కోతి పుండు బ్రహ్మరాక్షసి అయ్యేలోపలే!
ఆండ్ర లలిత
శ్యామ్ ఈ మధ్య పెద్ద కార్పొరేట్ స్కూల్ లో జేరాడు. కొత్త బడి..స్నేహితులు..అలవాట్లు.. కొత్త తరగతి..చదువులు.. మరి వీటిల్లో చదువు పక్క దారి పట్టకూడదు అనుకుంది శ్యామల. ఏమిటో! వినడు గేజట్స్ మీద పడుతున్నాడు. వాటి మీద మోజు పెరిగింది. చదువు మీద ఆసక్తి తగ్గుతోంది. ఇతర వ్యాపకాల మీద ధోరణి పెరుగుతోంది. ఏమి స్కూల్సో! అని అనుకుంటూ, శ్యామల గడియారం కేసి చూసి అయ్యో! నా మతి మండా! శ్యామ్ బడి నుంచి ఆకలితో వస్తాడు అని అనుకుంటూ, వంటింట్లోకి వెళ్లి, పెనము పొయ్యి మీద పెట్టి , అప్పుడే రుబ్బిన పప్పుతో, చక్కగా కాస్త చమురు ఎక్కువ వేసి, సన్నని సెగ మీద ఎఱ్ఱగా మినపరొట్టి కాల్చింది. అది ఇలా పళ్ళెంలో పెట్టిందో లేదో హీరో శ్యామ్ వచ్చాడు. వస్తూనే, ఆకలీ! మినపరొట్టి పెట్టూ! అంటూ షూ విప్పుకుని బట్టలు మార్చుకుని మరి ఏకైక పుత్రుడు సింహాసనము ఎక్కి కూర్చొని, రిమోట్ తో టీవీ ఆన్ చేసుకుని, క్రొత్త స్నేహితులతో డిస్కస్ చేయడంకోసం పోఖిమాన్ చూస్తూ ఆస్వాదిస్తున్నాడు. ఇంతలో మినపరొట్టి అందించింది శ్యామల. ఆరిన బట్టలు మడత పెట్తూ పెట్తూ అవి పక్కన పెట్టి, బడికి తీసుకెళ్లే బేకపేక్ ముట్టుకునేటప్పటికి, అమాంతముగా ఒక్క కేక పెట్టాడు శ్యామ్ “ఆ పుస్తకాల సంచీ నాది, ముట్టుకోకు అమ్మా”. “ఎందుకు?” అంది శ్యామల. “అంతే. టీవీ చూస్తున్నాను. నన్ను చూడనియ్యి” అన్నాడు శ్యామ్ “ 6వ తరగతి చదువుతున్నావు. చదువుకోవాలి. అలా టీవీ చూస్తూ ఉండిపోకూడదు. బంగారు తండ్రివి! ఆ ప్రోగ్రామ్ అయ్యాక చూపిస్తావు కదా! నా వజ్రాల మూట” అంది శ్యామల ముద్దు చేస్తూ. ఏదో పని చేసుకుంటూ సమయం ఇట్టే గడిచిపోయింది. ఇంకొక ప్రోగ్రాం కూడా మొదలయింది. ”టీవీ కట్టేయ్” శ్యామ్ అని లాలిస్తూ చెప్పింది. “అమ్మా 10నిమిషాలు” అన్నాడు శ్యామ్. “మరి ఆఖరి 10 నిమిషాలు” అంది శ్యామల చిరునవ్వుతో. “శ్యామ్ ఆపేయ్ నాన్నా! 10 నిమిషాలు అని గంట చూసావు. ఇంకా ఎంతసేపమ్మా? టీవీ చూసే సమయము అయిపోయింది” అని అంది శ్యామల. “నేను ఆపను! ఇవాళ నేను చదువుకోను అంతే” అన్నాడు కోపంగా శ్యామ్. నువ్వు ఆపాలి అంతే. చెప్పిన సమయానికి నిలబడాలి అంతే! అని శ్యామల అనగానే , టీవీ ఆపి ,బుంగ మూతి తో ఒక మూల కూర్చున్నాడు. “పోనిలే చదువుకోవద్దు, కాసేపు బయటికి వెళ్ళి ఆడుకునిరా! బావుంటుంది” అంది శ్యామల చక్కగా లాలిస్తూ. “వాళ్లతో నేనాడను!”