోటపని కి కావల్సిన గ్లవ్స్ వేసుకుని తమ పొలంలోకి దిగారు. సంజయ్ కుటుంబం ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళని.
"నేల గట్టిగానే ఉంది, మీరు కూడా రావచ్చు" అంది రేఖ. ఆ మాట అనగానే పిల్లలిద్దరూ తూనిగల్లా పరిగెత్తారు.
మొదట గా తోటలో పండిన బెండ కాయలు కోసింది రేఖ. దాదాపు రెండు కిలోలు వచ్చి ఉంటాయి అవి. పిల్లలు ముగ్గురూ ఆమెకి సహాయం చేసారు. ఆ తర్వాత టొమేటోలు, దొండకాయలు కోశారు. పచ్చిమిరపకాయలు మాత్రం తనొక్కర్తే కోసింది, కారానికి పిల్లలకి చేతులు మండితే కష్టమని. ఇంకా పూర్తిగా తయారవలేదు కనక కేరట్లని వచ్చేవారం కోద్దామని చెప్తూ, ఒక మొక్క పీకి వాళ్ళకి చిన్నగా ఉన్న కేరెట్ ని చూపించింది.
కూరలని ఎప్పుడూ షాపుల్లో తప్ప చూడని ఆడపిల్లలిద్దరూ బొలడంత సంబరపడ్డారు వాటిని చూసి. ఆ తర్వాత కాసేపు ఆకుకూరలు కోశారు. అన్నీ తెచ్చిన కవర్లలో విడి విడిగా సర్ది కొంచం నీళ్ళు చల్లి, తమతో తెచ్చిన బుట్టలో సర్ది పెట్టింది రేఖ.
" అమ్మా, ఆకలి" అన్నాడు ఆద్విక్. శ్రీనిధి అందరికీ టిఫిన్స్ పెట్టింది. అందరూ తిని ఆ ప్లేట్లన్నీ జాగ్రత్తగా ఒక కవర్లో వేసి పెట్టారు.
ఆ తర్వాత విక్రం, రేఖా పొలంలో ఒక మూల కొద్ది కొద్దిగా తవ్వుతూ, తమతో తెచ్చిన విత్తనాలని పాతారు. ఆద్విక్ ఒక్కో విత్తనం వాళ్ళకి అందిస్తూ ఉండగా. ఆ తర్వాత తమతో తెచ్చిన ఎరువును వేశారు మొక్కలకి. ఆ ఎరువును తమ ఇంట్లో వచ్చే చెత్తతో ఇంట్లోనే కంపోస్టింగ్ పద్ధతిలో తయారు చేస్తానని చెప్పింది ఆమె శ్రీనిధికి. అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా, లేదా అని చెక్ చేసారు ముగ్గురూ. అవన్నీ అయ్యేసరికి పన్నెండు దాటింది.
"పదండి అక్కడ షెడ్ ఉంది అక్కడ కూర్చుందాం, ఎండగా ఉంది కదా?" అన్నాడు విక్రం. అందరూ కొద్ది దూరంలో ఉన్న పెద్ద పాక క్రిందకి నడిచారు. దాంట్లో కూడా చెక్కవీ, రాయివీ టేబిల్స్, బెంచీలు ఉన్నాయి.
క్రింద దుప్పటీ, చాపా పరిచింది రేఖ.
" అమ్మా, నేను స్ప్రింక్లర్ ఆన్ చేసి చూపించనా వీళ్ళకి" అని ఉత్సాహంగా అడిగాడు ఆద్విక్.
" యా, కానీ ఎక్కువ సేపు వద్దు, నేల బాగానే ఉంది కదా' అన్నాడు విక్రం. తమ ప్లాట్ నంబర్ రాసి ఉన్న స్ప్రింక్లర్ స్విచ్ నొక్కి అక్కడ నీళ్ళు ఫౌంటేన్ లా రావడాన్ని తన స్నేహితులిద్దరికీ చూపించాడు ఆద్విక్. ఆ తర్వాత ఆపేశాడు. ఆ తర్వాత ముగ్గురూ పరిగెత్తి ఆడుకోవడం మొదలుపెట్టారు. పెద్దవాళ్ళు కబుర్లలో పడ్డారు. అప్పుడే మరొక కుటుంబం వచ్చింది వారు విక్రం, రేఖలని పలకరించారు. ఆవిడ తనతో తెచ్చిన కేబేజీ, కాలిఫ్లవర్ విత్తానలని రేఖకి ఇచ్చింది, రేఖ దగ్గరనించి బెండ, బీర విత్తనాలు తీసుకుంది.
