విలువలు
మంథా భానుమతి
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లల గదుల్లోకి వెళ్ళి పుస్తకాలు, చిందరవందరగా పడేసిన బట్టలు సర్ది.. కప్పుకున్న దుప్పట్లు సరి చేసి, హాయిగా పడుక్కున్న వాళ్ళ ముద్దుమొహాలు కాసేపు చూసి హాల్లోకి వచ్చింది వసంత.
ఏంటో.. పిల్లలు పడుక్కున్నప్పుడు మరీ ముద్దొస్తారు. రాత్రి పది దాటింది. ప్రశాంత్ సోఫాలో అడ్డంగా పడుక్కుని ఏదో నవల చదువుకుంటున్నాడు.
టివీ రిమోట్ అందుకుని నొక్కి సౌండ్ బాగా తగ్గించింది.
“కాలం మారిపోతోంది.. విలువలు మారిపోతున్నాయి!” టివి లో ఏదో ఛానల్ లో పండితుడు ప్రవచనం చెప్తున్నాడు. వసంత కెప్పుడూ అర్ధం కానిదక్కడే.
“కాలం మారిపోవడమేంటి? అవే ఋతువులు. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారుతూనే ఉన్నాయి.. కరవు కాటకాలు అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి. అతివృష్టి, వరదలు ఎప్పుడూ ఉన్నాయి. విలువలంటే.. విలువలకి కొలమానం ఏమిటి?” వసంత ప్రకాశంగా అంది.
“మారేది నెలలూ సంవత్సరాలూ కాదోయ్! కాలం ముందుకెళ్తుంటే, కొత్త కొత్త మార్పుల వల్ల జీవన విధానాలు, జీవితం పట్ల దృక్పధాలు మారడం. త్రేతా యుగానికీ, ద్వాపర యుగానికీ మార్పు లేదూ? ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంటే మార్పు మరింత త్వరగా వస్తోంది.” ప్రశాంత్ తనకి తోచింది వివరించాడు.
“అది కాదు నా ఉద్దేశ్యం..ఋతువులు మారనట్లే, మనుషులు, వారి మనస్తత్వాలూ ఏ మాత్రం మారడం లేదు. రాజ్యాల కోసం యుద్ధాలు, కుల మత సంఘర్షణలు, ఆడవారిమీది అనుమానాలు, అవమానాలు, మాన భంగాలూ.. ఏవి మారాయి? ఇద్దరు మగవాళ్ళు దెబ్బలాడుకుంటే వాళ్ళ ఆడవాళ్ళని తీసుకొస్తారు పగ తీర్చుకోడానికి. ఏం చేస్తాం?” టి.వీ ఛానళ్ళు తిప్పుతూ అంది.
“ఏదైనా ఆహ్లాదమైన పుస్తకం చదవడమో, మంచి మంచి పాటలు వినడమో చేస్తుండాలోయ్.. ఆ టివీ చూడకుండా.” ప్రశాంత్ ఉచిత సలహా పడేస్తుంటాడు. చర్చ మరీ తీవ్రమైపోతుంటే.
రాజస్థాన్ లో బాల్యవివాహాల గురించి వస్తున్న వార్తా విశేషాలు చూస్తూ అదే అనుకుంది వసంత, తను కూడా.
అలసిపోయిన శరీరాన్ని మంచం మీదికి చేరేసి, కళ్లు మూసుకుంది.
“చిన్న చిన్న పాపలు.. వాళ్ళని పెద్ద పెద్ద కోరమీసాలున్న, ఎర్రటి కళ్ళతో భయంకరంగా చూస్తూ, పర్వతాల్లాంటి మనుషులు బలవంతంగా తీసుకెళ్ళి పెళ్ళి చేస్తున్నారు. కొంత మంది పిల్లలు నవ్వుతూ, సంతోషంగా ఉన్నారు. కొంతమంది గొంతు కక్కటిల్లేట్లు ఏడుస్తున్నారు.” గొంతు తడారిపోగా వసంత ఉలిక్కిపడి లేచింది. ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. అందులో తన పాప ఉందా? ఎదురుగా డిజిటల్ గోడ గడియారం నాలుగు చూపిస్తోంది.
