పొగర్ స్టార్ - అచ్చంగా తెలుగు
పొగర్ స్టార్ 
 పెయ్యేటి రంగారావు 
 
     
         'శబ్బాష్!'
          ' వహ్వా!'
          ' భళా, భళా!'
          టి.వి.లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యావత్తు తెలుగు ప్రేక్షకులు కుర్చీల్లోంచి లేచి ఎగిరి గంతులేసారు.  ఈలలేసారు.  చప్పట్లు కొట్టారు.
          కొద్ది క్షణాల్లోనే ఆ వార్త దావానలంలా రెండు తెలుగు రాష్ట్రాల్లోను పాకిపోయింది.
          అందరూ రోడ్ల మీదకొచ్చి ఔట్లు పేల్చారు, బాణాసంచా కాల్చారు.
          ప్రఖ్యాత పొగర్ స్టార్ బభ్రాజమానం గాడికి మతి పోయింది.  ఏవిటి. తన గురించి టి.వి.లో వచ్చిన వార్తకి ఇంత గొప్ప స్పందనా!  తన గురించి ఇంతమంది ఆలోచిస్తూ వుంటారా?  ఎంత విచిత్రం!  ఏదో ఒక గ్రూప్ లోని ప్రేక్షకులు తనకి అభిమాన సంఘాలు పెట్టడం, వాళ్ళకి తను ధనసహాయం చేస్తూ వుండడం, తన రాబోయే సినిమాల తాలూకు ఆడియో ఫంక్షన్లకి వాళ్ళందర్నీ పిలుస్తూ వుండడం, వాళ్ళందరూ వచ్చి ఈలలు,కేకలతో హడావిడి చేస్తూవుండడం, అలాగే, తన సినిమా విడుదల రోజున తను వాళ్ళకి ధన సహాయం చెయ్యడం, వాళ్ళందరూ హాలు అలంకరించడం, ప్రేక్షకులకి టికెట్లు కొని ఉచితంగా పంచిపెట్టడం, మొదటి రెండు వారాలు బలవంతంగా హౌస్ ఫుల్ చేస్తూ వుండడం - ఇవన్నీ ఎప్పుడూ జరిగేవే.
          కాని ఇవాళ తన ప్రమేయం ఏమీ లేకుండానే, యావత్తు తెలుగు ప్రజలు రోడ్లమీదకి వచ్చి పండగ జరుపుకుంటున్నారంటే ఎంత ఆశ్చర్యం!!
                                                                 ఈ వార్త పూర్వాపరాల్లోకి వెళ్తే..................
  ****************************
          భజగోవిందం నటుడిగా చాలా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.  అతడు నటించిన అనేక సినిమాలు సిల్వర్ జుబిలీలు చేసుకున్నాయి.' దొమ్మరోడు ' పిచ్చోడు ', ' అత్తను వలచిన అల్లుడు ', ' ఓ అత్తా!  నీ ఇద్దరు కూతుళ్ళకి నేనే మొగుణ్ణీ' లాంటి అనేక సినిమాలు జనం ఎగబడి చూసారు.  వాటిలో అతడు వేసిన కుప్పిగంతులు, చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగులు, వరసకు అత్త అయినామెతో విచ్చలవిడిగా చేసిన బూతు డాన్సులు చూసి హాల్లో జనం ఈలలేసారు.  అతడికి ఎవరో అభిమానసంఘం వారు 'పొగర్ స్టార్'  అని బిరుదు కూడా ఇచ్చేసారు.  అప్పటినించి, అతడి ప్రతి సినిమాలోను అతడి పేరు తెర మీద వేసేటప్పుడు చెవులు చిల్లులు పడేలా మ్యూజిక్ పెట్టి తెరంతా కనిపించేలా 'పొగర్ స్టార్' అని వేసి తర్వాత భజగోవిందం అని పేరు వెయ్యడం అలవాటైపోయింది.