అన్నాడు శ్యామ్. “నేను బడికి వెళ్లను! అని బళ్ళున కళ్ళు నలుపుకుంటూ ఏడ్చాడు” శ్యామ్. “పోని లే మనిద్దరము వాక్కి వెళ్దాము, ఆడుకుందాము. నువ్వు నా స్నేహితుడువి కదా! నువ్వు నా చిన్న కృష్ణుడివి కదా! పద మనము అలా అలా తిరిగేసి వద్దాము” అని అంది శ్యామల. “ఉహు! నేను రాను”అన్నాడు శ్యామ్. “అలా పేచీ పెట్టకు నాన్నా” అంది తల నిమురుతూ. ఇద్దరూ కలిసి అలా గుడి ఇంకా ఉద్యానవనములో కాసేపు ఆటలు, వాకింగ్లు చేసి అలసి పోయి, తరువాత అక్కడున్న బెంచి మీద కూర్చుని నవ్వులు మాటలు అయ్యాయి. ఇంక చీకటి పడుతుంటే ఇల్లు చేరుకున్నారు. మరి చెప్పులు విప్పుకున్న వెంటనే శ్యామ్ చేతులు ఆటోమాటిగ్గా టీవీ రిమోట్ వెతుకుతున్నాయి, అని గమనించిన శ్యామల “అమ్మ దొంగా! తప్పు, టీవీ వద్దు” అంది. పట్టుబడి పోయాడని ఒక చిరునవ్వు నవ్వి “అమ్మా ప్లీజ్” అని అన్నాడు శ్యామ్. ఇప్పుడే కోలుకున్న ఆ లేత హృదయాన్ని నొప్పించటము ఇష్టము లేక ఒప్పుకుంది కాని మనసు బరువెక్కింది, శ్యామ్ ప్రవర్తనకి. చాటంత మొహము చేసుకుని “మా మంచి అమ్మ” అంటూ హాయిగా టీవీ చూడసాగాడు. ఇంతలో శ్యామ్ వాళ్ళ నాన్న అవినాష్ వచ్చాడు. రోజూ అవినాష్ రావటము, చక్కగా ఇంటిల్లిపాది కలిసి భోజనాలు, కాసేపు కబుర్లూ అలా మధుర క్షణాలు అనుభవించాక అందరూ మంచి స్మృతులతో హాయిగా మంచి ఆలోచనలతో పడుకునేవారు. మరి వాళ్ళ హీరోగారికి మాత్రం పడుకునేముందు కాస్త ఎక్కువ సమయము కావాలి. మరి ఆ సమయములో బోళ్ళు కథలు, వాటి ఊహలలో అలా తేలిపోతూ, ఇంకా ఎన్నెనో మాట్లాడుకుంటూ ఆదమరచి హాయిగా పడుకునేవారు. రోజూ ఎన్నో ప్రశ్నలు వేసే శ్యామ్ , ఆ నాలుగు రోజుల్లో ఏమి చెప్పితే అది అలా అలా ఎదో ధోరణి లో వింటున్నాడు. స్థిరత్వము కరువైనది. పిల్లాడిలో ఈ మార్పు గమనించిన శ్యామల, అవినాష్ లలో చాలా ఆందోళన రేపింది. ఎప్పుడైనా బడి గురించి ప్రస్తావన వస్తే వణికి పోతాడు. రోజు బడికి వెళ్లనని గోల. చదువు , స్నేహితులు, బడి గురించి మాట్లాడుతే చాలు కస్సు బుస్సు. నిద్రట్లో కలవరింతలు. ఎంత సేపు టీవీ! టీవీ! అంతే. ఇలా వారం రోజులు గడిచింది. ఎక్కడా అంతు చిక్కటము లేదు. ఆ దేముడికి ఒక్క నమస్కారము చేసి “తండ్రీ నువ్వే దిక్కు”అనుకుంది. విభూతి శ్యామ్ నుదురు మీద పెట్టింది. శ్యామ్ పడుకున్నాక “శ్యామలా! బడికి వెళ్లి ఉపద్యాయురాలిని కలిసావు కదా ఏమైంది?” అని అవినాష్ అడిగాడు. “ఎందుకో దృష్టి చదువు మీద కేంద్రీకరించటము లేదని చెప్పి, లెక్కలలో కాస్త మదం అని చెప్పింది. బెంగ పెట్టుకోవద్దు పిల్లలు ఒకొక్క సారి ఇలా అవుతారు. సమయము ఇచ్చి మెల్లిగా ముద్దు చెస్తే మళ్ళీ చురుకు చలాకీగా అవుతారు. చదువు మేము చూసుకుంటాము. ఇంట్లో వాతావరణము అనుకూలంగా ఉండేలా చూసుకోండి అని చెప్పింది. అప్పుడే సోమవారము నుండి శుక్రవారము వరుకు గడిచింది”అంది శ్యామల. శ్యామల, అవినాష్ ఆలోచించుకుని సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నారు శ్యామ్ కి. శనివారము పొద్దున్నే శ్యామ్ ని ముద్దు చేస్తూ లేపింది శ్యామల. అప్పుడే మెలకువ వస్తున్న శ్యామ్ తో “తొందరగా రెడీ అవ్వు! లే! మనము అలా తిరిగేసి వద్దాము. దగ్గరకు తీసుకుని మనము అలా బయటకి వెళ్లి చాల రోజులైంది కదూ శ్యామ్.