……….
ఒకానొక ఆధునిక మహానగరంలో.. ఒక ప్రదేశం.
ఎత్తైన ప్రాకారాలు.. గోడలకు తాపడం చేసిన గాజు పెంకులు పున్నమి వెన్నెలలో తళుక్కుమంటున్నాయి. వాటి నానుకుని పొడవాటి చెట్లు.. అక్కడక్కడ తీరుగా పెంచిన పచ్చగడ్డి. మధ్యలో వరుసగా కట్టిన బహుళంతస్థుల భవన సముదాయాలు.. గేటెడ్ కమ్యూనిటీ! అందులో ఒక భవనంలోని ఐదో అంతస్థులో మూడు గదుల ఇల్లు. అప్పుడప్పుడే లేచి సన్నగా కూతపడుతున్న పిట్టల ధ్వనులు తప్ప అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. గాఢనిద్రలో ఉన్నారు అన్ని భవనాల్లోని జనాలూ!
భయంకరమైన కలతో ఉలిక్కిపడి లేచిన వసంతకి.. “ఢాం..” అంటూ పెద్ద చప్పుడు, సన్నగా ఏడుపు.. ఒక్కసారిగా వినిపించాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందేమో ధ్వని పది రెట్లు పెరిగింది. ఆదివారం ఐనా కాసేపు కంటినిండా నిద్ర పోనియ్యరు. తెల్లారకుండానే మొదలెట్టేశారా?
కప్పుకున్న దుప్పటి విసురుగా పక్కకి తప్పించి మంచం దిగబోయింది. పక్కనే పడుక్కున ప్రశాంత్.. అలికిడికి కదిలాడు.
“హేవిటోయ్.. పొద్దున్నే. ఇవేళ సెలవే..” సగం నిద్రలో గొణుగుతూ భార్య నైటీ పట్టుకుని లాగాడు. నైటీని నెమ్మదిగా విడిపించుకుని మంచం దిగింది వసంత, వెనువెంటే వినిపిస్తున్న గుర్రుని అసూయతో గమనించింది.
“అదృష్టవంతుడు.. ఆరైతే కానీ ఆరు నూరైనా లేవడు. ఏ చప్పుళ్లూ వినిపించవు.” సణుక్కుంటూ లేచి హాల్లోకి నడిచింది. ఎదురుగా ఉన్న ఆనంద్ గదిలో చీకటి.. నిశ్శబ్దం. అంటే.. అన్నా చెల్లెళ్ల దెబ్బలాటలు కాదు.. మరేమయింది? వసంతకి చికాకొచ్చింది. రాత్రి రెండింటి వరకూ నిద్ర పట్టలేదేమో.. కళ్లు మండిపోతున్నాయి.
మళ్లీ వెక్కిళ్లు.. ఏడుపు ఆపుకుంటున్నట్లు తెలుస్తోంది. అటూ ఇటూ చూసింది.. ఇంకెక్కడా.. పక్కనున్న కూతురి గదిలోంచే.
“ఏవయిందే? పీడకలొచ్చిందా? నే పక్కన పడుక్కుంటాలే.. జరుగు.” గోడ కేసి తలతిప్పి, వెక్కుతూనే పక్కకి జరిగింది ఎనిమిదేళ్ళ అదితి. కూతురి భుజం మీద చెయ్యేసి, వెంటనే నిద్రలోకి జారుకుంది వసంత.
“ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనూ? అమ్మా వాళ్ళింటికొచ్చేశావా? అంత తొందరపాటు పనికి రాదే.. కనీసం వెళ్ళే ముందైనా నా దగ్గరకొచ్చి మాట్లాడచ్చు కదా?” చెవిలో ఫోన్ పెట్టకుని, అది పడిపోకుండా భుజం మీద తల పక్కకి ఆన్చి, ఒక చేత్తో దోశలు వేస్తూ, ఇంకో చేత్తో, పళ్ళాలు సర్దుతూ అష్టావధానం చేస్తోంది వసంత వంటింట్లో.