          భజగోవిందానికి ఇద్దరు కొడుకులు.  పెద్దవాడి పేరు బభ్రాజమానం.  వాడికి మూడవ నెల వయసున్నప్పుడు మొదటిసారిగా వాడిచేత సినిమాలో వేషం వేయించారు.  అక్కడినించి అడపా తడపా సినిమాల్లో కనిపిస్తూనే వున్నాడు.  వాడు నెమ్మది నెమ్మదిగా పదిహేనేళ్ళ వయసుకి రాగానే ఇంక హడావిడి మొదలుపెట్టారు.  'తెలుగువారి ఆశాకిరణం, ' చలనచిత్రాకాశంలో వెలగబోతున్న ధృవతార '  'ప్రేక్షకులందరూ ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తున్న అందగాడు ' ఇలా మీడియా ద్వారా హోరెత్తించడం మొదలైంది.  భజగోవిందం సినిమాల ఆడియో ఫంక్షన్లలో అభిమానుల చేత బభ్రాజమానం సినిమాల్లోకి రావాలి అని అరిపించేవారు.  దానికి మళ్ళీ భజగోవిందం చిరునవ్వుతో, ' మా బభ్రాజమానం ఇంకా హైస్కూల్లో చదువుకుంటున్నాడు.  సమయం వచ్చినప్పుడు తప్పకుండా సినిమాల్లోకి ప్రవేశించి మీ ఆశలు నెరవేరుస్తాడు.' అని చెప్పేవాడు.
          భజగోవిందం మొదటినించీ పకడ్బందీగా ప్లానులు వేసుకుంటూ రావడం మొదలుపెట్టాడు.  అందువల్ల బభ్రాజమానానికి చదువుకోవలసిన అవసరం లేదని తెలిసిపోయింది.  విద్య గలవాడు వింతపశువు అని వెకిలిగా నవ్వుకునేవాడు.  అతడికి డబ్బు మదం బాగా ఒంటబట్టింది గాని, చదువు అస్సలు అబ్బలేదు.  స్కూల్లో ఆకతాయిలతో కలిసి అమ్మాయిలని ఏడిపించడం, క్లాసులెగ్గొట్టి పబ్బుల చుట్టూ స్నేహితులని వెంటేసుకు తిరగడం లాంటివన్నీ చేసేవాడు.
          బభ్రాజమానానికి పదహారు సంవత్సరాలు వచ్చాయి. చిరు చిరుగా మీసాలు, గడ్డాలు మొలుచుకొస్తున్నాయి.  వాటిని సొగసుగా పెంచుకునేవాడు.  భజగోవిందం వాడి ఫొటోలు తీయించి మీడియాలో ప్రచారం చేయించేవాడు.
          ఒకసారి భజగోవిందం అతడితో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసాడు.  అందులో పత్రికా విలేఖరులందరూ ఏకకంఠంతో, ' మీరు సినిమా అరంగేట్రం ఎప్పుడు చేస్తున్నారు?' అని అడిగారు.  దానికి బభ్రాజమానం ముసి ముసి నవ్వులు నవ్వుతూ, ' నాకైతే డాక్టరు కావాలని వుంది.  నా చదువు పాడవడం నాకు ఇష్టం లేదు.  కాని నా అబిమానుల సందడి చూస్తుంటే ఏం చెయ్యాలో అర్దం కావటల్లేదు.  వాళ్ళ ఆశలు తీర్చవలసిన కర్తవ్యం కూడా నామీద వుంది కదా?  ఆలోచిద్దాం, ఏం జరుగుతుందో.' అని సమాధానం చెప్పాడు.
          ఈ ఇంటర్వ్యూ అన్ని పత్రికలలోను, అన్ని టి.వి.ఛానెల్స్ లోను ప్రముఖంగా వచ్చేలా భజగోవిందం ఏర్పాటు చేసాడు.
          అసలు బభ్రాజమానం ఒక్క సినిమాలో కూడా నటించకుండానే అతడికి అభిమానులు ఎక్కడినించి పుట్టుకొచ్చారో జనానికైతే అర్థం కాలేదు కాని అందరూ, యాక్టరు కొడుకు యాక్టరు కాక ఇంకేమవుతాడులే అని సమాధానపడ్డారు.