"ప్రతీవారం ఇన్ని కూరలు వస్తాయా? "అడిగింది శ్రీనిధి.రేఖ సర్దిపెట్టిన కూరల బుట్టవైపు చూస్తూ.
"దాదాపుగా వస్తాయి. మనం వేసుకునే విత్తనాలని బట్టి" అంది రేఖ.
" చాలా బావుంది. వెరీ నైస్ ఎక్స్పీరియెన్స్" అన్నాడు సంజయ్.
" నిజం, నాకైతే మా అమ్మమ్మగారి ఊరు వెళ్ళినట్టనిపిస్తోంది" అంది శ్రీనిధి.
" ఈ ఫార్మ్ ఎవరిది? అసలిలాంటిది ఒకటుందనీ, ఇలా చెయ్యవచ్చని ఐడియా ఎలా వచ్చింది మీకు?"అన్నాడు సంజయ్ ఆసక్తిగా.
ఈ పొలం విశ్వాస్ అనే అతనిది. విశ్వాస్ అతను చాలామంది ఇంజనీర్లలాగే చదువు పూర్తి కాగానే ఉద్యోగం కోసం విదేశాలకి వెళ్ళిపోయిన అతను దాదాపు పదిహేనేళ్ళు అక్కడే గడిపాడు. ఎంత మంచి జీవితమైనా ఎప్పుడో ఒకప్పుడు బోర్ కొడుతుంది కదా? అలాగే అతనికీ అనిపించడం మొదలుపెట్టింది. ' ఎప్పుడూ ఈ ఉరుకులూ, పరుగుల జీవితమేనా? ఇంతకన్నా భిన్నంగా ఏదీ చెయ్యలేమా?' అనిపించేదిట.
అప్పుడే అతనికి ఈ ఆలోచన వచ్చింది, స్వదేశానికి తిరిగి వచ్చేసే ఉద్దేశ్యంలో ఉన్న అతను ఈ నాలుగెకరాల పొలం కొన్నాడు. కేవలం తన ఇంటికి కావలసిన కూరలూ, పళ్ళూ పండించుకోవడానికి అన్నది అతని ఆలోచన మొదట్లో. ఆతర్వాత అతనికర్ధమైంది తనొక్కడికీ ఇంత నేల అక్కరలేదని, అలాగే తనలాంటి అభిరుచి ఉన్న ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని. అప్పుడు అతను ఈ పొలాన్ని ఇదిగో, ఇలా రెండు భాగాలుగా విభజించి ఒక పక్కన తను ఉంచుకున్నాడు. మరొక పక్కన చూశారు కదా, చిన్న చిన్న ప్లాట్ లా చేసి మనలాంటివాళ్ళకి లీజ్ కి ఇస్తాడన్నమాట. అలా తీసుకున్నాం మేము. ఇవన్నీ మేము ఒకరోజు పేపర్ లో అతని గురించి వచ్చిన వ్యాసంలో చదివాము. అలా తెలిసింది మాకు విశ్వాస్ గురించి. చాలా కొత్తగా, ఆసక్తికరంగా అనిపించి, వెంటనే అతన్ని కలిసి మాట్లాడాము. అతను చెప్పిన వివరాలన్నీ మాకు నచ్చి ఒక ప్లాట్ అద్దెకు తీసుకున్నాము, అలా మొదలైంది మా ఈ వీకెండ్ యాక్టివిటీ.
" ప్లాట్ సైజుని బట్టి అద్దె. అందులో ఏం పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేది మన ఇష్టం. కానైతే రసాయనిక ఎరువులు అదే, కెమికల్ ఫెర్టిలైజర్స్ మాత్రం వాడకూడదు. నీరు, కాపలా వాళ్ళు చూసుకుంటారు. మనం వీలున్నప్పుడు వచ్చి మనకిష్టమైన మొక్కలు పెంచుకుని, వాటి ఆలనా పాలనా చూసుకుని వెళ్తూ ఉండచ్చు. ఇక్కడ మనకిష్టమొచ్చినంత సేపు గడపవచ్చు. చెత్త పడేసి పాడు చెయ్యనంతవరకూ ఎవరూ దేనికీ అభ్యంతరపెట్టరు. ఇది మేము లీజుకి తీసుకున్నప్పటినించీ దాదాపు ప్రతీవారం వచ్చి కనీసం సంగం రోజు గడుపుతాము ఇక్కడ. మొక్కలు నాటడమో, కలుపు తియ్యడమో, రెడీ అయిన కూరలు కోసుకోవడమో ఇలా ఏదో ఒక పని చేస్తాము. అన్నీ సరిగ్గా ఉన్నాయని చూసుకున్నాకా ఇదిగో ఇక్కడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటాం. ముగ్గురం కలిసి ఆడుకుంటాం, పుస్తకాలు చదువుతాం. మాతో భోజనం తెచ్చుకుంటే అది తిని బయలుదేరుతాం, లేదా దారిలో ఎక్కడైనా భోంచేసి వెళతాము" అన్నాడు విక్రం.