“అదికాదు అనూ! పెళ్ళంటే దానికొక వాల్యూ.. అదే.. విలువ, ఉంటుంది కదా? ప్రతీ విషయానికీ కోపం తెచ్చుకో కూడదు. నీకు చిన్నప్పట్నుంచీ కాస్తంత..”
“.......”
“సరే. సరే.. నిన్నేమీ అనట్లేదే బాబూ? ఒప్పుకున్నాను. అతను నిన్ను అర్ధం చేసుకోడు. కానీ.. పెళ్ళయి ఇంకా ఏడాదవలేదు. ఇద్దరూ కాస్తంత సమయం తీసుకోవాలి కద! పోనీ కౌన్సిలర్ దగ్గరకి వెళ్ళండి. పెళ్ళంటే అల్లాటప్పా వ్యవహారంకాదు. ముందు నువ్వు అతనికిష్టమైనట్లు నడుచుకుని చూడు. మరీ జడపదార్ధమైతే చెప్పలేను కానీ..”
“.......”
“మీ అత్తగారి మాటే చెల్లాలా? చెల్లించి చూడు.. కొన్నాళ్ళు. ప్రేమకీ, పొగడ్తకీ, వినయానికీ లొంగనివాళ్ళుండరు ఎక్కడైనా.. ఆ దేముడ్ని కూడా పొగుడ్తూనే ఉంటాం కదా! ఏదేమైనా తొందరపడ్డావే అనూ.. ఇప్పటికైనా మించి పోయింది లేదు. నేనూ మీ బావా వెళ్ళి మాట్లాడ్తాం మీ అత్తారితో. పెళ్ళయ్యాక అత్తారింట్లో మొగుడు దగ్గరుంటేనే గౌరవం.”
“........”
“నిజమేలే.. కోపం తెచ్చుకోకు! అంత భరించలేకపోతే చేసేదేం లేదు. మళ్ళీ జీవితం ఒక గాడిలో పడ్డానికి ఎన్నేళ్ళు పడుతుందో చెప్పలేం. తరువాత మాట్లాడుకుందాం. ఒకసారి ఇక్కడికిరారాదూ? ఉంటా.. దోశలు మాడిపోతున్నాయి.”
“అమ్మా! పిన్నేనా? అత్తారింటినుంచి వచ్చేసిందా? నేనోటి అడగచ్చా?” అక్కడే కూర్చుని పొల్లుపోకుండా సంభాషణంతా వింటున్న అదితి, తనకెంతో ఇష్టమైన రోస్టెడ్ దోశ ముట్టుకోకుండా.. ఏదో తీవ్రమైన ఆలోచనతో ఉన్నట్లు మొహం పెట్టి అడిగింది.
“తర్వాత అడగచ్చు, ముదురు మాటలూ నువ్వూనూ.. ముందు దోశ తిను. తొమ్మిదింటికి సంగీతం క్లాసుకెళ్ళాలి.” గాస్ గట్టుకేసి తిరిగి పిల్లలిద్దరికీ బూస్ట్, తమకి కాఫీ కలుపుతూ, ఇంకో పొయ్యి మీద దోశలు వేస్తూ, “ఇంకా ఎంతసేపు.. ఆ లాప్టాప్ ఆపి ఇట్రా.” పన్నెండేళ్ళ ఆనంద్ ని ఓ కేక పెట్టింది వసంత.
“వచ్చేశా..” చెవుల్లో ఐపాడ్ తీగలు వేళ్ళాడుతూ వచ్చాడు ఆనంద్. వస్తూనే చెల్లెలి నెత్తి మీద ఒక్కటేశాడు. మౌనంగా.. పట్టించుకోనట్లున్న అదితిని వింతగా చూశాడు. మామూలుగా ఐతే సివంగిలా మీద పడాలి. భుజాలెగరేసి, దోశ మీద పడ్డాడు.
“యమ్మీ.. మమ్మీ.. నాకు ఆరు దోశలు కావాలి.” పక్కనున్న పచ్చడి సగం గిన్నె వంపుకుని కేక పెట్టాడు.