          భజగోవిందం బభ్రాజమానాన్ని తనంత ఛండాలపు నటుణ్ణి చేసేసి, తెలుగు చలనచిత్రసీమకి చక్రవర్తిని చేసెయ్యాలని తెగ తాపత్రయపడి పోసాగాడు.  ఆ క్రమంలో ప్రఖ్యాత రంగస్థల దర్శకుడు, నటుడు, ప్రయోక్త, అనేక పరిషత్తులలో బహుమతులు అందుకున్న మల్లన్నని వేటాడి, వెతికి, వెతికి పట్టుకున్నాడు.  మల్లన్న మంచినటుడే కాని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాడు.  రంగస్థలం మీద అతడికి ఎంత పేరున్నా, సినిమారంగం పరిస్థితి వేరు కదా?  అందులో హీరోగా అవకాశం రావాలంటే గాడ్ ఫాదర్ వుండాలి.  లేకపోతే వారసత్వంగా అన్నా రావాలి.  అవేవీ లేక ఎక్స్ ట్రా వేషాలేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు.
          సరే, భజగోవిందం మల్లన్నని ఇంటికి పిలిపించి అతడికి నెలకి ఐదువేలు ఫీజు ఇస్తానని చెప్పి బభ్రాజమానానికి ట్యూటరుగా పెట్టాడు.  మల్లన్న ఈ రకంగా అన్నా భజగోవిందం ప్రాపకం దొరికితే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయి కదా అని ఫీజు గురించి ఆలోచించకుండా ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు.
          అట్లాగే భజగోవిందం బభ్రాజమానానికి కుప్పిగంతులు, దొమ్మరి వాళ్ళ మోళీలు నేర్పడానికి కన్నయ్య అన్న వ్యక్తిని నియమించాడు.  కన్నయ్య చాలా మంచి డాన్సరు.  భరతనాట్యం, కూచిపూడి బాగావచ్చిన నృత్యాచార్యుడు.  సినిమాల్లో అవకాశాలకోసం అందరి కాళ్ళూ పట్టుకుని, అన్ని స్టూడియోల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగి, ఉపయోగంలేక, గ్రూపుడాన్సుల్లో రోజుకూలీకి వెళ్ళి ఆ కొరియోగ్రాఫర్లు చెప్పే కుప్పిగంతులన్నీ వేసి పొట్టపోసుకుంటున్నాడు.  అతడు కూడా మల్లన్న లాగే తనకీ భజగోవిందం ద్వారా మంచి అవకాశాలు రాకపోతాయా అని ఎగిరిగంతేసి, బభ్రాజమానానికి స్టెప్పులు నేర్పడానికి ఒప్పుకున్నాడు.  ఇక భజగోవిందం తన ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసాడు.  మంచి ట్రైనర్ కోసం వెతికి సుబ్బయ్య అనే అతడిని ఏర్పాటు చేసి, బభ్రాజమానానికి సిక్స్ పేక్ వచ్చేలా చెయ్యడానికి కూడా తాపత్రయపడసాగాడు.  సుబ్బయ్య సినిమాల్లో హీరో అవాలన్న తపనతో తన యావదాస్తినీ తెగనమ్మి, హైదరాబాద్ వచ్చి వేషాలకోసం సంవత్సరాల తరబడి తాపత్రయపడి, కుదరక, ఆఖరికి విలను పక్కన గూండా వేషాలు వేస్తూ సినిమారంగంలో స్థిరపడిపోయాడు.   మొత్తం మీద బభ్రాజమానం మొహం ఎంత వికారంగా, దరిద్రంగా వున్నా, రోజూ చేసే వ్యాయామాల వల్లా, తీసుకునే మందు, మాంసాల వల్లా కాస్త కండ పట్టి ముర్రాజాతి దున్నలా ఎదిగాడు.  ఇక నటన విషయానికి వస్తే, మల్లన్న ఎంత తాపత్రయపడినా బభ్రాజమానం మొహంలో భావం పలికేది కాదు.  డైలాగ్ చెప్పడమైతే సరేసరి, గాడిద ఓండ్ర పెట్టినట్లుండేది.  వాడికి సరిగ్గా ఒంట పట్టినదల్లా కుప్పిగంతులే.  నేలమీద కాలు మోపకుండా ఎగిరెగిరి గెంతేవాడు.  ఒంట్లో ఎముకలు లేనట్లు అష్టవంకరలు తిరిగేవాడు.  ఇలా కఠోరపరిశ్రమ చేస్తూ, బభ్రాజమానం పదహేడేళ్ళ వయసుకి వచ్చేసాడు.