రా రా !” అంది శ్యామల శ్యామ్ టప్ మని లేచి కూర్చొని “ఎక్కడికి? ” అని అడిగాడు తయారౌతూ అవినాష్ “నువ్వే చెప్పాలి!” అన్నాడు శ్యామ్ సంతోషంతో వెలిగిపోయాడు. “నాన్నా, ఎక్కడికి వెళుతున్నాము?” అని కళ్ళు నలుపుకుంటూ అడిగాడు. “నువ్వు ఏమంటే అదే. ఇవాళ నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి. ఇంక నీకు ఏమి కావాలో తెచ్చుకో. సరేనా!” అన్నాడు అవినాష్. గబగబా రెడీ అయిపోయి, ఆటవస్తువులు, తినుబండారాలతో నింపేసాడు కారు అంతా శ్యామ్. “ఇప్పుడు మనము ఎక్కడికి వెళుతున్నాము హీరో” అన్నాడు అవినాష్. “Bird Sanctuary” అని శ్యామ్ అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ... “అమ్మా! రేపు నేను నా స్నేహితులతో చెప్తాను నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు. నాన్నా ఏదో ఒకటి మాట్లాడు నాన్నా” అన్నాడు సంతోషముగా శ్యామ్. “ముందు నువ్వు మాట్లాడు శ్యామ్! ” అన్నాడు అవినాష్. “లేదు నువ్వు మొదలుపెట్టు నాన్నా” అన్నాడు శ్యామ్. “సరే! ఒక అంశము మొదలు పెట్తా, అందరము అలా ఆపకుండా నిరవధికంగా ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉండాలి. ఏమీ మాట్లాడటానికి లేకపోతే వాళ్ళు అవుటు” అన్నాడు అవినాష్. ఆకాశం, చెట్లు , పుట్టల గురించి మాటలు మొదలుకుని మెల్లి మెల్లిగా అందరూ మనసు విప్పి మాటాడు కుంటూ, ఆహ్లాదముగా అంతాక్షరి ఆడుతూ పాడుతూ మధ్యమధ్యలో ఆసక్తికరమైన లెక్కల పజిల్స్ చేస్తూ, సంతోషముగా కారులో వెళ్తున్నారు. ఆ పజిల్స్ తో మళ్లీ లెక్కలంటే ఆసక్తి రావటము మొదలైనది శ్యామ్ కి. ఇంతలో మరి శ్యామ్ కి పక్షి అభయారణ్యం కనబడింది. “నాన్నా ఆపు, bird sanctuary!! stop”అన్నాడు శ్యామ్. సరే అయితే మరి మన మాటలు చాలించి పద పద వెళ్దాము. “మీకు ఒకటి తెలుసా? ఈ bird sanctuary లో వేరే దేశాల నుంచి వేలాది మైళ్ళు ప్రయాణించి పక్షులు గుంపులు గుంపులు కింద వస్తాయి. ఒక ప్రత్యేక ఋతువు లో ప్రతీ సంవత్సరము వచ్చి మళ్లీ వాళ్లింటికి వెళ్లిపోతాయి. Ok let’s go!” అన్నాడు అవినాష్ లోపల చాలా బాగా, ఆనందంగా గడిపారు. రకరకాల పక్షులని చూసారు. శ్యామ్ పరుగెట్టి చాలా బాగా ఆనందంగా గడిపాడు. కాని ఒక చోట శ్యామ్ కళ్ళు ఒక దృశ్యం చూస్తూ ఉండిపోయాయి. మరి అక్కడ రెండు పావురాలు వాళ్ళ పిల్ల పావురాళ్ళకి ఎగరటము నేర్పుతున్నాయి. దాంట్లో ఒకటి చాలా భయపడుతోంది. దాని దగ్గరికి వాళ్లమ్మ వచ్చి ముక్కుతో రెక్కలని పొడుస్తూ ఎగరటం చూపిస్తోంది. మిగతా పావురాలు కూడా అక్కడ వాళ్ల భాష లో సౌజ్ఞ చేస్తూ ఆ చిన్న పావురముతో....