`గుణపాఠం
తమిరిశ జానకి
పక్కింట్లోకి వినాయక్ రావు అద్దెకి దిగుతాడని కల కన్నాడా మురళీ అందుకే అతన్ని చూడగానే గతుక్కుమన్నాడు. బయటకి వెయ్యబోయిన అడుగు చటుక్కున వెనక్కి తీసుకున్నాడు. "కస్తూరీ కస్తూరీ పక్కింట్లోకి ఎవరో అద్దెకి వచ్చినట్టున్నారు," కంగారుగా పిలిచాడు భార్యని.
"ఔనండీ మీరు రెండురోజులు ఊళ్ళో లేరుగా. రాత్రి పొద్దుపోయి వచ్చారు కదా ఊర్నించి. అందుకే మీరు చూడలేదు. నిన్న సాయంత్రం దిగారు వాళ్ళు. వాళ్ళ హడావిడిలో వాళ్ళున్నారు నేనింకా పరిచయం చేసుకోలేదు. ఇంతకుముందు పద్మారావునగర్లో ఉండేవాళ్ళుట. ఇంటి ఓనరుగారు చెప్పారు."
"పరిచయం చేసుకోకపోతే కొంపలేం మునిగిపోవులే. నీ పని నువ్వు చేసుకో." విసురుగా వెంటనే వచ్చింది సమాధానం. భర్త అంత చిరాగ్గా మాట్లాడటంతో ఆశ్చర్యపోయింది కస్తూరి. ఆఫీసు పనులమీద ఊరెళ్ళిరావడంతో ఆ విషయాలగురించి ఏదో విసుగ్గా ఉండిఉంటుందిలే అని సరిపెట్టుకుంది.
ఆ రోజు సాయంత్రం వినాయక్ రావు భార్య సుందరవల్లి కాసేపు కస్తూరి దగ్గిరకొచ్చింది స్నేహపూర్వకంగా పరిచయం అయ్యాక చేతిలో ఉన్న మిఠాయిలు అందించింది, వాళ్ళ అమ్మగారింట్లో చేసి ఇచ్చినవి అని చెప్తూ. సాయంత్రం మురళీ ఆఫీసునించి రాగానే అవి తింటుంటే సుందరవల్లి చెప్పిన కబుర్లు సంబరంగా చెప్పుకొచ్చింది. వింటున్న మురళీ నోరంతా చేదుగా అయ్యింది మిఠాయిలు తింటున్నా కూడా.
"వాళ్ళ సంగతులు ఎందుకూ నాకు ?"
"ఊరికే కాలక్షేపానికి చెప్తున్నాను. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. ఆ వినాయక్ రావుగారు కూడా కధలు రాస్తాడుట. వి. ఆర్. అన్న పేరుతో పత్రికల్లో కధలు రాసేది ఆయనేట. వాళ్ళావిడ చెప్పింది. మీరు కూడా రచయితే అని నేను చెప్పాను. రచయిత మురళీగారి పేరు తెలుసు పత్రికల్లో కధలు చూస్తూనే ఉంటాను " అంది.
వినాయక్ రావు తమ పక్కింట్లోకి రావడంఏమాత్రం నచ్చలేదు మురళీకి. పైపెచ్చు ఇబ్బందికరంగా అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. కస్తూరికి ఆశ్చర్యంగా ఉంది. ఇద్దరూ రచయితలే కదా పాలూనీళ్ళల్లా కలిసిపోతారనుకుంది. తన ఊహ తలకిందులైనందుకు తెల్లబోయింది. బయట ఒకరికొకరు ఎదురుపడినప్పుడు హలో అంటే హలో తప్ప పొలోమని రెండోమాట లేకపోవడం గమనించింది. ఎన్నో రంగాలలో రాజకీయం ఉన్నట్టే రచయితలమధ్య కూడా రాజకీయం రాజ్యమేలుతుంటుందని అర్ధమై బుగ్గలు నెప్పిపెట్టేలా నొక్కుకుంది.