          భజగోవిందం, ఇంక బభ్రాజమానాన్ని అచ్చోసి జనం మీదకి వదిలేసే సమయం వచ్చేసిందని నిర్ణయించుకున్నాడు. అనేక హిట్ సినిమాలకి కథ, సంభాషణలు సమకూరుస్తూ, మంచి స్థాయిలో వున్న జితేంద్ర అన్న రచయితకి కథ, సంభాషణలు సమకూర్చే బాధ్యత అప్పగించాడు.  అలాగే, ఆడవాళ్ళ అంగాంగాలను అతి నీచంగా తెరమీద చూపిస్తూ కాసులు పండించుకుంటున్న దర్శకచక్రవర్తి వీరన్నకి దర్శకత్వ బాధ్యతలని అప్పగించాడు.  ఒక మంచి ముహూర్తం చూసుకుని బభ్రాజమానం మొదటి సినిమాకి అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిపాడు.  ఆ సినిమా పేరు, ' ఆసినీ, ఏం అందమే నీది?'
          ఆ కార్యక్రమం మొత్తం అన్ని టి.వి.ఛానెల్స్ లోను పూర్తిగా లైవ్ టెలికాస్ట్ చేసారు.  సినిమా శరవేగంతో తయారవుతోంది.  అందులో భజగోవిందం ఒక అతిథి పాత్రలో కూడా కనిపించబోతున్నాడన్న వార్త అతడి అభిమానులని బాగా అలరించింది.  సినిమా ఇంకో నెలరోజుల్లో విడుదల అవుతుందనగా భారీఎత్తున ఆడియో ఫంక్షను ఏర్పాటు చేసారు.  మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోని భజగోవిందం అభిమానులందరూ వేలసంఖ్యలో తరలి వచ్చారు.  ఎప్పటిలాగే అన్ని ఛానెళ్ళవారు మొత్తం కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు.  అందరూ వరసగా మాట్లాడుతున్నారు.  చాలా సేపటి తర్వాత భజగోవిందం వేదిక మీదకు వెళ్ళి, తనని ఇంతవరకు ప్రేక్షకదేవుళ్ళందరూ ఎలా ఆదరిస్తున్నారో, అదే విధంగా తన కొడుకుని కూడా ఆదరించాలని వినమ్రంగా నమస్కరించి మరీ ప్రేక్షకులని కోరాడు.  చివరగా బభ్రాజమానం మాట్లాడడానికి వేదిక మీదకు వచ్చాడు.  వస్తూనే ప్రేక్షకులందరికీ చెయ్యి వూపుతూ అభివాదం చేసాడు.  హాలంతా ఈలలు, కేకలు, చప్పట్లతో మారుమోగిపోతోంది.  స్టేజి మీద అతడి పక్కన హీరోయిన్ గా నటించిన బెంగాలీ భామ వెకిలినీ ఛటర్జీ ఇంచుమించు ఒళ్ళంతా కనపడేలా డిజైన్ చేసిన బట్టలు ధరించి, మాటి మాటికీ నుదుటిమీద పడుతున్న జుత్తుని సవరించుకుంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ నిల్చుని వుంది.  బభ్రాజమానం వస్తూనే ఆమెని దగ్గరకి లాక్కుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.  అందరూ ఆనందంతో వెర్రెక్కి పోయారు.  తరవాత తన ప్రసంగం ప్రారంభించాడు.