“నువ్వు చెవుల్లో అవన్నీ దోపుకుని పొలికేకలు పెట్టక్కర్లేదు. నీకు మీ నాన్నకీ కలిపి పద్నాలుగు దోశలు పెట్టా ఇందులో.. నీ ఇష్టం.” వసంత హాట్ పాక్ చూపిస్తూ, తన పళ్ళెం, కాఫీ కప్పు తెచ్చుకుని బల్ల దగ్గరికి వచ్చి కూర్చుంది.
అంతలో జాగింగ్ సూట్ లో ప్రశాంత్ వచ్చాడు, హాల్లోకి.
“ఐదే నిముషాల్లో వచ్చేస్తా..” రెండంగల్లో బాత్రూంలో దూరాడు.
అదితి, పళ్ళెంలో పక్కనే ఉన్న కొబ్బరి పచ్చడి వదిలేసి, దోశని రెండు చేతుల్తో పట్టుకుని పరపరా నమిలి తిన్నాననిపించింది.
“అదేవే.. పచ్చడంతా అలా కెలికేశావు? నీకెంతో ఇష్టం కదా అని పొద్దున్నే పడి పడీ చేస్తే పడెయ్యడానికా.. ఆనంద్! ఎంతసేపురా.. మీ నాన్నని పిలు! మళ్ళీ చల్లారిపోతే గెంతులేస్తారు.”
ఆనంద్ మళ్ళీ భుజాలెగరేసి బాత్రూం కేసి చూశాడు.
“అందరూ ఏదో మాలోకంలో ఉంటారు. ఇంట్లో నేనొక్కదాన్నే అన్ని అవయవాలు సవ్యంగా ఉపయోగించే దాన్ని..” వసంత గొణుక్కుంటూ లేచి వంటిల్లు సర్ది, తయారయి వచ్చింది.
సోఫాలో కూర్చుని ఎదురు చూస్తున్న అదితి యాంత్రికంగా లేచి తల్లి వెంట నడిచింది.
ప్రశాంత్ తల తుడుచుకుంటా బాత్రూంలోంచి వచ్చాడు.
“మేం గంటలో వస్తాం. ఆనంద్ చేత హోం వర్క్ చేయించు ప్రశాంత్. ఇద్దరూ కలిసి వీడియో గేములు ఆడుతూ కూర్చుంటే.. ఇవేళ నో స్పెషల్స్. చారు అన్నవే..” గట్టిగా వార్నింగ్ ఇచ్చి బైట పడింది వసంత.
“ప్రశాంత్! మధ్యాన్నం ఏం ప్రోగ్రాం వెయ్యకు. ‘అను’ ఏవో ప్రాబ్లంస్ తో అమ్మా వాళ్ళింటికి వచ్చేసింది. మనం సాయంత్రం వెళ్ళి దాంతో మాట్లాడాలి.” వెనక్కి వెళ్ళి హెచ్చరించి, కళ్ళు పెద్దవి చేసి అక్కడే నిల్చుని చూస్తున్న కూతురి రెక్క పట్టుకుని లాక్కెళ్ళింది.
సంగీతం పాఠానికెళ్తున్నప్పుడు కూడా అదితి ఆలోచిస్తూనే ఉంది. సాధారణంగా అరగంట పైగా పట్టే కారు ప్రయాణంలో, కిందటి వారం నేర్చుకున్న పాఠం సాధన చేస్తుంటుంది. చక్కని కంఠం, లయ, శృతి జ్ఞానం ఉన్న కూతుర్ని, ఎన్ని పనులున్నా తనే డ్రైవ్ చేస్తూ, క్రమం తప్పకుండా ప్రతీ ఆదివారం తీసుకెళ్తుంది వసంత.
“ఏమయిందిరా అదితులూ! సైలెంట్ గా ఉన్నావు? ఒక పాట పాడు?”
“అమ్మా! నేనొకటి అడగనా?”
“అడుగు తల్లీ.. దానికి పర్మిషన్ కావాలా?” ఉన్నట్లుండి కారుకి అడ్డం పడ బోయిన ఆటోని తప్పిస్తూ అంది వసంత.