"రెండు నెలలకొకసారి మీటింగ్ పెడతాడు విశ్వాస్, అందులో ఆయన తోట పని గురించి చిన్న చిన్న వర్క్ షాప్ లు నిర్వహిస్తాడు. అప్పుడే మేమదరమూ విత్తనాలూ, మొక్కలూ ఒకరి తోటలోవి మరొకరికి ఇచ్చుకుంటాం. అలాగే ఒకరికి తెలియని విషయాలు మరొకరం తెలుసుకుంటాం. అలా ఒక చిన్న కుటుంబం తయారయింది. ఇందాకా చూశారు కదా, వాళ్ళది ప్లాట్ నంబర్ 8, చాలా కలుపుగోలుగా ఉంటారు విద్యా, మనోజ్ ఇద్దరూ." అంది రేఖ.
"వినడానికే ఎంత బావుందో? నాకిప్పుడు అర్ధం అవుతోంది మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో? ముఖ్యంగా ఆద్విక్ " అంది శ్రీనిధి.
' కానీ కలుపు మొక్కలూ, కాపలా అవీ?" అడిగాడు సంజయ్.
' కాపలా గురించి చెప్పాను కదా, కలుపు మొక్కలుమనకిష్టమైతే మనమే తీసుకోవచ్చు లేదా రోజుకింత అని ఇస్తే మనిషి వచ్చి చేస్తాడు. నీరే మొదట్లో కొద్దిగా సమస్య అయ్యేది, బోర్ వెల్ వేసి మోటర్ పెట్టాకా బావుంది. మేమందరం తలా కొంతా వేసాము విశ్వాస్ తో పాటు" అన్నాడు సంజయ్.
" అసలు ఇలా చెయ్యచ్చొన్న ఆలోచన మీకెలా వచ్చింది?" అడిగింది శ్రీనిధి ఆసక్తిగా. రేఖా, విక్రం ఒకళ్ళని చూసి ఒకరు నవ్వుకున్నారు.
' ఏదైనా తప్పుగా అడిగానా?" అంది శ్రీనిధి.
" లేదు, లేదు, దాంట్లో తప్పేముంది? రెండు కారణాలున్నాయి. మొదటిది ఓకే, రెండోది మాకెప్పుడూ నవ్వొస్తుంది" అంది రేఖ. విక్రం చెప్పడం మొదలు పెట్టాడు.
" రేఖకి మొదటినించీ మొక్కలన్నా, పువ్వులన్నా, పక్షులన్నా ప్రాణం. మీకు తెలియనిదేముంది? మన సిటీల్లో ఉండడానికే చోటు కరువు. మా మూడో అంతస్థు ఫ్లాట్ లో ఉన్నవే రెండు బాల్కనీలు. ఒక దాంట్లో పని అమ్మాయి పనులు చేసుకోవాలి, మరొక దాంట్లోనే మేం ఏం చేసుకున్నా. అక్కడే చిన్న, చిన్న కుండీలు పెట్టి మొక్కలు పెంచేది. ఆ పది మొక్కల వల్ల ఆమె సరదా పెద్దగా తీరకపోయినా 'గుడ్డిలో మెల్ల నయం' అనుకునేవాళ్ళం. ఒక పూల చెట్టు మొగ్గ వేసినా, ఒక చిన్న టొమాటో కాసినా రేఖ ఆనందం చెప్పనలవి కాదు. అయితే ఆద్విక్ పుట్టాకా, వాడు పొరపాటున మట్టీ అదీ నోట్లో పెట్టుకుంటాడేమో అన్న భయంతో అవన్నీ కింద పెట్టించేసింది. 'ఆది' కాస్త పెద్దవాడ డయ్యాకా, కొంత పరవాలేదు అనుకుని మళ్ళీ మొక్కలు పెట్టడం మొదలుపెట్టింది. పరిమితి లేకుండా వాడుతున్న పెస్టిసైడ్స్, కెమికల్స్ వాటివల్ల కలిగే నష్టాల గురించి చదివినప్పుడల్లా రేఖ మనసు కొట్టుకుపోయేది.