 ' నా అబిమాన ప్రేక్షకులందరికీ నమస్కారం .  నేనసలు డాక్టరు కావాలని చాలా బుద్దిగా చదూకుంటన్నాను. కాని మా డాడీ, అబిమానులు మనకు దేవుల్ల ఒంటి  వారని, వారి ఆశలు, కోరికలు తీర్చడం మన మొదటి కర్తవ్యమని చెప్పేసరికి, ఇంక తప్పనిసరై కలాసేవ చెయ్యాలని, నా అభిమానులకి ఆనందాన్ని కలిగించాలని నిర్ణయించుకుని ఈ సినిమా అంగీకరించడం జరిగింది.  ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్.  నేను సినిమాల్లో నటించడానికి పచ్చజెండా ఊపగానే ఎందరో రచయితలు తమ కదలతో నాదగ్గిరకి వచ్చి క్యూ కట్టారు.  ఐతే ఒకరోజు జితేంద్ర నా దగ్గిరకి వచ్చి, ఇన్నాల్ల తన సినిమా అనుబవాన్ని రంగరించి, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తయారు చేసానని, నేను ఏమైనా ఈ సబ్జెక్ట్ అప్రూవ్ చెయ్యక తప్పదని కాళ్ళా వేళ్ళా పడ్డాడు.  సరే, సీనియర్ రచయిత కదా అని ఒకరోజు డేట్ ఇచ్చి కద చెప్పమన్నాను.  కదలో చాలా కొత్తదనం వుంది.   చాలా వెరైటీగా వుంది.  నా పాత్రని కూడా బాగా మలిచారు.  బాగుంది కదా అని వెంటనే ఒప్పేసుకున్నా.  ఈ చిత్రం మీకందరికీ నచ్చుతుందని గ్యారంటీగా చెబుతున్నా.  మళ్ళీ ఇదే వేదిక మీద ఈ సినిమా వందరోజుల పండుగ ఇంకా గనంగా జరుపుకుందాం.' అని చెప్పి మళ్ళీ అభిమానులందరికీ చెయ్యి ఊపి కూర్చున్నాడు.  పాపం మల్లన్న ఎంత తాపత్రయపడినా బభ్రాజమానానికి ఒత్తులు పలకడం రాలేదు.  పైగా ' ఏంటయ్యా, మరీ చాదస్తం పోతుండావు?  అసలు ఒత్తులు ఎందుకు పలకాలేంటి?  బావం ముక్యం గాని బాస కాదయ్యా. ఇంక నన్ను విసిగించక.' అని మల్లన్నని చీవాట్లేసాడు.  ఇంక మల్లన్న చేసేదేంలేక ఊరుకున్నాడు.
          సరే, సినిమా ఫలానా తేదీన రిలీజన్నారు.  బయ్యర్లు భజగోవిందం కొడుకు సినిమా కదా అని ఎగబడి, కోట్లు వెచ్చించి హక్కులు  కొనేసారు.  సినిమా ఒకేరోజు మొత్తం అన్ని దేశాల్లోను భారీ ఎత్తున రిలీజ్ చేసారు.  సినిమా విడుదల ఐన రెండోరోజే టి.వి.లో అన్ని ఛానెల్స్ లోను సినిమా సక్సెస్ మీట్ అని ఏర్పాటు చేసారు.  సినిమా ఘనవిజయం అయిందట.  అందుకని బభ్రాజమానంతో ఇంటర్వ్యూ అట.  బబ్రాజమానం మురిసిపోతూ, వెకిలినీ చటర్జీతో కలిసి ఇంటర్వ్యూలిచ్చాడు.  కాని నిజానికి సినిమా భయంకరంగా ఫెయిలయింది.బయ్యర్లు భారీగా నష్టపోయి, గగ్గోలు పెట్టేసారు. సినిమా మాత్రం బలవంతంగా నూరురజులు ఆడించడానికి భజగోవిందం ప్రయత్నించాడు.  కాని రెండోవారం నించే హాళ్ళన్నీ ఖాళీగా వుండడంతో పిక్చరు తీసెయ్యాల్సి వచ్చింది.