“పెళ్ళయ్యాక అమ్మాయి అత్తగారింటికెళ్లి పోవాలి కదమ్మా? అక్కడే ఉండి పోవాలి కదా అమ్మా నాన్నలని వదలి ఉండడం కష్టమైనా కూడా?”
పక్కకి తిరిగి ఆశ్చర్యంగా చూసింది వసంత. ఈ టివి సీరయళ్లేవైనా చూస్తోందా.. పెద్ద పెద్ద మాటలూ ఇదీ.. చటుక్కున గుర్తుకొచ్చింది, ఫోన్లో తన చెల్లెలితో మాట్లాడిన మాటలు విందని.
“అవునూ.. ఎందుకడుగుతున్నావు? నిన్నట్నుంచీ ఏదోలా ఉన్నావు.. జ్వరం వచ్చిందా?” ఎడం చెయ్యి చాపి, కూతురి మెడ మీద వేసి చూసింది. చల్లగానే ఉంది.
“ముందు చెప్పమ్మా! బాలికా వధులో ఆ అమ్మాయి వెళ్ళింది కదా! అన్ని సినిమాల్లో పెళ్ళవగానే హజ్బెండ్ తీసుకు పోతాడు కదూ? ఇందాకా పిన్నికి కూడా నువ్వు అదే చెప్తున్నావు కదా?”
“నిజమే. పెళ్ళయ్యాక అత్తగారింట్లోనే ఉండాలి. హజ్బెండ్ ఎక్కడుంటే అక్కడుండాలి. మరీ కష్టమైతే తప్ప. ఇప్పుడు నీకదంతా ఎందుకు? కిందటివారం చెప్పిన వర్ణం ప్రాక్టీస్ చేసావా? ఇప్పుడు పాడు..”
అదితి పలక్కుండా కిటికీలోంచి బైటికి చూస్తూ కూర్చుంది. ట్రాఫిక్ కూడా ఉన్నట్లుండి పెరిగిపోయింది. వసంత డ్రైవింగ్ మీద దృష్టి పెట్టింది. అయినా ఏదో ఓ మూల భయం వేస్తోంది. అన్నతో మొన్న పెద్ద దెబ్బలాట పెట్టుకుంది. అందుకని ఇలా మాట్లాడుతోందా? ఇప్పుడు పెళ్లి చెయ్యమని కూర్చోదు కదా! తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. అమాయకంగా.. ప్రపంచం భారం అంతా తనే మోస్తున్నట్లు విచారంగా కూర్చున్న కూతుర్ని చూస్తుంటే ముద్దొచ్చింది. చెయ్యి చాపి తల నిమిరింది. గుండె ఒక్క క్షణం పక్కకి కదిలినట్లనిపించింది.
అదితి క్షణంలో సగం సేపు అమ్మ కేసి చూసి తల తిప్పుకుంది.
“ఏంటబ్బా.. ఆ చిన్ని మనసులో తిరిగే భావాలు.. అంత దిగులు దేనికో!” ఆనంద్ తరువాత అమ్మాయే కావాలని ఎన్నో మొక్కులు మొక్కుతే.. ఏ దేవుడి కరుణో.. చక్కని పాప వచ్చింది నట్టింట్లోకి. ఆ మాటంటే ప్రశాంత్ ఒప్పుకోడు. అంతా దేవుడి మహిమేనా.. నా రోల్ ఏమీ లేదా అని అలుగుతాడు.
కిసుక్కుని పైకే నవ్వింది వసంత. ప్రశాంత్ కూడా చిన్న పిల్లాడిలాగే ప్రవర్తిస్తాడు. తను ముగ్గుర్ని కంట్రోల్ చెయ్యాలి.. ఐతే.. అందులోనే ఎంతో ఆనందం. ప్రశాంత్ కి ఎప్పుడూ కోపం రాదు. ఏ సమస్య అయినా.. చిరునవ్వుతో పరిష్కరిస్తాడు.