అసలేమైఉంటుంది ఎంత ఆలోచించినా ఓ కొలిక్కిరాలేకపోయింది. ఇంక లాభం లేదని చేతులేకాదు బుర్రకూడా కలిపింది సుందరవల్లితో. ఇద్దరూ కలిసినా కూడా ఏ బుర్రకధా అంతుచిక్కలేదు. ఎలా చిక్కుతుందీ ?అసలే మగమహారాజులిద్దరూ ఇంట్లో ఆడంగులతో అరమరికలు లేకుండా మాట్లాడేరకాలు కాదు. అలాంటప్పుడు తమ అహాన్ని చులకన చేసుకునే బాపతు విషయాలు ఎందుకు బయట పెట్టుకుంటారు అబ్బే అది ఉత్త మాటే. !
ఆరోజు సాయంత్రం వినాయక్ రావు విరచిత పుస్తకావిష్కరణ ఉంది. పక్క పక్క ఇళ్ళు కదా వెళ్ళకపోతే బావుండదని తన భర్తతోపాటూ తనూ వెళ్ళేందుకు తయారై కూచుంది కస్తూరి. కానీ మురళి టీ.వీ. చూస్తూ ఎంతకీ బయటికి వెళ్ళే ప్రసక్తి తీసుకురాకపోవడంతో ఉండబట్టలేక అడిగింది "మనం వెళ్ళట్లేదా?" అని. "ఎక్కడికీ ?" చూపుల్లో కాస్త విసుగు మిళితం చేశాడు మురళి.
"అదేనండీ వినాయక్ రావుగారి పుస్తకం ఆవష్కరణ సభ ఉందిగా ఈరోజు. ఆహ్వానపత్రిక ఇవ్వకపోయినా నోటిమాటగా చెప్పారుగా. వస్తానని మీరు తల ఊపారుగా." "అయితే వెళ్ళిపోవాలా కిందటి నెల్లో నా పుస్తకానికి ఆయనగారొచ్చారా !"
"అదేమిటండీ అప్పుడాయనకి ఒంట్లో బాగులేక రాలేకపోయినట్టున్నారుగా !" " ఇప్పుడు నాకు ఒంట్లో బాగులేదు సరేనా?" కస్సుమన్నాడు మురళి. ఎగాదిగా చూసింది. ఇప్పుడేగా అయిదు పెసరట్లు అల్లప్పచ్చడితోనూ కొబ్బరిపచ్చడితోనూ తిని బ్రేవ్ మని తేన్చాడు. ఛఛ తప్పుతప్పు ఇలాంటి ఆలోచన రానేకూడదు దిష్టి తగులుతుంది చెంపలు వాయించుకుంది గట్టిగా.
పక్కింట్లో సుందరవల్లి పట్టుచీర రెపరెపలాడించుకుంటూ ఇంట్లోకీ బయటికీ తిరిగేస్తోంది. ఏవిటి నాకంటే ఎక్కువ కంగారుపడిపోతున్నావు బయల్దేరేటప్పుడు నేను చెప్తానుగా విసుక్కున్నాడు వినాయక్ రావు.
"అదికాదండీ పక్కింటి వాళ్ళు కూడా " అంటూ చిన్నగా నసిగేసింది భర్త మొహం ఎర్రబడటం చూసి.
" పక్కింటివాళ్ళసంగతి నీకు ఎందుకు చెప్పు వల్లీ , ఆర్నెల్లకిందట నా కవితాసంపుటి ఆవిష్కరణకి వచ్చినవాడు వేదికమీద పెద్దలు నన్ను మెచ్చుకోవడం గానీ మర్నాడు దినపత్రికలవాళ్ళు గొప్పగా రాయడం గానీ భరించలేకపోయాడు. అప్పటినించీ నాతో మాటలు తగ్గించేశాడు. అందుకే ఆయనగారి పుస్తకావిష్కరణకి కిందటి నెల్లో వెళ్ళకుండా ఒంట్లో బాగులేదని చెప్పేశాను. "
"ఏవిటండీ మరీ చిన్నపిల్లల్లాగా ఈ వంతులు పోవడం? ఆ మాట ఆయన దగ్గిరకెళ్ళి అనరాదూ ! ఇలా మాట్లాడితే ఇంక నేనేం చెప్పగలను ? " చిన్నబుచ్చుకున్న మొహంతో వంటిటివైపు వెళ్ళిపోయిందిమొహమైతే చిన్నబోయింది కానీ మనసు ముకుళించుకుపోలేదు. తీవ్రంగా ఆలోచనలో పడింది.