          భజగోవిందానికి ఇలాంటి ఆటుపోటులన్నీ మామూలే.  ఎన్ని సినిమాలు ఫట్టయినా, ఒక్క సినిమా హిట్టయితే చాలు, మళ్ళీ సినిమారంగంలో నిలదొక్కుకోవచ్చు అన్నది అతని ఉద్దేశ్యం.  అందుకని, ఈ సారి మళ్ళీ మరొక పకడ్బందీ కథని ఎన్నుకున్నాడు. బభ్రాజమానంలో సత్తాలేదని అర్థమయిపోయింది కనుక, సినిమాలో భారీగా తెలుగు సినిమారంగంలో వున్న కమేడియన్లందర్నీ పెట్టేసాడు.  నువ్వా, నేనా అనే కేరెక్టర్ ఆర్టిస్టుల్ని పెట్టాడు.  హోరెత్తించే మ్యూజిక్ పెట్టాడు.  ముగ్గురు వెర్రెక్కించే  హిందీ, గుజరాతీ, హాలీవుడ్ అమ్మాయిల్ని తీసుకొచ్చి, వీలైనంత అసభ్యంగా మూడు ఐటెమ్ సాంగ్స్ లో డాన్సులు చేయించాడు. ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్ లలో షూటింగ్ జరిపించాడు.  ముగ్గురు హీరోయిన్లని పెట్టాడు. ప్రేమ సన్నివేశాలలో ఎక్కువగా హీరోయిన్లకి క్లోజప్పులు పెట్టి, బభ్రాజమానాన్ని చూపించకుండా మేనేజ్ చేసాడు.
          ఆ సినిమా మొత్తం మీద ఏభయిరోజులు ఆడేసింది.  మిగిలిన ఏభయి రోజులు భజగోవిందం తన అభిమానుల సాయంతో కిందా మీదా పడి ఆడించేసాడు.  శతదినోత్సవం చాలా పెద్ద ఎత్తున జరిపించాడు.  ఆ ఫంక్షనులో బభ్రాజమానం వేదిక మీదకి రాగానే జనం చేత పొగర్ స్టార్, పొగర్ స్టార్, పొగర్ స్టార్ అని అరిపించాడు.  అంతే, అప్పటినించీ, తన సినిమా కెరీర్ కొడుక్కి వారసత్వంగా ఇచ్చినట్టుగానే, తన బిరుదు పొగర్ స్టార్ కూడా కొడుక్కి ఇచ్చేసాడు.
          ఇలా మరో రెండు సినిమాలు ఏవరేజిగా ఆడాయి.  బభ్రాజమానానికి పొగరు బాగా తలకెక్కేసింది.  తను పొగర్ స్టార్ అన్నది బాగా వంట పట్టించుకున్నాడు.
          ఇప్ప్పుడు బభ్రాజమానం ఐదో సినిమా లాంచ్ చేసారు.  బభ్రాజమానం సెట్స్ లోకి రాగానే అందరూ లేచి నుంచుని అతడికి నమస్కారాలు చెయ్యాలి.  ఎవరన్నాచెయ్యకపోతే వాడికి ఉద్వాసన చెప్పించేసే వాడు.  దర్శకుడు ఏదన్నా సలహాలివ్వడానికి వస్తే, ' ఇదుగో చూడు, నా డైలాగేమిటో నాకు తెలుసు.  నువ్వు సన్నివేశం వివరించు.  ఊరికే నసపెట్టకు.  ఇంకా ఇంకోళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను.  ఏ సన్నివేశంలో ఎలా నటించాలో నాకు బాగా తెలుసు.  నువ్వు మిగిలిన వాళ్ళ సంగతి చూసుకోవయ్యా.' అని విసుక్కునే వాడు.
