ఋతువులు - అచ్చంగా తెలుగు

ఋతువులు

Share This

ఋతువులు 

మంతెన ఝాన్సీ 


ఎండా,   వానా,   చలి  మూడు కాలాలోను మనిషికి విసుగే.  ఏది ఎక్కువైనా భరించ లేడు.   కాని మనసు పెట్టి చూస్తే  అన్ని వేళలా ప్రకృతి అందంగానే ఉంటుంది.  తేడా అల్లా మనిషి  మనసులోనే;;
౧. ఋతువు రాణి ఆమనేతెంచి జవమిచ్చె.
పూల జాతర గని పుడమి నవ్వె
మావి చిగురు మెక్కి మత్తెక్కి కోకిల
మధుర గాన మందు మనల ముంచె
౨. ఆరు రుచులు చూపె ఆగమన ముగాది
తీపి పులుపు కార ముప్పు వగరు
చేదు లుగను, చూడ  చింతయు, సంతసం
తిరుగు జీవ చక్రపు తీరు తెన్ను
౩. చెలుడు నవ్వె మురిసి చెలియ సొగసు గాంచి
లేత యెండ హాయి జూతు మిపుడె
హోళి కేళి నెగయు హొయలు మీరంగ
రంగు రంగు పూలు రమ్య ముగను
౪. గ్రీష్మ తాప మనుచు గ్రీవమదిరె నంచు
చేవ బోయె నంచు చిటపటంచు
చెదిరి పోవు మనిషి, మది నిల్పి చూడగా
ఎండ నైన దేవు డిడెను సొగసు
౫. మల్లె జాజి మంచి మామిడి ఫలములు
తనువు చల్ల బడగ తాటి ముంజ
సంధ్య వేళ వీచు చల్లని గాలులు
కలుగు హాయి నీట జలక మాడ
౬. తొలక రించె జల్లు పులకరించె తనువు
మొదటి వాన యందె మోజు తీరె
వానలెక్కు వాయె వాగులుప్పోంగగా
దారి బురద గనిన తగని  రోత
౭. విసుగు చెంద వలదు వీధి బురద జూచి
వాన దైవ మిచ్చు వరము గాద
రైతు కనుల నీరు రాదింక వానున్న
బువ్వ లోటు కాదు భువిని జనుల
౭.  శార దందు జూడు సరి లేని వెన్నెల
మదిని హాయి గొలుపు మంచు తెరలు
అమ్మ పూజ లందు కమ్మ దనము
గౌరి నోము లోని గరిమ గనుము
౮. శీత గాలి వీచె శిశిర హేమంతాన
చీదర పడి వణికి చింత పడుచు
మంచు కాల మొచ్చె మనసు నిలివదెందు
ఆకు రాలు నంచు సాకులొద్దు
౯. ఎరుపు పసుపు బంతి  యెన్నగా చామంతి
వన్నె వన్నె విరులు వరుస బూయ
హెచ్చు వనపు శొభ హేమంత సౌరభం
మత్తు గొలుపు హాయి  మనసు కిచ్చు
౧౦. వచ్చు సంకురాత్రి తెచ్చు నెన్నొ సిరులు
భోగొమంటలేయు భోగ మెంతొ
గంగిరెద్దులాడు ఘనముగ ముంగిట
సంత సంబు గాదె యంత రాన
౧౧. కర్షకునికి పంట కలిమి దెచ్చు నిపుడె
ఎండ విలువ తెలియు నెంచ గాను
భాను దేవునీవు  బాగుగా బూజించు
శుభము కలుగు నీకు సుఖము దొరుకు
౧౨. ఎండ లోనె దెలియు కొండ గాలి విలువ
వాన వచ్చినపుడె మనసు చెమ్మ
వయసు గురుతు దెచ్చు వసంత కాలము
చంద్ర  సొగసు గనుము శారదందు
౧౩. హేల జేయు గాద హేమంత చేమంతి
వడిని జేర్చి పెంచు వనము నిన్ను
ఆకు రాల నేమి ఆమని వచ్చుగా
కాల మేది గాని కలత వలదు
 *****

No comments:

Post a Comment

Pages