వారానికో రోజు సేవకు - అచ్చంగా తెలుగు

వారానికో రోజు సేవకు

Share This

వారానికో రోజు సేవకు


మన చుట్టూ ఉన్న ఎంతో మందితో పోలిస్తే, దైవం మనకు వాళ్ళకంటే మెరుగైనవి ఎన్నో ఇచ్చారని గమనిస్తాము. సిరివెన్నెల గారు ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే గీతంలో చెప్పినట్లు ‘దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా ?’ అన్న వాక్యం తలచుకుంటే... మనకు దైవం ఇచ్చిన సంపదలతో పాటు, ఏ అనారోగ్యము లేని దేహం కూడా ఒక గొప్ప పేన్నిధేనని తెలుస్తుంది.  మరి దైవం నుంచి ఇన్ని వరాల్ని, సమాజం నుంచి ఎన్నో లాభాల్ని పొందిన మనం, తిరిగి ఆ సమాజానికి ఎంతో కొంత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా.
వారానికి ఒక్క రోజైనా, మన ఇష్టదైవాన్ని కొలిచేందుకు ఆలయానికి వెళ్తూ ఉంటాము కదా. అలాగే వారానికి ఒకరోజు మనం సేవకు, దానానికి కేటాయించాలి. ఆర్తులు, దానం ఆశించేవారు, మనల్ని వెతుక్కుంటూ రారు. మనమే మన చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనించాలి. ఎక్కడ సేవ చేసే అవకాశం ఉంటే, అక్కడకు వెళ్లి, అవసరాన్ని బట్టి సహకరించాలి.
‘తిండి లేనివారికి తిండి, బట్ట లేనివారికి బట్ట ఇవ్వు,  దైవం ఎంతో సంతోషిస్తారు’ అన్నారు షిర్డీ సాయి.  ‘ప్రార్ధించే పెదవుల కంటే, సహాయం చేసే చేతులే మిన్న’ అన్నారు సత్యసాయి బాబా గారు. ‘ఉన్నవాడికి ఏమిటయ్యా పెట్టేది, లేనివాడికి పెట్టండి, అప్పుడే దైవం ఆనందిస్తారు,’ అన్నారు అవధూత వెంకయ్య స్వామి. ‘సమాజం నుంచి లాభాన్ని పొంది, చదువుకుని, ఉద్యోగస్తులై, తిరిగి ఆ సమాజానికి ఏమీ ఇవ్వనివారు దేశ ద్రోహులు అవుతారు’ అన్నారు స్వామీ వివేకానంద.
‘మానవాళి శ్రేయస్సు కోసం నిరంతరం ప్రార్ధించే పెదవులు, సాయం చేసే చేతులు రెండూ పవిత్రమైనవే. దాతలు గ్రహీతల పట్ల వినమ్ర భావంతో, నేరుగా ఆ దైవానికే ఇస్తున్నట్లుగా దానం చేస్తూ, మనం ఇచ్చినది తీసుకున్నందుకు వారికి కృతఙ్ఞతలు చెప్పాలి.’ అంటారు మా పూజ్య గురుదేవులు వి.వి.శ్రీధర్ గురూజీ. ‘దానం చెయ్యడానికి కావలసింది, బోలెడంత డబ్బు కాదు, ఇవ్వాలన్న మనసు’ అని కూడా వారు చెప్పారు.
ఏ సద్గురువులు చెప్పినా, అవధూతలు చెప్పినా, ఉన్నంతలో సొంతలాభం కొంత మాని, దానం చెయ్యమనే. వారానికి ఒకరోజు కాస్త ప్రసాదం స్వయంగా వండి పంచడం, చాక్లెట్ లు, బిస్కెట్ లు పంచడం ఎవరైనా తేలిగ్గా చెయ్యవచ్చు. ఇదొక తప్పనిసరి కార్యక్రమంగా మొదలుపెట్టాలి. అనాధ పిల్లలతో, వృద్ధులతో కాస్త సమయం గడపాలి. ఎంతో విలాసవంతమైన జీవితం గడిపే కొంతమంది నటులు, కళాకారులు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మనం చూస్తూ ఉంటాము. మనం కూడా నిండు మనసుతో ఆలోచిస్తే, ఈ దిశగా ఒక్క అడుగు వేసే ప్రయత్నం చేస్తే, తప్పకుండా త్వరలోనే సఫలీకృతులం కాగలం. ఉన్నంతలో నవ్వులు పంచే ప్రయత్నం ఈ రోజు నుంచే ప్రారంభిద్దాము.
హరివిల్లు వర్ణాల వంటి ఏడు కధలతో, అనేక ఆధ్యాత్మిక అంశాలు, ప్రత్యేక వ్యాసాలతో, దారావాహికలతో వచ్చిన ఈ సంచిక ఎప్పటిలాగే మిమ్మల్ని అలరిస్తుందని భావిస్తున్నాము. మీ దీవెనలను కామెంట్స్ రూపంలో అందిస్తారు కదూ.
మీ అభిమాన బలమే మాకు కొండంత అండ.
కృతజ్ఞాతభివందనాలతో...
మీ
భావరాజు పద్మిని.

No comments:

Post a Comment

Pages