          పతాకసన్నివేశం తాలూకు చిత్రీకరణ జరుగుతోంది.  అది పండకపోతే సినిమా ఫెయిలవుతుందని భజగోవిందానికి భయం పట్టుకుంది.  అందుకని గతిలేక, మల్లన్నని పిలిపిద్దామనుకున్నాడు.  ప్రొడక్షను మేనేజరుతో చెబుతే, మల్లన్న, కన్నయ్య, సుబ్బయ్య, వారందరూ ఈ సినిమాలోనే ఎక్స్ ట్రా వేషాలు వేస్తున్నారని, రోజూ షూటింగ్ కి హాజరవుతున్నారని చెప్పాడు.  వెంటనే మల్లన్నని పిలిచాడు భజగోవిందం.  ఆ సన్నివేశంలో ఎలా చెయ్యాలో మల్లన్న బభ్రాజమానానికి సూచనలిస్తున్నాడు.  పక్కనే కన్నయ్య, సుబ్బయ్య కూడా వున్నారు.  వారి అవసరం కూడా వుందని వాళ్ళని కూడా రప్పించాడు భజగోవిందం.  ఇంతలో బాయ్ ఫ్లాస్కులో కాఫీ తీసుకువచ్చాడు.  భజగోవిందానికి, బభ్రాజమానానికి కాఫీ ఇచ్చాడు.  అలాగే అక్కడే వున్నారు కదా అని మల్లన్నకి, సుబ్బయ్యకి, కన్నయ్యకి కూడా కాఫీ కప్పుల్లో పోసి ఇచ్చాడు.  బభ్రాజమానం తన చేతిలో వున్న కాఫీ బాయ్ మొహం మీదకి విసిరాడు.  ' ఇడియట్!  నీకసలు బుధ్ధి వుందా?  అడ్డమైనవాళ్ళకీ నాతో సమానంగా నా పక్కన కూర్చోబెట్టి కాఫీలిస్తావా?  ఒరేయ్ ప్రొడక్షను మేనేజరూ, ఈ రోజునించీ ఈవెధవని పనిలోంచి తీసెయ్ ' అని అరిచాడు.  తరవాత వాళ్ళకేసి తిరిగి అరిచాడు, ' ఆ వెధవకి సరే, బుధ్ధి లేదు.  మీ బుధ్ధేమైంది?  నా అంతస్తేమిటి, మీ బతుకులేమిటి?  నా పక్కన కూర్చుని కాఫీలు తాగుతారా?  మా మోచేతి నీళ్ళు తాగి బతికే కుక్కలు, మీ కళ్ళు అంత నెత్తికెక్కాయా?  గెటవుట్, యూ రాస్కెల్స్.'
          పాపం వాళ్ళు ముగ్గురూ తలలు దించుకుని అక్కడినించి బైటికి వెళిపోయారు.
          సరే, పతాకసన్నివేశం తాలూకు షూటింగ్ మొదలైంది.  అందులో బభ్రాజమానం ముగ్గురు విలన్లతో ఒకేసారి తలపడతాడు.  వాళ్ళ అనుచరులు దాదాపు పాతిక మంది అతడి మీద విరుచుకుపడితే, వాళ్ళందర్నీ మట్టి కరిపించి, తరవాత ఆ ముగ్గురిమీదకి లంఘిస్తాడు.  ముందు వాళ్ళు ముగ్గురూ అతడ్ని చితక్కొడతారు.  తరవాత అతడు పుంజుకుని వాళ్ళందర్నీ హతమారుస్తాడు. అదీ సన్నివేశం.  ముందు పాతికమంది అతడిమీద విరుచుకు పడ్డారు.  షూటింగ్ జరుగుతోంది.  కెమేరా నడుస్తోంది.  ఆ పాతికమందిలో మల్లన్న, కన్నయ్య, సుబ్బయ్య కూడా వున్నారు.  వారి వంతు రాగానే ఒక్కసారిగా బభ్రాజమానం మీద విరుచుకుపడ్డారు.
          ' ఏరా, నేను నీకు కుక్కలా కనిపిస్తున్నానురా పందీ?' అని బభ్రాజమానానికే వినిపించేలా అంటూ,  మల్లన్న అతడి డొక్కలో ఒక్క పోటు పొడిచాడు.  బభ్రాజమానం బాధగా డొక్కలో చెయ్యి పెట్టుకున్నాడు.  అది షూటింగ్ లోభాగమే అని జనం అనుకుంటున్నారు.