“అలిసిపోయావా కన్నా!” అంటూ సోఫాలో ఉసూరుమంటూ కూర్చున్న వసంత నుదుటి మీద చల్లని చేత్తో నెమ్మదిగా వత్తుతాడు. వెంటనే వసంత చికాకు మాయం.
ఆలోచనల్లో పడి.. సంగీతం టీచర్ గారి వీధి దాట బోయింది.. నయం. అదితి అయినా చెప్పచ్చు కదా! వీధిలోకి తిరిగి, టీచర్ ఇంటి దగ్గర కారాపింది. అదితి పుస్తకం తీసుకుని, నెమ్మదిగా తలుపు తీసుకుని దిగింది.
చాలా తేడాగా ఉంది పిల్ల. ఇంటికి వెళ్ళగానే సంగతి కనుక్కోవాలి.
అప్పుడు వసంత ఊహించలేదు.. తను కనుక్కోడానికి ముందే అదితి షాకిస్తుందని.
“అదితీ! అన్నానికి రా.. నీకిష్టమైన అరటికాయ వేపుడు, సాంబారు..”
వసంత పళ్ళాలు సర్ది పిలిచింది. ఆనంద్, ప్రశాంత్ వచ్చి మొదలు పెట్టేసారు కూడా. అదితి అలికిడి లేదెక్కడా. గది లోకెళ్ళి చూసింది. ఫోన్ లో సీరియస్ గా మాట్లాడుతోంది.
“ఎందుక్కుదరదు వినీత్? మీ పేరెంట్స్ కి చెప్పు. నేను కూడా ఇవేళే చెప్తా. ఇంక ఆగడం నా వల్ల కాదు. లైట్ తీసుకో కూడదు మనం.”
వసంతని చూసి ఆపేసింది.
“ఏమైందే? ఏమిటీ లైట్ తీసుకోడం? రెండ్రోజుల్నుంచీ ఎందుకు ఏదోలా ఉంటున్నావు? పద.. అన్నం తిన్నాక నాలుగు తగిలిస్తే ఆ లైట్ ఏంటో బైటికొస్తుంది.” వసంతకి ఇంక ఓపిక నశించింది. బ్రతిమాలినా లేదు.. గట్టిగా అడిగినా లేదు, తనకి ఇష్టమైనవి ప్రామిస్ చేసినా లేదు.. మౌనం, లేదా భారీ డైలాగులు.
ప్రతీ ఆదివారం లాగే నలుగురూ హాల్లో కూర్చున్నారు. స్క్రాబుల్ బోర్డ్ తీసి సర్దుతున్నాడు ఆనంద్. “డాడీ! నాకు పెళ్ళయి పోయింది. అత్తగారింట్లో దింపెయ్యి.”
స్క్రాబుల్ బిళ్ళల శబ్దం మాత్రమే వినిపిస్తున్న హాల్లో ఖంగుమని మోగింది అదితి కంఠం. చెల్లెల్ని ప్రతీ దానికీ ఆట పట్టించే ఆనంద్ తో సహా అందరూ నోళ్లు వెళ్ళబెట్టి చూశారు.
వసంత మొహం ఎర్రగా ఐపోయింది. ఎవరైనా బలవంతంగా తన చిన్నారి పాపని, తమకి తెలియకుండా తీసుకెళ్ళి పెళ్లి చేశారా? లేకపోతే ఎనిమిదేళ్ల పిల్ల ఈ మాటలేంటి?
“ఏం మాటలే అవీ?” “ఆర్ యు మాడ్” “నా బంగారం.. ఏమైందిరా?” ముగ్గురూ ఒకే సారి గట్టిగా అరిచారు.
ప్రశాంత్ కూతుర్ని ఒళ్లో కూర్చో పెట్టుకుని నెమ్మదిగా బాబ్డ్ హెయిర్ లోకి వేళ్లు జొనిపి తల మీద రాస్తూ అడిగాడు, “ఎమైంది కన్నా?” అదితి భోరుమంది. మెళ్లోనుంచి మంగళ సూత్రాలు తీసి చూపించింది. గాజుల కొట్లో దొరికే ఇమిటేషన్ గొలుసు.. సూత్రాలతో.