" చూడు విక్రం, ఏమిస్తున్నాం మనం మన పిల్లలకి?" అనేది బాధగా. నేను తనని సమాధానపరచడానికి ప్రయత్నించేవాడిని." ఎక్కడ చూసినా కాలుష్యం, దానికి తోడు విషాహారం! ఏమీ చెయ్యలేమా మనం?" అనేది తరచూ.
ఆ తర్వాత ' వర్టికల్ గార్డెనింగ్" అనీ ' టెర్రస్ గార్డెనింగ్' అనీ ఇలా చాలా వాటి గురించి చదివి అవి ప్రయత్నించింది. 'అపార్ట్ మెంట్ టెర్రస్ మీద గార్డెన్ పెంచితే? "అన్న ప్రతిపాదన తను చేసినపుడు కమిటీ వారు ఇష్టపడలేదు సరికదా, టెర్రస్ మీద అందరికీ సమానమైన హక్కులుంటాయి కనక రేపు అక్కడ పండేవి ఎవరు కోసుకోవాలి? అనేదానిమీద గొడవలు వస్తాయి. అలాగే నీళ్ళు లీకయ్యే ప్రమాదం ఉంది కనక వద్దన్నారు. తాను ముందుగా 'వాటర్ ప్రూఫింగ్' చేయించే మొదలు పెడతాను అన్నా వారు ఒప్పుకోలేదు. అప్పటినించీ ఇతరమార్గాలేమైనా ఉన్నాయా? అని చూసేది రేఖ. అప్పుడే విశ్వాస్ గురించి తెలిసింది, ఇది మొదటి కారణం" అంటూ ఆగాడు..
"రెండోది నేను చెప్తాను" అంటూ మొదలు పెట్టింది రేఖ నవ్వుతూ.
" ఆద్విక్ యూకేజీ లో ఉన్నప్పుడు అనుకుంటాను, టీచర్ వాళ్ళని ఒకరోజు తినే వస్తువుల గురించి చెప్తూ కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటిల్లో వారికి అన్నింటికంటే ఇష్టమైన పదార్ధాలూ, ఇష్టం లేనివి, ఇలాంటి ప్రశ్నలున్నాయి.
దాంట్లో ' మీరు రోజూ తినే రైస్ ఎక్కడనించి వస్తుంది?" అనేది ఒక ప్రశ్న. దానికి క్లాస్ లో సగం పైన పిల్లలు చెప్పిన జవాబు ఏమిటో తెలుసా? 'సూపర్ మార్కెట్' నుంచి అని.
అలాగే పాలు అంటే " ప్లాస్టిక్ పాకెట్" లోంచి అని కొందరు చెప్పారు, మా ఇంటికి రోజూ పొద్దున్నే ఒక అంకుల్ వచ్చి ఇస్తాడు, అతను మాజికల్ గా బేగ్ లోంచి పాకెట్లు తీసి ఎన్ని పాలు కావాలంటే అన్ని ఇస్తాడు" అని కొందరు చెప్పారు.
అలా ఆమె చెప్పినప్పుడు సంజయ్, శ్రీనిధి కూడా నవ్వారు. " నిజమే నల్లగా బురదనీళ్ళల్లో ఉన్న గేదె తెల్లని పాలు ఇస్తుంది అన్న విషయం నమ్మడానికి అదితికి కూడా చాలా కాలం పట్టింది, అంతే కాదు దీంట్లోంచి వచ్చే పాలు నేను తాగను అని ఎంతో గొడవచేసేది" అంది శ్రీనిధి తాను కూడా గుర్తు చేసుకుంటూ. నలుగురూ నవ్వుకున్నారు ఆ మాటలకి.
"ఫన్నీ కదా, వాళ్ళు ఆలోచించే తీరు! "అన్నాడు సంజయ్.
" వాళ్ళు ఆలోచించడం కాదు, ఆలోచించడానికి మనమేమీ చూపించకపోవడం ఫన్నీ. కదా!" అంది రేఖ.
"అంటే? "అంది శ్రీనిధి.