          తరవాత సుబ్బయ్య, ' ఏరా, నేను నీ మోచేతి కింద నీళ్ళు తాగుతున్నానురా కుక్కా!' అని మెల్లిగా అంటూ బభ్రాజమానం వీపు మీద ఒక్క పిడిగుద్దు గుద్దాడు.  మరి టైము ఇవ్వకుండా కన్నయ్య బభ్రాజమానం ముక్కుమీద పది కిలోల పంచ్ ఇచ్చాడు.  బభ్రాజమానం ముక్కు నించి ధారాపాతంగా రక్తం కారసాగింది.  అతడు స్పృహ తప్పి పడిపోయాడు.  వెంటనే షూటింగ్ ఆపేసారు. వాళ్ళు నిజంగానే కొట్టారని అర్థం చేసుకుని పోలీసుల్నిపిలిచారు.  పోలీసులు వాళ్ళని అరెస్టు చేసి తీసుకుపోయారు.
***********************************
          అదీ జరిగిన విషయం.  ఈ వార్త క్షణాల్లో మీడియాకెక్కేసింది.  అది చూసిన ప్రజలు ఆనందోత్సాహాలతో బాణసంచా కాలుస్తున్నారు.  భజగోవిందం తెల్లబోయాడు.  తన కొడుకు అంటే ప్రజల్లో ఇంత వ్యతిరేక భావన వుందా అని ఆశ్చర్యపోయాడు. ఈ గొడవ సద్దుమణగడానికి ఏం చెయ్యాలా అని ఆలోచనలో మునిగిపోయాడు.
          తరవాత ఆ ముగ్గుర్నీ పోలీసు కస్టడీ నించి బైటికి తీసుకు వచ్చి, వాళ్ళ చేత స్టేట్ మెంట్ ఇప్పించాడు.  ' బభ్రాజమానం సారంతటి పొగర్ స్టార్ ని మేము కొట్టడమేమిటి?  షూటింగ్ లో భాగంగా ఫైటింగ్ చేసాము.  ఐతే మాకు ఫైట్ మాస్టర్ సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకపోవడం వలన మేము కొట్టిన దెబ్బలు ఆయనకి కొంచెం గట్టిగా తగిలాయి.  ఆయన చాలా గొప్ప నటుడు కనక తమాయించుకున్నారు.  ఆయన కాళ్ళమీద పడి మేము క్షమాపణలు చెప్పుకున్నాము.  వారు పెద్దమనసుతో మమ్మల్ని క్షమించేసారు.'
          తరవాత బభ్రాజమానం స్టేట్ మెంటిచ్చాడు.  షూటింగుల్లోఇలాంటివి మామూలే.  అమితాభ్ బచ్చన్ అంతటి మహానటుడే కూలీ సినిమా షూటింగ్ లో ప్రాణాపాయానికి గురి అయ్యారు.  ఒక్కోసారి అలా జరుగుతూ వుంటాయి.  కల నా జీవితం.  కల నా ప్రాణం.  అందుకని ఇలాంటి చిన్న చిన్న సంగటనలకి నేను కుంగి పోను.  నేను కలకే పూర్తిగా అంకితమైపోయిన నటుణ్ణి.  నా అబిమానులందరూ ఇది అర్దం చేసుకుని, ఈ సినిమాని విజయవంతం చెయ్యాల్సిందిగా కోరుతున్నాను.'
 ***********************
          అలా బభ్రాజమానం కూడా సినిమారంగంలో స్థిరపడిపోయాడు.  ఇప్పుడు భజగోవిందం తన రెండోకొడుకుని హీరోగా చెయ్యడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.  కొద్దిరోజుల్లోనే మనం అతడిని కూడా వెండితెర మీద చూడబోతామన్న మాట!
                                                                                           జై, తెలుగు సినిమాకీ జై!
***************************

No comments:

Post a Comment

Pages