మొదటి అడుగు ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది అన్నట్టుగా చుట్టూ తిరుగుతున్నాయి. “అలుపూ సొలుపూ లేకుండా ధైర్యసాహసాలతో మందుకు సాగితే, విజయం మనదే!!! కదా శ్యామ్!” అన్నాడు అవినాష్. “ఊ..” అన్నాడు శ్యామ్ మెల్లిగా. ఆ చిన్ని పావురము ఓపికగా నేర్చుకున్నాక అక్కడి నుంచి గుంపుగా అన్నీ కలిసి ఎగిరిపోయాయి. అది అంతా అక్కడే పావు గంట నుంచి చూస్తున్న శ్యామ్ మనసుకి హత్తుకుని పోయింది. శ్యామ్ బుజము మీద చెయ్యివేసి, “ఏ సమయములో ఏది చెయ్యాలో అది చేస్తే, చూసే వాళ్లకి అందంగా ఉంటుంది అంది” శ్యామల. మళ్ళీ అందుకుంటూ “మనకీ బావుంటుంది కదా. కాని ఆ వయస్సు లో ఆ విద్య అభ్యసించేవరుకు ఎంత కష్టముగా ఉంటుందో. ఎప్పటికప్పుడు విద్య ఒక పక్వం రావటానికి కష్ట పడుతూ ఉంటాము. పోని మానేద్దామంటే చూడు ఆ పెద్ద పావురము, చిన్న పావురము నేర్చుకునే వరకు ఊరుకోలేదు. ఈ భగవంతుడి సృష్టి లో ఆఖరికి పక్షులు కూడా నేర్చుకునే వరుకు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాయన్నమాట.” అక్కడి నుంచి శ్యామ్ కి ఇష్టమైన చోటికి వెళ్లి తిను బండారాలు తిని, సాయంత్రము వరుకు తిరిగి తిరిగి ఇంటి మొహం పట్టారు. అవినాష్ శ్యామ్ కేసి చూస్తూ “happy!” అన్నాడు. “Yes” అన్నాడు శ్యామ్. శ్యామ్ తో మాటలు కలుపుతూ, “ఎలా ఉన్నావు?” అన్నాడు అవినాష్. “బాగున్నాను” అన్నాడు శ్యామ్. అలా ప్రశ్నోత్తరాలు వర్షం కురిసింది వాళ్ళిద్దరి మధ్య. “బడిలో టీచర్లు, స్నేహితులు బాగున్నారా?” “ఊ! “ “ఇంకా ! “ “ఏం చెప్తున్నారు? “ “ఏమో!” “అర్థము కావటము లేదా!” “ఊ! లెక్కలు తప్పులు చేస్తుంటే ,అందరూ నవ్వుతున్నారు. నాకు లెక్కలు రావు. నాకు వద్దు.” “ఒస్! అంతేనా! ఇది నాకు అయింది” అన్నాడు అవినాష్. “ఆవునా! మరి తాత తో చెప్పావా ?” అన్నాడు శ్యామ్. “లేదు చెప్పలేదు. భయం. అప్పుడు చాలా కోపము వచ్చేది నాకు. అప్పుడు చదువు మీద ఆసక్తి పోయింది. దానితో వెనక పడ్డాను. అప్పుడు టీచర్ తాతని బడికి పిలిచి , తాతకి నా గురించి చెప్పారు. నాకు బడి నుంచి ఇంటికి వెళ్లి నప్పుడు తాత తిట్తారేమో అనిపించింది. కాని తిట్టలేదు. నువ్వు బాగా చేయగలవు అని చెప్పి ట్యూషన్ పెట్టారు. నేను ట్యూషన్‌కి వెళ్లనని ఏడ్చాను. అప్పుడు తాత ఎందుకు వెళ్లవని అడిగారు. నేను ఆడుకోవాలి. బడిలో ఎంత వస్తే అంత చదువుకుంటాను, నాకు రానిదాని గురించి ఆలోచించను అని అన్నాను. అప్పుడు తాత పెద్దగా నవ్వి, అలా కాదు నాకు ఎందుకు రాదు అని ఆలోచించాలి అని చెప్పారు. నువ్వు బాగా చదువుకుని మంచి