అన్ని రంగాలలో రాజకీయం చోటుచేసుకున్నట్టే సాహిత్యరంగంలో రాజకీయాలా? పుస్తకం మనిషికి మంచి స్నేహితుడంటారుకదా! అలాంటిది అవి రాసే రచయితలే తమ మధ్య స్నేహానికి విలువ ఇవ్వలేకపోవడం ఎంత హాస్యాస్పదం? తను రచయిత్రి కాదు, ఒక పాఠకురాలు మాత్రమే. వాళ్ళకి చెప్పగలిగే తెలివితేటలు తనకి లేకపోవచ్చు కానీ అది తప్పు అని గ్రహించగలిగే మనసైతే ఉంది అందుకే ఎవరెలా నడుచుకున్నా తన భర్త మనసుకి మకిలి పట్టకుండా ఉంటే ముందుముందు మనశ్శాంతితో బ్రతగగలుగుతాడు అనిపించింది. ఏదో ఒకటి చెయ్యాలి తను ఏంచెయ్యాలి !సరిగ్గా కస్తూరి ఆలోచనలు కూడా ఇలాగే ఉన్నాయి. స్నేహితురాళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు చివరికి.
ఆరోజు మురళి పెద్దనాన్న కొడుకు రాఘవవాళ్ళింట్లో భోజనానికి పిలిచారు. మురళి తయారయిపోయి తలకూడా దువ్వుకోకుండా ఏదో ఆలోచిస్తూ కూచున్న భార్యని వింతగా చూశాడు.
" ఏవిటింకా తయారవలేదు నువ్వు? వాళ్ళింటికి వెళ్ళడానికి గంట పట్టేస్తుంది మనకి. ఇంకో పావుగంటలో బయల్దేరాలి మనం."
"నేను రావట్లేదు మీరు వెళ్ళి రండి."
" ఎందుకురావట్లేదు? "
"కిందటిసారి వాళ్ళింటికి భోజనానికి వెళ్ళినప్పుడు సరోజక్కయ్యగారి చేతివంటని మనవాళ్ళంతా ఎంతో ఆకాశానికి ఎత్తేసినట్టు పొగిడారు. నేనూ వంట బాగానే చేస్తాను కదా. మనింటికి మనవాళ్ళందరూ భోజనానికి వచ్చినప్పుడు నన్ను ఎవ్వరూ అంతలా పొగడలేదు. అలాంటప్పుడు సరోజక్కయ్యగారంటే నాకు ఈర్ష్యగా ఉండదా. పైగా నా పుట్టినరోజుపార్టీకి ఏదో వంక పెట్టేసి రానేలేదు ఆవిడగారు. అందుకే నేను ఇవాళ రాదల్చుకోలేదు."
"నీకేవన్నా పిచ్చా మా వదిన ఆరోజు రాలేదనీ వాళ్ళందరూ నిన్ను పొగడలేదనీ ఏవిటా తలతిక్క మాటలు ?"
" నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష" అంటూ కూనిరాగం తీసింది కస్తూరి. రచయితవల్ల పాఠకులకి గుణపాఠం అవుతుందన్నది ఎంత నిజమో ఏమోగానీ, పాఠకులవల్ల రచయితకి గుణపాఠం అవుతుందని సరికొత్త అనుభవం అయ్యింది మురళికి.
*****
No comments:
Post a Comment