" ఆరోజు మాకు మొదటిసారిగా తెలిసింది. మూడేళ్ళ నించీ యూ ట్యూబ్ లో సినిమాలు చూడడం తెలిసిన పిల్లలకి మన మనుగడకి మూలమైన ముఖ్య విషయాల గురించేమీ తెలియదని.
పుడుతూనే కంప్యూటర్లూ, టాబ్లెట్ లు, టీ.వీ లు తప్ప మనమేమీ చూపించడం లేదని. అది మన తప్పని.మన కళ్ళతో చూస్తారు, మన చెవులతొ వింటారు పిల్లలు. అని అర్ధం అయింది మాకు" అంది రేఖ
ఆ రోజు స్కూల్ నించి వచ్చిన ఆద్విక్ " మా టీచర్ కి బియ్యం ఎక్కడనించి వస్తుందో తెలీదు, మేమే చెప్పాము సూపర్ మార్కెట్ నుంచీ" అని మాతో చెప్పిన రోజు మాకెంత నవ్వు వచ్చిందో, అంతే బాధ కూడా కలిగింది. దుక్కి దున్ని, నాట్లు వేసి, కుప్ప నూర్చే వ్యవసాయం మేము వీడికెలాగూ నేర్పలేము, చూపించలేము, కనీసం మనం రోజూ తినే తిండీ ఇలా వస్తుంది! అని చూపించాలన్న చిన్న భావనతో ఇది చూసిన వెంటనే లీజ్ కి తీసుకున్నాము. మా ప్రయత్నం వృధా కాలేదు. వాడికి ఇప్పుడీ విషయాలంటే ఎంతో సరదా. ఒక విత్తనం లోంచి చిన్న మొక్క వచ్చి, అది కొద్ది రోజుల్లోనే కాయలూ, పూలూ ఇవ్వడం వాడికి మొదట్లో ఎంతో ఆశ్చర్యంగా అనిపించేది. ఇప్పుడు వాడు ప్రతీ వారం ఇక్కడికెప్పుడు వద్దమా అని ఎదురుచూస్తూ ఉంటాడు" చెప్పింది రేఖ.
"అప్పుడప్పుడు వాడి స్నేహితులని కూడా తీసుకుని వస్తాము. మేము ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కొత్త విత్తనాలూ, మొక్కలూ ఎక్కడ దొరుకుతాయా? అని చూస్తాము. ఇంట్లో చిన్న డబ్బా పెట్టాము, దాని పేరు సీడ్ బాంక్, అందులో మాకు దొరికిన విత్తనాలన్నీ వేస్తాము. ఇక్కడికి వచ్చినపుడు వాటిని నాటుతాము, అలాగే ఆ మొక్కకి సంబంధించి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా పెంచాలి అనే విషయాలు నెట్ లో చదువుతాము. ఇవన్నీ వాడు కూడా మాతో సమానంగా చేస్తూ ఉంటే మాకెంతో ఆనందంగా ఉంటుంది." అన్నాడు విక్రం.
" అవును, ఈ ఆసక్తి ఎన్నాళ్ళుంటుందో తెలీదు కానీ కనీసం కూరలు, పళ్ళూ అవీ షాపుల్లోంచి కాకుండా భూమి లోంచి వస్తాయని తెలుసుకున్నాడు కదా అనిపిస్తుంది" అంది రేఖ..
" వెరీ ఇంటరెస్టింగ్ మీ వీకెండ్ వ్యవసాయం, మేము కూడా ఒక ప్లాట్ తీసుకుంటాం ఖాళీ గా ఉంటే" అన్నారు సంజయ్, శ్రీనిధి ఒకేసారి.
" ఎక్కడ ఇంచి నేల కనిపించినా ఆకాశాన్నంటే భవనాలు కట్టేస్తున్న ఈ రోజుల్లో విశ్వాస్ లాంటి వారు కొందరైనా ఉండబట్టే మనలాంటి వారు ఈ మాత్రం ప్రకృతికి దగ్గరగా రాగలుగుతున్నాం, ఇది కేవలం వ్యవసాయం కాదు, మనం మనకి, మనమే చేసుకుంటున్న పెద్ద సాయం. దానికి ప్రతిగా ప్రకృతి మనకిచ్చే ఫలసాయం" అంది రేఖ.
అవునన్నట్టు గా , అందరూ చిరునవ్వు నవ్వారామె మాటలకి.
***
No comments:
Post a Comment