వృద్ది లోకి రావాలంటే ఎప్పుడు మనము కొత్త మార్పులు అంగీకరిస్తూ మనకి ఉన్న విద్యను మెరుగు పెట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి. మరి ఆ తరువాత మాస్టరుగారు లెక్కల ట్యూషన్ లో బోధించింది చక్కగా నేర్చుకున్నాను. “ శ్యామ్ ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ అందుకుంటూ అవినాష్. “అలాగే ట్యూషన్ మాస్టర్ గారు చెప్పినట్టు విన్నాను. మంచి మార్కులు, అందరి ప్రశంసలు నాకు ఎంతో సంతోషము ఇచ్చాయి. మరి చూడు నీ దగ్గర కూడా మొన్న మొబైల్ లో రికార్డు చేయటము నేర్చుకున్నానా లేదా! నేర్చుకోడానికి సిగ్గు పడలేదు కదా! ఏమంటావ్ శ్యామ్” అన్నాడు. “హోంమ్ వర్కుంది.” అన్నాడు శ్యామ్ మెల్లగా. ఇంటికి వచ్చాక శ్యామ్ బ్యాగ్ సద్దేసుకుని మర్నాటికి తయారై పోవటమే కాకుండా తనకి అర్థమవ్వని అంశాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఇద్దరిని సంతోషపెట్టింది. హోంమ్ వర్కూడా చేసేసాడు. అవినాష్ శ్యామ్ ని దగ్గరకు తీసుకుని చూసావా, నీకు ఎంత బాగా వచ్చాయో లెక్కలు! అన్నాడు. ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకో నాన్నా! మన గమ్యాన్ని చేరేందుకు రెండే ఆధారాలు. ఒకటి మనలో ఉన్న లక్ష్యం. రెండు పట్టుదల. ఎప్పుడు ఇవి కోల్పోకూడదు అన్నాడు. “ఊ” అని తలూపాడు ముద్దుగా శ్యామ్. శ్యామ్ స్కూలు వెళ్ళాక అవినాష్ శ్యామల తో ఇలా అన్నాడు. “పిల్లలకి ఏదన్నా నచ్చక పోతే దూరము వెళ్లి పోతారు. వాళ్లలో ఉన్న భయము తీసే బాధ్యత తల్లీదండ్రులది. తల్లి తండ్రీ పిల్లలతో గడిపే అమూల్యమైన సమయము ప్రేమ, ఆత్మీయత, అనురాగాలతో గడపాలి. శ్యామ్ తో సమయము గడిపిన మూలంగా వాడిని చక్కగా అర్థము చేసుకున్నాము. మా పిల్లలు మాట వినరు అని అనేకన్నా వాళ్లని దగ్గరి కి తీసుకుని ప్రేమ తో వ్యవహరిస్తే ఎందుకు ఫలించదు. మనము బిజీ అయిపోయి, వాళ్లకి మనసు విప్పుకునేందుకు సమయము ఇవ్వక పోతే వాళ్ల భయాలు ఎలా తొలుగుతాయి. తోలిగితేనేకదా విజయము సాధించగలరు. పెద్ద పెద్ద కార్పోరేట్ స్కూల్స్ లో పెట్టగానే సరిపోదు. పిల్లలు అటు స్కూల్ పర్యావరణ అలవాట్లవల్ల చదువుకు దూరం కాకండ చూసుకుంటూ, వాళ్ళ క్లాస్మేట్స్ లతోనూ సమన్వయంగా వుండగలిగే మనోధైర్యాన్ని పెపొందిస్తూ, మనుషులకు దూరమయి గాడ్జెట్ల ప్రపంచానికి బానిసలు కాకండా చూసే బాధ్యత తల్లి తండ్రులపైన ఎంతైనా ఉంది.” “చిన్న సమస్యలుగా ఉన్నప్పుడే తీర్చిదిద్దాలి మన లాగ కదా! చిన్న చిన్న సమస్యలు గాలివాన అయ్యేలోపల సవరించు కోవాలి, వదిలేస్తే మహా ప్రళయం అవుతుంది బాబోయ్!”అంది శ్యామల. అవును అవును, “కోతి పుండు బ్రహ్మరాక్షసి అవకూడదు కదా!” అన్నాడు అవినాష్.
*****
No comments:
Post a Comment