“ఓహ్.. ఇందుకేనా ఇవేళ పొద్దున్న తలంటుతానంటే వద్దన్నావు.. ఎవరేవిటి పెళ్లి కొడుకు..” వసంత గొంతులో హేళన, కోపం మిళితం..
“వినీత్..” తల్లి మాటలు పట్టించుకోకుండా గంభీరంగా అంది అదితి.
కూతురి మొహం చూస్తుంటే ముద్దొచ్చింది ప్రశాంత్ కి. గట్టిగా హత్తుకుని, వీపు మీద రాస్తూ ఓదార్చ సాగాడు.
“అలాగే అత్తారింట్లో దింపుతా.. అసలేమయిందో చెప్పు నాన్నా..”
“నే చెప్తా డాడీ!” అప్పటివరకూ అంతా గమనిస్తున్న ఆనంద్ నోరు విప్పాడు. కుతూహలంగా చూశారు వసంత, ప్రశాంత్.
“మొన్న ఫ్రైడే మా స్కూల్లో ‘వేల్యూస్’ అని ఒక ఫంక్షన్ చేశారు కదా.. మీరు ఆఫీస్ లో లేట్ అవుతుందనీ, మమ్మీ అమ్మమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలనీ రాలేదు. అప్పుడు, హ్యూమన్ వేల్యూస్, మేరేజ్ వేల్యూస్, ఫామిలీ వేల్యూస్ అంటూ స్పీచెస్ ఇచ్చారు. అన్ని రకాల మేరేజెస్ స్టేజ్ మీద చేసి చూపించారు. పంజాబీ, గుజరాతీ, తెలుగు, కేరళ, క్రిస్టియన్, ముస్లిం ఎట్సెట్ర. అందర్నీ బాగా డెకొరేట్ చేశారు. అచ్చం నిజం పెళ్లి లాగే! చెల్లికి తెలుగు పెళ్లికూతురు వేషం, వినీత్ కి పెళ్లికొడుకు వేషం వేశారు. సునీల్గాడు ప్రీస్ట్. పేపర్లో ఫొటోలుకూడా వచ్చాయి. మీకు చూపించా కదా! అది నిజం పెళ్ళనుకుంటోందేమో చెల్లి.”
వసంతకి నవ్వాగలేదు. ప్రశాంత్ వారిస్తూ చూశాడు. నవ్వాపుకుంటూ వంటింట్లోకెళ్లింది వసంత.
ప్రశాంత్, కూతుర్ని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టి, చేతులు పట్టుకుని, నెమ్మదిగా రాస్తూ వివరించ సాగాడు..
“చూడు తల్లీ.. అదంతా నిజం కాదు. ఉత్తుత్తినే డ్రామా. సినిమాల్లో జరిగే పెళ్లిళ్లన్నీ నిజం అనుకుంటే యాక్టర్లకి ఎన్ని సార్లవాలి చెప్పు .. నువ్వు బాగా చదువుకుని, పెద్దయ్యాక, అమ్మా నాన్నా కలిసి చేస్తేనే నిజం పెళ్లి..”
“అయినా విలువలు చెప్పడానికి, పెళ్లి చేసి చూపించాలా.. స్కూల్ ప్రిన్సిపాల్ తో ఇలాంటి వేషాలెయ్యద్దని చెప్పాలి. నాలుగు కప్పుల్లో సేమ్యాపాయసం తీసుకొస్తూ అంది వసంత.
“చిట్టి తల్లి మూడు రోజుల్నుంచీ ఎంత నలిగిపోయిందో!” ప్రశాంత్ బొంగురు గొంతుతో అన్నాడు.
“ఐతే.. అత్తారింటికి..”
“పెద్దయ్యాక నువ్వు వద్దన్నా నే పంపుతాలే..” ఆనంద్ చెల్లి కప్పులోంచి చెంచాతో పాయసం లో జీడిపప్పు తీసుకుంటూ అన్నాడు.
“రేయ్.. నిన్నూ..” భద్రకాళిలా మీద పడుతున్న అదితిని చూసి హాయిగా నిట్టూర్చారు అందరూ.
No comments:
Post a Comment